Majid Hussain
-
మీ సేవలు మరువలేం
జీహెచ్ఎంసీ పాలకమండలికి వీడ్కోలు నేటితో పదవీ కాలం పూర్తి గ్రూప్ ఫొటో దిగిన కార్పొరేటర్లు మేయర్, సభ్యులకు అధికారుల ప్రశంసలు జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మేయర్ సహా పాలక మండలి సభ్యులకు అధికారులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. విందు ఏర్పాటు చేశారు. సభ్యులంతా కలసి గ్రూప్ ఫొటో దిగారు. పార్టీలు, విభేదాలు పక్కన పెట్టి... కాసేపు కులాసా కబుర్లతో గడిపారు. పాలనా కాలంలో తాము అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మహిళా కార్పొరేటర్లు మేయర్, కమిషనర్లతో కలసి ప్రత్యేకంగా ఫొటో దిగారు. కార్పొరేటర్ల సేవలను అధికారులు కొనియాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి గడువు బుధవారంతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులకు అధికారులు మంగళవారం వీడ్కోలు సమావేశం, గ్రూప్ ఫొటో, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదేళ్ల పాటు కార్పొరేటర్లు అందించిన సేవలను కొనియాడుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు. జీహెచ్ఎంసీ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధికారులకు కార్పొరేటర్లు ఎంతగానో సహకరించార ని గుర్తు చేసుకున్నారు. పాలకమండలి సమన్వయం, సహకారంతోనే ఎన్నో పనులు చేయగలిగామని చెప్పారు. మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కమార్, వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లు వాజిద్‌హుస్సేన్(కాంగ్రెస్), నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ)లు మాట్లాడుతూ అధికారులు, కార్పొరేటర్ల సమష్టి కృషితోనే లోటు బడ్జెట్‌తో ఉన్న కార్పొరేషన్ ఆర్థికంగా బలపడిందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సకల జనుల సమ్మె, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు వంటివి జరిగినప్పటికీ, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లామన్నారు. జలమండలి ఎమ్డీ జగదీశ్వర్, ట్రాఫిక్ చీఫ్ జితేందర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లు బాబు అహ్మద్, పీఎస్ ప్రద్యుమ్న, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇద్దరు మేయర్ల పాలన 2009 డిసెంబర్4న జీహెచ్ఎంసీ పాలకమండలి కొలువుదీరింది. ఐదేళ్ల కాలాన్ని ఇద్దరు మేయర్లు పంచుకున్నారు.కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం మేరకు ఇద్దరు మేయర్లుగా, ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా వ్యవహరించారు. బండ కార్తీకరెడ్డి(కాంగ్రెస్), మాజిద్ హుస్సేన్(ఎంఐఎం)లు మేయర్లుగా వ్యవహరించగా.. జాఫర్‌హుస్సేన్(ఎంఐఎం), జి.రాజ్‌కుమార్(కాంగ్రెస్)లు డిప్యూటీ మేయర్లుగా పనిచేశారు. వీరిలో జాఫర్ హుస్సేన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి మూడేళ్లు, ఎంఐఎం అభ్యర్థి రెండేళ్లు మేయర్ పదవిలో ఉండాల్సి ఉంది. మారిన పరిణామాల నేపథ్యంలో ఎంఐఎంకు మూడేళ్లు అవకాశం లభించగా... కాంగ్రెస్‌కు రెండేళ్లు అధికారంలో ఉండే అవకాశం లభించింది. మాజిద్‌హుస్సేన్ నగరానికి 24వ మేయర్ గా వ్యవహరించారు. -
మొహర్రం ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో వచ్చేనెల 4న మొహర్రం సందర్భంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బీబీకాఆలం ఊరేగింపు మార్గం లో, ఇతరత్రా ప్రధాన మార్గాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మేయర్ మాజిద్‌హుస్సేన్ అధికారులకు సూచించారు. శనివారం కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి మొహర్రం ఏర్పాట్లపై సమీక్షజరిపారు. రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మొహర్రం సందర్భంగా ఎంపికచేసిన మార్గాల్లో ఎల్ఈడీ లైట్లు.. పాతబస్తీలో పారిశుధ్యానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. -
బలపడిన ద్వైపాక్షిక బంధం
పలు నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చలు ప్రజారవాణా, గృహనిర్మాణం, స్మార్ట్ సిటీస్‌పై చర్చ పరస్పర సహకారానికి అంగీకారం వివరాలు వెల్లడించిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన ప్రజారవాణా, గృహ నిర్మాణం, స్మార్ట్‌సిటీల నిర్మాణం తదితర అంశాల్లో పలు నగరాలతో ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. హెచ్ఐసీసీలో మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం పలు నగరాల మేయర్లతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్ చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న విలేకరులకు వెల్లడించారు. ఆయా నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చించిన వివరాలు ఇలా.. మెట్రోపొలిస్ మేయర్ జీన్పాల్హచాన్తో.. తీరైన పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెట్రొపోలిస్ సదస్సులో ఆయా అంశాలపై జరిగిన చర్చలను వేర్వేరుగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను జీన్‌పాల్ హచాన్ ప్యారీస్‌కు ఆహ్వానించారు. త్వరలో వాతావరణ మార్పులపై ప్యారీస్‌లో నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాలని కోరారు. బెర్లిన్ డిప్యూటీ మేయర్ బర్భరా బెర్నింగర్‌తో.. స్మార్ట్‌సిటీల నిర్మాణం,పేదలకు తక్కువ ఖర్చుతో నిర్మించనున్న గృహాలు, వికలాంగులకు చేయూతనిచ్చే విషయంలో బెర్లిన్ నగరం నుంచి సాంకేతిక సహకారం అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. జర్మన్ కంపెనీలు గ్రేటర్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఐటీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వచ్చే ఏప్రిల్‌లో బెర్లిన్‌లో జరగనున్న మెట్రోపాలిటన్ సొల్యూషన్స్ సదస్సులో పాల్గొనాలని ఆమె కేటీఆర్‌ను ఆహ్వానించారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె హామీ ఇచ్చారు. మాషాద్ మేయర్ సోలాట్ మోర్తాజావితో.. సంస్కృతి, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంతోపాటు పట్టణాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. ఇరాన్, హైదరాబాద్ నగరాలకు మధ్యనున్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మషాద్ నగరం ఏటా 24 మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇరాన్‌కు తమ నగరం ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతోందన్నారు. హైదరాబాద్ నుంచి మషాద్‌కు నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పలు ఐటీ కంపెనీలు మషాద్ నగరంలోనూ తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ఆయనకు తెలిపారు. జోహెన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ టవ్తో.. నగరాల్లో సురక్షిత భద్రతా ఏర్పాట్లు చేసే అంశంపై మంత్రి కేటీఆర్ చర్చించారు. విశ్వవిద్యాలయాల సౌజన్యంతో సైన్స్పార్క్ల ఏర్పాటుపై అభిప్రాయాలను పంచుకున్నారు. జోహెన్స్‌బర్గ్ నవనిర్మాణానికి అక్కడ చేపట్టిన సంస్కరణలు, సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను వివరించారు. జోహెన్స్‌బర్గ్ సహకారంతో హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. జోహెన్స్‌బర్గ్ నగరానికి ఐటీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. హరిత భవనాల నిర్మాణానికి సంబంధించిన సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఐటీ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. సావోపోలో మేయర్ రోవేనాతో.. దక్షిణ అమెరికాలోని సాపోలో నగరంలో 11 మిలియన్ల మంది నివసిస్తున్నారని రోవేనా మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. నిర్మాణరంగం,పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, ఆరోగ్యం, గృహనిర్మాణం, వ్యాక్సీన్ల అభివృద్ధి విషయంలో పర స్పరం సహకరించుకోవాలనే ఆలోచనకు వచ్చారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో గృహనిర్మాణం, పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్, సావోపోలో నగరాల్లో ఉన్న అవకాశాలను చర్చించారు. బార్సిలోనా మేయర్ క్సేవియర్ ట్రయాస్తో.. స్మార్ట్‌సిటీల నిర్మాణం, ఇంధన భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, స్థలాలు, మేనేజ్మెంట్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పలు అంశాల్లో బార్సిలోనా సాధించిన విజయాలను ఆయన కేటీఆర్‌కు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. -
రూ. 5కే భోజనం
తొమ్మిదో కేంద్రం ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: పేదలకు సేవ చేయడం.. భగవంతునికి సేవ చేయడంతో సమానమని మేయర్ మాజిద్ హుస్సేన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 5కే భోజన కార్యక్రమం తొమ్మిదో కేంద్రాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో లిబర్టీ బస్టాప్ వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్ని జీహెచ్ఎంసీ చేపట్టినందున ఎంతో గర్వపడుతున్నానన్నారు. అక్టోబర్ 2వ తేదీకి మొత్తం 50 కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం రూపాయికే టిఫిన్ పథకాన్ని ప్రారంభించే యోచన ఉందన్నారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోమందికి ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈసెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ పథకం వల్ల ఎందరో పేదలకు ఆకలి తీరుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పథకం వల్ల నేరాలు, దొంగతనాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఉండేందుకుగాను మెరుగైన రహదారులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, సైనేజీలను ఏర్పాటుకు సహకరించాల్సిందిగా మేయర్, కమిషనర్లను కో రారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జి. రాజ్‌కుమార్, హరేకృష్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, కాంగ్రెస్ పక్ష నాయకుడు వాజిద్‌హుస్సేన్, స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, జోనల్ క మిషనర్ సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. -
మిస్డ్‌కాల్ కొట్టు.. ఉద్యోగం పట్టు
నగరంలో ‘ఈ-వ్యాన్’ సదుపాయం ఉన్న చోటు నుంచే యువతకు ఉద్యోగ అవకాశం పథకాన్ని ప్రారంభించిన మేయర్ మాజిద్ సాక్షి, సిటీబ్యూరో:‘మీరు నిరుద్యోగులా... ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా?... ఇకపై ఆ అవసరం లేదు. ఉన్న చోటు నుంచే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఉద్యోగం కోసం మీ పేరు నమోదైనట్టే.. ఆపై అవసరమైన శిక్షణ.. ఇంటర్వ్యూ.. ఉద్యోగం మీకొచ్చినట్టే’.. ఈ ప్రయోగాత్మక పథకాన్ని జీహెచ్ఎంసీ శనివారం ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి జ్యోతి వెలిగించి పథకాన్ని ప్రారంభించారు. టీఎంఐ సంస్థ సాంకేతిక సహకారంతో జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఈ-వ్యాన్ (ఎంప్లాయ్మెంట్ వ్యాన్)ను కూడా మేయర్ ప్రారంభించారు. మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఏ కార్పొరేషన్ చేయని విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిరుద్యోగులు 040-71012014 నెంబర్‌కు ఫోన్ చేస్తే.. కార్యాలయ పనిదినాల్లో జీహెచ్ఎసీ నుంచి వారికి ఫోన్ కాల్ వెళ్తుందన్నారు. విద్యార్హతలకు తగిన ఉద్యోగాల గురించి వివరించడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ-జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్లో కనీసం 10 ఈ-వ్యాన్లు, 25 ఈ-జోన్ కేంద్రాలు అవసరమన్నారు. వేదికనుంచే మల్కాజిగిరిలోని ఈ-జోన్ కార్యాలయాన్ని ఆన్లైన్ ద్వారా మేయర్ ప్రారంభించారు. అక్కడున్న నిరుద్యోగులతో మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ఎన్నో పథకాలు.. ఈ-వ్యాన్‌లో ఉండే సదుపాయాలతో నిరుద్యోగుల వివరాలు నమోదు చేస్తారని.. అనంతరం వారి అర్హతలకు తగిన ఉద్యోగాల గురించి ఈ-జోన్ కేంద్రాల్లో తెలుపుతారని, అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతోపాటు ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు తగిన శిక్షణ కూడా ఇస్తామన్నారు. ఈ-వ్యాన్ ఆయా బస్తీల్లోని నిరుద్యోగులందరినీ ఒక చోటకు చేర్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జోన్‌కొకటి చొప్పున ఐదు ఈ-వ్యాన్లు పనిచేస్తాయన్నారు. ఈ-వ్యాన్ ద్వారా ఏటా 12వేల మందికి ఉపాధి చూపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టీఎంఐ సంస్థ చైర్మన్, ఎండీ మురళీధరన్ మాట్లాడుతూ రానున్న పదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి చూపాలని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
కూల్చివేతలు ఆపండి
