సాధారణ ఎన్నికలు- వివిధ రంగాలపై ప్రభావం | General Essay On Elections - Economy | Sakshi
Sakshi News home page

సాధారణ ఎన్నికలు- వివిధ రంగాలపై ప్రభావం

Published Thu, Mar 27 2014 2:52 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

General Essay On Elections - Economy

దేశంలో పదహారో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు జరగనున్నాయి.  దేశంలో సుదీర్ఘ కాలం జరిగే ఎన్నికలివి. ఈ సందర్భంలో ఎన్నికలు భారత ఆర్థిక  వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏ రంగంలో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఏ రంగంలో ప్రతికూల ధోరణులు పొడచూపుతాయనే అంశాలపై స్పెషల్ ఫోకస్..
 
 
 
 ఎన్నికల సంవత్సరాలలో ప్రభుత్వ కోశ విధానంలో భాగంగా పన్నుల వ్యవస్థ, పెట్టుబడి వ్యయం, వినియోగ వ్యయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ సేవల పంపిణీని పరిశీలిస్తే.. రాష్ట్రాల ప్రజా పనుల విభాగం చేపట్టే రహదారుల నిర్మాణంపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. ఎన్నికలు జరిగే ఏడాదిలో ప్రతిపాదించిన బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను రేట్ల తగ్గింపును చేపట్టినప్పుడు తన నిధులను పెంచుకునేందుకు మూలధన రాబడులపై ఆధారపడుతుంది. ఈ స్థితి రుణ భారం పెరగడానికి దారితీస్తుంది.
 
 పెరిగిన ప్రభుత్వ వ్యయం
మొదటి సాధారణ ఎన్నికల (జనరల్ ఎలక్షన్స్)తో పోలిస్తే 2009లో జరిగిన 15వ సాధారణ ఎన్నికల నాటికి ప్రతి ఓటరుపై ప్రభుత్వం వెచ్చించిన మొత్తం వ్యయం 20 రెట్లు పెరిగింది. మొదటి సాధారణ ఎన్నికలలో ఒక ఓటరుపై ప్రభుత్వ వ్యయం దాదాపు రూ.0.60. ఇది 2009 ఎన్నికల నాటికి రూ.12కు చేరుకుంది.
1951-52లో జరిగిన ఎన్నికలకు ప్రభుత్వం రూ.10.45 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం 2009 ఎన్నికల నాటికి రూ. 846.67 కోట్లకు పెరిగింది.
2009 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ (రూ.70 కోట్లు), తమిళనాడు (రూ.80.60 కోట్లు)లలోని ఎన్నికల వ్యయం కంటే మహారాష్ట్ర (రూ.155 కోట్లు), పశ్చిమబెంగాల్ (రూ.150 కోట్లు) లోక్‌సభ ఎన్నికల వ్యయం దాదాపు రెట్టింపు ఉంది.
 
 2014 ఎన్నికల స్వరూపం:
 2009 సాధారణ ఎన్నికలలో మొత్తం ఓటర్లు 71.40 కోట్లు కాగా ఇది 2014 నాటికి 81.45 కోట్లకు చేరింది. ఐరోపా యూనియన్ (ఈయూ), అమెరికా దేశాలలో ఉన్న మొత్తం ఓటర్ల (Electorate) కంటే భారత్ ఓటర్ల సంఖ్య అధికం. 16వ సాధారణ ఎన్నికల ప్రక్రియను మే 16 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. గత ఎన్నికలలో 59 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
 2014 ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ స్టేషన్‌లు 9,30,000.
 భద్రతా సిబ్బందితో పాటు ఎన్నికల కార్యకలాపాలలో మొత్తం 1.10 కోట్ల మంది పాల్గొంటున్నారు.
 మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 2.30 కోట్లు. ఈ ఎన్నికలలో 18 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వినియోగించనున్నారు.
 
 వ్యయం రూ.వెయ్యి కోట్లు:
 2014 ఎన్నికలలో ప్రభుత్వ వ్యయం అధికారికంగా రూ.1000 కోట్లు ఉండగలదని అంచనా. లోక్‌సభ ఎన్నికలలో భాగంగా మొత్తం 543 నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.70 లక్షలుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమైన పార్టీ అభ్యర్థుల వ్యయం ప్రతి నియోజకవర్గంలో పరిమితి కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
 మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఎన్నికలలో రాజకీయ పార్టీలు రూ.30,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఒక అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం తర్వాత అధిక ఎన్నికల వ్యయం భారత్‌లోనే నమోదైంది. ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ పార్టీల వ్యయం అదనంగా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
 
 ఏయే రంగాలపై ఎంత ప్రభావం?
 ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మూలధన కొరత, తయారీ రంగవృద్ధి క్షీణత తదితర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ప్రస్తుత ఎన్నికల వ్యయం కారణంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి అదనంగా 0.2 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉండగలదని నేషనల్ స్టాటిస్టికల్ ఛైర్మన్ ప్రొణబ్ సేన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ముందస్తు అంచనా 4.9 శాతంగా ఉంది.
 
 2014-15 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ పన్ను తగ్గింపు కారణంగా ఆర్థిక వ్యవస్థలో వ్యయం పెరిగి, స్వల్పకాలంలో వృద్ధి రేటులో పెరుగుదల సంభవించే సూచనలున్నట్లు ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో జరిగే వ్యయం కారణంగా 2014 రెండో త్రైమాసికంలో భారత్‌లో వినియోగ వ్యయంలో పెరుగుదల సంభవిస్తుంది. గత సాధారణ ఎన్నికల సమయాలలో జరిగిన వ్యయం కారణంగా వినియోగ వస్తు వాణిజ్యంలో వృద్ధిని గమనించవచ్చు.
 భారత్ అడ్వర్టైజ్‌మెంట్ పరిశ్రమ బడ్జెట్ 2014లో రూ.34,500 కోట్లు కాగా ఎన్నికల కారణంగా ఈ బడ్జెట్‌లో 8 నుంచి 10 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ పరిశ్రమ బడ్జెట్ రూ.38వేల కోట్లకు చేరగలదని అంచనా. రాజకీయ ప్రకటనలపై చేసే వ్యయంలో ముద్రణ మాధ్యమం వాటా 45 శాతం, టీవీ చానళ్లలో ప్రకటనల వాటా 38 శాతం. మిగిలింది ఇతర ప్రచార మార్గాలపై చేసిన వ్యయం.
 
 ఇతర రంగాలపై ప్రభావం:
 ఎన్నికలు జరిగే నెలల్లో స్టాక్‌మార్కెట్‌పై ధనాత్మక, రుణాత్మక ప్రభావాలను గమనించవచ్చు. గత ఐదు వారాలలో స్టాక్ ధరలలో అధిక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ స్థితి ఎన్నికలు పూర్తయ్యేవరకు కన్పించే సూచనలున్నాయి. అనశ్వర వినియోగ వస్తువులు, బ్యాంకులు, బేసిక్ ఇంజనీరింగ్ స్టాక్ ధరలలో పెరుగుదలను గమనించవచ్చు. వాహనాలకు చేసే వ్యయానికి సంబంధించి ఎన్నికల నియమావళి (Code of conduct) కఠినతరంగా ఉన్నందున ఎన్నికలలో అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అన్ని రకాల వాహనాల డిమాండ్ తక్కువైనందువల్ల ఆ రంగంపై ఆధారపడిన ప్రజల ఆదాయంలో పెరుగుదల కనిపించదు.
 
 కొన్ని రకాల వ్యాపారాలపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. వార్తా పత్రికలు, నగరాలలో ప్రకటనల బోర్డుల ఏర్పాటు, సోషల్ మీడియా, రవాణా, ఆతిథ్యం, బస్సులు, టాక్సీ ఆపరేటర్లు సంబంధిత వ్యాపార వర్గాలపై ఎన్నికల ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది.
 ఎన్నికల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని జీడీపీ గుణక ప్రభావం (GDP Multiplier Effect) రూపంలో గమనించవచ్చు. వివిధ వర్గాల ప్రజలు ఆర్జించిన ఆదాయంలో 80 నుంచి 90 శాతం వినియోగంపై వెచ్చించడాన్ని గమనించవచ్చు. శ్రామికులు, అల్పాదాయ వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులలోనూ పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉంటుంది.
 
 గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల అధికారులు రాజకీయ నేతల దగ్గర నుంచి దాదాపు రూ.185 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ఆకర్షించే క్రమంలో రాజకీయ నేతలు అనేక కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఓటర్ల మొబైల్ ఫోన్లకు టాక్‌టైమ్ కోసం కొంత మొత్తాన్ని జమ చేయడం వలన టెలికం కంపెనీల వ్యాపారంలో కొంతమేర వృద్ధి కనిపించింది.
 
 రాజకీయ నాయకులు లెక్కల్లో చూపించని ద్రవ్యాన్ని ఎన్నికల సమయంలో చలామణిలోకి తీసుకొస్తున్నందువల్ల దేశంలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచనా వ్యాపార ధోరణి అనేక రంగాల్లో ప్రబలుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది.
 
 రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ పన్ను రాబడి పెరుగుతుంది. ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉండి ఎక్సైజ్ పన్ను ద్వారా అధిక రాబడి సమకూరుతుంది.
 
 సమష్టి చొరవ అవసరం
 ఎన్నికల సంవత్సరాలలో పన్నురేట్ల తగ్గింపు, మూలధన వ్యయం పెంపు లాంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నందు వల్ల ప్రభుత్వ రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరుగుతుంది. ఈ స్థితిని పస్తుత వ్యయాల (Current Spending)ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించాలి. దేశంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. విదేశీ పెట్టుబడిదారులు రాబోవు రోజుల్లో అభద్రతా భావానికి లోనుకాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.
 
 రాజకీయ పార్టీలు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని హామీలు ఇవ్వాలి. అభివృద్ధి వ్యయాన్ని పెంచే చర్యలను తమ ఎన్నికల ప్రణాళికలలో (Manifesto) చేర్చాలి. పన్నుల వ్యవస్థను అభిలషణీయ విధంగా రూపొందించుకోవాలి. నల్లధన ప్రవాహాన్ని గుర్తించాలి. ఇలా అటు పాలక పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే శ్రేయో ఆర్థిక వ్యవస్థ సాకారమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement