interim relief
-
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులతో సమానంగా వారికి మధ్యంతర భృతి మంజూరు చేసింది. మూలవేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్టీవీకి భారీ ఊరట
మీడియాలో ట్రేడ్ మార్క్ వివాదంలో తెలుగు న్యూస్ ఛానల్ ఆర్టీవీకి ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ లోగో, 'R'ను వినియోగించి RTV న్యూస్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలను కోర్టు బాంబే హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించే వరకు ఆర్టీవీ న్యూస్ లోగో వినియోగంపై అత్యవసర స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ వేసిన మధ్యంతర దరఖాస్తును జస్టిస్ మనీష్ పితలే తోసిపుచ్చారు. జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, రవిప్రకాష్ నేతృత్వంలోని R TV న్యూస్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. RTV తన ట్రేడ్‌మార్క్‌ను కాపీ కొట్టి, మోసపూరితంగా వ్యవరించిందని ఆరోపించింది. ఈ ఉల్లంఘనకు గాను ఆర్టీవీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ రిపబ్లిక్ TV మాతృ సంస్థ ARG Outlier మార్చి 2023లో దావా వేసింది. తాజాగా ఈ విషయంలో రిపబ్లిక్ టీవీకి భారీ షాక్ తగిలింది. -
గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే!
గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే! -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) స్టే విధించింది. గతేడాది ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఉన్నపళంగా మూసేయడం తెలిసిందే. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినట్టు సెబీ తన విచారణలో భాగంగా తేల్చింది. మ్యూచువల్ ఫండ్స్‌విభాగాలకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కినట్టు గుర్తించింది. దీంతో ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ.512 కోట్లరూపాయల ఫీజులను, ఈ మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రెండేళ్లపాటు కొత్తగా డెట్ పథకాలను ప్రారంభించకుండా వేటు వేసింది. జరిమానాలను కూడా విధించింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) ముందు సవాలు చేసింది. వాదనలు విన్న శాట్..రూ.512 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించడం అన్నది చాలా అధిక మొత్తంగా అభిప్రాయపడింది. కనీస ఖర్చులను ఇందులో మినహాయించడం భావ్యంగా పేర్కొంది. దీంతోరూ.250 కోట్లను ఎస్క్రో ఖాతాలో మూడు వారాల్లోగా జమ చేయాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను ఆదేశించింది. ఇప్పటికీ 21 డెట్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నిర్వహిస్తుండగా.. వీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడాన్ని శాట్ పరిగణనలోకి తీసుకుంది. ఆరు పథకాలను మూసేసినందున కొత్త పథకాలను ప్రారంభించకుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసులో స్పందన దాఖలు చేయాలంటూ సెబీకి నాలుగువారాల వ్యవధినిచ్చింది. చదవండి : stockmarket : బ్యాంకుల దెబ్బ, నష్టాల్లో సూచీలు -
పెన్షనర్లకు 27 శాతం ఐఆర్
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1–07–2013 ముందుకు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ భృతి వర్తించనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ భృతి మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటి అలవెన్స్.. మరో ఏడాది పొడిగింపు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌ను మరో ఏడాది పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.. పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్ 30 శాతం మరో ఏడాది పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం జగన్ నిర్ణయంపై ఉద్యోగుల హర్షం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపు, కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దుకు సంబంధించి విధివిధానాల కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తొలి కేబినెట్ సమావేశాంలోనే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుసుకోవడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఇంత త్వరగా తమ సమస్యలు పరిష్కరిస్తారని అనుకోలేదని ఆనందం వెలిబుచ్చుతున్నారు. (చదవండి : ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ 27 శాతం పెంపు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగులు పట్ల తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్ అని, ఆయనకు ఉద్యోగులు అందరు రుణపడి ఉంటారన్నారు. కాగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపు, ఆశావర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపునకు, సామాజిక పింఛన్లను రూ.2,250 పెంపు, జనవరి 26 నుంచి అమ్మఒడి లాంటి కీలక పథకాలకు ఆమోద ముద్ర వేసింది. -
ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం
సాక్షి,అమరావతి : ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేశారు. రివ్యూ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల పేరిట ఇబ్బంది పెట్టారు. కొత్త నియామకాలు చేయకపోవడంతో ఉద్యోగులపై పని భారం రెట్టింపైంది. సమయానికి డీఏలు, ఐఆర్‌లు ఇవ్వకుండా, పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఇక్కట్లకు గురిచేశారు. బలవంతపు పదవీ విరమణ జీఓల జారీకి ప్రభుత్వం ప్రయత్నిస్తే.. ఉద్యోగ సంఘాలు వాటిపై పోరాడకుండా సర్కారుకు వత్తాసు పలికి ఉద్యోగుల్ని మోసగించాయి. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికి ఉద్యోగ వ్యతిరేక సర్కారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 శాతం ఐఆర్ ఇస్తానని చెప్పడంతో పాటు సీసీఎస్‌ను రద్దు చేస్తామంటున్నారు. ఇది ఉద్యోగులకు శుభవార్త’ అంటున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమాఖ్య కన్వీనర్ కె వెంకటరామిరెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ.. ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యాయి రాష్ట్రంలో ఉద్యోగులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. ఇప్పుడు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు రెండూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వీరిద్దరూ కుమ్మక్కయి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం సిగ్గుచేటు. మూడు డీఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? 50 సంత్సరాలకే బలవంతపు పదవీవిరమణ చేయించేలా దుర్మార్గమైన జీఓలు తయారు చేసిన ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? ఎన్నడూ లేని విధంగా పోస్టుడేటెడ్ ఐఆర్, డీఏలు ఇచ్చే ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? మా దగ్గర డబ్బులు వసూలు చేసి పనిచేయని హెల్త్‌కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మా సంక్షేమం గురించి ఆలోచిస్తుందని చెప్పాలా.? డీఏలు రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పటికి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2014 నుంచి పెండింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు డీఏలను రద్దు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 50 ఏళ్లకే బలవంతపు పదవీవిరమణ జీఓల విడుదలకు ప్రయత్నించడం ముమ్మాటికి నిజం. ఆ జీఓల విషయం లీక్ చేశారన్న నెపంతో ఇద్దరు అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఉద్యోగికి 50 సంవత్సరాలు రాగానే.. ఆ ఉద్యోగి గత 5 సంవత్సరాల పనితీరు ఆధారంగా ఉద్యోగంలో ఉంచాలా? లేదా? అనేది ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ జీఓల వల్ల ఉద్యోగం పోవడం మాట పక్కిన పెడితే వేధింపులు ఎక్కువవుతాయి. ఇలాంటి దుర్మార్గమైన జీఓలు ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాకుండా అడ్డుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకులకు ఒక సవాలు విసురుతున్నా. ధైర్యముంటే అలాంటి జీఓలు లేవని బహిరంగంగా చెప్పండి. ఎవరికీ సెంటు స్థలం ఇవ్వలేదు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగికీ స్థలం ఇవ్వలేదు. నెల క్రితం ఇళ్ల స్థలాల మంజూరులో నియమ నిబంధనలకు సంబంధించి పాలసీని మాత్రమే తయారుచేసింది. ఎప్పుడిస్తారో చెప్పలేదు. 20 ఐఆర్‌కే సన్మానాలు చేస్తున్నారు ప్రభుత్వం 20 శాతం ఐఆర్ ఇచ్చింది. దీనికే సన్మానాలు చేశారు. 2009లో 22 శాతం, 2014లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అప్పుడు ఎవరికి సన్మానాలు చేయలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం రావాలి. సీపీఎస్ రద్దు చేయడంతో పాటు, సక్రమంగా డీఏలు ఇవ్వడం, మంచి ఐఆర్ ప్రకటించి సకాలంలో పీఆర్సీ అమలు చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి. 27 శాతం ఐఆర్ హామీపై హర్షం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీనివ్వడం చాలా గొప్ప విషయం. 27 శాతం ఐఆర్ అంటే ఫిట్మెంట్ తప్పకుండా 30 శాతానికి పైగానే ఇస్తారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ హామీతో 1.8 లక్షలకు పైగా కుటుంబాలకు మంచి జరుగుతుంది. లక్ష ఉద్యోగాల్ని భర్తీ చేయాలి.. పనిభారం రెట్టింపైంది చాలా మంది ఉద్యోగులు పనివేళలతో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు. ప్రభుత్వం ఉద్యోగులపై నమ్మకంతో పనిచేయించుకోవాలని గాని బయోమెట్రిక్ పేరిట ఉద్యోగుల్ని వేధించడం సరికాదు. ఉద్యోగులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. రివ్యూ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల హడావుడితో ఉద్యోగులపై ఒత్తిడి పెడుతున్నారు. నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంలో లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులపై పని భారం రెట్టింపవుతోంది. సచివాలయంలో ఒక సెక్షన్‌కు రెండు ఏఎస్ఓ పోస్టులు అవసరం కాగా.. ప్రస్తుతం రెండు సెక్షన్లకు ఒక్క ఏఎస్ఓ మాత్రమే పనిచేస్తున్నారు. -
ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఊరట లభించింది. వీరికి సీబీఐ, ఈడీ కేసుల్లో మధ్యంతర ఊరటను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 11 వరకూ పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని పత్రాలను సమీకరించేందుకు సమయం కావాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మారిషస్ కంపెనీకి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్టవిరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారన్న సీబీఐ ఆరోపణలను నిరాధారమైనవని చిదంబరం కోర్టు ముందు పేర్కొన్నారు. కాగా దర్యాప్తుకు చిదంబరం ఎంతమాత్రం సహకరించడం లేదని ఆయన ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపిస్తూ తెలిపింది. -
పవర్ కంపెనీలకు భారీ షాక్
అలహాబాద్ హైకోర్టు పవర్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఎన్‌పీఐలపై ఆర్బీఐ చర్యలపై మధ్యంతర ఊరటనిచ్చేందుకు సోమవారం నిరాకరించింది. ఈ తీర్పుతో దాదాపు 60కిపైగా దిగ్గజ కంపెనీలను భారీగా ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను సమర్ధించిన కోర్టు ప్రధానంగా విద్యుత్ సంస్థలకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. ఆర్బీఐ మంజూరు చేసిన 180 గ్రేస్ పీరియడ్(ఆరునెలలు) నేటితో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. భారీగా రుణ పడిన సంస్థలు చెల్లింపులను ఆలస్యం చేస్తే వెంటనే చర్యల్నిప్రారంభించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకసర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. దీనిపై కొన్ని విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో దివాలా పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు (మంగళవారం) వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ డౌల్ చెప్పారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ఐబీసీ క్రింద చర్యల్ని ప్రారంభిస్తాయనీ, అలాగే కంపెనీలు స్వతంత్రంగా పై కోర్టుకు అప్పీల్ చేయవచ్చని ఆయన చెప్పారు. నిరర్దక ఆస్తుల వ్యవహారంలో ఆర్బీఐ సర్క్యులర్‌ను అనుసరించాల్సి ఉంటుందని యుకో బ్యాంకు వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులు ఇపుడు దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు.. విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు దాదాపు 1.74 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. -
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆగస్టు 1 వరకూ మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ విచారణకు సహకరించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లరాదని కోరుతూ జస్టిస్ కే పాథక్ చిదంబరానికి మధ్యంతర రిలీఫ్ కల్పించారు. తనను ఈడీ అరెస్ట్ చేస్తుందనే ఆందోళన ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం అప్పీల్లో పేర్కొనడంపై కోర్టు ఈడీ స్పందనను కోరింది. ఆగస్టు 1న ఈడీ, సీబీఐలు దాఖలు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులపై చిదంబరం ముందస్తు బెయిల్‌పై విచారణ చేపట్టేవరకూ ఈడీ ఆయనపై ఎలాంటి తీవ్ర చర్యలు చేపట్టరాదని కోర్టు కోరింది. ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చిదంబరం అప్పీల్‌ను వ్యతిరేకించారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విచారణ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో హైకోర్టును ఆశ్రయించారని మెహతా పేర్కొన్నారు. ప్రధాన కేసులో కాంగ్రెస్ నేత కస్టడీ విచారణ అవసరమని సీబీఐ చెబుతుండటంతో అరెస్ట్‌పై తమ క్లయింట్ ఆందోళన చెందుతున్నారని చిదంబరం తరపున హాజరైన న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ కోర్టుకు నివేదించారు. -
