దీర్ఘకాలిక వ్యూహం.. దర్జాగా కొలువు... | Long Term Approach: Banking Jobs | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక వ్యూహం.. దర్జాగా కొలువు...

Published Thu, Mar 27 2014 2:47 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Long Term Approach: Banking Jobs

హోదాకు హోదా.. ప్రతిభకు గుర్తింపు.. సుస్థిరమైన భవిష్యత్.. చక్కటి కెరీర్.. వెరసి నేటి యువతలో బ్యాంకింగ్ రంగం క్రేజ్‌ను సంపాదించుకుంది.. సాధారణ డిగ్రీ నుంచి ప్రొఫెషనల్ డి గ్రీ పట్టా ఉన్న విద్యార్థుల వరకూ బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల మీదనే దృష్టి ఉంటోంది. నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యం లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు.. దీంతో విపరీతమైన పోటీ నెలకొని ఉంటోంది.. ఈనేపథ్యంలో ఆయా పరీక్షల్లో విజయం సాధించాలంటే దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి.. అప్పుడే భవ్యమైన కెరీర్‌కు పునాది ఏర్పడుతుంది.. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, సంబంధిత అంశాలపై విశ్లేషణ


 
 ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నియామక విధానాన్ని పరిశీలిస్తే.. ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పీఓ/క్లరికల్/ స్పెషలిస్ట్ ఏ స్థాయి హోదా ఉన్న ఉద్యోగాలకైనా సాధారణంగా ఈ అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అంటే దీర్ఘకాలికంగా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే.. ఏక కాలంలో పీఓ/క్లరికల్ పోస్టులకు పోటీ పడొచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కు కూడా ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది (ప్రొఫెషనల్‌నాలెడ్జ్‌ను మినహాయిస్తే).


 
 విభాగాల వారీగా ప్రిపరేషన్
 
 ఇంగ్లిష్:
 ఇంగ్లిష్ అత్యంత కీలకమైంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి రోజూ దీనికి గంట సమయం కేటాయించాలి. ఇందులో కనీసం 30 నిమిషాలు ఇంగ్లిష్ పేపర్ చదవడం, టీవీ వార్తలు వినడం చేయాలి. దీంతో ఏ పదాన్ని సందర్భానుసారంగా ఏవిధంగా వినియోగించాలో అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ 5 నుంచి 10 కొత్త పదాలు నేర్చుకోవాలి. వాటిని వాక్యాల్లో ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేర్చుకున్న పదాలను వాడుతూ సంభాషించాలి.

 

ఈవిధంగా చేయడం వల్ల ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించడంతోపాటు ఇంటర్వ్యూను దైర్ఘ్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుంది. ఇంగ్లిష్‌లో గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి.


 
 రీజనింగ్:
 బ్యాంకుల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షల్లో అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కు కేటాయించాలి. ఇదే క్రమంలో సాధ్యమైనన్ని షార్ట్‌కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి. తద్వారా త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో కీలకమైన అంశాలు.. సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్.


 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
 అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారితంగా ఉంటాయి. కాబట్టి గణిత నేపథ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే గణిత మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు 20 వరకు టేబుల్స్, 25 వరకు స్క్వేర్స్, 15 వరకు క్యూబ్స్‌ను నేర్చుకోవాలి.


 
 న్యూమరికల్ ఎబిలిటీ:
 న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
 
 జనరల్ అవేర్‌నెస్:
 జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్‌లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి.


 
 జనరల్ అవేర్‌నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్):
 ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (నెట్ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్), వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం (ఎన్‌పీఏ, ఎన్‌ఈఎఫ్‌టీ వంటివి), ద్రవ్య సాధనాలు (చెక్స్, ఏటీఎం కార్డు తదితర), భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు.

 

ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై కూడా దృష్టి సారించాలి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; ఆస్కార్‌లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉండే కామిక్ షో అనే కార్టూన్.. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.


 
 కంప్యూటర్ నాలెడ్జ్:
 ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారింంచాలి. కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్‌మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి.
 ఇన్‌పుట్స్ బై:
 కె.వి. జ్ఞానకుమార్, బ్యాంకింగ్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 
 రిఫరెన్‌‌స బుక్స్:
వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్
 - ఆర్.ఎస్.అగర్వాల్
 క్వికర్ మ్యాథ్స్ -ఎం.థైరా
  క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -అరుణ్ శర్మ
  ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్
 -హరిమోహన్ ప్రసాద్
 {పతియోగితా దర్పణ్  మనోరమ ఇయర్ బుక్
 
 
 సన్నద్ధం ఇలా
 
 ముందుగా అన్ని బ్యాంక్ రిక్రూట్‌మెంట్ పరీక్షల సిలబస్‌ను, ఆ తర్వాత గత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. తద్వారా ఇచ్చిన సిలబస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు, ఏవిధంగా అడుగుతున్నారనే దానిపై స్పష్టత వస్తుంది. వీలైతే గత కటాఫ్ మార్కులను కూడా తెలుసుకోవాలి. తద్వారా పోటీ ఏస్థాయిలో ఉందో ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మీ సామర్థ్యాలను విశ్లేషించుకుని ఎంత సమయం ప్రిపరేషన్‌కు సరిపోతుందో అంచనా వేసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి.
పరీక్షించే విభాగాలు ఒకటే అయినా.. ఎంచుకున్న పోస్టును బట్టి ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక వ్యూహాం దృష్ట్యా విస్తృత స్థాయి లో ప్రిపరేషన్ సాగించాలి. ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. తద్వారా సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. ప్రశ్న ఏవిధంగా వచ్చిన సమాధానాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది.
    ...............................................................
నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా ప్రిపరేషన్ ప్రారంభించాలి. కనీసం మూడు-ఆరు నెలల సమయాన్ని ప్రిపరేషన్ కోసం కేటాయించాలి.
...............................................................
 ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలపై అధికంగా దృష్టి సారించాలి.
     ...............................................................
గత విజేతల అభిప్రాయాలను విధిగా పాటించాలి.
 ...............................................................
{పతి రోజూ ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఒక గ్రూప్‌గా ఏర్పడి మోడల్ పరీక్ష రాయాలి. దాని ఫలితాలను వారే విశ్లేషించుకోవాలి.
 
 ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్‌గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
 
 గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి.
 
 
 ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు.
 
 ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.
 అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
 
 ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి.
 
 కరెంట్ అఫైర్స్‌పై అప్‌డేట్‌గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement