కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు పూర్తిగా చెడిపోయినట్లే కనిపిస్తోంది. మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేస్తున్నారు. రాజీనామా విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారమే ప్రకటించారు. ఎలాగోలా ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మంతనాలు సాగించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవానికి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారమే మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ రాజీనామా చేస్తున్నా.. కనీసం డిప్యూటీ మేయర్ పదవి తీసుకోడానికి కూడా మజ్లిస్ నేతలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. దీన్నిబట్టి చూస్తే ఇక కాంగ్రెస్తో కటీఫ్ చెప్పడానికి ఎంఐఎం సిద్ధమైపోయినట్లే ఉంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద పూర్తిస్థాయిలో సందడి కనిపిస్తోంది.
తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గతంలో జగన్ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తన ఉనికిని చాటుకోడానికి మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు పార్టీలకు మధ్య చెడిపోయింది. కొన్ని భూముల విషయం కూడా ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని అప్పట్లో వినిపించింది. ఈసారి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక కూటమిగా ఏర్పడొచ్చని అంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో బుధవారం భేటీ అయ్యారు.
ఇక కేవలం పాతబస్తీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మజ్లిస్ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు యాదవ వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారిని ఎంఐఎం తరఫున ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కనీసం 3 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. తద్వారా కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కూడా భావిస్తోంది.