కార్తీ చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయనకు ఊరట ఇచ్చింది. మరోవైపు కార్తీ చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా నేడు విచారించనున్నారు. అవినీతి కేసులో కార్తీని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ మరో ఆరు రోజులు కస్టడీని కోరింది. మూడు రోజుల పాటు కార్తీ కస్టడీకి కోర్టు అనుమతించిన గడువు నేటితో ముగిసింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కార్తీ సీఏ ఎస్ భాస్కరరామన్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈనెల 22 వరకూ పొడిగించింది. కాగా ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ చెబుతున్నట్టు తాను సాక్ష్యాలను ఎన్నడూ ప్రభావితం చేయలేదని, డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించలేదని బెయిల్ పిటిషన్లో కార్తీ పేర్కొన్నారు.రాజకీయంగా తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి పీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా వ్యవహరించినందుకు కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. -
‘జనగణమనపై సుప్రీం ససేమిరా.. వారికి ఓకే’
ఢిల్లీ: అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అయితే, ప్రత్యేక అవసరాలుగల వారికి మాత్రం ఈ జాతీయ గీతం విషయంలో మినహాయింపునిచ్చింది. జాతీయ గీతం ప్రదర్శితమవుతున్న సమయంలో దివ్యాంగులు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పింది. కాకపోతే, ఎవరైన ప్రశ్నించినప్పుడు తమ పరిస్థితి అర్థమయ్యేలా ఏదో ఒక సంకేతం సూచిస్తే సరిపోతుందని తెలిపింది. అలాగే, కావాలంటే థియేటర్‌కు తలుపులు దగ్గరికి వేసుకోవచ్చని, అయితే, గడియ మాత్రం పెట్టొద్దని స్పష్టం చేసింది. సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మరోసారి పునఃసమీక్షించాలంటూ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, గీతం ప్రదర్శించి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కేరళలో అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్న సభ్యులు తాజాగా జాతీయ గీతం ప్రదర్శనపై పిటిషన్ వేశారు. ఈ చిత్రోత్సవానికి దాదాపు 1500మంది విదేశీయులు వస్తున్నారని, ఈ నేపథ్యంలో కొంత వెసులుబాటును ఇప్పించాలని అందులో కోరారు. అయితే, న్యాయస్థానం అందుకు ససేమిరా అంది. -
ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్‌కు ఊరట
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్కు తాత్కాలికంగా ఊరట కలిగింది. ఈ నెల 18 వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయవద్దంటూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బుధవారం నుంచి 18 వరకు ప్రతిరోజు ముంబైలోని బంగుర్నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని రాజ్సింగ్ను ఆదేశించింది. రాజ్‌సింగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో సోమవారం అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రత్యూష తల్లిదండ్రులు మొదటిసారి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాజ్సింగ్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదని అతని తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యూష మరణించిన రెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆమెతో రాజ్ సింగ్ అనుబంధాన్ని వ్యతిరేకించినవారు ఆమె తల్లిదండ్రులను ప్రభావితం చేశారని చెప్పారు. అనంతరం హైకోర్టు వారం రోజుల వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయరాదంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సంఘటనపై ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాజ్‌సింగ్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజ్సింగ్ను విచారించారు. ప్రత్యూష మృతితో రాజ్‌సింగ్ షాక్‌కు గురయ్యాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ఉన్నాడు. -
పీఆర్సీ అమలు గతేడాది నుంచే
హైదరాబాద్: పదవ వేతన సవరణ సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందోననే ఉద్యోగుల ఉత్కంఠకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఉద్యోగులకు పదవ వేతన సవరణ సంఘం సిఫార్సులు 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది. 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉద్యోగుల డీఏ, మధ్యంతర భృతి(ఐఆర్), పీఆర్సీ అమలుతోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా రెవెన్యూ వ్యయం పెరిగిందని నివేదికలో తెలియజేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో.. సీమాంధ్రకు సంబంధించి అయిన రెవెన్యూ వ్యయం రూ.50,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యయం రూ.78,977 కోట్లకు పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీతోపాటు కార్యాలయ ఖర్చులు, అద్దెలు పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. భారీ రెవెన్యూ వ్యయానికి కారణంగా ఈ దిగువ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల డీఏ, కార్యాలయ ఖర్చుల పెంపు, అద్దెలకు- రూ.8,117 కోట్లు అనివార్య ఖర్చులను ప్రణాళికేతరానికి మార్చడం- రూ.6,065 కోట్లు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు ప్రభావం- రూ.2,569 కోట్లు 2013-14 నుంచి పీఆర్సీ అమలు కారణంగా- రూ.3,111 కోట్లు మొత్తం- రూ.19,862 కోట్లు -
ఐఆర్ ఇవ్వకుంటే సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులతో సమానంగా అన్ని విభాగాల ఉద్యోగులకు 28 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లించాలని, దీనిపై ఈనెల 5లోగా నిర్ణయం తీసుకోకుంటే సమ్మె తప్పదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.భాస్కర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐఆర్ చెల్లింపునకు అంగీకారం కుదిరిందని, కేవలం పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచారని అన్నారు. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఈనెల 5లోగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీ మేరకు వేచి చూస్తామని, 7వ తేదీ నుంచి దశలవారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. 10న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, 16 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తామని భాస్కర్ చెప్పారు. -
'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
-
'సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తాం'
హైదరాబాద్: సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులపై హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా సమ్మె విరమించకపోతే కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ తరఫున కార్మికులకు చేయాల్సినవి అన్నీ చేశామన్నారు. జీతాల పెంపు అన్నది ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిపారు. హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఎస్మాకు భయపడబోమని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మధ్యంతర భృతిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాలతో చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మాజిద్ హుస్సేన్ తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. 25 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినా వారు ఒప్పుకోలేదు. -
ఐఆర్ 27 శాతం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఇంటెరిమ్ రిలీఫ్-ఐఆర్) ఎట్టకేలకు ఖరారరుు్యంది. 27 శాతం ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 7,681 కోట్ల భారం పడనుంది. 45-50 శాతం ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు తొలినుంచీ డిమాండ్ చేస్తూ వచ్చారుు. బుధవారం ఆర్థికమంత్రి వద్ద జరిగిన చర్చల్లో 32 శాతం కంటే తక్కువకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాయి. 22% ఇస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం వద్ద జరిగిన చర్చల్లో చివరకు 27% ఐఆర్‌కు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. 27 శాతానికి మించి ఇవ్వలేమని సర్కారు తేల్చి చెప్పడంతో.. ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించాయి. 2014 జనవరి నుంచి ఐఆర్ వర్తింపజేయనున్నారు. ఫిబ్రవరిలో అందుకొనే జనవరి జీతంలో ఈ మధ్యంతర భృతిని కలపనున్నారు. 2013 జూలై 1 నుంచి పదో పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. అప్పటి నుంచే ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటివరకు రెండున్నర పీఆర్సీల కాలాన్ని (12 సంవత్సరాలు) ఉద్యోగులు కోల్పోయారని, పదో పీఆర్సీ అమల్లో జాప్యం వల్ల మరోసారి అర్ధ సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నప్పటికీ ఫలితం లేకపోయింది. రూ.7,681 కోట్ల భారం: సీఎం ఐఆర్ 27 శాతం ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖాజానాపై ఏటా రూ.7,681 కోట్ల భారం పడుతుందని సీఎం తెలిపారు. చర్చల అనంతరం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, పార్థసారథి, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకు దీనివల్ల రూ.1,920 కోట్ల భారం పడుతుందన్నారు. 9.5 లక్షల మంది ఉద్యోగులు, 5.5 లక్షల మంది పెన్షనర్లకు ఐఆర్ వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. హెల్త్‌కార్డుల పథకంలో లోపాలు సవరించడానికి చర్యలు తీసుకోనున్నామని, త్వరలో స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల విషయాలపై తప్ప మిగతా అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. తనకు కేటాయించిన వాణిజ్య పన్నుల శాఖ స్వీకరించబోనని శ్రీధర్‌బాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయగా.. పత్రికా కథనాలపై స్పందించనని సీఎం సమాధానం ఇచ్చారు. శాసనసభ ఎలా జరుగుతుందో రేపు (శుక్రవారం) చూడండి అని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. టీ బిల్లు టేబుల్ అయిందా? అని అడిగిన ప్రశ్నకు.. ‘టీ టైం అయింది’ అంటూ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని ముగించారు. చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఠక్కర్, ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, డైవర్ల సంఘం అధ్యక్షుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 27% ఐఆర్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం ప్రకటించాయి. 10న ‘ఆర్టీసీ ఆర్జిత సెలవుల’ వేతనం చెల్లింపు ఆర్టీసీ కార్మికులు ఆర్జిత సెలవులను ఎన్‌క్యాష్ చేసుకోడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది. 2011కి సంబంధించిన ఆర్జిత సెలవులకు ఈ నెల 10న నగదు చెల్లించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై కార్మిక సంఘం ఎన్ఎంయూ హర్షం వ్యక్తం చేసింది. ఐఆర్‌పై ఉద్యోగ సంఘాల హర్షం ఐఆర్ 27 శాతం ఇవ్వడం సంతోషమే. వెంటనే పదో పీఆర్సీని అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి. 6 నెలల బకాయిలు రాకపోవడం అసంతృప్తి కలిగించింది. - ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి ఐఆర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆకాశాన్నంటుతున్న ధరలను తట్టుకోవడానికి ఐఆర్ సరిపోదు. వెంటనే పీఆర్సీ అమలు చేసి వేతనాలు సవరించాలి. - టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి ఐఆర్ ప్రకటించి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. పీఆర్సీ అమలుకైనా చొరవ తీసుకోవాలి. కనీసం 55 శాతం ఫిట్మెంట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. - వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు ఓబుళపతి, జాలిరెడ్డి, రమణారెడ్డి, రియాజ్ హుస్సేన్, అశోక్‌రెడ్డి, రామసుబ్బారావు, ప్రకాశ్. ఐఆర్ కొంత ఊరట కలిగిస్తుంది కానీ పూర్తిగా పరిష్కారం లభించదు. పదో పీఆర్సీ 2013 జూలై నుంచి అమలయ్యే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలి. - తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్ ఐఆర్ 27 శాతం ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పదో పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిబ్రవరి నుంచి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. - పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి పీఆర్సీ కూడా సకాలంలో అమలు చేస్తే పూర్తి సంతోషం. - తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఫిబ్రవరి నెలాఖరులోగా పదో పీఆర్సీని అమలు చేయాలి. 2013 జూలై నుంచి ఐఆర్ అమలు చేసి ఉంటే ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేది. - ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి 2013 జూలై నుంచి ఐఆర్ వర్తింపజేయకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. కనీసం రెండు నెలల బకారుులైనా చెల్లిస్తే బాగుండేది. - యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు ఐఆర్ ప్రకటనతో సరిపెట్టకుండా వెంటనే పీఆర్సీ అమలు కోసం చర్యలు చేపట్టాలి. - మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె.రాజశేఖరరెడ్డి ఐఆర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నాం. - మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు వర్మ, కృష్ణమోహన్