షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగోసారి బరిలోకి దిగిన సుశీల్‌కుమార్ షిండేని విజయలక్ష్మి సునాయాసంగా వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాషాయ ఉగ్రవాద శిబిరాలు తదితర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. వాస్తవానికి పశ్చిమ మహారాష్ట్రలోని ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. అధిష్టానానికి అత్యంత విధేయుడైన షిండే... దళిత కార్డును వినియోగించుకునేందుకు ఏనాడూ తటపటాయించలేదు. కోర్టులో గుమస్తా స్థాయి నుంచి తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి, క్రమేణా అత్యున్నత కేంద్ర హోం శాఖ మంత్రి స్థాయికి కూడా ఆయన ఎదిగారు.
ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్టానం తన అభ్యర్థిగా శరద్ బన్సోడేని బరిలోకి దించింది. 2009లో కూడా శరద్ ఇక్కడి నుంచి షిండేకి వ్యతిరేకంగా పోటీచేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో పట్టణ, గ్రామీణ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నెల 17న ఎన్నిక జరగనున్న సంగతి విదితమే. ఇదిలాఉంచితే ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బన్సోడేకి యువతరం ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గస్థాయిలోనే ఉంది. బన్సోడే దేశభక్తి భావన ఇక్కడి యువతరాన్ని కట్టిపడేసింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పుకోదగ్గస్థాయిలో ఓటుబ్యాంకు ఉంది. ఈ కారణంగానే షిండే వరుసగా మూడు పర్యాయాలు ఇక్కడినుంచి విజయం సాధించగలిగారు. ఈ నియోజకవర్గం అభివృద్ధికి షిండే రాత్రింబవళ్లు శ్రమించారని ఆ పార్టీ కార్యకర్తలు తమ ప్రచారంలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి మనోగతాన్ని ‘న్యూస్‌లైన్’ తెలుసుకుంది.
జనం కోసం పనిచేయాలి
రాజకీయ నాయకులు స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల కోసం పనిచేయాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకోవాలి. దానిని ఆచరణలో చూపించాలి. విద్య, ఆరోగ్యంతోపాటు ఆరోగ్య స్థితిగతుల మెరుగు కోసం కృషి చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు ఎప్పుడైతే అందుతాయో అప్పుడే దేశం పురోగమించినట్టు.
పారదర్శకంగా వ్యవహ రించాలి
అభ్యర్థి విద్యావంతుడై ఉండాలి. పారదర్శకంగా వ్యవహ రించాలి. రాజకీయం అంటే భారీగా డబ్బు కూడగట్టుకునే మార్గంగా మారిపోయింది. అందుకే అనేకమంది ఈ రంగంలోకి వస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే వస్తున్నారు. అలాంటి వారిని నిరాకరించాలి. ప్రజాప్రతినిధులు స్వార్థం కోసం కాకుండా దేశం కోసం అసువులు బాసిన క్రాంతి వీరులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు పూనుకోవాలి. ఇలా అయితేనే దేశం ప్రగతి సాధిస్తుంది. - ప్రభాకర్ జంపాల్
మార్పు అనివార్యం
తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. దీంతో ఓ కొత్త అనుభూతి కలుగుతోంది. కొత్త ఓటరునే అయినప్పటికీ విజ్ఞతతోనే ఓటు వేస్తా. సామాన్య ప్రజానీకం సమస్యల పరిష్కారానికి పాల్పడే అభ్యర్ధికే ఓటేస్తా. ఎందుకంటే ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నవారు ఏమిచేశారనేది అందరికీ తెలిసిందే. ఈసారి మార్పు అనివార్యం. - సతీష్ దుబ్బాక
యువతరం రాణించడం హర్షణీయం
ప్రస్తుత రాజకీయాల్లో యువతరం వారు రాణిం చడం హర్షణీయం. యువత కోసం ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెట్టాలి. వారికి ఉపాధి కల్పించాలి. అలా చేస్తారని భావించినవారికే ఓటేస్తా. ఎందుచేతనంటే రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను నేటి రాజకీయ నాయకులు పట్టించుకోవాలి. వాటిని పరిష్కరించాలి. యువకుల సమస్యలు తీర్చగోరే వారికే ఓటు వేయాలి. అప్పుడే దేశం అభివద్ది సాధించడం సాధ్యమవుతుంది.
నోటా వద్దు-నోట్లూ వద్దు
అభ్యర్థులు పంచే డబ్బుకు ఆశపడను. ఆమోదయోగ్యుడికే ఓటు వేస్తా. ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిరంగ పరచడం సబబు కాదు. దానిని గోప్యంగానే ఉంచాలి. నోటా ( నన్ ఆఫ్ ద ఎబౌ) బటన్‌ను ఎవరూ ఉపయోగించుకోకూడదని అందరికీ విన్నవిస్తున్నా. నోటా బటన్ నొక్కొద్దు, అలాగే నోట్లు కూడా తీసుకోవద్దు. - శ్రీనివాస్ చేగ్గు
అభివృద్ధి చేసేవారికే ఓటు
పట్టణంలోని రహదారులు మరీ అధ్వాన్నంగా మారాయి. వీటిపై రాకపోకలు సాగించడం వల్ల వెన్నునొప్పికి గురవుతున్నాం. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పట్టణ వాసులకు కనీస సదుపాయాలు కల్పించే అంశంపై నాయకులు దృష్టి సారించాలి. అభివృద్ధికోసం పాటుపడేవారికే ఓటు వేయాలి. - చంద్రమౌళి. తమునూర్
షోలాపూర్ బరి నాలుగోసారీ నల్లేరుపై నడకే!
Published Tue, Apr 8 2014 10:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement