'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
హైదరాబాద్: సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులపై హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా సమ్మె విరమించకపోతే కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ తరఫున కార్మికులకు చేయాల్సినవి అన్నీ చేశామన్నారు. జీతాల పెంపు అన్నది ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిపారు. హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అయితే ఎస్మాకు భయపడబోమని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మధ్యంతర భృతిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.
ప్రైవేటు వాహనాలతో చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మాజిద్ హుస్సేన్ తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. 25 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినా వారు ఒప్పుకోలేదు.