b.tech
-
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్‌సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి -
ఐఐటీ విద్యార్థి విషాదాంతం
మిర్యాలగూడ టౌన్: వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ సోమవారం రాత్రి విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో శవమై తేలాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురై బంగాళాఖాతంలో మునిగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్, సైదమ్మ దంపతులకు కుమారుడు ధనావత్ కార్తీక్ (20), కుమార్తె సాతి్వక ఉన్నారు. ఉమ్లా నాయక్ వ్యవసాయ పనులు చేస్తుండగా, సైదమ్మ చింతలపాలెంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కాగా కార్తీక్ ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ అప్పట్నుంచీ కన్పించకుండా పోయాడు. ఈ నెల 18న తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. కార్తీక్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి ఎక్కి విశాఖలో దిగి.. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా..18వ తేదీ ఉదయం కార్తీక్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు కన్పించింది. అతను అదేరోజు రాత్రి విశాఖలో దిగడం, రాత్రి 9.30 సమయంలో ఆర్కే బీచ్‌లోని ఓ బేకరీలో ఏవో కొనడం కూడా సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కార్తీక్ విశాఖపట్నంలో కన్పించినట్టు పోలీసులు ఇచ్చి న సమాచారంతో అతని తల్లిదండ్రులు అక్కడి తమ బంధువులకు విషయం చెప్పారు. 19వ తేదీ నుంచి కుటుంబసభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ దొరకలేదు. కాగా ఈ నెల 21న విశాఖ జోడుగుళ్లపాలెం బీచ్‌కు ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ తల్లిదండ్రులు అది తమ కుమారుడేనని గుర్తించారు. కార్తీక్ వారం రోజుల క్రితమే బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి మృతదేహం కుళ్లిపోయింది. సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఆ మృతదేహం కార్తీక్‌దే అని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని జలచరాలు తినడంతో పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో శవాన్ని వెంటనే అంబులెన్సులో మిర్యాలగూడ వాటర్ ట్యాంకు తండాకు తరలించి సాయంత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు. అమ్మకు బంగారం కొనిస్తానంటివయ్యా.. ‘ఉద్యోగం వచ్చి న తర్వాత అమ్మకు బంగారం కొనిస్తానంటివి.. అందరినీ మంచిగా చూసుకుంటా అంటివి.. ఇప్పుడు కనిపించకుండా పోయావా కొడుకా’అంటూ ఉమ్లానాయక్ కుమారుడి మాటలను గుర్తు చేసుకుంటూ రోదించిన తీరు అందరినీ కదిలించింది. -
డాక్టర్ చదువుల్లో సమానం!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో మహిళలు దూసుకెళ్తున్నారు. కొన్ని కోర్సుల్లో యువకులను మించి యువతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక 2022 వెల్లడించింది. దేశంలో 1,59,69,571 మంది యువకులు, 1,50,77,414 మంది యువతులు ఉన్నత విద్య అభ్యసిస్తుండగా ఆర్ట్స్, సైన్స్, మెడికల్, సోషల్ సైన్స్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉంది. కామర్స్, ఐటీ, కంప్యూటర్స్, మేనేజ్మెంట్, న్యాయవాద విద్యలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ♦ బీఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు (పురుషులు) 109 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఈడీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 182 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఎస్సీ (నర్సింగ్‌లో)లో అత్యధికంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 308 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంబీబీఎస్‌లో పురుషులతో సమానంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 100 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థినులున్నారు. ♦ మ్‌కాంలో ప్రతి వంద మంది విద్యార్థులకు 198 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎమ్మెస్సీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 156 మంది విద్యార్థినులున్నారు. ♦ బీటెక్‌లో ప్రతి వంద మంది విద్యార్థులకు అత్యల్పంగా 40 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎల్ఎల్బీలో కూడా యువతులు తక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది విద్యార్థులకు 49 మంది విద్యార్థినులున్నారు. -
Himansee Katragadda: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!!
గణపురం కోటగుళ్లు .. గండికోట మాధవరాయ ఓరుగళ్లు రామప్ప.. జాకారం శివయ్య ఏ ఊళ్లో చూసినా ‘కొలువై ఉన్నాడే దేవ దేవుడు... కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..’ అంటూ ఆనందపరవశంతో తమ నాట్య ప్రయాణాన్ని వివరిస్తుంది హిమాన్సీ కాట్రగడ్డ. నెమలికి నేర్పిన నడకలివీ .. అంటూ తన పాదాల మువ్వలతో అలరిస్తుంది. తెలంగాణలోని వరంగల్లు వాసి అయిన హిమాన్సీ కూచిపూడి నృత్యకారిణి. తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ, వాటిని వీడియోలుగా రూపుకట్టి ‘టెంపుల్ డ్యాన్స్’ పేరిట అలనాటి వైభవాన్ని మన కళ్లకు కడుతోంది. ఆలయ ప్రాంగణంలో నృత్యాన్ని దృశ్యీకరిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు, దేశ వ్యాప్త నృత్య ప్రదర్శనలతో పాటు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోంది హిమాన్సీ. తెలుగులో ఇటీవల సూర్యాస్తమయం, కోలీవుడ్‌లో నవిలా కిన్నరి సినిమాలలో నటించి, నటిగా విమర్శకుల మెప్పు పొందింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కూచిపూడి నృత్యసాధన చేస్తూ దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న హిమాన్సీ ప్రస్తుతం బి.టెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. టెంపుల్ డ్యాన్స్ ఆలోచనను, అందుకు తన కృషిని ఇలా వివరించింది. ‘‘నేను చేసిన ‘టెంపుల్ డ్యాన్స్’ వీడియోలకు కళాతపస్వి విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సప్తపది సినిమా నటీమణి సబిత తమ ప్రశంసలు అందించారు. మా దేవాలయ నృత్యాలను ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాలను ఒక్కొక్కటిగా చేరుకోవడం, వాటిని మా నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకురావడం మేం చేయాలనుకున్న పని. నాకు మద్దతుగా మా గురువు సుధీర్ గారు నిలవడంతో నా ఆలోచనను అమలులో పెట్టడం మరింత సులువు అయ్యింది. కట్టిపడేసే మార్మికత చిన్ననాటి నుంచి చారిత్రక రహస్యాల పట్ల అమితమైన ఆసక్తి. వాటి శోధనల్లో ఉన్నానంటే నన్ను నేను మర్చిపోతాను. వరంగల్‌లో కాకతీయ రాజులు కట్టించిన ఎన్నో గుళ్లు, వాటి వైభవం చూస్తూ పెరిగాను. ఆ శిల్పకళలో ఏదో తెలియని మార్మికత కట్టిపడేస్తుంటుంది. ఎక్కడ ఆలయాన్ని సందర్శించినా నా నాట్యకళతో ముడిపెట్టినట్టుగా అనిపించేది. ప్రతీ ఆలయంలో నాట్య మండపాలు ఉన్నాయంటే, నాడు కళలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో దీనిని బట్టే తెలిసిపోతుంది. కళల ద్వారా విద్యను జనాల్లోకి తీసుకువెళ్లేవారు. వీటన్నింటినీ తెలుసుకుంటూ ఏ ఆలయానికి వెళ్లినా వీడియోలు, ఫొటోలు తీస్తుండేదాన్ని. కళ ఎప్పటికీ సజీవం కాకతీయు రాజుల చరిత్ర చదివినప్పుడు, ఆలయ నిర్మాణాల పట్ల వారికున్న దూరదృష్టి నన్ను అమితంగా ఆకర్షించింది. అదే, నన్ను అనేక ఆలయాలను దర్శించేలా చేసింది. మనకు తెలిసినంతవరకు హంపి, ఖజరహో ఆలయాల గురించి, వాటి శిల్ప కళ గురించి గొప్పగా ప్రస్తావిస్తుంటాం. కానీ, ఒక్క తెలంగాణలోనే వెయ్యికి పైగా శివాలయాలున్నాయని, అంతకుమించి శిల్పకళ ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ ఆలయాలు నేడు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకున్నాను. కొన్నింటిని ప్రభుత్వం గుర్తించి, వాటిని బాగు చేసే ప్రయత్నం చేస్తోంది. రేపటి తరాలకు నాటి కళను అందించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమంతో వెలుగులోకి.. ప్రాచీన ఆలయాల గురించి శోధిస్తున్నప్పుడు పుస్తకాల్లో చదివి, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాను. అవేవీ దృశ్యరూపంలో లేవని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని మా గురువుగారితో చర్చించి, ‘టెంపుల్ డ్యాన్స్’ పేరుతో వీడియోలు తీస్తూ, మా నాట్యకళాకారులచేత కూడా ప్రదర్శనలు ఇస్తూ, వాటిని సామాజిక మాధ్యమం ద్వారా జనంలోకి తీసుకువస్తున్నాం. ఇటీవల తెలంగాణలోని కోటగుళ్లు, రామప్ప, వారణాసిలో చేసిన నృత్యాలకు మంచి స్పందన వచ్చింది. ఏ ఊళ్లో శిథిలావస్థలో ఉన్న గుడి అయినా, వెలుగులోకి రావాలని, తిరిగి ఆ గుడికి కళాకాంతులు తీసుకురావాలన్నది నా తాపత్రయం. అలా వరంగల్‌లోని అన్ని గుళ్ల వద్ద టెంపుల్ డ్యాన్స్ వీడియోలు చిత్రించాం. మా నాట్య అకాడమీ నుంచి బృందాన్ని తీసుకెళ్లి, తగిన పాటను ఎంపిక చేసుకొని, డ్రెస్సింగ్, వీడియో, ఎడిటింగ్.. అన్ని బాధ్యతలు చూసుకుంటాను. ఇది ఒక తపస్సులాగా చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ శ్రీలక్ష్మి, నాన్న శ్రీనివాస్‌లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఊరే ముందుకు వచ్చి... తెలంగాణలోని జాకారం ఊళ్లో శివయ్య ఆలయం చూసి ఆశ్చర్యపోయాం. ఆ ఆలయానికి పై కప్పు ఎప్పుడో పడిపోయింది. లోపలంతా చెత్త పేరుకుపోయింది. అద్భుత కళా సంపద గల ఆ ఆలయం గురించి ఆ ఊరి పెద్దలు ఎన్నో విషయాలు వివరించారు. ఆ గుడిని బాగు చేయడానికి గతంలో ఆ ఊరి వారు చందాలు పోగేశారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన మద్ధతు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఆచరణలోకి రాకుండానే ఆగిపోయింది. మేం అక్కడ ప్రస్తుతం ఉన్న సమస్యను రికార్డ్ చేయడంతో పాటు, మా నృత్యరీతులను ప్రదర్శించాం. వాటిని వీడియోగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ గుడిని బాగుచేసే పనులు మళ్లీ మొదలయ్యాయి’’ అని ఆనందంగా వివరించింది హిమాన్సీ. ‘ఆలయంలో ఒక్క దీపమైనా వెలిగించాలని ఎంతోమంది భావిస్తారు. మా నృత్యాల వల్ల ఒక్క ఆలయం బాగు పడినా చాలు’ అంటున్న హిమాన్సీ ఆలోచన జనం గుండెల్లోకి చేరాలని, ప్రాచీన కళావైభవం రేపటి తరాలకు అందాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
మహేంద్ర ఎకోలే సెంటర్ ఆడ్మిషన్ల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: మహేంద్ర యూనివర్శిటీ ఎకోలే సెంట్రలే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈసీ),హైదరాబాద్ నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈసీ హైదరాబాద్ క్యాంపస్‌లో 2020-2024 విద్యాసంవత్సరానికి కోర్సులో చేరాలనుకునే ఆసక్తి ఉన్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగుస్తుందని ఎంఈసీ ప్రకటించింది. www.mechyd.ac ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించి, విద్యార్థులకు వారు ఎంపికయిన బ్రాంచ్‌ల వివరాలు తెలియజేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎంఈసీ విద్యాసంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎంఈసీలో బీటెక్‌కు సంబంధించి 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7 బ్రాంచ్‌లు- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటేషన్ అండ్ మ్యాధమేటిక్స్ బ్రాంచ్‌లు కలవు. జేఈఈ మెయిన్స్ ర్యాంక్, శాట్ స్కోర్ ఆధారంగా లేదా ఏసీటీ స్కోర్, 10+2 పరీక్షల ఆధారంగా అడ్మిషన్లను పొందవచ్చు అని ఎంఈసీ నిర్వాహకులు తెలిపారు. చదవండి: మెకానిక్ కొడుకు.. అమెరికన్ స్కూల్ టాపర్ -
ఇంట్లో కూర్చొని బీటెక్ చదువులా?
సాక్షి, హైదరాబాద్: తగినంత హాజరు లేదన్న కారణంతో తమను పరీక్షలకు అనుమతించడం లేదంటూ కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు ఉమ్మడి హైకోర్టు చీవాట్లు పెట్టింది. నిర్దేశించిన మేర హాజరు శాతం లేకుంటే పరీక్షలకు అనుమతించాలంటూ తామెలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించగలమని పేర్కొంది. తరగతులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని బీటెక్ చదువుతామంటే ఎలా అని ప్రశ్నించింది. అలాంటి చదువులు ఎందుకూ పనికి రావని మందలించింది. పరీక్ష రాయకపోతే మరోసారి అదే తరగతి చదవాల్సి ఉంటుందని, అందుకు సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదని, మళ్లీ చదివితే గట్టి పునాది ఏర్పడుతుందని విద్యార్థులకు చెప్పింది. నిబంధనల మేర 75 శాతం హాజరు ఉండాలని, 65–75 శాతం మధ్య హాజరున్న పిటిషనర్లకు మినహాయింపు విషయమై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని వర్సిటీ అకడమిక్ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడిచ్చారని... బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష రాసిన తమను తగినంత హాజరు శాతం లేదంటూ తదుపరి సంవత్సరానికి పంపకపోవడంతోపాటు రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలూ వెల్లడించడం లేదని పలువురు జేఎన్టీయూ, హైదరాబాద్ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించాలని వర్సిటీని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ధర్మాసనం ముందు వర్సిటీ రిజిస్ట్రార్ అప్పీల్ దాఖలు చేయగా.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తగినంత హాజరు లేని విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో సుప్రీం, హైకోర్టుల తీర్పులూ ఉన్నాయన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. హాజరు మినహాయింపులో తుది నిర్ణయం వర్సిటీదేనని స్పష్టం చేసింది. -
బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో 2016 నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన బీటెక్ , బీఫార్మసీ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలకు జేఎన్టీయూ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. -
బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలో మే, జూన్–2016లో నిర్వహించిన బీటెక్ , బీఫార్మసీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..
-
19 నుంచి ఎస్ఆర్ఎం జేఈఈఈ పరీక్షలు
సాక్షి, చెన్నై: ఎస్ఆర్ఎం వర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల(బి.టెక్) ప్రవేశ నిమిత్తం ఈ నెల 19 నుంచి ఎస్ఆర్ఎం జేఈఈఈ-2015 ఆరంభం కానుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్సిటీ అధ్యక్షుడు పి.సత్యనారాయణన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా దేశం నలుమూలల నుంచి ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈఈ) రాయడానికి 1,74,471 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత ఏడాదికంటే 40 శాతం అదనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు ఈ నెల 19, 20, 21, 22 తేదీల్లో రోజుకు రెండు సెషన్స్ చొప్పున దేశ వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పేపర్ పెన్సిల్ మోడ్(రాత) పరీక్ష ఈ నెల 26న ఉదయం 10గం నుంచి 12:30గం వరకు 102 కేంద్రాల్లో నిర్వహించనున్నామని వెల్లడించారు. పరీక్ష ఫలితాలు మే 4న ప్రకటిస్తామన్నారు. కాగా, ఎంటెక్(ఎస్ఆర్ఎం జీఈఈటీ) ఎంబీఏ(ఎస్ఆర్ఎం సీఏటీ) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మే 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.వర్సిటీ వీసీ ప్రవీన్ బక్షీ, రిజిస్ట్రార్ సేతురామన్, అడ్మిషన్స్ డెరైక్టర్ ఆర్.ముత్తు సుబ్రమణియన్, రీసెర్చ్ డెరైక్టర్ నారాయణరావు పాల్గొన్నారు. -
అపోహలు వద్దు
సాక్షి, కడప : మారుమూల గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మల్లెపల్లె బసిరెడ్డి జిల్లాకు చెందిన వారే. పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో తొలి విడతలోనే ఆర్టీఓగా ఖమ్మంలో బాధ్యతలు నిర్వర్తించి డీటీసీగా వచ్చిన బసిరెడ్డికి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. పదవ తరగతి నుంచి బీటెక్ వరకు జిల్లాలోనే చదువుకున్న ఆయన జిల్లా రవాణాశాఖ అధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాహనాల యజమానులు ఆధార్‌కార్డు అందించే ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అపోహాలు పడవద్దంటూనే ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. ఆధార్‌కార్డు అనుసంధానంతో ఎలాంటి ఇబ్బందులు వాహనదారులకు ఉండవన్నారు. అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడతామని, ఇప్పటికే దళారుల వ్యవస్థ శకం ముగిసిందని....ఎంవీఐలు కూడా పద్ధతి మార్చుకుని వ్యవహరించాలని హెచ్చరిస్తున్న బసిరెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ... సాక్షి : డీటీసీగా బాధ్యతలు చేపట్టారు. అనుబంధం ఉన్న ఈ జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది? డీటీసీ : నేను పుట్టింది అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో. అవ్వగారి ఊరైన పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామంలో ఆరంభమై నల్లపురెడ్డిపల్లెలో పదవ తరగతి పూర్తి చేశాను. ఇంటర్మీడియేట్ పులివెందుల, బీటెక్ కడప కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశాను. ఎంటెక్ తిరుపతిలో చదివాను. దీంతో నాకు జిల్లా పరిస్థితిపై అవగాహన ఉంది. జిల్లా ప్రజలు మంచివారు. నాకున్న అనుభవంతో ఉత్తమ సేవలు అందించగలను. సాక్షి : ప్రస్తుతం పెట్రోలు బంకుల్లో ఆధార్ కార్డు అనుసంధానమంటూ వాహన యాజమానులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి? బసిరెడ్డి: అలాంటిదేమీ లేదు. ఆధార్, లెసైన్స్, రిజిస్ట్రేషన్ కార్డులు మాత్రమే అడుగుతున్నాం. తీసుకు రాకపోతే తర్వాత తీసుకు రావాలని చెబుతున్నాం. సాక్షి : ఆధార్ అనుసంధానం ద్వారా సంక్షేమ పథకాలు, ట్యాక్సులు, రేషన్‌కార్డులు తొలగిస్తారని ప్రజలు భయపడుతున్నారు? బసిరెడ్డి: ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అపోహాలు వదిలేయండి. మాకు సహకరించండి. ఇప్పటికే స్వచ్ఛందంగా చాలామంది ఆధార్‌కార్డులు తీసుకుని పెట్రోలు బంకుల వద్దకు వస్తున్నారు. ఎలాంటి చర్యలు ఉండవు. వాహనాల వ్యవహారానికి సంబంధించిన విషయం మాత్రమే... బయపడవద్దు. సాక్షి: జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్ని పెట్రోలు బంకుల్లో అమలు చేస్తున్నారు? బసిరెడ్డి: జిల్లాలో మొదటి విడతగా 55 పెట్రోలు బంకుల్లో మెప్మా వారితో కలిసి ఆధార్ సేకరిస్తున్నాం. ఒక్కొక్క ఎంవీఐకి ఏడు నుంచి ఎనిమిది బంకులను కేటాయించాం. ముందుగా జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభించాం. ఆధార్ అనుసంధానం పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. రెండవ విడతలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేపడతాం. సాక్షి : జిల్లాలో వాహనాలు ఎన్ని ఉన్నాయి? లెసైన్సుల సంఖ్య ఎంత? బసిరెడ్డి : జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల (అన్ని రకాలు కలిపి) పైచిలుకు వాహనాలుంటే....అంతకంటే ఎక్కువగానే లెసైన్సులు మంజూరు అయ్యాయి. సాక్షి : లెసైన్సులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి దళారీ వ్యవస్థ కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి? బసిరెడ్డి: దళారుల వ్యవస్థకు కాలం చెల్లింది. లెసైన్సులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి కేవలం ఒక్కరోజులోనే కార్డులను జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. వారంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. ప్రత్యేకంగా ఒక పోస్టల్ కవరును కూడా రూపొందించాం. తద్వారా ఎవరిదైనా కార్డు పోస్టుద్వారా ఇంటికి పంపినా యజమాని లేని సందర్భంలో పోస్టల్‌కు సంబంధించి వ్యక్తి కూడా ఆప్షన్లు పూర్తి చేసి అందజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సాక్షి : జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం, రాయచోటి, బద్వేలు, కడప ప్రాంతాలలో అధిక లోడుతో వాహనాలు వెళుతున్నా పట్టించుకోని పరిస్థితిపై మీరేమంటారు? బసిరెడ్డి: ప్రస్తుతం ఆధార్‌తో బిజీగా ఉన్నాం. త్వరలోనే అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై చర్యలు తప్పవు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక లోడు వాహనాలను అరికడతాం. సాక్షి : జిల్లాలోని అన్ని ఎంవీఐ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? అయితే కొన్నిచోట్ల అవి పనిచేయడం లేదు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరదు కదా? బసిరెడ్డి: అవినీతి, దళారుల వ్యవస్థ నిరోధానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల పనిచేయలేదని తెలిసింది. ప్రత్యేకంగా సంబంధిత ఆపరేటర్‌ను పిలిపించి మాట్లాడాం. పనిచేయని ప్రాంతాలలో త్వరలోనే కొత్తవి సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి : కొంతమంది ఎంవీఐలు కేటాయించిన ప్రాంతాల్లో ఉండకుండా వివిధ ప్రాంతాల్లో ఉంటూ వస్తూపోతూ మధ్యలో వాహనాలను పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి? బసిరెడ్డి : ఎంవీఐలకు ఇప్పటికే చెప్పాం. పద్దతి మార్చుకోండి.... అలా వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. సాక్షి : కడపలోని డీటీసీ కార్యాలయంలో గతంలో ఐదు లక్షల నగదు గల్లంతు వ్యవహారం చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? బసిరెడ్డి : గతంలో జరిగిందేదో జరిగింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఐదు లక్షలు రికవరీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాడుగ, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లులు, స్పీడ్ పోస్టు, బీఎస్ఎన్ఎల్ నెట్, హోంగార్డులకు సంబంధించిన జీతాలు కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అకౌంట్లలో వేసేందుకు చర్యలు తీసుకున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా చేశాం. సాక్షి : టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కాకుండా బర్త్ సర్టిఫికెట్లు ఎలా పడితే అలా డాక్టర్ల ద్వారా తెస్తుండడంతో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమంటారు? బసిరెడ్డి : దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రొద్దుటూరు, కడపలో పలువురు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లతో చర్చించాం. ఖచ్చితంగా పదవ తరగతి సర్టిఫికెట్‌పై సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ అటెస్ట్డ్తోనే స్వీకరిస్తాం. అందుకు సంబంధించి ఎంవీఐలకు కూడా ఆదేశాలు ఇచ్చాం. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మియాపూర్: ద్విచక్రవాహనాన్ని స్టార్ట్ చేస్తే కాలేదు... దీంతో ఇంజిన్ వైపు వంగి చూస్తున్న బీటెక్ విద్యార్థినిని అంతలోనే వెనుకనుంచి దూసుకొచ్చి ఇసుక లారీ బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొండగట్టు గ్రామానికి చెందిన మౌనిక (18) నగరంలోని మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతూ మియాపూర్ హెచ్ఎంసీ స్వర్ణపురికాలనీలోని పెద్దన్నాన ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై తన ద్విచక్రవాహనాన్ని నిలిపి స్టార్ట్ చేయగా స్టార్ట్ కాలేదు. దీంతో ఆమె ద్విచక్ర వాహనాన్ని వంగి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన మౌనికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్సపొందుతూ రాత్రి 8.30కి మృతి చెందింది. పోలీసులు స్వగ్రామంలో ఉన్న మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శోకసంద్రంలో మునిగిపోయారు. -
దొంగలుగా మారిన బీటెక్, ఇంటర్ విద్యార్థులు
కరీంనగర్ క్రైం : జల్సాలకు అలవాటుపడ్డ యువకులు దారితప్పి.. దోపిడీదారులుగా మారారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్‌ను చేజేతులా కాలరాసుకున్నారు. క్షణపాటి సరదాల కోసం బంగారు భవిష్యత్‌ను చీకటిమయం చేసుకున్నారు. నలుగురు ముఠాగా చేరి దారిదోపిడీలకు పాల్పడ్డాడు. ఫలితంగా కటకటాల పాలయ్యారు. వివరాలు సీఐ నరేందర్ బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తెలిపారు. నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన సర్ధార్ కులదీప్‌సింగ్(20), ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కేంద్రానికి చెందిన ముత్యం సాయికృష్ణ(19), కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన ఎండీ ఫిరోజ్(19), రామడుగు ఎక్స్‌రోడ్డుకు చెందిన శనిగరపు రంజిత్(19) ముఠాగా ఏర్పడ్డారు. కులదీప్‌సింగ్ వెల్డింగ్ పనులు చేస్తుండగా, సాయికృష్ణ బీటెక్ మూడో సంవత్సరం, ఫిరోజ్ పాలిటెక్నిక్, రంజి త్ ఇంటర్ పూర్తి చేశారు. వీరు ముఠాగా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడుతున్నా రు. ఈనెల 4న రాత్రి పది గంటలకు చొ ప్పదండి నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లా రీని అటకాయించి డ్రైవర్‌ను బెదిరించి రూ.8 వేలు లాక్కున్నారు. బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కులదీప్సింగ్పై నిఘా పెట్టారు. బుధవారం ఇంటికి చేరుకున్న కులదీప్సింగ్తోపాటు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని వి చారించగా అసలు విషయం చెప్పారు. వారి నుంచి బైక్, రూ.2వేల నగదు స్వా ధీనం చేసుకున్నారు. ఎండీ ఫిరోజ్, రం జిత్ పరారీలో ఉన్నారు. గతంలో కుల దీప్‌సింగ్, ఫిరోజ్, రంజిత్‌పై రెండు కే సులు నమోదయ్యాయి. రిమాండ్‌కు సైతం వెళ్లొచ్చారు. వీరిని పట్టుకు నేందుకు రెండు బృందాలుగా పోలీసు లు గాలించారు. సమావేశంలో రూరల్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. -
చెదిరిన స్వాతి కలలు
* సీటు మారడం వల్లే మృతి * పెళ్లి పీటలెక్కని ప్రేమజంట * మృతురాలు స్వాతి విషాదగాథ చెన్నై, సాక్షి ప్రతినిధి: అందరినీ అలరిస్తూ ఆటపాటలతో తడిసిముద్దచేసే ‘స్వాతి’ కలలు చెదిరిపోయూరుు. తల్లిదండ్రులతో ముచ్చట్లు, బామ్మతో కబుర్లు, ప్రేమించిన వ్యక్తితో వివాహం.. ఇలా ఆమె కన్నకలలను రైలు బాంబు కబళించివేసింది. ఇటీవలే చేరిన ఉద్యోగంలో విరామం తీసుకుని తల్లిదండ్రులను కలుసుకునేందుకు బెంగళూరు నుంచి బయలుదేరింది. తనను అమితంగా ప్రేమించే అవ్వకు బహుమతులు, కుటుంబ సభ్యులకు తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఆలస్యం కావడంతో పరుగుపరుగున ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమెకు అప్పుడు తెలియదు తాను మృత్యుకుహరంలోనే కూర్చుంటున్నానని. తనతో పాటు రైలు ఎక్కిన చెన్నైకి చెందిన స్నేహితురాలు రజితతో కలిసి వారికి కేటాయించిన సీటు నెంబరు 9,10లో కూర్చున్నారు. అయితే ఒక కుటుంబం వచ్చి ఁప్లీజ్ 23, 24 సీట్లలో కూర్చుంటారా* అని అడిగింది. స్నేహశీలైన స్వాతి సంతోషంగా అంగీకరించింది. మంచి ఉద్యోగం, ఇంటివారికి బహుమతులు వారిని కలవబోతున్నామనే ఆనందం, తాను ప్రేమించిన వ్యక్తితో జరగనున్న వివాహం ఆమెను నిద్రపోనివ్వలేదు. అలాగే గుంటూరులోని వారింటిలో కూడా ఎపుడు తెల్లారుతుందా, స్వాతి వస్తుందా అని జాగారం చేశారు. సీటు మారడంతో దురదృష్టం ఆమె వెన్నంటే నిలిచింది. వారు కూర్చున్న సీటు కిందనే బాంబును అమర్చి ఉన్నారు. చెన్నై రాగానే స్నేహితురాలికి టాటా చెప్పి సాగనంపింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్వాతి కన్నుమూసింది. పేలుడు జరగడంతో వెంటనే వెనక్కు వచ్చిన స్నేహితురాలి రజిత కన్నీరుమున్నీరైంది. వెళ్లొస్తానని చెప్పింది... ఇలా వెళ్లిపోతుందని అనుకోలేదంటూ విలపించింది. తెల్లారగానే వచ్చిన ఫోన్‌ను అందుకున్న స్వాతి తండ్రి రామకృష్ణన్, తల్లి కామాక్షిదేవి, బామ్మ రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బీటెక్‌లో 91 శాతం మార్కులతో వర్సిటీ పరిధిలోనే మెరుగైన ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్వాతి. చిత్రలేఖనం, కవిత, ఫొటోగ్రఫీలలో దిట్ట. బీటెక్ ఉత్తీర్ణతలో సాధించిన ఉత్సాహంతో ఎంటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులో ఉద్యోగం పొందారు. పరిచయం లేని ఊరు వద్దన్నారు పెద్దలు. అందివచ్చిన తొలి ఉద్యోగం వద్దనకూడదంటూ వారికి నచ్చజెప్పి స్వాతి బెంగళూరు వెళ్లిపోయారు. జనవరిలో తొలి జీతంతో బామ్మకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. ప్రతిరోజు రాత్రి స్వాతితో మాట్లాడితేగానీ నిద్రపోను, ఇక తనను నిద్రపుచ్చేదెవరని బామ్మ కన్నీరుమున్నీరయ్యూరు. కాలేజీలోనే ప్రేమ హైదరాబాద్‌లో చదువుతుండగానే తన సహ విద్యార్థిని ఆమె ప్రేమించారు. అయితే సాధారణ కుటుంబం, బాధ్యతలు ఉండటం వల్ల పెళ్లివాయిదా వేద్దామని చెప్పి అతడిని ఆమె ఒప్పించారు. ఆతను సైతం ఆనందంగా అంగీకరించాడు. ఈ దశలో ప్రేమికునికి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే స్వాతి తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారుసైతం అంగీకరించారు. మరో నెలన్నర రోజుల్లో వారిద్దరి వివాహం జరిపేలా నిశ్చయించారు. చక్కనైన ఉద్యోగం, పెద్దల అనుమతితో ప్రేమించిన వ్యక్తితో వివాహం వంటి రంగుల రంగుల కలలు కంటున్న స్వాతిని రైలు బాంబు కబళించివేసింది, భవిష్యత్తుపై ఆమె కన్న కలల ఆమె దేహం మాదిరే ఛిద్రమైపోయాయి. ఆమెను అభిమానించి, ప్రేమించే వారిని కన్నీటి సంద్రంలోకి నెట్టివేశాయి. -
కొలువు కొట్టాలె..
మరో దిక్కులేక దరఖాస్తు చేసిన.. నా పేరు పడిదెల వేణుగోపాల్‌రావు. మాది వీణవంక మండలం బేతిగల్. నేను హైదరాబాద్‌లో బీటెక్ (సీఎస్ఈ)పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న కష్టపడి నన్ను చదివించిండు. వారి రెక్కల కష్టం చూడలేకపోతున్న. మా ఊళ్లో అందరు ఎప్పుడు సర్కారు నౌకరి చేస్తవు అంటున్నరు. అందుకే గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఓ కోచింగ్ సెంటర్లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్న. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న. ఇంతలో వీఆర్వో నోటిఫికేషన్ వెలువడింది. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కసితో వీఆర్వోకు దరఖాస్తు చేసుకున్న. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నరు. ఇంజినీరింగ్ రంగంలో సరైన అవకాశాలు లేకపోవడంతో.. మరో దిక్కులేక వీఆర్వోకు పోటీపడుతున్న. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వీఆర్వోకు 72,000, వీఆర్ఏకు 2200 దరఖాస్తులు అందాయన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి భూపరిపాలన ముఖ్య కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13 వరకు 90వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 216 కేంద్రాలను గుర్తించామని, అభ్యర్థులు పెరిగితే అదనంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తుల ఫొటో పరిశీలన ఈనెల 15లోగా పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారందరూ వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామాల్లో దండోరా వేయిస్తామన్నారు. ఈ పరీక్షలకు డీఆర్వో కృష్ణారెడ్డిని సమన్వయ అధికారిగా నియమించామని తెలిపారు. -
ప్రేమ.. విషాదం
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : ప్రేమ వ్యవహారం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండు నిండుప్రాణాలను బలిగొన్నది. ప్రియుడు మోసం చేశాడనే కారణంతో కుమార్తె మృతి చెందగా, ఆమె మృతిపై అనుమానాలు రావడంతో తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హుస్నాబాద్ మండలం గౌరవెళ్లి గ్రామానికి చెందిన ఎండీ.షర్పొద్దీన్ భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామకార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన నాల్గవ కుమార్తె షెష్మా(18) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే గ్రా మానికి చెందిన ఓ యువకుడు, షెష్మా ప్రేమించుకున్నారని సమాచారం. ఈనెల ఒకటిన షెష్మా ఇంట్లో మృతి చెందగా, కుమార్తె మరణం తట్టుకోలేక ఆమె తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గౌరవెళ్లికి చెందిన ఓ యువకుడు షెష్మాను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని, దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి షర్పొద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షెష్మా మృతదేహానికి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె క్రిమిసంహారక మందు తాగి చనిపోలేదని, శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని పోలీసులకు నివేదిక ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న షెష్మా గాయాలపాలు కావడంపై పోలీసులు అనుమానించారు. ఆమె శరీరంలోని పలు భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. షెష్మా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతరత్రా ఏమైనా జరిగిందా.. అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టడంతోపాటు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. షెష్మా ప్రేమ వ్యవహారంతోపాటు ఆమె మృతిపై పదిమందిలో పలు రకాలుగా చర్చ సాగడం ఆ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేసింది. దీంతో మనస్తాపం చెందిన షర్పొద్దీన్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె మరణంతో మనోవేదకు గురై షర్పొద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య రమిజా ఫిర్యాదు చేసినట్లు హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ తెలిపారు. షెష్మా మృతిపై అనుమానాలున్నాయి.. షెష్మా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఆమె క్రిమిసంహారక మందు తాగలేదని, శరీరంపై మూడు చోట్ల గాయాలున్నాయని పోస్టుమార్టంలో తేలిందని సీఐ సదన్‌కుమార్ తెలిపారు. దీంతో గాయాలున్న ఆమె శరీర భాగాలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే షెష్మా మృతిపై వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. షర్పొద్దీన్ మృతిపై గ్రామస్తులను విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఈ వంద రోజుల్లో.. గేట్ ప్రిపరేషన్ ప్లాన్..
బీటెక్/బీఈ పూర్తయ్యాక ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులు చదవాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్). ఇందులో వచ్చిన ర్యాంకుతో ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంట్రీ లెవల్ (ట్రైనీ ఇంజనీర్) పోస్టుల భర్తీలో గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు దాదాపు వంద రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రిపరేషన్ వ్యూహాలు.. పి.శ్రీనివాసులు రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, వాణి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ కోర్ అంశాలపై దృష్టి సారించాలి.. ఈ వంద రోజుల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాథమిక భావనలు, నిర్వచనాలు, సూత్రాలను క్షుణ్నంగా రివిజన్ చేయాలి. గత 20 ఏళ్లలో నిర్వహించిన గేట్, ఐఈఎస్, డీఆర్డీవో, బార్క్, ఇతర పీఎస్‌యూ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి వాటిల్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయాలి. ఇలా చేస్తే ఏయే అంశాలపై మరింత దృష్టి సారించాలో తెలుస్తుంది. తర్వాత పాఠ్యపుస్తకాల్లో అధ్యాయాలవారీగా ఉన్న ముఖ్య అంశాలను బాగా చదవాలి. ఈసీఈ విద్యార్థులు ముఖ్యంగా ఈడీసీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ సిస్టమ్స్, ఈఎంటీఎల్, కమ్యూనికేషన్లపై ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యాంశాలను పదేపదే చదవడంతోపాటు ప్రతిరోజూ పునశ్చరణ చేస్తుండాలి. ‘ఎలక్ట్రికల్’ విద్యార్థులు ఎలక్ట్రికల్ మిషన్‌స, పవర్ సిస్టమ్స్, నెట్వర్క్స, కంట్రోల్స్, మెజర్మెంట్స్లపై ఎక్కువ దృష్టి సారించాలి. మెకానికల్ విద్యార్థులు థర్మల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్, థియరీ ఆఫ్ మిషనరీ, ప్రొడక్షన్ టెక్నాలజీలను బాగా చదవాలి. చదివిన అంశాలపై ఎప్పటికప్పుడు సొంతంగా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అంశాలనైతే చదువుతారో వాటిపైనే టెస్టులు ఉండాలి. ప్రిపరేషన్ ఒకే విధానంలో ఉండాలి.. అందుబాటులో ఉన్న ఈ వంద రోజుల్లో ప్రతిరోజూ ఆరు గంటలపాటు సంబంధిత బ్రాంచ్‌ల సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. సంబంధిత టాపిక్లపై రెండు గంటలు తప్పనిసరిగా పునశ్చరణ అవసరం. కళాశాలల్లో పరీక్షలు ఒక్కొక్క సబ్జెక్ట్‌పైనే నిర్వహించేవారు. గేట్లో మాత్రం బీఈ/బీటెక్‌లో ఉండే అన్ని సబ్జెక్టులతోపాటు జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లు ఉంటాయి. వీటన్నింటిని ఒకే పేపర్‌గా రూపొందించి ఇస్తారు. అందువల్ల డిసెంబర్ చివరి నాటికి సిలబస్ మొత్తాన్ని అధ్యయనం చేయడం పూర్తి చేయాలి. జనవరి నెలంతా పునశ్చరణకు కేటాయించాలి. ఈ సమయంలోనే వీలైనన్ని ఎక్కువసార్లు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఆన్‌లైన్‌పై సాధన చేయాలి. కోర్ బ్రాంచ్‌ల్లో విజయానికి.. కోర్ బ్రాంచ్‌ల్లో విజయానికి ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్‌ను ఒక పుస్తకంలో ముందు రాసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా చదవాలి. నోట్స్‌తోపాటు ప్రామాణిక పుస్తకాల అధ్యయనం తప్పనిసరి. పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠ్యాంశం చివరనున్న ఆబ్జెక్టివ్, న్యూమరికల్ టైప్ ప్రశ్నలను ప్రతిరోజూ మాక్ టెస్టుల రూపంలో ప్రాక్టీస్ చేయాలి. మొదటిసారి ఏ ప్రశ్నలకైతే సమాధానం గుర్తించలేకపోయారో ఆ ప్రశ్నలను మరోసారి రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి మాక్టెస్టుకు సిద్ధం కావాలి. ఏమైనా సందేహాలు ఉంటే ఈ-మెయిల్/ఫోన్ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీలను సంప్రదించాలి. న్యూమరికల్ ప్రశ్నలు.. సాధారణంగా న్యూమరికల్ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వర్చువల్ కీప్యాడ్‌ను ఉపయోగించి వీటికి సమాధానాలు గుర్తించాలి. దీంతోపాటు సమయపరిమితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల ముందు ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి తర్వాత న్యూమరికల్ ప్రశ్నలను ఆన్సర్ చేయాలి. ఇవి ఫార్ములా ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన ప్రశ్నను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకుని, తగిన ఫార్ములాను ఉపయోగించి సమాధానాలు గుర్తించాలి. జనరల్ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నల సరళి.. ముఖ్యంగా రీజనింగ్‌లో 3 నుంచి 4 మార్కులు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 4 నుంచి 5 మార్కులు, సింప్లికేషన్స 2 నుంచి 3 మార్కులు, ఇంగ్లిష్‌లో ఐదు మార్కుల వరకు ప్రశ్నల సరళి ఉండొచ్చు. అయితే అత్యధిక మార్కులు పొందడానికి విద్యార్థులు ఆర్ఎస్ అగర్వాల్, అభిజిత్ గుహ, గులాటి, జీఎస్ఆర్ పుస్తకాలను ఎక్కువగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఏవైనా ఇంగ్లిష్ దినపత్రికలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవాలి. నెగెటివ్ మార్కులను అధిగమించండిలా.. సంబంధిత సబ్జెక్టులను బాగా చదవడంతోపాటు వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి. దీంతోపాటు ఎక్కువ ప్రశ్నలను ఎంచుకుని సొంతంగా మాక్‌టెస్టులను రాయాలి. ఇలా చేస్తే పరీక్షలో చాలావరకు నెగెటివ్ మార్కులను అధిగమించవచ్చు. పరీక్షలో కూడా ముందు సులువుగా అనిపించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత కొం చెం సులువు.. కష్టం.. బాగా కష్టం.. ఇలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పోవాలి. ఇలా చేస్తే చాలా వరకు తప్పులు లేకుండా సమాధానాలు ఇవ్వొచ్చు. అలా కాకుండా ముందుగానే కష్టమైన ప్రశ్నలకు ఉన్న సమయాన్ని వెచ్చిస్తే చివరలో ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో అటు సులువైన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోయే ప్రమాదముంది. పరీక్ష హాల్లో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆన్లైన్ పరీక్ష.. జాగ్రత్తలు.. గేట్-2014లో ప్రశ్నలు, మార్కుల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేవు. కానీ అన్ని పేపర్లను ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బీటెక్ వరకు విద్యార్థులంతా రాత పరీక్షకు అలవాటు పడి ఉంటారు. అందువల్ల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆందోళనల సహజం. ముఖ్యంగా కంప్యూటర్‌పై అంతగా పట్టులేని గ్రామీణ విద్యార్థులు.. ఆన్లైన్ పరీక్షకు సిద్ధం కావడానికి చాలా ముందు నుంచి కంప్యూటర్‌పై వీలైనన్ని మాక్‌టెస్టులు, గ్రాండ్‌టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్‌పోర్టల్స్‌లో ఈ మాక్‌టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇలా చేస్తే పరీక్ష నాటికి కంప్యూటర్‌పై ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమించడంతోపాటు వేగంగా సమాధానాలను గుర్తించగల నైపుణ్యం అలవడుతుంది. అందుబాటులో ఉన్న ఈ మూడు నెలల్లో వీలైనన్ని మాక్ ఆన్లైన్ టెస్టులు రాయాలి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో కటాఫ్ మార్కులు.. గేట్లో 800 కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా 600 కంటే ఎక్కువ స్కోర్ పొందితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీటు ఆశించొచ్చు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో సీటు పొందాలంటే గేట్లో 450 కంటే ఎక్కువ స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు ఇలా.. సాధారణంగా గేట్ పరీక్షలో బీటెక్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే సంబంధిత సబ్జెక్టుల బేసిక్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఎవల్యూషన్లపై ప్రశ్నలుంటాయి. కానీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో మాత్రం ఎంటెక్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు అడుగుతారు. గేట్‌కు పూర్తి భిన్నంగా లోతైన విశ్లేషణ (ఇన్‌డెప్త్ అనాలసిస్), సింథసిస్, ఎవల్యూషన్, క్రియేటివిటీ, డిజైన్ మొదలైన వాటిపై ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఐఈఎస్‌కు సిద్ధమయ్యేవారు సంబంధిత సబ్జెక్టుల కాన్సెప్ట్స్, బేసిక్స్‌తోపాటు ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ చదువుకోవాలి. విద్యార్థులు మొదట ఫిబ్రవరి వరకు గేట్‌పై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత నుంచి ఐఈఎస్‌కు సిద్ధమవ్వాలి. పరీక్ష రోజు డూస్ అండ్ డోన్ట్స్.. డూస్: ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి. పరీక్షకు ముందు అన్ని అంశాలు చదవకుండా సారాంశాన్ని (సమ్మరీ) మాత్రమే చదవాలి. పరీక్ష కేంద్రం, ప్రదేశాన్ని ఒకరోజు ముందుగానే వెళ్లి తెలుసుకోవాలి. ఇలా చేస్తే పరీక్ష రోజు వెతుకులాట తప్పుతుంది. పరీక్షకు కావలసిన సరంజామా (హాల్‌టికెట్, పెన్ను, గుర్తింపు కార్డు మొదలైనవి) అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. డోన్ట్స్: ఎలాంటి ఆందోళన చెందొద్దు. చివరి నిమిషంలో పాఠ్యపుస్తకాలు చదివి గందరగోళానికి గురి కావద్దు. స్నేహితులతో ఎలాంటి చర్చలు చేయొద్దు. అతి విశ్వాసం వద్దు. అత్యుత్తమ స్కోర్‌కు టాప్‌టెన్ టిప్స్ ప్రాథమిక భావనలపై పట్టు. ఏకాగ్రత, సాధించాలనే తపన. యూనిఫాం.. కంటిన్యూస్ స్టడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం. తెల్లవారుజామున (ఎర్లీమార్నింగ్) స్టడీ అవర్స్ ఉండాలి. ఎక్కువసార్లు పునశ్చరణ (రివిజన్). వీలైనన్ని ఆన్లైన్, మాక్ టెస్టుల సాధన. ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఫ్యాకల్టీతో సందేహాలను నివృత్తి చేసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు, యోగా. 2011 నుంచి గేట్‌కు హాజరవుతున్నా.. పూర్తి సమయం కేటాయించి, సీరియస్ ప్రిపరేషన్ సాగించింది గతేడాది ఆగస్టు నుంచే. ప్రతిరోజు 8 గంటలు కేటాయించాను. అంతకుముందు రాసినప్పుడు ర్యాంకు రాకపోవడానికి గల లోపాలను గుర్తిస్తూ.. గేట్ ప్రశ్నల తీరును విశ్లేషిస్తూ చదివాను. అంతేకాకుండా ప్రతి చాప్టర్ వెనుక ఇచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో కలిసొచ్చింది. ఒక సమస్యను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సాధించే విధంగా ప్రాక్టీస్ చేయడం గేట్‌కు ఎంతో ప్రధానం. ఇలాంటి ప్రశ్నలే పరీక్షలో అడుగుతారు. ముందుగా అభ్యర్థులు గేట్ అంటే కఠినమైన పరీక్ష అనే ఆందోళన వీడాలి. గేట్ సిలబస్ బీటెక్లోదే. బీటెక్ సబ్జెక్ట్‌లలోని థియరీని, ప్రాబ్లమ్‌సాల్వింగ్ అప్రోచ్‌ను ఆకళింపు చేసుకుని.. ఆ తీరులో చదివితే సులభంగానే అర్హత పొందొచ్చు. - బి. సుజిత్‌కుమార్, (ఎంఎస్, ఐఐటీ మద్రాస్), ఫస్ట్ ర్యాంకర్, ఈసీఈ, గేట్- 2013 మిగిలిన బ్రాంచ్‌లతో పోలిస్తే ఈఈఈలో ఎక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి పరీక్షకు ఆరేడు నెలల ముందుగానే ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వాలి. ప్రతిరోజూ కనీసం ఆరు గంటలపాటు చదవాలి. చాలామంది క్లాస్‌రూం నోట్స్, రిఫరెన్స బుక్స్ చదివి వదిలేస్తారు. ఇది సరికాదు. రోజూ మీరు ఏ అంశమైతే చదివారో ఆ అంశంపై ప్రతిరోజూ మాక్ టెస్టులు రాయాలి. గేట్ ఆన్లైన్లో జరగనున్న నేపథ్యంలో రోజువారీ ప్రాక్టీస్, మాక్టెస్టుల సాధన తప్పకుండా చేయాలి. రోజూ చదివిన అంశాలపై కనీసం గంటసేపైనా సాధన చేయాలి. పరీక్షకు రెండు నెలలు ముందు మొత్తం సిలబస్‌పై వీలైనన్ని ఆన్లైన్ టెస్టులు రాయాలి. ప్రాక్టీస్ వల్లే నేను విజయం సాధించగలిగాను. వంద మార్కులగానూ 92 మార్కులకు పరీక్ష రాస్తే 88 మార్కులు సాధించానంటే అది ప్రాక్టీస్ వల్లే. - ఎం. రామకృష్ణ, (ఆఫీసర్ ట్రైనీ, హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం) ఫోర్త ర్యాంకర్, ఈఈఈ, గేట్- 2013 రిఫరెన్స్ బుక్స్ ఎలక్ట్రానిక్స్: Edc: Milliman, Halkias, Sedra Smith, Schaum series. Digital: Marrismano, R.P. Jain, Gaonkar. Emtl: William Hayt, Schaum series, Krauss, k.d. prasad. Comm. Signals: Simon haykin, Schaum series. c.s: Nagrath & Gopal, Schaum series. Adc: Jacob Milliman, Schaum series. W/W: William hayt, Schaum series. ఎలక్ట్రికల్: Electrical Machines: p.s. Bhimbra; J.B. Gupta; Nagrath & Kothari; M.G. Say. Power Systems: C.L. Wadhwa; J.B. Guptha; Soni Guptha Bhatnagar. Networks: Hyatt; Sadiku Measurements:A.K.Sawhney; H.S.Kalsi Control systems: Nagrath & Gopal; ogata; kuo Power electronics: Khanchandani మెకానికల్: Thermal: Cengel, P.K. Nag FM: DS Kumar Subramanyam Som: Sadhu Singh R/Ac: Arora/Manohar Prasad H.T.: Dr. Ramakrishna -
సూపర్ న్యూమరరీ కోటా ఫీజు రూ.3.17 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సూపర్ న్యూమరరీ కోటా కింద బీటెక్, బీ.ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే విదేశీ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారు వార్షిక రుసుమును రూ. 3.17 లక్షలు(5 వేల డాలర్లు) చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు వార్షిక రుసుమును రూ. 1.90 లక్షలు(3వేల డాలర్లు)గా నిర్ధారించింది. ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మాడీ, ఎం ఆర్క్, ప్లానింగ్ కోర్సుల్లో వార్షిక రుసుమును రూ.3.81 లక్షలు(6 వేల డాలర్లు)గా ఖరారు చేసింది. అయితే, ఇదే కోటాలో అడ్మిషన్లు పొందే భారతీయ గల్ఫ్ కార్మికుల పిల్లలకు సాధారణ ఫీజులే వసూలు చేయనున్నట్టు పేర్కొంది. 20 నుంచి ఎంసెట్-ఏసీ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ముస్లిం మైనారిటీ విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్)లో ప్రవేశానికి ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎంసెట్-ఏసీ-సింగిల్‌విండో-2 కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 20వ తేదీన 1 నుంచి 1,30,000 వరకు గల ర్యాంకర్లు, 21న 1,30,001 నుంచి 1,70,000 వరకు, 22న 1,70,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల ముస్లిం మైనారిటీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. హైదరాబాద్, మార్కాపురం, విజయవాడ, కడప, నెల్లూరు పట్టణాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. పూర్తివివరాలకు వెబ్సైట్లో చూడొచ్చు. భారీగా తగ్గిన ఎంసీఏ, ఎంబీఏ సీట్లు సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం ఎంసీఏ, ఎంబీఏ సీట్లు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఎంబీఏ సీట్లు 15,450, ఎంసీఏ సీట్లు 24,400 తగ్గిపోయాయి. ఈ రెండు కోర్సులకు డిమాండ్ పడిపోవడంతో ఈ ఏడాది 130 ఎంబీఏ కాలేజీలు, 334 ఎంసీఏ కాలేజీలు కోర్సులను రద్దు చేశాయి. దీంతో ఈ ఏడాది 837 ఎంబీఏ కాలేజీల్లో 95,535 సీట్లు, 317 ఎంసీఏ కాలేజీల్లో 22,304 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐసెట్‌లో మొత్తం 1,26,000 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా 1,19,647 సీట్లు అందుబాటులో ఉన్నాయి.