చేతికంది వచ్చిన కొడుకు మరణించడంతో
కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులు
ఆర్‌కే పురంలో విషాదఛాయలు
దిల్‌సుఖ్‌నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్‌కే పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్‌లో ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్‌కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్‌కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది.
ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్‌హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్‌పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు.
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు
తాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment