రోడ్ల పనులకు రూ. 75 కోట్లు | To work on the roads. 75 crore | Sakshi
Sakshi News home page

రోడ్ల పనులకు రూ. 75 కోట్లు

Published Tue, Dec 24 2013 5:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

రోడ్ల పనులకు రూ. 75 కోట్లు

రోడ్ల పనులకు రూ. 75 కోట్లు

 =పారిశుధ్య అక్రమాలపై విచారణ
 =మహిళా భవనాలపై దుమారం
 =జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం
 

సాక్షి, సిటీబ్యూరో: రోడ్ల మరమ్మతుల కోసం యుద్ధప్రాతిపదికన ఒక్కో డివిజన్‌కు రూ. 50 లక్షల చొప్పున నిధులు కేటాయించేందుకు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. వచ్చేనెల 20 లోగా పనులు చేపట్టేందుకు వీలుగా స్వల్పకాలిక టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో రహదారులకు యుద్ధప్రాతిపదికన తగినన్ని  నిధులు మం జూరు చేయాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.

మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్ హుస్సేన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. మూడునెలల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాల్సిందిగా ఆదేశించారన్నారు. ఇందుకుగాను జనవరి 20 లోగా ఒక్కో డివిజన్‌కు రూ. 50 లక్షలు మంజూరు చేయాలని కోరారు.  కొత్త సంస్కరణలు వద్దని.. పాత పద్ధతిలోనే రోడ్ల మరమ్మతుల పనులు చేయాలన్నారు. దీనికి ఎంఐఎం సభ్యులు జుల్ఫీకర్ అలీ, నజీరుద్దీన్, వాజిద్ హుస్సేన్, టీడీపీ సభ్యులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్త రామారావు, బీజేపీ సభ్యులు బం గారి ప్రకాశ్, ఆలె జితేందర్  తదితరులు సంఘీభావం తెలపడంతో డివిజన్‌కు రూ. 50 లక్షలు కేటాయించాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మేయర్ రూలింగ్ ఇచ్చారు. ఈ లెక్కన గ్రేటర్‌లోని 150 డివిజన్లకు రూ. 75 కోట్లు రోడ్ల మరమ్మతులకు ఖర్చు చేయనున్నారు.
 
ఆఫీసర్లకిది తగదు : వీహెచ్
 
మున్నెన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సమావేశం ప్రారంభం కాగానే ప్రసంగం ప్రారంభించారు. కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించడాన్ని తప్పుబట్టారు. శనివారం నాటి ఘటనను ప్రస్తావిస్తూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. అధికారులు 30 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారని, ప్రజాప్రతినిధుల గడువు ఐదేళ్లేనంటూ.. వారి ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులు.. ప్రజలకు మేము (ప్రజాప్రతినిధులు) బాధ్యత వహించా ల్సి ఉంటుందన్నారు.

జీహెచ్‌ఎంసీలో ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ.. ఏ క్షణాన్నయినా ఎన్నికలు రానున్నందున పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యల్లేవన్నారు. చిన్న పనులకు పెద్ద ప్రొసీజర్ లేకుండా వెంటనే పూర్తిచేయాలని సూచించారు. డిప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి వచ్చిన అధికారులు ఏళ్లతరబడి ఇక్కడే పాతుకుపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముషీరాబాద్‌లో మూడేళ్లుగా ఏఈ లేరని, రోడ్లపై ఎక్కడిగోతులక్కడే ఉన్నాయన్నారు. కొత్త కమిషనర్ ను జీహెచ్‌ఎంసీ పరిధి తెలిసేలోగా ఎన్నికలొచ్చేలా ఉన్నాయంటూ త్వరిత గతిన రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
 
అవసరాల కనుగుణంగా పారిశుధ్య సిబ్బంది
 
ఆయా ప్రాంతాలను బట్టి అవసరమైనంతమంది స్వీపింగ్ కార్మికులను నియమించేందుకు.. వారికి కావాల్సిన సామగ్రి ఇచ్చేందుకు కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. పారిశుధ్య పనుల్లో కాంట్రాక్టర్ల వ్యవస్థను తొలగించినప్పటికీ.. అక్రమాలు ఆగలేదని.. ముడుపులు పుచ్చుకుంటూ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్(ఎస్‌ఎఫ్‌ఏ)లను నియమిస్తున్నారని, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవే క్షించే వారే లేకుండా పోయారని బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ తదితరులు ఫిర్యాదు చేశారు.

రిజిస్టర్లలోని ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండటం లేదని లంచాలు తీసుకొని హాజరు వేస్తున్నారని, అబద్ధమని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వాటిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విచారణకు మేయర్ రూలింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డిరాంబాబు, పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ.. డంపర్‌బిన్లు, చెత్త తరలించే వాహనాలు, రిక్షాలు తగినన్ని లేవన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) వందన్‌కుమార్ తెలిపారు.
 
యూసీడీ తీరుపై విమర్శలు
 
జీహెచ్‌ఎంసీలోని యూసీడీ విభాగం పనితీరు బాగాలేదని.. దాని  ద్వారా ఇస్తున్న కంప్యూటర్  శిక్షణ సర్టిఫికెట్లకు విలువే లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. సభ్యులు సుమలతారెడ్డి (టీడీపీ) అయేషా రుబీనా (ఎంఐఎం), గరిగంటి శ్రీదేవి (కాంగ్రెస్), ఉమారాణి (బీజేపీ)  తదితరులు మాట్లాడుతూ.. ఈ విభాగం ద్వారా మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణనిప్పించి ఉపాధి చూపాల్సి ఉండగా.. మొక్కుబడి తంతుగా పేరులేని సంస్థలతో శిక్షణలిప్పిస్తున్నారని ఆరోపించారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు వడ్డీలేని రుణాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. డ్రైవింగ్ , గార్డు శిక్షణతోపాటు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసే వీలున్నా పట్టించుకోవడం లేదన్నారు. బంగారు తల్లి, అభయహస్తం తదితర పథకాలు అమలు జరగడం లేదని ఆరోపించారు.
 
మహిళా భవన్లపై దుమారం
 
మహిళలకు స్వయంఉపాధి, శిక్షణ తదితర కార్యక్రమాల కోసం డివిజన్‌కో మహిళాభవన్ ఏర్పాటు చేస్తామని బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు హామీ ఇచ్చినప్పటికీ, అమలుకు నోచుకోలేదని హేమలత(టీడీపీ) అన్నారు. దీంతో కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో డివిజన్‌లో రూ. 10 లక్షలతో మహిళా భవన్ల ఏర్పాటుకు అప్పటి కమిషనర్ ప్రణాళిక రూపొందించారని, వాటిల్లో కొన్ని ఏర్పాటయ్యాయని చెబుతుండగా.. టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అడ్డుతగులుతూ, ఆమె హయాంలో ఏ పనులూ జరగలేదని ఆరోపించడంతో వాదోపవాదాలు జరిగాయి.

మహిళా కార్పొరేటర్లు మాట్లాడుతుండగా అడ్డు తగలడం సరికాదని.. మాజీ మేయరైన తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ కార్తీకరెడ్డి వాకౌట్ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా కార్పొరేటర్లంతా ఆమెను అనుసరించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గమనించిన మేయర్ సభకు విరామం ప్రకటించారు. విరామ సమయంలో కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ చాంబర్‌లో సమాలోచనలు జరిపారు. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెబితేనే సభను కొనసాగించేందుకు అంగీకరించాలనుకున్నారు.

అనంతరం.. మేయర్ తదితరులు సర్దిచెప్పడంతో తమ ఆలోచన విరమించుకున్నారు. అంతకుముందు సింగిరెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమావేశం ప్రారంభమయ్యాక కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. తాను మేయర్‌గా ఉన్నప్పుడు సీఎస్సీల ఏర్పాటు, ప్లాస్టిక్‌బ్యాన్ తదితర పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. మహిళలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా, వారు మనస్తాపం చెందకుండా చర్యలు తీసుకోవాలని మేయర్‌ను కోరారు. స్వయం సహాయక బృందాలకు రిజిస్ట్రేషన్లే జరగలేదని, కమ్యూనిటీ ఆర్గనైజర్లు లేరని చెప్పారు. ఈ అంశాలపై అన్ని పార్టీల మహిళా కార్పొరేటర్లతో కమిటీ ఏర్పాటుచేసి.. వారి నివేదిక  కనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement