వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు షట్‌డౌన్ గండం తప్పింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రిలోగా బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనేట్‌కు పంపించారు. సెనేట్ సైతం ఆమోదించింది. దీంతో షట్‌డౌట్ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్‌కు పంపించారు.
ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచి్చన ద్రవ్య వినిమయ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వ్యతిరేకించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి 14 వరకు ప్రభుత్వ అవసరాలకు, విపత్తుల్లో సహాయక చర్యలకు నిధులు సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేళ్లపాటు రద్దు చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. గతంలో ట్రంప్ ప్రభుత్వ పాలనలో అమెరికాలో 35 రోజులపాటు షట్‌డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా చెబుతుంటారు. షట్‌డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment