ప్రత్యూష బాయ్ఫ్రెండ్కు ఊరట
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్కు తాత్కాలికంగా ఊరట కలిగింది. ఈ నెల 18 వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయవద్దంటూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బుధవారం నుంచి 18 వరకు ప్రతిరోజు ముంబైలోని బంగుర్నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని రాజ్సింగ్ను ఆదేశించింది.
రాజ్సింగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో సోమవారం అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు మంగళవారం ఈ పిటిషన్ను విచారించింది. ప్రత్యూష తల్లిదండ్రులు మొదటిసారి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాజ్సింగ్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదని అతని తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యూష మరణించిన రెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆమెతో రాజ్ సింగ్ అనుబంధాన్ని వ్యతిరేకించినవారు ఆమె తల్లిదండ్రులను ప్రభావితం చేశారని చెప్పారు. అనంతరం హైకోర్టు వారం రోజుల వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయరాదంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సంఘటనపై ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాజ్సింగ్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజ్సింగ్ను విచారించారు. ప్రత్యూష మృతితో రాజ్సింగ్ షాక్కు గురయ్యాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ఉన్నాడు.