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచన సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ కొనసాగిస్తోంది. తాజాగా గురువారం నగరంలోని వివిధ సర్కిళ్ల పరిధిలోని 19 భవనాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గడచిన మూడు రోజుల్లో మొత్తం 44 భవనాలను కూల్చివేశారు. అధికారుల ఈ చర్యలపై ప్రజల నుంచి పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోకుండా.. ఏళ్ల తర్వాత కూల్చివేతలకు దిగడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజల నుంచి కార్పొరేటర్లపై ఒత్తిళ్లు పెరగడంతో పలువురు కార్పొరేటర్లు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నంమేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు కూల్చివేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కూల్చివేతకు ముందు.. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే అడ్డుకోకుండా ప్రోత్సహించిన సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ల (ఏసీపీలు)పై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా కమిషనర్‌కు సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, పీఎస్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్పొరేటర్ల ధర్నా కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అంతకుముందు టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కూల్చివేతలకన్నా ముందు అక్రమ భవనాలు రావడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రికి రాసిన మరో లేఖలో టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పక్షపాతంతో కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో జరగుతున్న కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎక్కడెక్కడ.. అధికారులు గురువారం చర్లపల్లి, సరూర్‌నగర్, ఎల్బీనగర్, ఆజంపురా, బడాబజార్, జాస్మిన్నగర్, రాంనగర్, మధురానగర్, బంజారాహిల్స్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, గాజులరామారం, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని భవనాలను నేలమట్టం చేశారు. కూల్చివేతలు యధాతథం: కమిషనర్ ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు యధాతథంగా కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. కూల్చివేతలను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల మేరకు అక్రమ భవనాలన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణను కోరుతూ కార్పొరేటర్ల విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదించేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. పాత పద్ధతిలోనే ట్రేడ్‌లెసైన్స్ ఫీజు గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోని దుకాణాలకు ఒకేలా ట్రేడ్‌లెసైన్సు ఫీజు విధించడాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యతిరేకించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా చేపట్టిన ఈ విధానాన్ని నిలుపు చేస్తూ పాత పద్ధతినే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. వీటికి ఆమోదం.. కార్పొరేటర్లకు యాపిల్ ఐపాడ్లు, మీడియా ప్రతినిధులకు టాబ్లెట్లు ఇచ్చేందుకు గతంలో ఆమోదించిన తీర్మానం ఉపసంహరణ ప్రభుత్వోద్యోగుల తరహాలో 2014 జనవరి నుంచి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు డీఏ పెంపు రూ. 74 లక్షలతో సైనిక్‌పురి షాపింగ్‌కాంప్లెక్స్ రెండో అంతస్తు నిర్మాణం జోహ్రాబీ దర్గా నుంచి డీఆర్డీఎల్ వరకు రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి పరిహారం. తిరస్కరించినవి.. మోహన్‌నగర్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు సీసీరోడ్డు పనులు. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ప్రహరీగోడ, అంతర్గత రహదారి నిర్మాణపనులు. హైదర్‌గూడ రింగ్‌రోడ్డు వద్ద సర్దార్ వల్లభాయిపటేల్ విగ్రహం ఏర్పాటు. దాన్ని తెలంగాణ అమరవీరుల ప్రదేశంగా గుర్తించాలని ప్రతిపాదన. పెండింగ్.. బల్దియా పెట్రోల్ సప్లయ్ కంపెనీకి స్థలం లీజు పొడిగింపు అంశం. 2013- 14 బడ్జెట్ రీ అప్రాప్రియేషన్ చేయాలనే అంశాన్ని వాయిదా వేశారు. 60 వేలపై అయోమయం: నగరంలో 60 వేల అక్రమ నిర్మాణాలున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్ని నిర్మాణాలెక్కడ ఉన్నాయో తెలియక జీహెచ్ఎంసీ అధికారులు అమోమయానికి గురవుతున్నారు. బీపీఎస్ పథకం అమల్లో ఉన్నప్పుడు అందిన 2.05 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 60 వేల దరఖాస్తుల్ని తిరస్కరించారు. వాటినే సీఎం అక్రమ నిర్మాణాలుగా చెబుతున్నారా అనేది అంతుబట్టక జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి అక్రమ నిర్మాణాల లెక్కల్లో పడ్డారు. -
మేయర్ చాంబర్ సొగసు చూడతరమా....
హైదరాబాద్ : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉన్నత స్థానాల్లోని వారు తలచుకుంటే సౌకర్యాలకు కొరతా... అన్నట్టుంది జీహెచ్ఎంసీలో పరిస్థితి. ఓ వైపు గ్రేటర్ ప్రజలు తాగే నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నా పట్టించుకోని పెద్దలు తమ కార్యాలయను మాత్రం ఆగమేఘాలపై సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అందుకోసం భనవం గోడలు కూల్చేసి అద్దాలతో పచ్చని మైదానం కనువిందు చేసేలా తీర్చి దిద్దుకుంటున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ళలోనే తన చాంబర్‌కు మార్పులు చేయించి..సీత్రూ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోగా తాజాగా మేయర్ మాజిద్ తన చాంబర్‌కు సొబగులు దిద్దాలని ఆదేశించారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం లక్షల రూపాయిలు వెచ్చిస్తున్నారు. ఇక కమిషనర్ రూ.5కే భోజనం పథకాన్ని ప్రారంభించగా..దానికి లభించిన ఆదరణతో మేయర్ రూపాయికే టిఫిన్ కార్యక్రమం ప్రారంభించాలంటున్నారు. కమిషనర్ చాంబర్‌ను అందంగా తీర్చిదిద్దుకోగా లేనిది... తన చాంబర్ నెందుకు అద్దంలా తీర్చిదిద్దరాదనుకున్నారో ఏమో! తన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3తో ముగిసిపోతున్న తరుణంలో మేయర్ ఈ పనికి సిద్ధం కావటం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశమైంది. -
‘గ్రేటర్’లో 400 ఆర్వో ప్లాంట్లు
శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు రూ.5కే భోజనం 50 కేంద్రాలకు విస్తరణ 1500 ప్లేస్కూల్స్ ఏర్పాటుకు చర్యలు జీహెచ్ఎంసీ పనులపై మేయర్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా పేదబస్తీల ప్రజలకు శుద్ధమైన తాగునీరందించేందుకు 400 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ అధికారులకు సూచించారు. కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి శనివారం జీహెచ్ఎంసీ చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1500 ముస్కాన్ (ప్లే స్కూల్) సెంటర్లు, 50 కేంద్రాల్లో రూ. 5లకే భోజనం కార్యక్రమాల అమలుకు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. తాగునీటి సదుపాయం, భవనాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తొలిదశ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ప్రజలెక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రేటర్లో 50 కేంద్రాల్లో రూ. 5లకే భోజనం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 8 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. అడ్డా కార్మికులు, ఆస్పత్రులు, బలహీనవర్గాల ప్రజలుండే ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆర్ఓ ప్లాంట్లు, ముస్కాన్‌లు, రూ. 5లకే భోజనం ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలు బుధవారం లోగా అందించాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ జోనల్ కమిషనర్లకు సూచించారు. 23 నుంచి రోడ్డు కటింగ్లుండవు.. ఈ నెల 23 నుంచి ఎలాంటి రోడ్డు కటింగ్‌లకు అనుమతించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వాటి అనుమతులపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సు దృష్ట్యా రహదారుల అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. లేన్‌మార్కింగ్, క్యాట్‌ఐస్, సైనేజీల ఏర్పాటుతోపాటు అన్ని ప్రధాన మార్గాల్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టంతో పనిచేసే ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. 81 ఫౌంటెన్లకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లపై లైటింగ్, గ్రీనరీలను పెంచాలన్నారు. హెరిటేజ్ కారిడార్ల వద్ద బస్‌బేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. -
సాలార్జంగ్ మ్యూజియం వద్ద...వేలాడే వంతెనా
నైట్ బజార్ కూడా.. సిటీకి సరికొత్త హంగులు మెట్రోపొలిస్ సదస్సు కోసం రూ. 500 కోట్ల పనులు సన్నద్ధమవుతున్న జీహెచ్ఎంసీ అందే నిధులెన్నో.. చేసే పనులెన్నో? సాక్షి, సిటీబ్యూరో: మెట్రోపొలిస్ సదస్సుకు సిటీని సరికొత్త హంగులతో తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ. 500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా సాలార్జంగ్ మ్యూజియం వద్ద వేలాడే వంతెన, నైట్‌బజార్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. నగరంలో మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు వచ్చే అక్టోబర్‌లో జరగనున్నందున ఈ లోపే పనులన్నీ పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచీ వీలైనన్ని నిధులు పొందాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే వంద దేశాల విదేశీ ప్రతి నిధుల ఎదుట హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపించేందుకు తహతహలాడుతోంది. ఇం దులో భాగంగా పాతబస్తీకి సంబంధించిన పలు పనులతోపాటు సాలార్జంగ్ మ్యూజియం వద్ద వేలాడే వంతెన, నైట్‌బజార్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ సూచించారు. అధికారులు ఆ దిశగా ప్రణాళిక.. అంచనా వ్యయం తదితరమైనవి రూపొందించే పనిలో పడ్డారు. దీనితోపాటు చార్మినార్ వద్దకు చేరుకునే అప్రోచ్‌రోడ్ల వెంబడి గ్రీనరీని పెంపొందించడం, ఆయా మార్గాలకు వారసత్వ శోభనిచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక వీధిదీపాలు తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. అంతా బాగానే ఉంది కానీ... సీఓపీ సందర్భంగా రూ. 150 కోట్ల పనులే చేయలేకపోయిన జీహెచ్ఎంసీ.. మెట్రోపొలిస్ సదస్సు కోసం రూ. 500 కోట్ల పనులను.. అదీ ఇంత తక్కువ సమయంలో ఎలా చేయగలుగుతుందో అంతుబట్టడం లేదు. జీహెచ్ఎంసీ చేపట్టే పనుల్లో కొన్ని... మీరాలం చెరువు సుందరీకరణ, కిషన్‌బాగ్ వద్ద అమ్యూజ్మెంట్ పార్కు అన్ని ప్రధాన మార్గాల్లో రోడ్డు మార్కింగ్‌లు.. సైనేజీలు వారసత్వ ప్రాముఖ్యమున్న అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక వీధిదీపాల ఏర్పాటు చాంద్రాయణగుట్టలో మల్టీపర్పస్ స్టేడియం పాతబస్తీలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులన్నీ పూర్తి ఆరాంఘర్ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు మిగిలిపోయిన ప్రాజెక్టు పనుల పూర్తి చార్మినార్, మక్కామసీదు, మొజాంజాహీ మార్కెట్ ప్రాంతాల్లో సుందరీకరణ చార్మినార్ వద్ద ఫొటోగ్యాలరీ ఏర్పాటుకు నిర్మాణ పనులు -
ఫ్లోర్ లీడర్లతో మేయర్ భేటీ
సాక్షి, సిటీబ్యూరో: డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాల) తొలగింపునకు ప్రతి డివిజన్‌కు ఒక వాహనాన్ని కేటాయించాల్సిందిగా గత స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ కమిషనర్‌కు సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత మేయర్ మాజిద్ బుధవారం డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజావసరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనుల గురించి సమావేశంలో చర్చించారు. ఆమేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సదరు పనులు వెంటనే చేయాల్సిందిగా క మిషనర్‌కు సూచించారు. వాటిల్లో ముఖ్యాంశాలు.. డెబ్రిస్ తొలగింపు పనులు వెంటనే పూర్తిచేయాలి. కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల (కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల వారికి రూ. 2 కోట్లు)నుంచి స్వల్పకాలిక టెండర్లు పిలిచి అవసరమైన పనులు వెంటనే చేపట్టాలి. బీటీ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలే తప్ప బీటీ ప్లాంట్లను మూసివేయరాదు పాట్‌హోల్స్ పనులు వెంటనే పూర్తిచేసి జాబితా సిద్ధం చేయాలి. డివిజన్ల వారీగా కొత్త రహదారుల వివరాలు 26న ‘షాబ్- ఎ- మైరాజ్’ను పురస్కరించుకొని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక వీధిదీపాల ఏర్పాటు. శ్మశానవాటికల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు. రూ. 5లకే భోజనం అమలు తీరుపై నివేదిక. అదనంగా ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల జాబితా. నాలాల డీసిల్టింగ్ పనులపై నివేదిక తిరిగి 23వ తేదీన జరుగనున్న సమీక్ష సమావేశానికి పై నివేదికల తో సంబంధిత అధికారులంతా హాజరుకావాలి. సమావేశంలో ఫ్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు(కాంగ్రెస్), ఎండి నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ), జీహెచ్ఎంసీ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మాజిద్ రాజీనామాను ఆమోదించని కౌన్సిల్
హైదరాబాద్ : హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. కౌన్సిల్ సాధారణ సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామాను కౌన్సిల్ ఆమోదించలేదు. కాంగ్రెస్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్లు మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా రాజీనామా చేస్తారంటూ మరోవైపు టీడీపీ, బీజేపీ ప్రశ్నించాయి. సమావేశం నుంచి బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. కాగా కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అయితే, అంతకుముందు కాంగ్రెస్ మేయర్ బండ కార్తీక రెడ్డి రెండు నెలలు అదనంగా ఉన్నందున తాను కూడా రెండు నెలలు అదనంగా ఉన్నానని మాజిద్ చెప్పారు. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య ఎన్నికల పొత్తు కూడా తేలకపోవడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మేయర్ పదవికి మాజిద్ రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఆ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. -
కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
-
పార్టీ ఏం చెబితే అదే చేస్తా!
మీరు నాంపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటున్నారు. ఇంకొన్ని పేర్లూ వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?.. ఎమ్మెల్యే.. ఎంపీ.. దేన్ని ఎంచుకుంటారు?’.. శుక్రవారం మేయర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాజిద్ హుస్సేన్‌ను చుట్టుముట్టిన ప్రశ్నలివి. మజ్లిస్ పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని, అంతకుమించి వ్యక్తిగత నిర్ణయమంటూ ఉండదని ఆయన బదులిచ్చారు. ప్రథమ పౌరుడనేది హోదా అయినప్పటికీ.. నగరానికి ప్రథమ సేవకుడిగానే పనిచేశానన్నారు. మేయర్‌గా పనిచేసిన 26 నెలల కాలం సంతృప్తినిచ్చిందని, అన్నివర్గాల సహకారంతో బాధ్యతలు నిర్వహించానన్నారు. ఇళ్ల వద్దకే బర్త్సర్టిఫికెట్లు, వివిధ విభాగాల్లో ఆన్లైన్ సేవలు, పేదలకు సబ్సిడీ పై భోజనం, బస్తీల్లో నీటిశుద్ధి ప్లాంట్లు వంటి పనులు బాగా సంతృప్తినిచ్చాయన్నారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా, లోటు బడ్జెట్లో ఉన్న జీహెచ్ఎంసీ ఖజానాను పరిపుష్టం చేశామన్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా ఉద్యోగాల భర్తీ, శివార్లలోని 36 గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం కాకుండా కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానించామని గుర్తు చేశారు. మెట్రోపాలిటన్ సిటీ కి తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించిందన్నారు. కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు, తమ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశం మేరకు తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కొత్తగా రాబోయే కాంగ్రెస్ పార్టీ మేయర్‌కు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జాఫ్రీ, మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్, పార్టీ ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. 22న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం తన రాజీనామాకు ఆమోదం తెలిపేందుకు వీలుగా ఈనెల 22న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మాజిద్ హుస్సేన్ తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు మేయర్ రాజీనామాను సర్వసభ్య సమావేశం ఆమోదించాలి. ఆ సమావేశాన్ని మేయరే ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ఆశావహుల్లో ఆశలు.. మాజిద్ హుస్సేన్ రాజీనామాతో.. మేయర్ పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఆశలు చిగురించాయి. కొత్తగా మేయర్‌గా ఎన్నికయ్యే వారికి ఆరేడు నెలల అవకాశమే ఉన్నప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా, ఓవైపు అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే మేయర్ పదవికి అవకాశం రానుండటంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ టిక్కెట్ అడగాలా? లేక మేయర్ పదవి కోరుకోవాలా? అనే ఊగిసలాటలో ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. మేయర్ రాజీనామాతో డిప్యూటీ మేయర్‌గా ఉన్న రాజ్‌కుమార్ (కాంగ్రెస్) సైతం రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన రాజీనామాను మేయరే ఆమోదించాల్సి ఉన్నందున.. 22లోగా ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ రాజీనామా చేయగలరనే అభిప్రాయాలున్నాయి. ‘‘మాజిద్ హుస్సేన్ ప్రస్తుతానికి అహ్మద్‌నగర్ డివిజన్ కార్పొరేటర్. రేపు ఎమ్మెల్యేగా నిలబడాలా.. ఎంపీగా పోటీ చేయాలా? అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏం చెబితే అది చేస్తా. ప్రస్తుతానికి అహ్మద్‌నగర్ బాధ్యత చూడటమే నా పని’’ - శుక్రవారం సాయంత్రం మేయర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మాజిద్ హుస్సేన్ -
హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌ను కలసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్టు మాజిద్ హుస్సేన్ స్పష్టం చేశారు. 26 నెలల పదవీ కాలంలో ప్రజలపై ఎలాంటి భారం వేయలేదని ఆయన చెప్పారు. నష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీని 572 కోట్ల రూపాయిల లాభాల్లోకి తెచ్చామని మాజిద్ తెలిపారు. కాంగ్రెస్ - మజ్లిస్ పార్టీల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండు సంవత్సరాలు దాటిపోవడంతో మాజిద్ హుస్సేన్ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ - ఎంఐఎంల మధ్య పొత్తులో భాగంగా మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని, ఎంఐఎం డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టాలని, రెండేళ్ల తర్వాత పదవులు మార్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే, తొలిసారి మేయర్ పదవి చేపట్టిన బండ కార్తీకరెడ్డి రెండు సంవత్సరాల తర్వాత మరి కొంత కాలం పాటు మేయర్ పదవిలో కొనసాగడంతో, మాజిద్ హుస్సేన్ కూడా రెండేళ్ల గడువు పూర్తయిన తర్వాత మరికొంత కాలం ఉండి.. ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. మేయర్ పదవిని విజయవంతంగా నిర్వర్తించిన మాజిద్ హుస్సేన్.. నగర ప్రజల నోళ్లల్లో బాగా నానారని, ఆయనకు మంచి పేరే వచ్చిందని ఎంఐఎం అధిష్ఠానం భావిస్తోంది. అందుకే మాజిద్ చేత నాంపల్లి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడున్న విరాసత్ రసూల్ ఖాన్ ను అవసరమైతే వేరే నియోజకవర్గానికి మార్చడం లేదా ఏమైనా ప్రత్యామ్నాయం చూడటం లాంటి యోచనలు కూడా చేస్తున్నారు. -
మేయర్ పదవికి నేడు మాజిద్ రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తాను రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కమిషనర్ సోమేష్ కుమార్ చేతికి రాజీనామా లేఖ అందించనున్నారు. కాంగ్రెస్ - మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు చెడిపోవడం, ఇప్పటికే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండు సంవత్సరాలు దాటిపోవడంతో మేయర్ మాజిద్ హుస్సేన్ శుక్రవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ - ఎంఐఎంల మధ్య పొత్తులో భాగంగా మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని, ఎంఐఎం డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టాలని, రెండేళ్ల తర్వాత పదవులు మార్చుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే, తొలిసారి మేయర్ పదవి చేపట్టిన బండ కార్తీకరెడ్డి రెండు సంవత్సరాల తర్వాత మరొ కొంత కాలం పాటు మేయర్ పదవిలో కొనసాగడంతో, మాజిద్ హుస్సేన్ కూడా రెండేళ్ల గడువు పూర్తయిన తర్వాత మరికొంత కాలం ఉండి.. ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా తమకు వద్దని ఎంఐఎం స్పష్టం చేసింది. ఇక మేయర్ పదవిని విజయవంతంగా నిర్వర్తించిన మాజిద్ హుస్సేన్.. నగర ప్రజల నోళ్లల్లో బాగా నానారని, ఆయనకు మంచి పేరే వచ్చిందని ఎంఐఎం అధిష్ఠానం భావిస్తోంది. అందుకే మాజిద్ చేత నాంపల్లి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడున్న విరాసత్ రసూల్ ఖాన్ ను అవసరమైతే వేరే నియోజకవర్గానికి మార్చడం లేదా ఏమైనా ప్రత్యామ్నాయం చూడటం లాంటి యోచనలు కూడా చేస్తున్నారు. -
కాంగ్రెస్ - మజ్లిస్ కటీఫ్.. మేయర్ రాజీనామా
కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు పూర్తిగా చెడిపోయినట్లే కనిపిస్తోంది. మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేస్తున్నారు. రాజీనామా విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారమే ప్రకటించారు. ఎలాగోలా ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మంతనాలు సాగించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవానికి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారమే మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ రాజీనామా చేస్తున్నా.. కనీసం డిప్యూటీ మేయర్ పదవి తీసుకోడానికి కూడా మజ్లిస్ నేతలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. దీన్నిబట్టి చూస్తే ఇక కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పడానికి ఎంఐఎం సిద్ధమైపోయినట్లే ఉంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద పూర్తిస్థాయిలో సందడి కనిపిస్తోంది. తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గతంలో జగన్ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తన ఉనికిని చాటుకోడానికి మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు పార్టీలకు మధ్య చెడిపోయింది. కొన్ని భూముల విషయం కూడా ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని అప్పట్లో వినిపించింది. ఈసారి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక కూటమిగా ఏర్పడొచ్చని అంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో బుధవారం భేటీ అయ్యారు. ఇక కేవలం పాతబస్తీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మజ్లిస్ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు యాదవ వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారిని ఎంఐఎం తరఫున ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కనీసం 3 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. తద్వారా కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కూడా భావిస్తోంది. -
రూ.5కే భోజనం షురూ
నాంపల్లిలో ప్రారంభించిన మేయర్ ఐదు రూపాయలు ఖర్చుపెడితే గట్టిగా సింగిల్ టీ కూడా రాని ఈ రోజుల్లో.. ఐదు రూపాయలకే నిరుపేదలకు కడుపు నిండా వేడివేడి భోజనాన్ని అందించే పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లాంఛనంగా ప్రారంభించింది. హరేకృష్ణ ఫౌండేషన్ వారి అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రతి డివిజన్ లోను ఈ పథకాన్ని చేపడుతున్నారు. నాంపల్లి సరాయి వద్ద మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ ఆదివారం ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ‘ఈ పథకానికి 2014-15 సంవత్సరానికి రూ.11 కోట్ల నిధులు కేటాయించాం. అవసరమైతే దీన్ని రూ.50 కోట్లకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు రూపాయలకే పేదలకు మధ్యాహ్న భోజనాన్ని అందించే ఈ పథకాన్ని ఎంఐఎం వ్యవస్థాపక దినోత్సవం నాడు ప్రారంభించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు రూ.5 టికెట్ కొనుగోలు చేసి సహపంక్తి భోజనం చేశారు. త్వరలో 50 కేంద్రాలు... కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ... ‘ఐటీ హబ్‌గా పేరొందిన మహానగరంలో పెద్ద సంఖ్యలోనే పేదలు, అడ్డా కూలీలున్నారు. వారందరికీ తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలన్న తలంపుతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. పుట్టినరోజు వంటి వేడుకలు, లేదా తమకు కావల్సిన వారి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాల సందర్భంగా అన్నదానాలు చేయాలనుకునేవారిని కూడా ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ఆలోచిస్తున్నాం. ఆయా రోజున భోజన కేంద్రాల్లో ఖర్చు భరిస్తే... వారి పేర్లతో పాటు ఏ సందర్భంగా భోజనం అందిస్తున్నారో నోటీసు బోర్డుపై రాసి ఉంచుతాం’ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ ప్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షులు సత్యగౌరు చంద్రదాస్ పాల్గొన్నారు. చాలా బాగుంది... పేదవాళ్ల కోసం బల్దియా ప్రారంభించిన ఈ పథ కం ఎంతో బాగుంది. బయట రూ.40 పెట్టినా ఇంత మంచి భోజనం లభించదు. - రహీముద్దీన్, ఖైరతాబాద్ -
‘షి ట్యాక్సీ’ ప్రారంభం
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘షి ట్యాక్సీ’ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ట్యాక్సీని నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, డిప్యూటీ స్పీకర్ రాజ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్, గ్రీన్ క్యాబ్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ బ్యాంకుల ద్వారా ట్యాక్సీకి రుణాలు మంజూరు చేయిస్తుందన్నారు. 15 శాతం వ్యయాన్ని భరించగలిగే అభ్యర్థులకు 85 శాతం రుణం బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు వివరించారు. త్వరలో ఈ పథకం ద్వారా 200 మందికి ట్యాక్సీలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ క మిషనర్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని రాణించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. షి ట్యాక్సీలతో మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా 200 కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. గురువారం ప్రయోగాత్మకంగా 5 ట్యాక్సీలను ప్రారంభించామన్నారు. కనీస విద్యార్హత 8వ తరగతి ఉండి, బ్యాంకు రుణంలో 15శాతం భరించగలిగిన ఆసక్తి గల అభ్యర్థులు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ ప్రాసెస్ శాఖ జాయింట్ సెక్రెటరీ అనూరాధ తదితరులు పాల్గొన్నారు. -
'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
-
రూ. 100 కోట్లతో ‘మెట్రోపొలిస్’ పనులు: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో రానున్న అక్టోబర్‌లో జరగనున్న మెట్రోపొలిస్ సదస్సును పురస్కరించుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతుల కల్పన, తదితరాల కోసం జీహెచ్ఎంసీ నిధుల నుంచి రూ. 100 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు. 60 దేశాల్లోని 136 నగరాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్న సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు నగరానికి వచ్చిన మెట్రోపొలిస్ ప్రతినిధులతో కలిసి మంగళవారం బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశంలో మేయర్ మాట్లాడారు. జీవ వైవిధ్య సదస్సు (సీఓపీ) అనంతరం నగరంలో మరో భారీ అంతర్జాతీయ సదస్సు జరగనుండడం నగరవాసులకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ సంస్కృతీ సంప్రదాయాలు, జీవన వైవిధ్యం, నగరీకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సదస్సుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు మెట్రోపొలిస్ ప్రతినిధులు (సెక్రటరీ జనరల్ అలైన్ లెసాస్, కంట్రీ డెరైక్టర్ సునిల్దుబే, ఆసియా రీజినల్ మేనేజర్ అజయ్సూరి) తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ, ‘సిటీస్ ఫర్ ఆల్’ థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో మరో నాలుగు సబ్‌థీమ్స్ ఉన్నాయన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు రోనాల్డ్‌రాస్, అలీంబాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెట్రోపొలిస్ ప్రతినిధులు సచివాలయంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు సమీర్‌శర్మ, ఎస్కె జోషిలను కలిశారు. రాష్ట్రప్రభుత్వం రైతులు, మహిళ ల కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మంత్రి వారికి వివరించారు. -
'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
హైదరాబాద్: సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులపై హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా సమ్మె విరమించకపోతే కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ తరఫున కార్మికులకు చేయాల్సినవి అన్నీ చేశామన్నారు. జీతాల పెంపు అన్నది ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిపారు. హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఎస్మాకు భయపడబోమని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మధ్యంతర భృతిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాలతో చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మాజిద్ హుస్సేన్ తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. 25 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినా వారు ఒప్పుకోలేదు. -
మేయర్ ‘కుర్చీ’పై వీడని సస్పెన్స్
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్- ఎంఐఎం ఒప్పందం మేరకు .. మేయర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు అప్పగించేందుకు వీలుగా ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనేదిప్పుడు జీహెచ్ఎంసీలో సస్పెన్స్‌గా మారింది. రెండుపార్టీల ఒప్పందాని కనుగుణంగా ఐదేళ్ల పాలకమండలిలో తొలి రెండేళ్లు, చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఉండాలి. ఎంఐఎం మధ్యన రెండేళ్లు తమ పార్టీ వారిని మేయర్‌గా ఉంచుతుంది. ఈ లెక్కన గత డిసెంబర్లోనే ఎంఐఎం గడువు ముగిసింది. కాగా, మాజిద్ బాధ్యతలు స్వీకరించిన సమయాన్ని, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ జనవరి 3 నాటికైనా ఆయన రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ, ఎంఐఎం నుంచి ఆ దిశగా ఎలాంటి సంకేతాల్లేవు. ఆసక్తి చూపని కాంగ్రెస్.. రాష్ట్ర విభజన అంశం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మేయర్ పదవి నాశిస్తున్న కొందరు కార్పొరేటర్ల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు మాజిద్ రాజీనామాను కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజుల క్రితం ఎంఐఎంకు లేఖ పంపింది. దాదాపు నెల రోజులవుతున్నా దానిపై ఎంఐఎం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. కాంగ్రెస్ సైతం ఆ అంశాన్ని అంతటితో వదిలేసిందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగనున్న ఆరు రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో తమ పార్టీకి ఖాయంగా రానున్న మూడు రాజ్యసభ స్థానాలు కాక మరో స్థానాన్ని అదనంగా దక్కించుకునేందుకు ఎంఐఎం మద్దతు పొం దాలనే ఆలోచనలో కొందరు కాంగ్రెస్ నేతలున్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్లే చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖ రి కారణంగా ఎంఐఎం.. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నప్పటికీ, ఇటు జీహెచ్ఎంసీలోను, అటు ఇతరత్రా కాంగ్రెస్ నేతలతోనూ ఎంఐఎం సఖ్యతనే కొనసాగిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో, రాజ్యసభ ఎన్నికల్లో ఎంఐఎం సహకారాన్ని తీసుకునేందుకుగాను కాంగ్రెస్‌కు దక్కాల్సిన మేయర్ పదవీకాలాన్ని ఎరగా వేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ కోసం.. ? ఎంఐఎంకు ఏడు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఒక ఎంపీ స్థానం ఉంది. వీటిని తమకు అనుకూలంగా మలచుకుంటే రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ నేతలు కొందరు ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. మేయర్ పదవీకాలం 10నెలలు కూడా లేకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న వారు దాని కంటే రాజ్యసభ సీటు ద్వారానే ఎక్కువ ప్రయోజనముంటుందనే తలంపుతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అది వెలువడితే జీహెచ్ఎంసీ నుంచి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడుతుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు. ఎటొచ్చీ మరో నాలుగైదు నెలలు మాత్రమే మేయర్ వైభోగం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే మేయర్ సీటు కోసం పట్టుబట్టకుండా ఎంఐఎం మద్దతుతో రాజ్యసభ సీటు పొందాలనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మాజిద్ రాజీనామా కోసం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఏదో ఒకటి స్పష్టం చేయాలని మేయర్ పదవి కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు కోరుతున్నారు. మేయర్ పదవి నాశిస్తున్న వారు అది తమ పార్టీకిస్తారో, లేదో తెలిస్తే కనీసం డిప్యూటీ మేయర్ పదవిలోనైనా మరొకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
‘కొత్త మేయర్’ పై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో : కాంగ్రెస్-ఎంఐఎం ఒప్పందం మేరకు త్వరలో తమ అభ్యర్థిని మేయర్‌గా చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఎంఐఎం మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా కోసం కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకు లేఖ పంపించినట్లు తెలుస్తోంది. మాజిద్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నందున తమపార్టీ అభ్యర్థి ఆ పదవి అధిష్టించేందుకు వీలుగా ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ పీసీసీ.. గ్రేటర్ కాంగ్రెస్ ద్వారా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి లేఖ పంపించినట్లు సమాచారం. గత వారమే ఈ లేఖను ఆయనకు అందజేయాల్సి ఉండగా.. పార్లమెంటు సమావేశాల కోసం అసదుద్దీన్ ఢిల్లీ వెళ్లడంతో ఇవ్వలేకపోయార ంటున్నారు. అసదుద్దీన్ నగరానికి వచ్చినందున పీసీసీ సూచన మేరకు.. గ్రేటర్ కాంగ్రెస్ నుంచి లేఖను అసదుద్దీన్‌కు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. నెలరోజుల క్రితమే కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ఎంఐఎం దృష్టికి తేగా ఒప్పందం మేరకు నడచుకునేందుకు ఎంఐఎం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడమే కాక.. లాంఛనప్రాయంగా అందజేయాల్సిన లేఖను అందజేయాల్సిందిగా కోరింది. అయినప్పటికీ ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ తదితర అంశాల నేపథ్యంలో వారు జీహెచ్ఎంసీపై పెద్దగా దృష్టి సారించలేదు. కాగా జీహెచ్ఎంసీలోని కాంగ్రెస్ కార్పొరేటర్లు, కొందరు రాష్ట్రనేతలు ఇటీవల ఈ అంశాన్ని పీసీసీ దృష్టికి తేవడంతో.. ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల సంవత్సరం అయినందున గ్రేటర్లో పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నగరంలో పార్టీ ఇమేజ్ను పెంచుకోవాలన్నది కాంగ్రెస్ యోచనగా ఉంది. ఇప్పటినుంచే పావులు కదిపితే కనీసం జనవరి నెలాఖరుకో, లేక ఫిబ్రవరి మొదటి వారానికో కొత్త మేయర్ వచ్చే అవకాశాలున్నాయి. రెండు పార్టీల ఒప్పందం మేరకు.. ఐదేళ్ల మేయర్ పదవీకాలానికి గాను తొలి రెండేళ్లు, చివరి ఏడాది కాంగ్రెస్ అభ్యర్థి.. మధ్యలో రెండేళ్లు ఎంఐఎం అభ్యర్థి మేయర్ పదవిలో కొనసాగాలి. ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించి త్వరలోనే రెండేళ్లు పూర్తికానుంది. వాస్తవానికి డిసెంబర్ నాటికే మేయర్ పదవికి రెండేళ్లు పూర్తి కానున్నప్పటికీ.. తొలి రెండేళ్లు మేయర్‌గా వ్యవహరించిన కార్తీకరెడ్డి రాజీనామా చేయడంలో జరిగిన జాప్యం.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ తదితరమైన వాటితో 2012 జనవరి 3న మాజిద్ బాధ్యతలు స్వీకరించారు. -
రోడ్ల పనులకు రూ. 75 కోట్లు
=పారిశుధ్య అక్రమాలపై విచారణ =మహిళా భవనాలపై దుమారం =జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సాక్షి, సిటీబ్యూరో: రోడ్ల మరమ్మతుల కోసం యుద్ధప్రాతిపదికన ఒక్కో డివిజన్‌కు రూ. 50 లక్షల చొప్పున నిధులు కేటాయించేందుకు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. వచ్చేనెల 20 లోగా పనులు చేపట్టేందుకు వీలుగా స్వల్పకాలిక టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రహదారులకు యుద్ధప్రాతిపదికన తగినన్ని నిధులు మం జూరు చేయాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్ హుస్సేన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. మూడునెలల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాల్సిందిగా ఆదేశించారన్నారు. ఇందుకుగాను జనవరి 20 లోగా ఒక్కో డివిజన్‌కు రూ. 50 లక్షలు మంజూరు చేయాలని కోరారు. కొత్త సంస్కరణలు వద్దని.. పాత పద్ధతిలోనే రోడ్ల మరమ్మతుల పనులు చేయాలన్నారు. దీనికి ఎంఐఎం సభ్యులు జుల్ఫీకర్ అలీ, నజీరుద్దీన్, వాజిద్ హుస్సేన్, టీడీపీ సభ్యులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్త రామారావు, బీజేపీ సభ్యులు బం గారి ప్రకాశ్, ఆలె జితేందర్ తదితరులు సంఘీభావం తెలపడంతో డివిజన్‌కు రూ. 50 లక్షలు కేటాయించాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మేయర్ రూలింగ్ ఇచ్చారు. ఈ లెక్కన గ్రేటర్‌లోని 150 డివిజన్లకు రూ. 75 కోట్లు రోడ్ల మరమ్మతులకు ఖర్చు చేయనున్నారు. ఆఫీసర్లకిది తగదు : వీహెచ్ మున్నెన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సమావేశం ప్రారంభం కాగానే ప్రసంగం ప్రారంభించారు. కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించడాన్ని తప్పుబట్టారు. శనివారం నాటి ఘటనను ప్రస్తావిస్తూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. అధికారులు 30 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారని, ప్రజాప్రతినిధుల గడువు ఐదేళ్లేనంటూ.. వారి ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులు.. ప్రజలకు మేము (ప్రజాప్రతినిధులు) బాధ్యత వహించా ల్సి ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీలో ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ.. ఏ క్షణాన్నయినా ఎన్నికలు రానున్నందున పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యల్లేవన్నారు. చిన్న పనులకు పెద్ద ప్రొసీజర్ లేకుండా వెంటనే పూర్తిచేయాలని సూచించారు. డిప్యుటేషన్‌పై జీహెచ్ఎంసీకి వచ్చిన అధికారులు ఏళ్లతరబడి ఇక్కడే పాతుకుపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముషీరాబాద్‌లో మూడేళ్లుగా ఏఈ లేరని, రోడ్లపై ఎక్కడిగోతులక్కడే ఉన్నాయన్నారు. కొత్త కమిషనర్ ను జీహెచ్ఎంసీ పరిధి తెలిసేలోగా ఎన్నికలొచ్చేలా ఉన్నాయంటూ త్వరిత గతిన రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అవసరాల కనుగుణంగా పారిశుధ్య సిబ్బంది ఆయా ప్రాంతాలను బట్టి అవసరమైనంతమంది స్వీపింగ్ కార్మికులను నియమించేందుకు.. వారికి కావాల్సిన సామగ్రి ఇచ్చేందుకు కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. పారిశుధ్య పనుల్లో కాంట్రాక్టర్ల వ్యవస్థను తొలగించినప్పటికీ.. అక్రమాలు ఆగలేదని.. ముడుపులు పుచ్చుకుంటూ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్(ఎస్ఎఫ్ఏ)లను నియమిస్తున్నారని, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవే క్షించే వారే లేకుండా పోయారని బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ తదితరులు ఫిర్యాదు చేశారు. రిజిస్టర్లలోని ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండటం లేదని లంచాలు తీసుకొని హాజరు వేస్తున్నారని, అబద్ధమని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వాటిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విచారణకు మేయర్ రూలింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డిరాంబాబు, పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ.. డంపర్బిన్లు, చెత్త తరలించే వాహనాలు, రిక్షాలు తగినన్ని లేవన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) వందన్‌కుమార్ తెలిపారు. యూసీడీ తీరుపై విమర్శలు జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం పనితీరు బాగాలేదని.. దాని ద్వారా ఇస్తున్న కంప్యూటర్ శిక్షణ సర్టిఫికెట్లకు విలువే లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. సభ్యులు సుమలతారెడ్డి (టీడీపీ) అయేషా రుబీనా (ఎంఐఎం), గరిగంటి శ్రీదేవి (కాంగ్రెస్), ఉమారాణి (బీజేపీ) తదితరులు మాట్లాడుతూ.. ఈ విభాగం ద్వారా మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణనిప్పించి ఉపాధి చూపాల్సి ఉండగా.. మొక్కుబడి తంతుగా పేరులేని సంస్థలతో శిక్షణలిప్పిస్తున్నారని ఆరోపించారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు వడ్డీలేని రుణాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. డ్రైవింగ్ , గార్డు శిక్షణతోపాటు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసే వీలున్నా పట్టించుకోవడం లేదన్నారు. బంగారు తల్లి, అభయహస్తం తదితర పథకాలు అమలు జరగడం లేదని ఆరోపించారు. మహిళా భవన్లపై దుమారం మహిళలకు స్వయంఉపాధి, శిక్షణ తదితర కార్యక్రమాల కోసం డివిజన్‌కో మహిళాభవన్ ఏర్పాటు చేస్తామని బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు హామీ ఇచ్చినప్పటికీ, అమలుకు నోచుకోలేదని హేమలత(టీడీపీ) అన్నారు. దీంతో కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో డివిజన్లో రూ. 10 లక్షలతో మహిళా భవన్ల ఏర్పాటుకు అప్పటి కమిషనర్ ప్రణాళిక రూపొందించారని, వాటిల్లో కొన్ని ఏర్పాటయ్యాయని చెబుతుండగా.. టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అడ్డుతగులుతూ, ఆమె హయాంలో ఏ పనులూ జరగలేదని ఆరోపించడంతో వాదోపవాదాలు జరిగాయి. మహిళా కార్పొరేటర్లు మాట్లాడుతుండగా అడ్డు తగలడం సరికాదని.. మాజీ మేయరైన తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ కార్తీకరెడ్డి వాకౌట్ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా కార్పొరేటర్లంతా ఆమెను అనుసరించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గమనించిన మేయర్ సభకు విరామం ప్రకటించారు. విరామ సమయంలో కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ చాంబర్లో సమాలోచనలు జరిపారు. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెబితేనే సభను కొనసాగించేందుకు అంగీకరించాలనుకున్నారు. అనంతరం.. మేయర్ తదితరులు సర్దిచెప్పడంతో తమ ఆలోచన విరమించుకున్నారు. అంతకుముందు సింగిరెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమావేశం ప్రారంభమయ్యాక కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. తాను మేయర్‌గా ఉన్నప్పుడు సీఎస్సీల ఏర్పాటు, ప్లాస్టిక్బ్యాన్ తదితర పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. మహిళలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా, వారు మనస్తాపం చెందకుండా చర్యలు తీసుకోవాలని మేయర్‌ను కోరారు. స్వయం సహాయక బృందాలకు రిజిస్ట్రేషన్లే జరగలేదని, కమ్యూనిటీ ఆర్గనైజర్లు లేరని చెప్పారు. ఈ అంశాలపై అన్ని పార్టీల మహిళా కార్పొరేటర్లతో కమిటీ ఏర్పాటుచేసి.. వారి నివేదిక కనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు. -
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం
-
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశం మేయర్‌గా మాజిద్ హు్స్సేన్కు చివరిది కాగా...కమిషనర్ సోమేష్ కుమార్‌కు మొదటిది. కాగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం గతంలో ఆరు నెలలకో... తొమ్మిది నెలలకో మాత్రమే జరిగేది. ఇటీవల చట్ట సవరణ కారణంగా మూడు నెలల్లోగా తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంది. దీంతో సెప్టెంబర్ 23 తర్వాత ఈరోజు తిరిగి సమావేశమైంది. మొత్తం 14 అంశాలను ఎజెండాలో చేర్చారు. వీటన్నింటిపై అర్థవంతమైన చర్చ జరుగుతుందో...లేక ఎప్పటిలాగే రెండు, మూడు అంశాలపై మమ అనిపించనున్నారో ఈ సమావేశంలో తేలనుంది.