
నా అధికారాలేమిటి?
రాష్ట్రపతి, సీఈసీలకు నరసింహన్ లేఖ
రాష్ట్రపతి పాలనలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు
గవర్నర్ అధికారాలేమిటో వివరించాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్.. తాజాగా తన అధికారాలు ఏమిటో చెప్పాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు గవర్నర్‌కు ఉండే అధికారాలు ఏమిటి? అధికారికంగా ఏమి చేయవచ్చు? ఏమి చేయరాదో తెలియజేయాల్సిందిగా గవర్నర్ కోరినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన నరసింహన్ గత సోమవారం కీలకమైన శాంతిభద్రతలు, సాధారణ ఎన్నికలు, విద్యుత్ సరఫరా తదితర రంగాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అనుమతించని విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు నేరుగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నందునే వారితో వీడియో కాన్ఫరెన్స్‌కు గవర్నర్‌ను అనుమతించలేదని కమిషన్ వర్గాలు వివరించాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రులతో పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న గవర్నర్లకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.