General Elections 2014
-
మూడు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు?
చట్టం మేరకు సెప్టెంబర్‌లోనే ఎన్నికలు అంతకన్నా నెల రోజుల ముందు నోటిఫికేషన్ సన్నద్ధమవుతున్న పార్టీలు సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా చల్లారనే లేదు. త్వరలోనే నగరంలో మరో ఎన్నికల వేడి రాజుకోనుంది. రాబోయే మూడు మాసాల్లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు వివిధ రాజకీయ పార్టీలు గ్రేటర్‌పై (జీహెచ్ఎంసీ కార్యాలయంపై) తమ జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలో నెగ్గిన టీఆర్ఎస్తోపాటు తెలుగుదేశం, బీజేపీ తదితర పార్టీలు సైతం రాబోయే రోజుల్లో కార్పొరేషన్ తమ చేతిలోకే వస్తుందని చెబుతున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సైతం జీహెచ్ఎంసీపై దృష్టి పెడతామని ప్రకటించారు. టీఆర్ఎస్- ఎంఐఎం నేతల మధ్య ఇటీవల జరిగిన విందు సందర్భంగా సైతం జీహెచ్ఎంసీయే ముఖ్యాంశంగా నిలిచింది. ఇలా.. ఏ కోణంలో చూసినా ఏ పార్టీకా పార్టీ జీహెచ్ఎంసీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. పాలకమండలి గడువు డిసెంబరు 3 జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే నవంబర్- డిసెంబర్ మాసాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయనేది ఆయా పార్టీల అంచనాగా ఉంది. జీహెచ్ఎంసీ చట్టం .. నిబంధనల మేరకు పాలకమండలి గడువు ముగియడానికి మూడు నెలల ముందు నుంచి గడువు తేదీలోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ నిబంధన మేరకు సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్‌లోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుంది. పోలింగ్‌కు నెలరోజుల గడువుతో నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టులోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడేందుకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి జీహెచ్ఎంసీని గుండెకాయగా భావిస్తున్న టీఆర్ఎస్కు రాష్ట్రంలో అధికార పగ్గాలు లభించినప్పటికీ, కార్పొరేషన్లో ఇంతవరకు ఉనికే లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పార్టీ ముఖ్యనాయకులు కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకుగాను కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తూనే ఎంఐఎంతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర అవగాహనతో జీహెచ్ఎంసీలో నెగ్గి అధికారాన్ని పంచుకున్నాయి. ఈసారి కాంగ్రెస్ స్థానంలో టీఆర్ఎస్ వచ్చే అవకాశాలున్నాయి. లేదా ఏక పక్షంగానే కార్పొరేషన్లో నెగ్గేందుకు ఉన్న అవకాశాలను టీఆర్ఎస్ అంచనా వే స్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే.. మూడు నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలా కాకుండా కొంతకాలం వేచి చూశాక కార్పొరేషన్ బరిలో దిగాలనుకుంటే మాత్రం పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలకు వెళ్తుంది. రెంటిలో ఏది తమకు ఎక్కువ అనుకూలంగా ఉంటే దానికి మొగ్గు చూపనుంది. పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు నిర్వహిస్తే.. ఈలోగా ఓట్ల జాబితా సవరణ.. డూప్లికేట్ల తొలగింపు తదితర కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తే.. ఎన్నికలన్నీ ముగిసి పాలనకు అనువుగా, ప్రజాసమస్యలు వేగంగా పరిష్కరించేందుకు వీలుంటుందన్న అభిప్రాయాలున్నాయి. -
కౌంటింగ్ ప్రారంభం
-
తెలంగాణలో పగ్గాలు చేపట్టేదెవరు?
-
కౌంట్ డౌన్
-
టీడీపీకి ఓటమి భయం
-
పొన్నాల..రావేల..?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జనగామ నియోజకవర్గంలోని 41 పల్లెలు ఐదేళ్లుగా పొన్నాల లక్ష్మయ్య రాక కోసం నిరీక్షిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికై... మంత్రి పదవి చేపట్టడంతో తమ గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించినట్లేనని భావించిన గ్రామస్తుల ఆశలు అడియూసలే అయ్యూరుు. 2009 ఎన్నికల తర్వాత ఆయన తన నియోజకవర్గ పరిధిలోని మూడో వంతు గ్రామాలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఈ క్రమంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సవాల్‌గా నిలుస్తాయని చెప్పవచ్చు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా తమ గ్రామంలోకి రాకపోవడంతో ఆయూ ఊళ్లలోని ప్రజలు ఈ సాధారణ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశం జనగామ అసెంబ్లీ ఫలితాలను నిర్ణయించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనగామ సెగ్మెంట్లో మొత్తం 102 గ్రామాలు ఉన్నాయి. పొన్నాల 2004 ఎన్నికల్లో గెలిచి ఓ దఫా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల అనంతరం రెండో దఫా మంత్రి పదవి చేపట్టారు. ఈ ఐదేళ్లలో ఆయన జనగామ నియోజకవర్గ పరిధిలోని 41 గ్రామాల్లో ఒక్కసారి కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఐదేళ్లలో ఇన్ని గ్రామాలకు వెళ్లని కాంగ్రెస్ నేత పొన్నాల ఒక్కరే ఉంటారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. దీన్నిబట్టి ఆ ఊళ్లన్నీ అభివృద్ధికి నోచుకోలేదనే విషయం స్పష్టమవుతోందని పొన్నాలపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అరుుతే.. 2009 తర్వాత ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు మారాయని... ఈ కారణంతోనే పొన్నాల పర్యటించలేకపోయారని... అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా ఆగిపోలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పొన్నాల వ్యతిరేకులు, సన్నిహితుల అభిప్రాయాలు ఎలా ఉన్నా... ఈ 41 గ్రామాల ఓటర్ల స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనగామ నియోజకవర్గంలో మొత్తం 2,04,139 ఓటర్లు ఉన్నారు. పొన్నాల ఒక్కసారి కూడా వెళ్లని గ్రామాల్లో 55,057 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో వీరి నిర్ణయం జనగామలోని రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనుంది. ఆ గ్రామాలు ఇవే... జనగామ నియోజకవర్గానికి సంబంధించి అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 2009 నుంచి పొన్నాల లక్ష్మయ్య సందర్శించని గ్రామాలు... మండలాల వారీగా ఇలా ఉన్నాయి. జనగామ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అడవికేశవాపూర్, సిద్ధెంకి, ఎల్లంల, పెద్దరాంచెర్ల, ఎర్రగొల్లపాడ్, వడ్లకొండ, ఓబుల్ కేశవాపూర్, వెంకిర్యాల, పెద్దపాడ్, గానుగుపాడ్, ప సరమడ్ల, మరిగడి గ్రామాలను పొన్నాల ఐదేళ్లలో ఎప్పుడూ సందర్శించలేదు. చేర్యాల మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి. వీరన్నపేట, చుంచునకోట, క డవేరుగులో ఆయన అడుగుపెట్టలేదు. మరిముచ్చాల గ్రామంలో అమర జవాను చంద్రారెడ్డికి రహదారిపైనే నివాళులర్పిం చి వెళ్లిపోయారు. గ్రామంలోకి రాలేదు. తపాస్‌పల్లి వద్ద రిజర్వాయర్ ప్రారంభానికి వచ్చినా... గ్రామంలోకి అడుగుపెట్టలేదు. మద్దూరు మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. మరుమాముల, సలాక్పూర్, ధర్మారం, నర్సాయపల్లి, వంగపెల్లి, వల్లంపట్ల, బైరాన్‌పల్లి, కొండాపూర్, జాలపల్లి గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవు. బచ్చన్నపేట మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కట్కూరు, బం డనాగారం, గంగాపురం, నక్కవానిగూడెం, ఇటుకాలపల్లి, మాన్సాన్పల్లి, నాగి రెడ్డిపల్లిలో పొన్నాల అడుగుపెట్టలేదు. నర్మెట మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కన్నెబోయిన గూడెం, బొత్తలపర్రె, పోతారం, సోలిపురం, గండిరామారం, మలక్‌పేట్, నర్సాపూర్ గ్రామాల్లో పొన్నాల ఇప్పటివరకు పర్యటించలేదు. బొమ్మకూరులో రిజర్వాయర్ ప్రారంభానికి వచ్చినా గ్రామంలోకి వెళ్లలేదు. -
షోలాపూర్ బరి నాలుగోసారీ నల్లేరుపై నడకే!
షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగోసారి బరిలోకి దిగిన సుశీల్‌కుమార్ షిండేని విజయలక్ష్మి సునాయాసంగా వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాషాయ ఉగ్రవాద శిబిరాలు తదితర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. వాస్తవానికి పశ్చిమ మహారాష్ట్రలోని ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. అధిష్టానానికి అత్యంత విధేయుడైన షిండే... దళిత కార్డును వినియోగించుకునేందుకు ఏనాడూ తటపటాయించలేదు. కోర్టులో గుమస్తా స్థాయి నుంచి తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి, క్రమేణా అత్యున్నత కేంద్ర హోం శాఖ మంత్రి స్థాయికి కూడా ఆయన ఎదిగారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్టానం తన అభ్యర్థిగా శరద్ బన్సోడేని బరిలోకి దించింది. 2009లో కూడా శరద్ ఇక్కడి నుంచి షిండేకి వ్యతిరేకంగా పోటీచేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో పట్టణ, గ్రామీణ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నెల 17న ఎన్నిక జరగనున్న సంగతి విదితమే. ఇదిలాఉంచితే ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బన్సోడేకి యువతరం ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గస్థాయిలోనే ఉంది. బన్సోడే దేశభక్తి భావన ఇక్కడి యువతరాన్ని కట్టిపడేసింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పుకోదగ్గస్థాయిలో ఓటుబ్యాంకు ఉంది. ఈ కారణంగానే షిండే వరుసగా మూడు పర్యాయాలు ఇక్కడినుంచి విజయం సాధించగలిగారు. ఈ నియోజకవర్గం అభివృద్ధికి షిండే రాత్రింబవళ్లు శ్రమించారని ఆ పార్టీ కార్యకర్తలు తమ ప్రచారంలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి మనోగతాన్ని ‘న్యూస్‌లైన్’ తెలుసుకుంది. జనం కోసం పనిచేయాలి రాజకీయ నాయకులు స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల కోసం పనిచేయాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకోవాలి. దానిని ఆచరణలో చూపించాలి. విద్య, ఆరోగ్యంతోపాటు ఆరోగ్య స్థితిగతుల మెరుగు కోసం కృషి చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు ఎప్పుడైతే అందుతాయో అప్పుడే దేశం పురోగమించినట్టు. పారదర్శకంగా వ్యవహ రించాలి అభ్యర్థి విద్యావంతుడై ఉండాలి. పారదర్శకంగా వ్యవహ రించాలి. రాజకీయం అంటే భారీగా డబ్బు కూడగట్టుకునే మార్గంగా మారిపోయింది. అందుకే అనేకమంది ఈ రంగంలోకి వస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే వస్తున్నారు. అలాంటి వారిని నిరాకరించాలి. ప్రజాప్రతినిధులు స్వార్థం కోసం కాకుండా దేశం కోసం అసువులు బాసిన క్రాంతి వీరులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు పూనుకోవాలి. ఇలా అయితేనే దేశం ప్రగతి సాధిస్తుంది. - ప్రభాకర్ జంపాల్ మార్పు అనివార్యం తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. దీంతో ఓ కొత్త అనుభూతి కలుగుతోంది. కొత్త ఓటరునే అయినప్పటికీ విజ్ఞతతోనే ఓటు వేస్తా. సామాన్య ప్రజానీకం సమస్యల పరిష్కారానికి పాల్పడే అభ్యర్ధికే ఓటేస్తా. ఎందుకంటే ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నవారు ఏమిచేశారనేది అందరికీ తెలిసిందే. ఈసారి మార్పు అనివార్యం. - సతీష్ దుబ్బాక యువతరం రాణించడం హర్షణీయం ప్రస్తుత రాజకీయాల్లో యువతరం వారు రాణిం చడం హర్షణీయం. యువత కోసం ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెట్టాలి. వారికి ఉపాధి కల్పించాలి. అలా చేస్తారని భావించినవారికే ఓటేస్తా. ఎందుచేతనంటే రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను నేటి రాజకీయ నాయకులు పట్టించుకోవాలి. వాటిని పరిష్కరించాలి. యువకుల సమస్యలు తీర్చగోరే వారికే ఓటు వేయాలి. అప్పుడే దేశం అభివద్ది సాధించడం సాధ్యమవుతుంది. నోటా వద్దు-నోట్లూ వద్దు అభ్యర్థులు పంచే డబ్బుకు ఆశపడను. ఆమోదయోగ్యుడికే ఓటు వేస్తా. ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిరంగ పరచడం సబబు కాదు. దానిని గోప్యంగానే ఉంచాలి. నోటా ( నన్ ఆఫ్ ద ఎబౌ) బటన్‌ను ఎవరూ ఉపయోగించుకోకూడదని అందరికీ విన్నవిస్తున్నా. నోటా బటన్ నొక్కొద్దు, అలాగే నోట్లు కూడా తీసుకోవద్దు. - శ్రీనివాస్ చేగ్గు అభివృద్ధి చేసేవారికే ఓటు పట్టణంలోని రహదారులు మరీ అధ్వాన్నంగా మారాయి. వీటిపై రాకపోకలు సాగించడం వల్ల వెన్నునొప్పికి గురవుతున్నాం. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పట్టణ వాసులకు కనీస సదుపాయాలు కల్పించే అంశంపై నాయకులు దృష్టి సారించాలి. అభివృద్ధికోసం పాటుపడేవారికే ఓటు వేయాలి. - చంద్రమౌళి. తమునూర్ -
సాధారణ ఎన్నికలు- వివిధ రంగాలపై ప్రభావం
దేశంలో పదహారో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. దేశంలో సుదీర్ఘ కాలం జరిగే ఎన్నికలివి. ఈ సందర్భంలో ఎన్నికలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏ రంగంలో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఏ రంగంలో ప్రతికూల ధోరణులు పొడచూపుతాయనే అంశాలపై స్పెషల్ ఫోకస్.. ఎన్నికల సంవత్సరాలలో ప్రభుత్వ కోశ విధానంలో భాగంగా పన్నుల వ్యవస్థ, పెట్టుబడి వ్యయం, వినియోగ వ్యయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ సేవల పంపిణీని పరిశీలిస్తే.. రాష్ట్రాల ప్రజా పనుల విభాగం చేపట్టే రహదారుల నిర్మాణంపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. ఎన్నికలు జరిగే ఏడాదిలో ప్రతిపాదించిన బడ్జెట్లో ప్రభుత్వం పన్ను రేట్ల తగ్గింపును చేపట్టినప్పుడు తన నిధులను పెంచుకునేందుకు మూలధన రాబడులపై ఆధారపడుతుంది. ఈ స్థితి రుణ భారం పెరగడానికి దారితీస్తుంది. పెరిగిన ప్రభుత్వ వ్యయం మొదటి సాధారణ ఎన్నికల (జనరల్ ఎలక్షన్స్)తో పోలిస్తే 2009లో జరిగిన 15వ సాధారణ ఎన్నికల నాటికి ప్రతి ఓటరుపై ప్రభుత్వం వెచ్చించిన మొత్తం వ్యయం 20 రెట్లు పెరిగింది. మొదటి సాధారణ ఎన్నికలలో ఒక ఓటరుపై ప్రభుత్వ వ్యయం దాదాపు రూ.0.60. ఇది 2009 ఎన్నికల నాటికి రూ.12కు చేరుకుంది. 1951-52లో జరిగిన ఎన్నికలకు ప్రభుత్వం రూ.10.45 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం 2009 ఎన్నికల నాటికి రూ. 846.67 కోట్లకు పెరిగింది. 2009 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ (రూ.70 కోట్లు), తమిళనాడు (రూ.80.60 కోట్లు)లలోని ఎన్నికల వ్యయం కంటే మహారాష్ట్ర (రూ.155 కోట్లు), పశ్చిమబెంగాల్ (రూ.150 కోట్లు) లోక్‌సభ ఎన్నికల వ్యయం దాదాపు రెట్టింపు ఉంది. 2014 ఎన్నికల స్వరూపం: 2009 సాధారణ ఎన్నికలలో మొత్తం ఓటర్లు 71.40 కోట్లు కాగా ఇది 2014 నాటికి 81.45 కోట్లకు చేరింది. ఐరోపా యూనియన్ (ఈయూ), అమెరికా దేశాలలో ఉన్న మొత్తం ఓటర్ల (Electorate) కంటే భారత్ ఓటర్ల సంఖ్య అధికం. 16వ సాధారణ ఎన్నికల ప్రక్రియను మే 16 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. గత ఎన్నికలలో 59 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ స్టేషన్లు 9,30,000. భద్రతా సిబ్బందితో పాటు ఎన్నికల కార్యకలాపాలలో మొత్తం 1.10 కోట్ల మంది పాల్గొంటున్నారు. మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 2.30 కోట్లు. ఈ ఎన్నికలలో 18 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వినియోగించనున్నారు. వ్యయం రూ.వెయ్యి కోట్లు: 2014 ఎన్నికలలో ప్రభుత్వ వ్యయం అధికారికంగా రూ.1000 కోట్లు ఉండగలదని అంచనా. లోక్‌సభ ఎన్నికలలో భాగంగా మొత్తం 543 నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.70 లక్షలుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమైన పార్టీ అభ్యర్థుల వ్యయం ప్రతి నియోజకవర్గంలో పరిమితి కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఎన్నికలలో రాజకీయ పార్టీలు రూ.30,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఒక అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం తర్వాత అధిక ఎన్నికల వ్యయం భారత్‌లోనే నమోదైంది. ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ పార్టీల వ్యయం అదనంగా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏయే రంగాలపై ఎంత ప్రభావం? ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మూలధన కొరత, తయారీ రంగవృద్ధి క్షీణత తదితర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ప్రస్తుత ఎన్నికల వ్యయం కారణంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి అదనంగా 0.2 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉండగలదని నేషనల్ స్టాటిస్టికల్ ఛైర్మన్ ప్రొణబ్ సేన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ముందస్తు అంచనా 4.9 శాతంగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను తగ్గింపు కారణంగా ఆర్థిక వ్యవస్థలో వ్యయం పెరిగి, స్వల్పకాలంలో వృద్ధి రేటులో పెరుగుదల సంభవించే సూచనలున్నట్లు ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో జరిగే వ్యయం కారణంగా 2014 రెండో త్రైమాసికంలో భారత్‌లో వినియోగ వ్యయంలో పెరుగుదల సంభవిస్తుంది. గత సాధారణ ఎన్నికల సమయాలలో జరిగిన వ్యయం కారణంగా వినియోగ వస్తు వాణిజ్యంలో వృద్ధిని గమనించవచ్చు. భారత్ అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమ బడ్జెట్ 2014లో రూ.34,500 కోట్లు కాగా ఎన్నికల కారణంగా ఈ బడ్జెట్లో 8 నుంచి 10 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ పరిశ్రమ బడ్జెట్ రూ.38వేల కోట్లకు చేరగలదని అంచనా. రాజకీయ ప్రకటనలపై చేసే వ్యయంలో ముద్రణ మాధ్యమం వాటా 45 శాతం, టీవీ చానళ్లలో ప్రకటనల వాటా 38 శాతం. మిగిలింది ఇతర ప్రచార మార్గాలపై చేసిన వ్యయం. ఇతర రంగాలపై ప్రభావం: ఎన్నికలు జరిగే నెలల్లో స్టాక్‌మార్కెట్‌పై ధనాత్మక, రుణాత్మక ప్రభావాలను గమనించవచ్చు. గత ఐదు వారాలలో స్టాక్ ధరలలో అధిక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ స్థితి ఎన్నికలు పూర్తయ్యేవరకు కన్పించే సూచనలున్నాయి. అనశ్వర వినియోగ వస్తువులు, బ్యాంకులు, బేసిక్ ఇంజనీరింగ్ స్టాక్ ధరలలో పెరుగుదలను గమనించవచ్చు. వాహనాలకు చేసే వ్యయానికి సంబంధించి ఎన్నికల నియమావళి (Code of conduct) కఠినతరంగా ఉన్నందున ఎన్నికలలో అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అన్ని రకాల వాహనాల డిమాండ్ తక్కువైనందువల్ల ఆ రంగంపై ఆధారపడిన ప్రజల ఆదాయంలో పెరుగుదల కనిపించదు. కొన్ని రకాల వ్యాపారాలపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. వార్తా పత్రికలు, నగరాలలో ప్రకటనల బోర్డుల ఏర్పాటు, సోషల్ మీడియా, రవాణా, ఆతిథ్యం, బస్సులు, టాక్సీ ఆపరేటర్లు సంబంధిత వ్యాపార వర్గాలపై ఎన్నికల ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. ఎన్నికల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని జీడీపీ గుణక ప్రభావం (GDP Multiplier Effect) రూపంలో గమనించవచ్చు. వివిధ వర్గాల ప్రజలు ఆర్జించిన ఆదాయంలో 80 నుంచి 90 శాతం వినియోగంపై వెచ్చించడాన్ని గమనించవచ్చు. శ్రామికులు, అల్పాదాయ వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులలోనూ పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల అధికారులు రాజకీయ నేతల దగ్గర నుంచి దాదాపు రూ.185 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ఆకర్షించే క్రమంలో రాజకీయ నేతలు అనేక కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఓటర్ల మొబైల్ ఫోన్లకు టాక్‌టైమ్ కోసం కొంత మొత్తాన్ని జమ చేయడం వలన టెలికం కంపెనీల వ్యాపారంలో కొంతమేర వృద్ధి కనిపించింది. రాజకీయ నాయకులు లెక్కల్లో చూపించని ద్రవ్యాన్ని ఎన్నికల సమయంలో చలామణిలోకి తీసుకొస్తున్నందువల్ల దేశంలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచనా వ్యాపార ధోరణి అనేక రంగాల్లో ప్రబలుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ పన్ను రాబడి పెరుగుతుంది. ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉండి ఎక్సైజ్ పన్ను ద్వారా అధిక రాబడి సమకూరుతుంది. సమష్టి చొరవ అవసరం ఎన్నికల సంవత్సరాలలో పన్నురేట్ల తగ్గింపు, మూలధన వ్యయం పెంపు లాంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నందు వల్ల ప్రభుత్వ రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరుగుతుంది. ఈ స్థితిని పస్తుత వ్యయాల (Current Spending)ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించాలి. దేశంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. విదేశీ పెట్టుబడిదారులు రాబోవు రోజుల్లో అభద్రతా భావానికి లోనుకాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ పార్టీలు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని హామీలు ఇవ్వాలి. అభివృద్ధి వ్యయాన్ని పెంచే చర్యలను తమ ఎన్నికల ప్రణాళికలలో (Manifesto) చేర్చాలి. పన్నుల వ్యవస్థను అభిలషణీయ విధంగా రూపొందించుకోవాలి. నల్లధన ప్రవాహాన్ని గుర్తించాలి. ఇలా అటు పాలక పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే శ్రేయో ఆర్థిక వ్యవస్థ సాకారమవుతుంది. -
మాజీ మంత్రిగారి బంపర్ ఆఫర్ : సై అంటే రూ.3 లక్షలు!
మాజీ మంత్రి కోండ్రు బంపర్ ఆఫర్? కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే నజరానా అయినా ముందుకురాని నేతలు ఒక్క వంగరలోనే ఇద్దరి నామినేషన్ మిగతా మండలాల్లో పడని బోణీ రాజాం: జాతీయ పార్టీ తరఫున పోటీ చేయడమంటే చిన్న విషయం కాదు. గెలిచినా.. ఓడినా పోటీ చేశారన్న గుర్తింపే చాలన్నట్లు చాలామంది టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటారు. అదీ.. దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఏలిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అయితే ఇక చెప్పేదేముంది. మహా మహా నేతలే టిక్కెట్లు దొరక్క ఉసూరుమన్న సందర్భాలు కోకొల్లలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. స్థానిక ఎన్నికలకే అభ్యర్థులు దొరకని దీనస్థితిలో పడిపోయింది. అందుకేనేమో.. మాజీమంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలో ప్రాదేశిక నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడితే చాలు.. రూ. 3లక్షలు ఇస్తామన్నది సదరు ఆఫర్ సారాంశం. ‘రండి బాబు.. రండి.. బీ ఫారంతోపాటు రూ.3 లక్షలు తీసుకెళ్లండి.. పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయండి’.. అని తన అనుచరగణం ద్వారా స్థానిక నాయకులకు ఎర వేస్తున్నారు. అయినా ఇప్పటివరకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగుస్తున్నప్పటికీ నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున ఒక్క వంగర మండలంలో రెండు ఎంపీటీలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. వంగరలో 12 ఎంపీటీసీలకు గాను రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో కాంగ్రెస్ తరఫున బోణీ పడలేదు. గురువారం మధ్యాహ్నం 3గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు. దీంతో మాజీ మంత్రి పరిస్థితి కుడితిలో పడిన ఎలక చందంగా తయారైంది. తను ప్రకటించిన బంపర్ ఆఫర్ చివరి రోజైనా నేతలను అకర్షించి అభ్యర్థులుగా మారుస్తుందేమో చూడాలి. -
నా అధికారాలేమిటి?
రాష్ట్రపతి, సీఈసీలకు నరసింహన్ లేఖ రాష్ట్రపతి పాలనలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు గవర్నర్ అధికారాలేమిటో వివరించాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్.. తాజాగా తన అధికారాలు ఏమిటో చెప్పాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు గవర్నర్‌కు ఉండే అధికారాలు ఏమిటి? అధికారికంగా ఏమి చేయవచ్చు? ఏమి చేయరాదో తెలియజేయాల్సిందిగా గవర్నర్ కోరినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన నరసింహన్ గత సోమవారం కీలకమైన శాంతిభద్రతలు, సాధారణ ఎన్నికలు, విద్యుత్ సరఫరా తదితర రంగాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అనుమతించని విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నేరుగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నందునే వారితో వీడియో కాన్ఫరెన్స్‌కు గవర్నర్‌ను అనుమతించలేదని కమిషన్ వర్గాలు వివరించాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రులతో పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న గవర్నర్లకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
'అన్నయ్య చిరంజీవితోనే ఉంటా'
-
అన్నయ్య చిరంజీవితోనే ఉంటా: నాగబాబు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం గురించి సోదరుడు నాగబాబు స్పందించారు. పవన్ కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విలేకరలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నా మద్దతు, అభిమానుల మద్దతు అన్నయ్యకే.... మా అందరికీ సమాజంలో గుర్తింపు అన్నయ్య వల్లే వచ్చిందని' అన్నారు. చివర వరకూ తాను అన్నయ్యతోనే ఉంటానని, అందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. చిరంజీవి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తమకు ఓ గొప్ప రాజమార్గాన్ని తయారు చేశారన్నారు. తమ్ముళ్లుగా తమకే కాకుండా అభిమానులందరికీ గొప్ప గుర్తింపు తెచ్చారన్నారు. ఈ మేరకు నాగబాబు ఓ ప్రకటన చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు తనయుడు వరుణ్ తేజ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడకోకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. జన సేన' అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్‌కు సోమవారమే దరఖాస్తు చేశారు. ఈనెల 14వ తేదీ శుక్రవారం నాడు ఆయన తన పార్టీ జెండా, ఎజెండా, ఇతర విషయాలను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
జనసేన పేరుతో పవన్ కొత్త పార్టీ?
ఎట్టకేలకు విషయం తేలిపోయింది. టాలీవుడ్ హీరో, కేంద్ర మంత్రి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు!! 'జన సేన' అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఎన్నికల కమిషన్‌కు సోమవారమే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈనెల 14వ తేదీ శుక్రవారం నాడు ఆయన తన పార్టీ జెండా, ఎజెండా, ఇతర విషయాలను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ విషయం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారన్న విషయం ఎప్పటినుంచో వినవస్తున్నా.. ఇంతవరకు ఆయన స్పందించలేదు. త్వరలో విలేకరుల సమావేశం పెడతారంటూ ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు తేదీలు బయటకు వచ్చినా, అలా జరగలేదు. అందరూ ఎందుకంత ఖంగారు పడతారని, త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అన్ని విషయాలు ఆయనే వెల్లడిస్తారని ఆయన సన్నిహితురాలు, పంజా సినిమా నిర్మాత తిరుమలశెట్టి నీలిమ ఇంతకుముందు చెప్పారు. ఎట్టకేలకు శుక్రవారం నాడు పూర్తి స్థాయిలో పవన్ పార్టీ విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుల పేర్ల విడుదల
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల పరిశీలకుల పేర్లను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. మొత్తం అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా ఇలా ఉంది.. శ్రీకాకుళం-కొయ్య ప్రసాద్‌రెడ్డి; విజయనగరం-ఎమ్వీ కృష్ణారావు; అరకు-భగ్గు లక్ష్మణరావు; విశాఖపట్నం-సాయిరాజ్; అనకాపల్లి-సుజయకృష్ణ రంగారావు; ఏలూరు-దొరబాబు; నరసాపురం-జీఎస్ రావు; అమలాపురం-ఇందుకూరి రామకృష్ణంరాజు; కాకినాడ-ఆదిరెడ్డి అప్పారావు; రాజమండ్రి-దాడి వీరభద్రరావు; మచిలీపట్నం-జ్యోతుల నెహ్రూ విజయవాడ-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు; గుంటూరు-జహీర్ అహ్మద్; నరసరావుపేట-బాలినేని శ్రీనివాసరెడ్డి; బాపట్ల-గుదిబండ చినవెంకటరెడ్డి; ఒంగోలు-మేకపాటి గౌతంరెడ్డి; నెల్లూరు-జ్ఞానేంద్రరెడ్డి; తిరుపతి-కొత్తకోట ప్రకాష్‌రెడ్డి; చిత్తూరు-వైఎస్ వివేకానందరెడ్డి; వైఎస్ఆర్ జిల్లా- వైఎస్ అవినాష్‌రెడ్డి; రాజంపేట-భూమన కరుణాకర్‌రెడ్డి; అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి; హిందూపూర్-డి.రవీంద్రనాథ్‌రెడ్డి; కర్నూలు-దేశాయి తిప్పారెడ్డి; నంద్యాల-దేవగుడి నారాయణరెడ్డి -
అనంతపురం జిల్లాలో 19 లక్షలు స్వాధీనం
అనంతపురం జిల్లా పత్తికొండ రోడ్డులో నిర్వహించిన వాహన తనిఖీల్లో 19 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నసీర్ అనే వ్యక్తి కారులోని ఓ బ్యాగ్‌లో 19లక్షల నగదును పోలీసులు గుర్తించారు. అయితే ఆ సొమ్ముకు సంబంధించి ఎలాంటి పత్రాలు అతడివద్ద లేకపోవడంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నాసీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బును వెంట తీసుకువెళ్లొద్దని, తప్పనిసరై తీసుకెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన రసీదులు, ఇతర పత్రాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయనున్న జగన్, విజయమ్మ షర్మిల
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధం అవుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల, ఇతర సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయం కూడా ఖరారవుతుందని, నేతలంతా ప్రచారానికి వెళ్లడం మాత్రం ఖాయమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ... ఇలా ఒకేసారి అన్ని స్థాయులకు సంబంధించిన ఎన్నికలు జరగడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమం. సాధారణంగా ఎంతో కొంత సమయం తర్వాతే ఈ ఎన్నికలన్నీ జరుగుతుంటాయి. అయితే వివిధ కారణాల వల్ల మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వాటిని కూడా దాదాపుగా సార్వత్రిక ఎన్నికలకు కొంచెం అటూ ఇటూగా నిర్వహించాల్సి వస్తోంది. దీంతో రాజకీయ పార్టీలన్ని తలమునకలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే సీమాంద్ర ప్రాంతంలో పోటీ చేయించడానికి తగిన అభ్యర్థులు కూడా దొరక్క తల పట్టుకుంటోంది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు జనంలోకి వెళ్లేందుకు సాహసించడంలేదు. గ్రామాల్లో అయితే కాంగ్రెస్ పేరెత్తితే చాలు.. జనం కొట్టేలా ఉన్నారని స్వయంగా ఆ పార్టీ కిందిస్థాయి నాయకులే వాపోతున్నారు. అందుకే ఇప్పటికే చాలామంది వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తమ అధినేత లేఖ వల్లే విభజనకు పునాదులు పడ్డాయన్న భయంతో ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాలికి బలపం కట్టుకుని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అందరినీ కలిసి మద్దతు పలకాల్సిందిగా కోరి, శాయశక్తులా రాష్ట్ర సమైక్యతకు ప్రయత్నించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రం ధైర్యంగా జనంలోకి వెళ్లి ఆ మాట చెప్పగలుగుతున్నారు. వారికి అండగా ప్రచారం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులంతా సిద్ధమవుతున్నారు. -
ఒంటరిగా పోటీచేసే సత్తా మాకుంది: జైపాల్ రెడ్డి
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేడర్ కూడా ఒంటరి పోరుపై ఆసక్తిగా ఉందని, తెలంగాణ కోసం కలిసి పోరాడిన కార్యకర్తల్లో చీలిక తేవడం మంచిది కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేయడంలో నిగ్రహం పాటిస్తున్నారని, అలాగే కేసీఆర్ కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటించాలని జైపాల్ సూచించారు. అలాగే, తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ తొందరపడి ముందుగానే ప్రకటించడం మంచిది కాదని జైపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్తో పొత్తుల విషయంలో తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌దేనని ఆయన తెలిపారు. పొత్తుల విషయంలో తామంతా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీని హైకమాండ్ ప్రకటిస్తుందని కూడా జైపాల్‌రెడ్డి తెలిపారు. -
'కాంగ్రెస్‌కున్న శక్తి, ధైర్యం వేరేవాళ్లకి లేదు'
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జానారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే తప్ప విలీనం, పొత్తులు తమకు అవసరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కున్న శక్తి, ధైర్యం వేరేవాళ్లకి లేదని, పొత్తులు, విలీనం అవసరమని తాము భావించటం లేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని జానారెడ్డి తెలిపారు. ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు కృతజ్ఞత చూపించాలని ఆయన అన్నారు. ఒకటి, రెండు ఎంపీలున్న టీఆర్ఎస్, టీడీపీల వల్ల తెలంగాణ రాలేదని జానారెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత, వివిధ ప్రజా సంఘాలు తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడాయన్నారు. వారికి అండగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కేంద్రంపై ఉద్యమించారన్నారు. అందువల్లే తెలంగాణ ఏర్పడిందని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణం, సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల మధ్య జానారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. -
వరంగల్ జిల్లాలో 13 లక్షలు స్వాధీనం
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ వద్ద పోలీసులు రూ. 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అక్కడ తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ఈ డబ్బును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ సొమ్ము ఎక్కడినుంచి వచ్చింది, ఎక్కడకు తీసుకెళ్తున్నారన్న ఆధారాలు ఏమీ లేకపోవడంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు. -
మహేష్ నాకు మద్దతిస్తాడు
హీరో మహేష్ బాబు ఏ పార్టీకి చెందిన వాడు కాదని, ఆయన ఎప్పుడూ ఎవరికీ ప్రచారం చేయలేదు గానీ, తనకు మాత్రం మద్దతిస్తాడని మహేష్ బావా గల్లా జయదేవ్ వెల్లడించారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు జయదేవ్ శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడారు. సీమాంధ్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని, అందుకే తాను టీడీపీలో చేరానని వెల్లడించారు. తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నామని, అయితే రాష్ట్ర విభజనతో తమను ఆ పార్టీ నట్టేట ముంచిందని గల్లా అరుణ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కూడా ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంతో కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని గతంలో గల్లా అరుణ భావించారు. ఆ క్రమంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె కుమారుడు జయదేవ్‌ను బరిలో దింపాలని యోచించారు. టీడీపీ అగ్రనేతలతో గల్లా కుటుంబసభ్యులు సంప్రదింపులు జరిపారు. అందుకు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు పచ్చ జెండా ఊపడంతో అరుణతోపాటు ఆమె కుమారుడు శనివారం టీడీపీలో చేరారు. -
టీఆర్ఎస్తో పొత్తు.. టీకాంగ్రెస్‌లో చీలిక
-
టీఆర్ఎస్తో పొత్తు.. టీ కాంగ్రెస్‌లో చీలిక
మాజీమంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రధానంగా, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ సమావేశంలో చర్చించారు. అయితే టీఆర్ఎస్తో పొత్తు విషయమై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్తో పొత్తు అవసరం లేదని దక్షిణ తెలంగాణ ప్రాంత నాయకులు అంటుంటే.. మరోవైపు ఉత్తర తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం పొత్తు ఉంటేనే నయమని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున టీఆర్ఎస్తో పొత్తు అవసరమని మాజీ మంత్రులు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సమావేశంలో ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. -
కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
-
అస్తవ్యస్తం, గందరగోళం
ముంబై: శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి అస్తవ్యస్తంగా మారిందని, అందులో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఎన్సీపీ విమర్శించింది. సిద్ధాంతాలు ఒక్కటికాకపోయినా కేవలం అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే ఇవన్నీ ఏకమయ్యాయని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మలిక్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘గడ్కరీ, ముండే శిబిరాల మధ్య అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరుకున్నాయన్నాయి. శివసేన, బీజేపీలు కూడా పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఎన్డీయేలోకి శరద్‌పవార్ రాకుండా అడ్డుకున్నానని ముండే చెబుతారు. అయితే బీజేపీ తీరుతో విసిగిపోయినపుడు ఆయన 10 జనపథ్ (సోనియాగాంధీ నివాసం)కు వెళ్లారు. అయితే ముండే సన్నిహితులు కొందరు ఆయనను కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు’ అని అన్నారు. బీజేపీ వాస్తవానికి వ్యాపారుల పార్టీ అని ఆయన అభివర్ణించారు. సైనికులకంటే వ్యాపారులే మరిన్ని సాహసాలు చేస్తారని వ్యాఖ్యానించడంద్వారా మోడీ...సైనికులను అవమానించారన్నారు. బీజేపీ వ్యాపారుల పార్టీ అని శివసేన భావిస్తే ఆ పార్టీతో ఇంకా పొత్తు ఎందుకంటూ ఉద్ధవ్‌ని నిలదీశారు. -
కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు పూర్తిగా చెడిపోయినట్లే కనిపిస్తోంది. మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేస్తున్నారు. రాజీనామా విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారమే ప్రకటించారు. ఎలాగోలా ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మంతనాలు సాగించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవానికి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారమే మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ రాజీనామా చేస్తున్నా.. కనీసం డిప్యూటీ మేయర్ పదవి తీసుకోడానికి కూడా మజ్లిస్ నేతలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. దీన్నిబట్టి చూస్తే ఇక కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పడానికి ఎంఐఎం సిద్ధమైపోయినట్లే ఉంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద పూర్తిస్థాయిలో సందడి కనిపిస్తోంది. తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గతంలో జగన్ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తన ఉనికిని చాటుకోడానికి మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు పార్టీలకు మధ్య చెడిపోయింది. కొన్ని భూముల విషయం కూడా ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని అప్పట్లో వినిపించింది. ఈసారి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక కూటమిగా ఏర్పడొచ్చని అంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో బుధవారం భేటీ అయ్యారు. ఇక కేవలం పాతబస్తీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మజ్లిస్ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు యాదవ వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారిని ఎంఐఎం తరఫున ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కనీసం 3 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. తద్వారా కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కూడా భావిస్తోంది. -
ఎన్నికల ఖర్చులో టాప్.. పశ్చిమగోదావరి
ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడల్లా అత్యధికంగా ఖర్చు చేసే జిల్లాల్లో పశ్చిమగోదావరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బెట్టింగులతో పాటు, డబ్బు పంపిణీ కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి మున్సిపల్, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలోని మొత్తం 8 మునిసిపాలిటీలకు, ఏలూరు కార్పొరేషన్‌కు ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల పదో తేదీ నుంచి మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈనెల 13వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏలూరు కార్పొరేషన్‌కు నామినేషన్లను స్వీకరిస్తారు. మిగిలిన 8 మున్సిపాలిటీలకు 14వతేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 28.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి కొత్తగా 1.70 లక్షల కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు అత్యధికంగా ఖర్చుచేసే జిల్లాల జాబితాలో పశ్చిమగోదావరి అగ్రస్థానంలో ఉండటంతో ఈసారి ఎన్నికల అధికారులు, కలెక్టర్ సిద్దార్థ జైన్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలోను ఎన్నికల కోడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేశారు. కంట్రోల్ రూం నెంబరు 08812 230050. ఫ్యాక్స్ నెంబరు 08812 230052 -
వచ్చే ఎన్నికల్లో యూపీ, బీహార్లలో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీహార్, యూపీల్లో సగం లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగలదని ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే వెల్లడించింది. యూపీలోని 20 లోక్‌సభ స్థానాలు, బీహార్‌లోని 10 లోక్‌సభ స్థానాల్లో శాంపిల్‌గా చేసిన సర్వే వివరాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 80 స్థానాల్లో 40, బీహార్‌లో 40 స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకోనుంది. సర్వే ఫలితాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక స్థానాన్ని దక్కించుకోనుంది. బీహార్‌లో జేడీయూ 9 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుందని సర్వే పేర్కొంది. యూపీలో కాంగ్రెస్ ఈసారి 14 సీట్లను పొందొచ్చని వెల్లడైంది. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, విపక్ష బీఎస్పీ చెరో 13 స్థానాల్లో గెలుస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీహార్‌లో 21 సీట్లను కైవసం చేసుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. లాలూ సారథ్యంలోని ఆర్జేడీకి 6 సీట్లు దక్కే అవకాశముంది. -
ఎన్నిక లయ్యాకే రెండు రాష్ట్రాల ఏర్పాటు?
సాంకేతిక ఇబ్బందులు దాటాకే అధికారిక విభజన సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలంటున్న సీమాంధ్ర నేతలు సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయా, లేక రెండు రాష్ట్రాలు విడిపోయాకా? విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఈ అంశంపై చర్చ సాగుతోంది. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని సీమాంధ్ర నేతలు, కొత్త రాష్ట్రాల్లోనేనని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక అమలు తేదీ (అపాయింటెడ్ డే) నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రెండుగా విడిపోతుంది. అప్పటి నుంచి రెండు అసెంబ్లీలుంటాయి. ఇద్దరు సీఎంలుంటారు. అయితే ఆ అపాయింటెడ్ డే ఎప్పుడన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి పంపిస్తుంది. దానిపై ఆయన లాంఛనంగా ఆమోదముద్ర వేశాక గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. అపాయింటెడ్ డేను అందులోనే రాష్ట్రపతి నిర్దేశిస్తారు. ప్రస్తుత బిల్లులో సాంకేతిక లోపాలున్నాయి. పైగా ఆస్తులు అప్పులు, ఆదాయాల పంపిణీ ఉద్యోగుల కేటాయింపు వంటి కీలకాంశాలు పూర్తవాల్సి ఉంది. అందుకు కనీసం నాలుగైదు నెలలైనా పడుతుందని అంచనా. కానీ మార్చి తొలి వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. షెడ్యూలు వచ్చిందంటే అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలోనే తలమునకలై ఉంటుంది. సాధారణ పరిపాలనా వ్యవహారాలు తప్ప ఆ సమయంలో మరే కార్యక్రమమూ చేపట్టే వీలుండదు. కాబట్టి ఎన్నికలయ్యేదాకా అధికారిక విభజన వీలు కాదన్నది సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అంచనా. పైగా విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ ఎస్సీ, ఎస్టీల జనాభాలో తేడా వచ్చి, ఆ మేరకు చట్టసభల్లో వారి రిజర్వేషన్లు కూడా సమస్యగా మారతాయి. ఎందుకంటే ఇప్పుడు సమైక్య రాష్ట్రం యూనిట్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ స్థానాలను విభజన అనంతరం ఒక్కో రాష్ట్రాన్నీ యూనిట్‌గా తీసుకుని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. లేదంటే వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం దక్కదు. రాజకీయంగా కూడా రాజకీయంగా చూసుకున్నా ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే పూర్తయితేనే మేలని అధిష్టానం భావిస్తోందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఆస్తులు అప్పులు, ఆదాయాలు, ఉద్యోగుల పంపిణీ, పెన్షన్‌దారుల వ్యవహారాలను ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా తలకెత్తుకోవడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ అంశాల్లో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగ సంఘాలు, తదితర సంస్థల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని బిల్లులో పేర్కొనగా, తెలంగాణ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెన్షనర్ల భారం కూడా ఇరు ప్రాంతాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉంది. సాగునీరు, విద్యుత్తు తదితరాల పంపిణీ కూడా జటిలంగానే కన్పిస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాలను ఎన్నికల ముందు తెరపైకి తెస్తే రెండు చోట్లా పార్టీ దెబ్బ తింటుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తే, ఈ సమస్యలనే సాకుగా చూపి, ‘మీకే ఎక్కువ న్యాయం చేస్తాం’ అని ఇరు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయించి లబ్ధి పొందవచ్చన్న ఆలోచన ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలను అధికారికంగా ఏర్పాటు చేయాలంటున్నారు. ఏదో సాకు చూపి వాయిదా వేస్తే ప్రక్రియ చిక్కుల్లో పడుతుందంటున్నారు. చిన్న చిన్న సమస్యలేమైనా ఉంటే అధికారికంగా విడివడ్డాక పరిష్కారమవుతాయన్నది వారి వాదన. -
సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా
* తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం * ఇండియూ టుడే/సీఓటర్ సర్వే స్పష్టీకరణ * సీమాంధ్రలో వై ఎస్సార్సీపీకి 18 ఎంపీ సీట్లు * తెలంగాణలో 14 సీట్లు టీఆర్ఎస్వే.. న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు కంచు కోట అనేది ఇక చరిత్రకే పరిమితం కానుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నారుు..’ అని ఇండియూ టు డే గ్రూపు/ సీఓటర్ తాజా సర్వే తేల్చింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోగతంపై ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలు వెనుకబడిపోయి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో మాదిరి ప్రాంతీయ పార్టీలు ముందంజలో నిలువనున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుంది. 25 లోక్‌సభా స్థానాలకు గాను ఆ పార్టీ 18 చోట్ల విజయదుందుభి మోగించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో అధికశాతం మంది ఇప్పటికీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే తమకు ఇష్టమైన ముఖ్యమంత్రి అని చెప్పడం. వైఎస్ జీవించి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని క్షేత్రస్థారుులో ప్రజలు భావిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చు. సీమాంధ్రలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఎక్కువ ప్రజాదరణ ఉండటం మరింత ఆసక్తి కలిగించే అంశం. ఇక తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేకుండానే 17 సీట్లకు గాను 14 సీట్లలో విజయం సాధించనుంది. -
సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా
-
బదిలీలకు రంగం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు రావడంతో ఆ ప్రకారం.. జిల్లాలో ఉన్న అధికారుల జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో మొదలైన బదిలీల ప్రక్రియ ఇతర శాఖల్లోనూ కొనసాగనుంది. రెవెన్యూ శాఖ విషయాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో మూడు సంవత్సరాలు తహసీల్దార్లుగా పదవీ కాలం పూర్తిచేసుకున్న వారు, జిల్లా స్థానికులు పొరుగు జిల్లాకు బదిలీ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం తహసీల్దార్ కేడర్‌లో జిల్లాలో 64మంది ఉన్నారు. వీరిలో 51మంది మండలాల్లో త హసిల్దార్లుగా పనిచేస్తుండగా మిగతా వారు సూపరింటెండెంట్లు, ఏవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 51మంది తహసిల్దార్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ తహసిల్దార్లు మినహా మిగతా 48మంది జిల్లా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అఫిషియేటింగ్‌పై పనిచేస్తున్న 13మందికి కూడా బదిలీ తప్పనిసరి. వీరితో పాటు ఈ సారి సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న వారికి కూడా బదిలీలు తప్పకపోవచ్చునని తెలుస్తోంది. గతంలో కలెక్టరేట్లోని ‘హెచ్’ విభాగం సూపరింటెండెంట్ పోస్టు మాత్రమే నోటిఫైడ్ పోస్ట్ అయినందున బదిలీ ఉండేది. కానీ, ఈ సారి కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లకు బదిలీలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా అధికారులు అందరి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం తదుపరి ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా బదిలీలు ఉంటాయి. రిటర్నింగ్ అధికారులు వీరే... రిటర్నింగ్ అధికారులుగా స్టేషన్ ఘన్‌పూర్‌కు డ్వామా పీడీ, పాలకుర్తికి జడ్పీ సీఈవో, డోర్నకల్‌కు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారి, మహబుబాబాద్, నర్సంపేట, జనగామ, ములుగుకు అక్కడి ఆర్డీవోలు, పరకాలకు ఐటీడీఏ పీవో, వరంగల్ పశ్చిమకు వరంగల్ ఆర్డీవో, వరంగల్ తూర్పుకు మున్సిపల్ కమిషనర్, వర్ధన్నపేటకు ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూపాలపల్లికి అడిషనల్ జారుుంట్ కలెక్టర్ పోస్టుల్లో ఉన్న వారు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అరుుతే ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కారణంగా జడ్పీ సీఈవో ఆంజనేయులుకు ఎన్నికల విధులు కేటాయించరు. ఆయన స్థానంలో వచ్చే కొత్త అధికారి ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఏజేసీగా ఉన్న సంజీవయ్య జిల్లాలో మూడేళ్ల విధులు పూర్తయినందున బదిలీ అవుతారు. ఎస్సార్ఎస్పీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న నూత మధుసూదన్ సొంత జిల్లా కారణంగా బదిలీ అవుతారు. వీరితో పాటు ఐటీడీఏ పీవో పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఈ ప్రాంతాలకు కొత్తగా వచ్చే వారు రిటర్నింగ్ అధికారులుగా ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తారు. -
రచ్చకెక్కిన...‘దేశం’ లొల్లి
మోత్కుపల్లిపై.. బాబుకు ఉమ ఫిర్యాదు తెలుగుదేశం విభేదాలు వీధిన పడ్డాయి.. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దే జిల్లా నేతల గొడవ తారస్థాయికి చేరింది.. సీనియర్ ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మధ్య ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. ఇపుడు తాజాగా రాజ్యసభ ఎన్నికలు వీరి మధ్య మరింత అగాథం సృష్టించాయి..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీడీ పీ నేతలు జంకుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ విషయంలో పార్టీ అనుసరించిన విధానంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు ఎన్నికల్లో సొంత పార్టీ వారి నుంచే ఎదురుకానున్న అసమ్మతి రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని బలపరుస్తూ మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి ఇద్దరూ తమకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని పోటీలు పడి అధినేతను కోరారు. ఇక, ఉమామాధవరెడ్డి రాజ్యసభ సీటును ఆశించడం వెనుక బలమైన కారణమే ఉందని చెబుతున్నారు. భువనగిరి నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి అనేది లేకుండా మాధవరెడ్డి.. ఆయన దుర్మరణం తర్వాత అతని సతీమణి ఉమామాధవరెడ్డి గెలుచుకుంటూ వస్తున్నారు. అయితే, ఇటీవల భువనగిరి నియోజకవర్గంలో కొందరు నేతలను ఎగదోసి, అసమ్మతి రాజేసి మోత్కుపల్లి న ర్సింహులు చికాకులు సృష్టిస్తున్నారన్న బలమైన అభిప్రాయానికి ఉమామాధవరెడ్డి వచ్చారని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పార్టీవర్గాల సమాచారం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని పెంచుకునేందుకు, తన అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు మోత్కుపల్లి ఓ ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతూ వస్తున్నారని అంటున్నారు. తానొక్కడినే కీలకనేతగా మిగాలన్న వ్యూహంతోనూ అందరికీ పొగపెడుతున్నారన్న ఆరోపణలూ లేకపోలే దు. ఈ రకంగానే సూర్యాపేట ఇన్చార్జ్ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావును పార్టీ వీడేలా చేశారని ప్రచారంలో ఉంది. ఇపుడిదే ఎత్తుగడతో కోదాడ, నాగార్జునసాగర్, భువనగిరి నియోజకవర్గాల్లో గుంపుల కుంపట్లు రాజేస్తున్నారని టీడీపీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ చికాకులు భరించలేకకే ఉమ మోత్కుపల్లి తీరుపై బాబు కు ఫిర్యాదు చేశారని సమాచారం. ఆలేరు నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి వలస వెళ్లి సంకినేని మద్దతుతో గెలిచిన మోత్కుపల్లికి ఈసారి ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా కనిపించకనే తనసొంత నియోజకవర్గం ఆలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారన్న వాదనా ఉంది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీలు పడి, ఖర్చు లు పెట్టుకునే బదులు రాజ్యసభకు వెళితే ఏ బాదరాబందీ ఉండదన్న ఆలోచనతోనే ఆయ న బాబు వద్ద దరఖాస్తు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే, పార్టీకి ముందు నుంచీ విశ్వాసంగా ఉండి, భువనగిరి నియోజకవర్గాన్ని టీడీపీకి ఓటమి ఎరుగని కోటగా మలి చిన తమ కుటుంబానికి గుర్తింపునివ్వాలని, తనకే రాజ్యసభ సీటు ఖరారు చేయాలని ఉమసోమవారం చంద్రబాబును కోరినట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో వివిధ నియోజకవర్గాల విషయంలో వేలుపెట్టి మోత్కుపల్లి పార్టీని ఎలా ఇబ్బందులు పాలు చేస్తోంది, తన నియోజవర్గంలో చికాకులు సృష్టించిందీ అధినేతకు వివరించినట్లు సమాచారం. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలూ రాజ్యసభ సీటు ఆశిస్తుండడం, ఫిర్యాదుల పరంపరకు తెరపడక పోవడంతో, సార్వత్రి క ఎన్నికల ముందు ఇదేం గొడవరా బాబూ అని కార్యకర్తలు మదనపడుతున్నారు. -
22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం
నాగపూర్: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 22 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఎన్సీపీ అగ్ర నాయకుడు, కేంద్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ పునరుద్ఘాటించారు. శనివారం సాయంత్రం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైందన్నారు. 22కు తక్కువగానీ లేదా ఒకటి ఎక్కువగానీ స్థానాలనుంచి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. సన్నద్ధత వ్యక్తం చేసిన తమ పార్టీకి చెందిన రాష్ర్టమంత్రులను సైతం ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించుతామన్నారు. కాగా లోక్‌సభ స్థానాల పంపిణీ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య వివాదం నడుస్తున్న సంగతి విదితమే. ఎన్సీపీ కోటాను 22 నుంచి 19కి తగ్గించాలని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ఇటీవల పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 48 స్థానాలు ఉండగా 29 నియోజకవర్గాలనుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వివాదం నానాటికీ ముదురుతోంది. ఆప్ వల్ల ఇబ్బందేమీ లేదు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ప్రఫుల్ పేర్కొన్నారు. రాష్ట్రం లో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రమేనన్నారు.