వృత్తి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ప్రవృత్తి నటన
స్వతహాగా ‘ది డిజర్వింగ్’ మూవీ తీసిన కరీంనగర్ యువకుడు
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, హీరో అతనే..
ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు
128 దేశాల్లో వచ్చే నెల 1న విడుదల
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్‌లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు.
11 ఏళ్ల క్రితం అమెరికాకు..
వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు.
14 రోజుల్లోనే సినిమా తీశాడు..
తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్‌లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్‌స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు.
సినిమా కోసం చాలా కష్టపడ్డాను
ది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్‌లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్‌లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్‌లో నటిస్తా.
– గుండ వెంకట్‌సాయి
ప్రపంచస్థాయిలో గుర్తింపు
నా కొడుకు వెంకట్‌సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి.
– గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment