సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ‘స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ లాబరేటరీస్ (ఎస్‌సీఎల్–గ్రూప్)’కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ), అంతకుముందు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎన్నికల్లో కూడా తన సేవలను అందించిందన్న విషయంపై చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. 2010లో బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున మొదటి సారి భారత ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఆ తర్వాత ఏయే ఎన్నికల్లో ఏయే పార్టీల తరఫున పనిచేసిందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో సీఏ సంస్థ ఓ రాజకీయ పార్టీ తరఫున పనిచేసిందని, అందులో 300 మంది శాశ్వత సిబ్బంది, 1400 మందిని తాత్కాలిక ఉద్యోగులతో తన సేవలను అందించిందని ‘క్వార్ట్స్జ్’ డాట్ కామ్ తాజాగా సేకరించిన డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి.
భారత్‌లోని అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కటక్, గజియాబాద్, గువహటి, ఇండోర్, కోల్‌కతా, పట్నా, పుణె అనే నగరాలను కేంద్రంగా సీఏ తన సేవలను అందించింది. భారత్ ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా పనిచేసిందని, బహూశ తమ క్లైంట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చని ఈ కంపెనీ మాజీ ఉద్యోగి ఈనెల 27వ తేదీన బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీ ముందు అంగీకరించడం, కాంగ్రెస్ పార్టీ క్లైంట్ కాదని కంపెనీ వర్గాలు ప్రకటించడం తెల్సిందే. వీటిలో ఎవరి మాట నిజమైందో తెలియదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఏ నిజంగా పనిచేసినట్లయితే కంపెనీ పరువు పోతుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో తాము సేవలందించిన స్థానాల్లో 92 శాతం తన క్లైంట్ అభ్యర్థులు విజయం సాధించారని కంపెనీ తెలిపింది. ఈ లెక్కన ఆ కంపెనీ బీజేపీ పార్టీ తరఫునే సేవలు అందించి ఉండాలి. స్పష్టత కోసం సీఏ, ఎస్‌సీఎల్ యాజమాన్యం నుంచి సమాధానాన్ని కోరింది. అయితే వారి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. వాస్తవానికి సీఏ 2013లో ఆవిర్భవించినప్పటికీ దాని మాతృసంస్థ ఎస్‌సీఎల్ 2003లో ఏర్పాటైన నాటి నుంచి భారత్‌లో ఎన్నికలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2003లో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ప్రధాన రాష్ట్ర పార్టీ సంస్థాగత బలం, ఓటర్ల ప్రవృత్తి, రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలపై అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరఫున ఓటర్ల నాడి, ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మళ్లే ఓటర్లను గుర్తించడం లాంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. 2007లో జిహాది గ్రూపుల నియామకాలను ఎలాంటి ప్రచారం ద్వారా ఎదుర్కోవాలి అన్న అంశంపై కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, జార్ఖండ్, యూపీ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. 2010 బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసినట్లు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఈ సేవల కోసం సీఏ సంస్థ ఓటర్ల ఫేస్‌బుక్ ఖాతాలను వాడుకుందనే విషయం వెలుగులోకి రావడంతో ఈ అంశంపై గొడవ జరుగుతున్న విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment