ఈ వంద రోజుల్లో.. గేట్ ప్రిపరేషన్ ప్లాన్.. | 100 days preparation plan for GATE Entrance exam | Sakshi
Sakshi News home page

ఈ వంద రోజుల్లో.. గేట్ ప్రిపరేషన్ ప్లాన్..

Published Thu, Oct 24 2013 1:36 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

100 days preparation plan for GATE Entrance exam

 బీటెక్/బీఈ పూర్తయ్యాక ఎంటెక్, పీహెచ్‌డీ వంటి కోర్సులు చదవాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్). ఇందులో వచ్చిన ర్యాంకుతో ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంట్రీ లెవల్ (ట్రైనీ ఇంజనీర్) పోస్టుల భర్తీలో గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో పరీక్షకు దాదాపు వంద రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రిపరేషన్ వ్యూహాలు..
 

పి.శ్రీనివాసులు రెడ్డి,
మేనేజింగ్ డెరైక్టర్, వాణి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
 
 కోర్ అంశాలపై దృష్టి సారించాలి..
 ఈ వంద రోజుల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాథమిక భావనలు, నిర్వచనాలు, సూత్రాలను క్షుణ్నంగా రివిజన్ చేయాలి. గత 20 ఏళ్లలో నిర్వహించిన గేట్, ఐఈఎస్, డీఆర్‌డీవో, బార్క్, ఇతర పీఎస్‌యూ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి వాటిల్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయాలి. ఇలా చేస్తే ఏయే అంశాలపై మరింత దృష్టి సారించాలో తెలుస్తుంది. తర్వాత పాఠ్యపుస్తకాల్లో అధ్యాయాలవారీగా ఉన్న ముఖ్య అంశాలను బాగా చదవాలి.
ఈసీఈ విద్యార్థులు ముఖ్యంగా ఈడీసీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ సిస్టమ్స్, ఈఎంటీఎల్, కమ్యూనికేషన్‌లపై ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యాంశాలను పదేపదే చదవడంతోపాటు ప్రతిరోజూ పునశ్చరణ చేస్తుండాలి. ‘ఎలక్ట్రికల్’ విద్యార్థులు ఎలక్ట్రికల్ మిషన్‌‌స, పవర్ సిస్టమ్స్, నెట్‌వర్‌‌క్స, కంట్రోల్స్, మెజర్‌మెంట్స్‌లపై ఎక్కువ దృష్టి సారించాలి. మెకానికల్ విద్యార్థులు థర్మల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్, థియరీ ఆఫ్ మిషనరీ, ప్రొడక్షన్ టెక్నాలజీలను బాగా చదవాలి. చదివిన అంశాలపై ఎప్పటికప్పుడు సొంతంగా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అంశాలనైతే చదువుతారో వాటిపైనే టెస్టులు ఉండాలి.
 

 ప్రిపరేషన్ ఒకే విధానంలో ఉండాలి..
అందుబాటులో ఉన్న ఈ వంద రోజుల్లో ప్రతిరోజూ ఆరు గంటలపాటు సంబంధిత బ్రాంచ్‌ల సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. సంబంధిత టాపిక్‌లపై రెండు గంటలు తప్పనిసరిగా పునశ్చరణ అవసరం. కళాశాలల్లో పరీక్షలు ఒక్కొక్క సబ్జెక్ట్‌పైనే నిర్వహించేవారు. గేట్‌లో మాత్రం బీఈ/బీటెక్‌లో ఉండే అన్ని సబ్జెక్టులతోపాటు జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లు ఉంటాయి. వీటన్నింటిని ఒకే పేపర్‌గా రూపొందించి ఇస్తారు. అందువల్ల డిసెంబర్ చివరి నాటికి సిలబస్ మొత్తాన్ని అధ్యయనం చేయడం పూర్తి చేయాలి. జనవరి నెలంతా పునశ్చరణకు కేటాయించాలి. ఈ సమయంలోనే వీలైనన్ని ఎక్కువసార్లు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఆన్‌లైన్‌పై సాధన చేయాలి.
 
 

కోర్ బ్రాంచ్‌ల్లో విజయానికి..
 కోర్ బ్రాంచ్‌ల్లో విజయానికి ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్‌ను ఒక పుస్తకంలో ముందు రాసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా చదవాలి. నోట్స్‌తోపాటు ప్రామాణిక పుస్తకాల అధ్యయనం తప్పనిసరి. పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠ్యాంశం చివరనున్న ఆబ్జెక్టివ్, న్యూమరికల్ టైప్ ప్రశ్నలను ప్రతిరోజూ మాక్ టెస్టుల రూపంలో ప్రాక్టీస్ చేయాలి. మొదటిసారి ఏ ప్రశ్నలకైతే సమాధానం గుర్తించలేకపోయారో ఆ ప్రశ్నలను మరోసారి రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి మాక్‌టెస్టుకు సిద్ధం కావాలి. ఏమైనా సందేహాలు ఉంటే ఈ-మెయిల్/ఫోన్ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీలను సంప్రదించాలి.
 

 న్యూమరికల్ ప్రశ్నలు..
 సాధారణంగా న్యూమరికల్ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. వర్చువల్ కీప్యాడ్‌ను ఉపయోగించి వీటికి సమాధానాలు గుర్తించాలి. దీంతోపాటు సమయపరిమితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల ముందు ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి తర్వాత న్యూమరికల్ ప్రశ్నలను ఆన్సర్ చేయాలి. ఇవి ఫార్ములా ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన ప్రశ్నను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకుని, తగిన ఫార్ములాను ఉపయోగించి సమాధానాలు గుర్తించాలి.
 
 

జనరల్ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నల సరళి..
 ముఖ్యంగా రీజనింగ్‌లో 3 నుంచి 4 మార్కులు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 4 నుంచి 5 మార్కులు, సింప్లికేషన్‌‌స 2 నుంచి 3 మార్కులు, ఇంగ్లిష్‌లో ఐదు మార్కుల వరకు ప్రశ్నల సరళి ఉండొచ్చు. అయితే అత్యధిక మార్కులు పొందడానికి విద్యార్థులు ఆర్‌ఎస్ అగర్వాల్, అభిజిత్ గుహ, గులాటి, జీఎస్‌ఆర్ పుస్తకాలను ఎక్కువగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఏవైనా ఇంగ్లిష్ దినపత్రికలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవాలి.
 

నెగెటివ్ మార్కులను అధిగమించండిలా..
 సంబంధిత సబ్జెక్టులను బాగా చదవడంతోపాటు వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి. దీంతోపాటు ఎక్కువ ప్రశ్నలను ఎంచుకుని సొంతంగా మాక్‌టెస్టులను రాయాలి. ఇలా చేస్తే పరీక్షలో చాలావరకు నెగెటివ్ మార్కులను అధిగమించవచ్చు. పరీక్షలో కూడా ముందు సులువుగా అనిపించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత కొం చెం సులువు.. కష్టం.. బాగా కష్టం.. ఇలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పోవాలి. ఇలా చేస్తే చాలా వరకు తప్పులు లేకుండా సమాధానాలు ఇవ్వొచ్చు. అలా కాకుండా ముందుగానే కష్టమైన ప్రశ్నలకు ఉన్న సమయాన్ని వెచ్చిస్తే చివరలో ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో అటు సులువైన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోయే ప్రమాదముంది. పరీక్ష హాల్లో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
 
 

ఆన్‌లైన్ పరీక్ష.. జాగ్రత్తలు..
 గేట్-2014లో ప్రశ్నలు, మార్కుల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేవు. కానీ అన్ని పేపర్లను ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బీటెక్ వరకు విద్యార్థులంతా రాత పరీక్షకు అలవాటు పడి ఉంటారు. అందువల్ల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆందోళనల సహజం. ముఖ్యంగా కంప్యూటర్‌పై అంతగా పట్టులేని గ్రామీణ విద్యార్థులు.. ఆన్‌లైన్ పరీక్షకు సిద్ధం కావడానికి చాలా ముందు నుంచి కంప్యూటర్‌పై వీలైనన్ని మాక్‌టెస్టులు, గ్రాండ్‌టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్‌పోర్టల్స్‌లో ఈ మాక్‌టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇలా చేస్తే పరీక్ష నాటికి  కంప్యూటర్‌పై ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమించడంతోపాటు వేగంగా సమాధానాలను గుర్తించగల నైపుణ్యం అలవడుతుంది. అందుబాటులో ఉన్న ఈ మూడు నెలల్లో వీలైనన్ని మాక్ ఆన్‌లైన్ టెస్టులు రాయాలి.
 

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కటాఫ్ మార్కులు..
 గేట్‌లో 800 కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా 600 కంటే ఎక్కువ స్కోర్ పొందితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీటు ఆశించొచ్చు. ఇక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో సీటు పొందాలంటే గేట్‌లో 450 కంటే ఎక్కువ స్కోర్ సాధించాల్సి ఉంటుంది.
 
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు ఇలా..
 సాధారణంగా గేట్ పరీక్షలో బీటెక్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే సంబంధిత సబ్జెక్టుల బేసిక్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఎవల్యూషన్‌లపై ప్రశ్నలుంటాయి. కానీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో మాత్రం ఎంటెక్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు అడుగుతారు.
 గేట్‌కు పూర్తి భిన్నంగా లోతైన విశ్లేషణ (ఇన్‌డెప్త్ అనాలసిస్), సింథసిస్, ఎవల్యూషన్, క్రియేటివిటీ, డిజైన్ మొదలైన వాటిపై ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఐఈఎస్‌కు సిద్ధమయ్యేవారు సంబంధిత సబ్జెక్టుల కాన్సెప్ట్స్, బేసిక్స్‌తోపాటు ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ చదువుకోవాలి. విద్యార్థులు మొదట ఫిబ్రవరి వరకు గేట్‌పై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత నుంచి ఐఈఎస్‌కు సిద్ధమవ్వాలి.
 
 పరీక్ష రోజు డూస్ అండ్  డోన్ట్స్..
 
 డూస్:
 ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి.
 పరీక్షకు ముందు అన్ని అంశాలు చదవకుండా సారాంశాన్ని (సమ్మరీ) మాత్రమే చదవాలి.
 పరీక్ష కేంద్రం, ప్రదేశాన్ని ఒకరోజు ముందుగానే వెళ్లి తెలుసుకోవాలి. ఇలా చేస్తే పరీక్ష రోజు వెతుకులాట తప్పుతుంది.
 పరీక్షకు కావలసిన సరంజామా (హాల్‌టికెట్, పెన్ను, గుర్తింపు కార్డు మొదలైనవి) అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
 ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి.
 
 డోన్ట్స్:
 ఎలాంటి ఆందోళన చెందొద్దు.
 చివరి నిమిషంలో పాఠ్యపుస్తకాలు చదివి గందరగోళానికి గురి కావద్దు.
 స్నేహితులతో ఎలాంటి చర్చలు చేయొద్దు.
 అతి విశ్వాసం వద్దు.
 
 అత్యుత్తమ స్కోర్‌కు టాప్‌టెన్ టిప్స్
 ప్రాథమిక భావనలపై పట్టు.
 ఏకాగ్రత, సాధించాలనే తపన.
 యూనిఫాం.. కంటిన్యూస్ స్టడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్.
 ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.
 తెల్లవారుజామున (ఎర్లీమార్నింగ్) స్టడీ అవర్స్ ఉండాలి.
 ఎక్కువసార్లు పునశ్చరణ (రివిజన్).
 వీలైనన్ని ఆన్‌లైన్, మాక్ టెస్టుల సాధన.
 ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
 ఫ్యాకల్టీతో సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
 తేలికపాటి వ్యాయామాలు, యోగా.
 
 2011 నుంచి గేట్‌కు హాజరవుతున్నా.. పూర్తి సమయం కేటాయించి, సీరియస్ ప్రిపరేషన్ సాగించింది గతేడాది ఆగస్టు నుంచే. ప్రతిరోజు 8 గంటలు కేటాయించాను. అంతకుముందు రాసినప్పుడు ర్యాంకు రాకపోవడానికి గల లోపాలను గుర్తిస్తూ.. గేట్ ప్రశ్నల తీరును విశ్లేషిస్తూ చదివాను. అంతేకాకుండా ప్రతి చాప్టర్ వెనుక ఇచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో కలిసొచ్చింది. ఒక సమస్యను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సాధించే విధంగా ప్రాక్టీస్ చేయడం గేట్‌కు ఎంతో ప్రధానం. ఇలాంటి ప్రశ్నలే పరీక్షలో అడుగుతారు. ముందుగా అభ్యర్థులు గేట్ అంటే కఠినమైన పరీక్ష అనే ఆందోళన వీడాలి. గేట్ సిలబస్ బీటెక్‌లోదే. బీటెక్ సబ్జెక్ట్‌లలోని థియరీని, ప్రాబ్లమ్‌సాల్వింగ్ అప్రోచ్‌ను ఆకళింపు చేసుకుని.. ఆ తీరులో చదివితే సులభంగానే అర్హత పొందొచ్చు.
 - బి. సుజిత్‌కుమార్, (ఎంఎస్, ఐఐటీ మద్రాస్),
 ఫస్ట్ ర్యాంకర్, ఈసీఈ, గేట్- 2013
 
 
 
 మిగిలిన బ్రాంచ్‌లతో పోలిస్తే ఈఈఈలో ఎక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి పరీక్షకు ఆరేడు నెలల ముందుగానే ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వాలి. ప్రతిరోజూ కనీసం ఆరు గంటలపాటు చదవాలి. చాలామంది క్లాస్‌రూం నోట్స్, రిఫరెన్‌‌స బుక్స్ చదివి వదిలేస్తారు. ఇది సరికాదు. రోజూ మీరు ఏ అంశమైతే చదివారో ఆ అంశంపై ప్రతిరోజూ మాక్ టెస్టులు రాయాలి. గేట్ ఆన్‌లైన్‌లో జరగనున్న నేపథ్యంలో రోజువారీ ప్రాక్టీస్, మాక్‌టెస్టుల సాధన తప్పకుండా చేయాలి. రోజూ చదివిన అంశాలపై కనీసం గంటసేపైనా  సాధన చేయాలి. పరీక్షకు రెండు నెలలు ముందు మొత్తం సిలబస్‌పై వీలైనన్ని ఆన్‌లైన్ టెస్టులు రాయాలి. ప్రాక్టీస్ వల్లే నేను విజయం సాధించగలిగాను. వంద మార్కులగానూ 92 మార్కులకు పరీక్ష రాస్తే 88 మార్కులు సాధించానంటే అది ప్రాక్టీస్ వల్లే.
 - ఎం. రామకృష్ణ, (ఆఫీసర్ ట్రైనీ, హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం) ఫోర్‌‌త ర్యాంకర్, ఈఈఈ, గేట్- 2013
 
 రిఫరెన్స్ బుక్స్
 ఎలక్ట్రానిక్స్:
 Edc: Milliman, Halkias, Sedra Smith, Schaum series.
 Digital: Marrismano, R.P. Jain, Gaonkar.
 Emtl: William Hayt, Schaum series, Krauss, k.d. prasad.
 Comm. Signals: Simon haykin, Schaum series.
 c.s: Nagrath & Gopal, Schaum series.
 Adc: Jacob Milliman, Schaum series.
 W/W: William hayt, Schaum series.
 
 ఎలక్ట్రికల్:
 Electrical Machines: p.s. Bhimbra;
 J.B. Gupta; Nagrath & Kothari; M.G. Say.
 Power Systems: C.L. Wadhwa;
 J.B. Guptha; Soni Guptha Bhatnagar.
 Networks: Hyatt; Sadiku
 Measurements:A.K.Sawhney; H.S.Kalsi
 Control systems:
 Nagrath & Gopal; ogata; kuo
 Power electronics: Khanchandani
 
 మెకానికల్:
 Thermal: Cengel, P.K. Nag
 FM: DS Kumar Subramanyam
 Som: Sadhu Singh
 R/Ac: Arora/Manohar Prasad
 H.T.: Dr. Ramakrishna

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement