![Albania Ranking Series Wrestlers Seek sports minister Intervention But](/styles/webp/s3/article_images/2025/02/15/sunil.jpg.webp?itok=njgv2N4N)
సునిల్ కుమార్ (ఫైల్ ఫొటో)
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.
కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్‌కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
డబ్ల్యూఎఫ్‌ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.
సమాఖ్య నిర్వాకం వల్లే
‘డబ్ల్యూఎఫ్‌ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది.
ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్‌లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.
అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు.
కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్‌కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్‌కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్‌లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment