మూడు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు?
- చట్టం మేరకు సెప్టెంబర్‌లోనే ఎన్నికలు
- అంతకన్నా నెల రోజుల ముందు నోటిఫికేషన్
- సన్నద్ధమవుతున్న పార్టీలు
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా చల్లారనే లేదు. త్వరలోనే నగరంలో మరో ఎన్నికల వేడి రాజుకోనుంది. రాబోయే మూడు మాసాల్లోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు వివిధ రాజకీయ పార్టీలు గ్రేటర్‌పై (జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై) తమ జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలో నెగ్గిన టీఆర్‌ఎస్‌తోపాటు తెలుగుదేశం, బీజేపీ తదితర పార్టీలు సైతం రాబోయే రోజుల్లో కార్పొరేషన్ తమ చేతిలోకే వస్తుందని చెబుతున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సైతం జీహెచ్‌ఎంసీపై దృష్టి పెడతామని ప్రకటించారు. టీఆర్‌ఎస్- ఎంఐఎం నేతల మధ్య ఇటీవల జరిగిన విందు సందర్భంగా సైతం జీహెచ్‌ఎంసీయే ముఖ్యాంశంగా నిలిచింది. ఇలా.. ఏ కోణంలో చూసినా ఏ పార్టీకా పార్టీ జీహెచ్‌ఎంసీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
పాలకమండలి గడువు డిసెంబరు 3
జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే నవంబర్- డిసెంబర్ మాసాల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయనేది ఆయా పార్టీల అంచనాగా ఉంది. జీహెచ్‌ఎంసీ చట్టం .. నిబంధనల మేరకు పాలకమండలి గడువు ముగియడానికి మూడు నెలల ముందు నుంచి గడువు తేదీలోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ నిబంధన మేరకు సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్‌లోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుంది. పోలింగ్‌కు నెలరోజుల గడువుతో నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉంటుంది.
ఈ లెక్కన ఆగస్టులోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడేందుకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి జీహెచ్‌ఎంసీని గుండెకాయగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో అధికార పగ్గాలు లభించినప్పటికీ, కార్పొరేషన్‌లో ఇంతవరకు ఉనికే లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పార్టీ ముఖ్యనాయకులు కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకుగాను కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తూనే ఎంఐఎంతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర అవగాహనతో జీహెచ్‌ఎంసీలో నెగ్గి అధికారాన్ని పంచుకున్నాయి. ఈసారి కాంగ్రెస్ స్థానంలో టీఆర్‌ఎస్ వచ్చే అవకాశాలున్నాయి.
లేదా ఏక పక్షంగానే కార్పొరేషన్‌లో నెగ్గేందుకు ఉన్న అవకాశాలను టీఆర్‌ఎస్ అంచనా వే స్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న టీఆర్‌ఎస్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే.. మూడు నెలల్లోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలా కాకుండా కొంతకాలం వేచి చూశాక కార్పొరేషన్ బరిలో దిగాలనుకుంటే మాత్రం పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలకు వెళ్తుంది. రెంటిలో ఏది తమకు ఎక్కువ అనుకూలంగా ఉంటే దానికి మొగ్గు చూపనుంది. పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు నిర్వహిస్తే.. ఈలోగా ఓట్ల జాబితా సవరణ.. డూప్లికేట్ల తొలగింపు తదితర కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తే.. ఎన్నికలన్నీ ముగిసి పాలనకు అనువుగా, ప్రజాసమస్యలు వేగంగా పరిష్కరించేందుకు వీలుంటుందన్న అభిప్రాయాలున్నాయి.