Pratyusha Banerjee
-
'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు'
Pratyusha Banerjees Father About Sidharth Shukla : బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతి అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. తాజాగా దివంగత నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ శుక్లాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'సిద్ధార్థ్‌ను నేను నా కొడుకులా భావించాను. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)సీరియల్ టైం నుంచి సిద్ధార్థ్, ప్రత్యూష మంచి స్నేహితులు. అయితే నా కూతురు చనిపోయాక సిద్ధార్థ్-ప్రత్యూషల గురించి మీడియాలో ఏవేవో వార్తలు రాసేవారు. దీంతో తను మా ఇంటికి రావడం మానేశాడు. కానీ నాతో ఫోన్లో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మా బాగోగుల గురంచి అడిగి కనుక్కునేవాడు. లాక్డౌన్ టైంలో కూడా తరుచూ వాట్సాప్‌లో నాతో టచ్‌లో ఉండేవాడు. అంకుల్,ఆంటీ..మీరు బాగున్నారా? మీకు ఏదైనా సహాయం కావాలా? నేను మీకు ఏదైనా సహాయడగలనా అంటూ తరుచూ మమ్మల్ని అడిగేవాడు. వద్దన్నా బలవంతంగా ప్రతీ నెల 20వేల రూపాయలు పంపేవాడు. అతని మరణం సడెన్ షాక్‌లా అనిపిస్తుంది' అంటూ సిద్ధార్థ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలికా వధు సీరియల్లో ప్రత్యూష బెనర్జీ, సిద్ధార్థ్ శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించి స్టార్స్‌గా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ 24 ఏళ్ల వయసులోనే ప్రత్యూష బెనర్జీ కన్నుమూసింది. 2016లో ప్రియుడితో వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ప్రచారంలో ఉంది. ఇటీవలె బామ్మగా అలరించిన సురేఖ సిఖ్రి కన్నుమూయగా, ఇప్పుడు సిద్ధార్థ్ మరణం తీరని విషాదాన్ని నింపింది. చదవండి: సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్ సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్ -
మా కుమార్తె చనిపోయాక చేతిలో చిల్లిగవ్వ లేదు: నటి తల్లిదండ్రులు
బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రత్యూష తల్లిదండ్రులు రాహుల్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తె మరణం తర్వాత అన్నీ పొగొట్టుకున్నామని.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రత్యూష తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ రూమ్ ఉన్న ఇంటికి మారామని.. రోజు వారి జీవితం గడవడం కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మా కుమార్తె మరణం తర్వాత ఓ పెద్ద భయంకరమైన తుపాను వచ్చి.. మా సర్వస్వం లాక్కెళ్లింది. మా దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఈ కేసు పోరాటంలో భాగంగా మేం సర్వస్వం కోల్పోయాం. నేను చైల్డ్ కేర్ సెంటర్లో పని చేస్తుండగా.. నా భర్త కథలు రాస్తూ.. పొట్ట పోసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఒక్క గదిలో నివసిస్తున్నాం’’ అని ప్రత్యూష తల్లి తెలిపారు. ప్రత్యూష బెనర్జీ 2016 లో తన ముంబై అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణం వెనుక ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్, నటుడు రాహుల్ రాజ్ సింగ్ పాత్ర ఉందని ఆరోపించారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ మూడు నెలల్లో బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం రాహుల్, నటి సలోని శర్మను వివాహం చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను గతం నుంచి బయటపడాలని భావించాను. ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో అయ్యింది. ఇప్పటికి సంతోషం కోసం పోరాడుతున్నాను. ఈ పరిస్థితులన్నింటిని నేను తట్టుకుని నిలబడటానికి నా కుటుంబ సభ్యులు, భార్య మద్దతు ఎంతో ఉంది. వారు నా బాధను అర్థం చేసుకుని.. నాకు అండగా నిలబడ్డారు’’ అని తెలిపాడు. -
డేటింగ్ గురించి చెప్పేందుకు ఇదా సరైన సమయం?!
దివంగత నటి, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ప్రత్యూష బెనర్జీ తాను ప్రేమించుకున్నామని నిర్మాత వికాస్ గుప్తా వెల్లడించాడు. తన గురించి ఎవరో చెడుగా చెప్తే ఆమె నమ్మేసిందని, అలా తమకిద్దరికీ బ్రేకప్ అయిందని తాజా ఇంటర్వ్యూలో వివరించాడు. చెప్పుడుమాటలు నమ్మినందుకు ఆమె మీద విపరీతమైన కోపం పెంచుకున్నానని, ఎక్కడైనా కనిపించినా చూపు తిప్పుకుని తనెవరో తెలియనట్లే వెళ్లిపోయానన్నాడు. అలా తమ మధ్య డేటింగ్ కొన్నాళ్లపాటే సాగిందన్నాడు. నిజానికి ఆమెంటే తనకెంతో ఇష్టమని, తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నానని తెలిపాడు. తాను బైసెక్సువల్ అన్న విషయం విడిపోయాక ఆమెకు తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూపై ప్రత్యూష క్లోజ్ ఫ్రెండ్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కామ్య పంజాబీ ఫైర్ అయింది. "అతడు చెప్పింది నిజమా? కాదా? అన్నది నిర్ధారించేందుకు ప్రత్యూష మన మధ్య లేదు. వికాస్ ఇప్పుడెందుకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు? ఓహ్ ఫేమస్ కావడానికా! ఇలాంటి విధానాలను నేను అస్సలు మెచ్చుకోను. ఎందుకంటే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు ఆమె ఈ లోకంలో లేదు" అని చెప్పుకొచ్చింది. చదవండి: సీక్వెల్ సినిమాలో 'జాతిరత్నాలు' హీరోయిన్ సందడి! -
కర్మ వారిద్దరిని శిక్షిస్తుంది: నటుడు
ప్రత్యూష బెనర్జీ గుర్తుందా.. ‘బాలికా వధు’ సీరియల్లో మొదట యుక్త వయసు ఆనంది పాత్రలో నటించింది. ఈ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2016లో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చనిపోయే నాటికే ప్రత్యూష రెండు నెలల గర్భవతి అని తెలిసింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లనే నటి ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. అతడిపై కేసు కూడా నమోదయ్యింది. మూడు నెలల తర్వాత రాహుల్ రాజ్‌కి బాంబే హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం అతడు నటి సలోని శర్మని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియా రాహుల్‌ని ఇంటర్వ్యూ చేసింది. పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ప్రత్యూషని కోల్పోయిన బాధ నుంచి బయటకు వస్తున్నానని.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘‘నా జీవితంలో గతంలో చోటు చేసుకున్న విషాదం, సంతోషకర క్షణాల నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. జీవితాంతం బాధపడుతూ ఉండాలని ఎవరూ భావించారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాను. ప్రస్తుతం నేను జీవితంలో అత్యంత దుర్భర క్షణాలను దాటుకుని వచ్చాను. ఇలాంటి సమయంలో పిల్లలను కనాలనుకోవడం సరైంది కాదని నా అభిప్రాయం. ఇక కుటుంబ సభ్యులు, నా భార్య సలోని ప్రతి ఒక్కరు నన్ను నమ్మారు.. నాకు మద్దతుగా నిలిచారు. నా జీవితంలో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లో వారు నాకు అండగా నిలిచారు’’ అని తెలిపాడు రాహుల్ రాజ్. ‘‘ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో కన్నా దారుణంగా తయారైంది. ప్రతి ఒక్కరు నన్ను దోషిలా చూస్తున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. జీవితం చీకటి అయ్యింది. కానీ నేను పోరాడుతున్నాను. సంతోషంగా జీవించాలనుకుంటున్నాను. పరిస్థితులతో.. సమస్యలతో చాలా గట్టిగా పోరాడుతున్నాను. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, నా భార్య మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అన్నాడు. కర్మ వారిని శిక్షిస్తుంది ‘‘ప్రత్యూష మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో పాటు కామ్య పంజాబీ, వికాస్ గుప్తా నాపై ఆరోపణలు చేశారు. ప్రత్యూష తల్లిదండ్రుల మీద నాకు ఎలాంటి కోపం లేదు. తమ కుమార్తెని కొల్పోయిన బాధలో వారు నన్ను అవమానించారు. దీన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ కామ్య పంజాబీ, వికాస్ గుప్తా అలా కాదు. కావాలనే వారు నాపై అబద్దపు ఆరోపణలు చేశారు. ప్రత్యూషపై నేను చేయి చేసుకున్నానని.. అది అందరూ చూస్తుండగా అని చెప్పారు. కానీ ఇది పచ్చి అబద్దం. ఇలా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను వారిని ఏం చేయలేకపోవచ్చు. కానీ కర్మ అంటూ ఒకటి ఉంటుంది.. అది అందర్ని శిక్షిస్తుంది. ఇప్పటికే వికాస్ ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అని’’ తెలిపాడు. చదవండి: గువ్వల్ని మింగుతున్న గద్దలు నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్ -
గువ్వల్ని మింగుతున్న గద్దలు
చిట్టి గువ్వలు ఎన్నో ఊళ్ల నుంచి కలల రెక్కలను అల్లార్చి ఎగిరి వస్తాయి. తెలియని నగరంలోతెలియని మనుషుల్ని నమ్మి ఆడతాయి. పాడతాయి. ప్రతిభ చూపి పైకి ఎగరాలనుకుంటాయి. కాని ఊరి గువ్వలంటే గద్దలకు లోకువ. అవి వెంటబడతాయి. వేధిస్తాయి. గువ్వలు కట్టుకుంటున్న గూళ్లను కూలదోస్తాయి. గతంలో నటి భార్గవి విషయంలో అయినా ఇప్పుడు శ్రావణి విషయంలో అయినా జరుగుతున్నది ఇదే. బహుపరాక్... బహుపరాక్. ఏ రంగంలో అయినా మార్గదర్శులు అవసరం. సినిమా పరిశ్రమలో మరీ అవసరం. పెద్ద కుటుంబాల నుంచి పెద్ద ఊళ్ల నుంచి పెద్ద చదువులు చదువుకొని వచ్చిన వారికి ఇవన్నీ కొంత సులువుగా దొరుకుతాయి. చిన్న ఊళ్ల నుంచి వచ్చినవాళ్లకు ఏ ఆధారమూ దొరకనప్పుడు తాడైనా పామైనా పట్టుకోక తప్పదు. ఇలాంటి వారికి ముందు ఆశ్రయం ఇచ్చినవారే తరువాత విరోధులుగా మారడం, ఈ మార్గదర్శులనుకునే వారితోనే తీవ్రమైన సమస్యలు రావడం సినిమా పరిశ్రమ నిండా ఉంది. అయినప్పటికీ కొత్తగా వస్తున్న స్ట్రగులర్స్ గుడ్డిగానే ఉంటున్నారు సమస్యలు తెచ్చుకుంటున్నారు. కంగనా రనౌత్ నుంచి నటి కంగనా రనౌత్ కూడా తల్లిదండ్రులను ఎదిరించి హిమాచల్ ప్రదేశ్‌లోని చిన్న ఊరి నుంచి ముంబై చేరుకుంది. మొదట ఆమెకు ముంబైలో ఆశ్రయం ఇచ్చింది నటుడు ఆదిత్యాపంచోలి కుటుంబం. కంగనా కు అవకాశాలు రావడానికి ఆదిత్యా పలుకుబడి కొంత ఉపయోగపడింది. ఆ తర్వాత కంగనా అతని పట్టు నుంచి బయటపడటానికి చాలా పెనుగులాడాల్సి వచ్చిందని ఆమే చెప్పుకుంది. ఆదిత్యా పంచోలి తనపై భౌతిక దాడి చేశాడని కూడా చెప్పుకుంది. అయితే అప్పటికే ఆమె సినిమా రంగంలో ఎలా మెలగాలో తెలుసుకోవడం వల్ల నిలబడగలిగింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి పేరు ప్రముఖంగా వచ్చింది. దీనికి ముందు నటి మహిమా చౌదరి కూడా కొండ ప్రాంతం డార్జిలింగ్ నుంచి బాలీవుడ్ కలలు కంటూ ముంబై చేరుకుంది. దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈమెకు తొలి అవకాశం ‘పర్దేశ్’ లో ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆమె కెరీర్ పట్ల శాసనకర్తగా మారడంతో మహిమా చౌదరి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ప్రెస్‌కు ఎక్కి చెప్పింది. ఇటీవల కూడా ఆమె సుభాష్ ఘాయ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు వచ్చినప్పటికీ ఈ డిస్ట్రబెన్స్ వల్ల మహిమా చౌదరి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఈ మార్గదర్శుల వల్ల వచ్చే విలోమ ఫలితం ఏమిటంటే వీరు అవకాశాలు కల్పిస్తారు అని మిగిలినవారు ఇవ్వరు. ఆ మార్గదర్శులంటే పడనివారూ ఇవ్వరు. రామ్‌గోపాల్ వర్మతో ఎక్కువ సినిమాలు చేసిన ‘ఆంత్రా మాలి’ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఆమె సినిమాల నుంచి విరమించుకుంది. లౌక్యంలో చిక్కుకుని తెలుగు ప్రాంతాల నుంచి ముఖ్యంగా చిన్న ఊళ్ల నుంచి వచ్చిన వారికి సినిమా పరిశ్రమలో సరైన మార్గదర్శులు దొరకడం ముఖ్య సమస్య. బాలీవుడ్లో దీని కోసం కన్సల్టెంట్లు ఉంటారు. ఏజెన్సీలు ఉంటాయి. తెలుగులో ‘మేనేజర్లు’, ‘డేట్స్ చూసేవారు’ ఉంటారు. లేదా ‘స్నేహితులు’ ఉంటారు. వీరు ఇండస్ట్రీలోని అనుభవజ్ఞులైతే కెరీర్ ఒక విధానంలో నడుస్తుంది. వీరూ కొత్తవారై వీరూ అగమ్యగోచరంగా ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. చాలా కథలు ఎలా ఉంటాయంటే ‘నా వల్ల పైకి వచ్చావు. పైకి రాగానే నన్ను వదిలించుకుంటున్నావు’ అనేలా ఉంటుంది. ఇవతలి పక్షానికేమో ‘నీ వల్ల పైకి వచ్చాను నిజమే. ఇప్పుడు నా మీద పడి బతుకుతూ నన్ను పంజరంలో పెట్టాలని చూస్తున్నావు’ అన్నట్టు ఉంటుంది. మనం ఎంచుకున్న రంగంలో పైకి రావాలంటే ‘నలుగురితో లౌక్యంగా’ ఉండాలి అనుకోవడం మరో సమస్యగా మారుతోంది. అందరితో మంచిగా, స్నేహంగా మాట్లాడిన వెంటనే దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని జీవితాల్లో చొరబడే పరిస్థితికి వస్తోంది. ఆ తర్వాత ప్రమాదాల వరకూ వెళుతోంది. భార్గవి/శ్రావణి 2008లో ఆత్మహత్య చేసుకున్న ‘అష్టాచెమ్మా’ ఫేమ్ భార్గవి, ఇప్పుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి చిన్నఊళ్ల నుంచి వచ్చినవారే. భార్గవి సొంతఊరు గుంటూరు జిల్లా గోరంట్ల. ఆమెకు సినిమా రంగంలో వెలగాలని కలలు కంది. అందుకు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ (బుజ్జి)ను మార్గదర్శిగా ఎంచుకుంది. ఆర్కెస్ట్రా నడుపుతూ సినీ పరిచయాలు కలిగిన ప్రవీణ్ భార్గవికి అవకాశాలు రావడానికి ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు. ఈలోపు వారిరువురూ ప్రేమలో పడ్డారని అంటారు. ‘అష్టాచెమ్మా’ హిట్ అయ్యాక భార్గవి కెరీర్ ఊపందుకుంది. అది ప్రవీణ్ కు ఇన్సెక్యూరిటీ కలిగించింది. 2008 డిసెంబర్లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్న భార్గవి భవిష్యత్తు అలా ముగిసింది. ఇప్పుడు శ్రావణి కథ కూడా అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి మంచి భవిష్యత్తును ఊహించుకుంటూ హైదరాబాద్ చేరుకున్న శ్రావణికి సాయి, దేవరాజ్ అనే మిత్రులే మార్గదర్శులు అయ్యారు. కెరీర్లో ముందుకు వెళ్లే కొద్దీ వీరిరువురి మధ్య ఆమె నలిగినట్టుగా ఇప్పటి వరకూ వస్తున్న వార్తల వల్ల తెలుస్తోంది. ఒక సినిమా నిర్మాత పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఈ వొత్తిళ్లలో, వలయాల్లో ఉన్నారో తెలియదు. హత్య–ఆత్మహత్య– బ్లాక్మెయిల్ వర్క్ రిలేషన్స్గాని వ్యక్తిగత రిలేషన్స్గాని ఏర్పరుచుకోవడం, విరమించుకోవడంలో తగిన మెచ్యూరిటీ లేకపోవడం, వాటినెలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల రిలేషన్స్ ‘వద్దు’ అనుకున్నప్పుడు ‘హత్య’, ‘ఆత్మహత్య’, ‘బ్లాక్మెయిల్’ వంటి పదాలు తారసపడుతున్నాయి. ఇవన్నీ లేకుండా కూడా విడిపోయి ఎవరి పని వారు చేసుకోవచ్చు. ప్రతిదానికి ఈ కొత్త టెక్నాలజీ ఒకటి మంచితోపాటు చెడ్డకూ ఉపయోగపడుతోంది. ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్‌లు ఆ సమయానికి బాగున్నా ఆ తర్వాత నరకాన్ని సృష్టిస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు టీవీ రంగంలో అయినా సినిమా రంగంలో అయినా వెళ్లి చెప్పుకునే విభాగాలు ఉండాలి. సరైన పెద్దలు ఉండాలి. పోలీసు విభాగంలో కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వారి కోసం కౌన్సిలింగ్ సెంటర్ అవసరం గట్టిగా కనపడుతోంది. మరో శ్రావణి ఉదంతం జరక్కూడదంటే ఏం చేయాలో అందరూ ఆలోచించాలి. అప్రమత్తంగా కావాలి. – సాక్షి ఫ్యామిలీ (ఇన్పుట్స్: సినిమా డెస్క్) ప్రత్యూష బెనర్జీ గుర్తుందా? ప్రత్యూష బెనర్జీ ‘చిన్నారి పెళ్లి కూతురు’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం. కెరీర్లో పైకొస్తుండగా 25 ఏళ్లకే 2016 ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ అని పోలీసుల కథనం. చనిపోయే ముందు రాహుల్‌తో ప్రత్యూష ఫోన్లో మాట్లాడిన సంభాషణను పోలీసులు సేకరించారు. కేసు న్యాయవిచారణలో ఉంది. ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి నటి శ్రావణి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. కారణం ఏంటంటే 12 ఏళ్ల క్రితం నేను దర్శకత్వం వహించిన ‘అష్టాచమ్మా’ చిత్రంలో అద్భుతంగా నటించిన భార్గవి కూడా ఇలానే వ్యక్తిగత కారణాల వల్ల మరణించింది. చిన్న చిన్న ఊర్లనుండి, టౌన్లనుండి ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన ఆడపిల్లలు ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఉచ్చుల్లో బిగుసుకుపోతున్నారు? దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇదే కెరీర్‌గా ఎన్నుకుని సినిమా పరిశ్రమకు వచ్చేవారికి ఈ పరిశ్రమపై నమ్మకాన్ని పెంచే విధంగా మనం చర్యలు చేపట్టాలి. వాళ్లకు వచ్చిన సమస్యలను చెప్పుకుని, దానికి పరిష్కారం ఇప్పించే ఒక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. సినీరంగానికి సంబంధించినవారు, సామాజిక విశ్లేషకులు తీవ్రంగా ఆలోచించి ఏదో ఒక వ్యవస్థను ముందుకు తీసుకురావాలి. ఆ వ్యవస్థ ఏర్పాటయ్యేవరకూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నా. – దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శ్రావణి చాలా సిన్సియర్ శ్రావణి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియగానే షాక్ అయ్యాను. ఆమె వర్క్ విషయంలో చాలా సిన్సియర్‌గా, హానెస్ట్‌గా ఉండేది. షూటింగ్‌కి టైమ్‌కి కరెక్ట్‌గా వచ్చేది. ఎప్పుడూ జోవియల్‌గా ఉంటూ అందరితో కలివిడిగా ఉండేది. నటీనటులు కొంచెం ఎమోషనల్‌గా ఉంటారు, కానీ శ్రావణి బాగా ప్రాక్టికల్‌గా ఉండేది. అలా ఉండే అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవటం బాధ కలిగించింది. ఈ జనరేషన్ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రేమ సమస్య అవ్వొచ్చు, మరో సమస్య అవ్వొచ్చు... అవేమీ జీవితం కంటే పెద్దవి కాదనేది వాళ్లు గమనించాలి. జీవితాన్ని ముగించే ముందు విచక్షణతో ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. – దర్శకుడు మలినేని రాధాకృష్ణ, ‘మౌనరాగం’ దర్శకుడు -
ఆ నటి ఆత్మకు శాంతి చేకూరదు!
సాక్షి, ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మకు శాంతి చేకూరదని నటి కామ్య పంజాబీ, నటుడు వికాస్ గుప్తా అన్నారు. ఆమె చనిపోయి రెండేళ్లు పూర్తయినా నిందితులకు శిక్ష పడక పోవడంపై బిగ్ బాస్ 11 ఫైనలిస్ట్ వికాస్, కామ్య పంజాబీ విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, ప్రత్యూష మృతి కేసులో దోషులకు ఇప్పటికైనా శిక్ష పడాలన్నారు. ప్రత్యూష రెండో వర్దంతి సందర్భంగా ఈ నటీనటులు తమ ఆవేదనను షేర్ చేసుకున్నారు. మరికొన్ని రోజులైతే ప్రత్యూష ఎవరూ అనే ప్రశ్నలు తలెత్తుతాయని, నిందితులకు శిక్ష పడకముందే ఈ నటిని అందరూ మరిచిపోయే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. రెండేళ్లు పూర్తయింది, కానీ ఎలాంటి చర్యలు లేవు. అయినా ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కామ్య పంజాబీ. నేను ఇష్టపడే ఓ మంచి వ్యక్తిని కోల్పోయాను. ఇప్పటికే రెండుళ్లు గడిచిపోయాయి. ఇంకా రోజులు గడుస్తుంటే అందరూ ప్రత్యూషను మరిచిపోతారేమో. నీ మృతి నాకు జీవితం విలువను నేర్పిందని వికాస్ గుప్తా ట్వీట్ చేశారు. ప్రత్యూష మృతికి కారకులైన వాళ్లను శిక్షించేవరకూ ఆమె ఆత్మకు శాంతి చేకూరదన్నారు. కాగా, 2016 ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతికి ప్రియుడు రాజ్సింగే కారణమని ప్రత్యూష కుటుంబీకులు ఫిర్యాదు చేయగా గతంలో ఓసారి అదుపులోకి ముంబై పోలీసులు విచారణ జరిపారు. రెండేళ్లు గడిచినా సెలబ్రిటీ మృతి కేసులోనే న్యాయం జరగలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కామ్య పంజాబీ, వికాస్ గుప్తా ప్రశ్నిస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ రాహుల్!
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. మద్యం తాగి వాహనాన్ని నడుపుతుండగా అతన్ని పోలీసులు బుక్ చేశారు. శనివారం రాత్రి ముంబైలోని శాంటాక్రజ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రాహుల్ వాహనం నడుపుతూ వచ్చాడు. అతని వెంట మాజీ ప్రియురాలు సలోని శర్మ కూడా ఉంది. అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని శాంటాక్రజ్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే, ఈ సమయంలో అతని వెంట సలోని శర్మ పోలీసులపై బెదిరింపులకు దిగినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. తమను విడిచిపెట్టకుంటే పైఅధికారులకు ఫిర్యాదు చేసి.. మీకు తగిన శాస్తి చేస్తామని ఆమె హెచ్చరించిందని వివరించారు. 'బాలికా వధు' సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు రాహుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మాజీ ప్రియురాలు సలోనీ శర్మ కూడా ఈ కేసులో తన పాత్రపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. -
మరో వివాదంలో ప్రత్యూష మాజీ బాయ్‌ఫ్రెండ్
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. 21 ఏళ్ల మోడల్‌ను లైంగికంగా వేధించినట్టు రాహుల్‌పై అంబోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి అంధేరిలోని ఓ పబ్ బయట రాహుల్.. మోడల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. రాహుల్ తన గాళ్‌ఫ్రెండ్‌తో కలసి పార్టీకి వెళ్లగా, మోడల్ తన ఫ్రెండ్ అయిన నిర్మాతతో కలిసి వచ్చింది. ఇరు వర్గాల మధ్య పాత శత్రుత్వం ఉందని, గొడవకు ఇదే కారణమని పోలీసులు చెప్పారు. కాగా తనపై ఫిర్యాదు చేసినవారిపై రాహుల్ కూడా ఫిర్యాదు చేశాడు. రాహుల్, అతని గాళ్ ఫ్రెండ్.. మోడల్, ఆమె బాయ్‌ఫ్రెండ్ దూషించుకోవడంతో పాటు కొట్టుకున్నారు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహుల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. -
'నాకు క్యారెక్టర్ లేదని ముద్ర వేశారు'
ముంబై: ఆత్మహత్య చేసుకున్న హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తో జరిపిన చివరి ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ ను సోమవారం కోర్టుకు సమర్పించారు. రాహుల్ ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మూడున్నర నిమిషాలు నిడివున్న ఈ ఆడియోను న్యాయస్థానం వింది. ఏప్రిల్ 1న ఆత్మహత్మకు గంట ముందు రాహుల్ తో ప్రత్యూష మాట్లాడింది. ఆడియోలో ఇలా ఉంది ప్రత్యూష: నన్ను క్యారెక్టర్ లేనిదానిలా ముద్రవేశారు. చంపుతామని నాకు బెదింపు కాల్స్ వస్తున్నాయి. మా అమ్మనాన్నలను కూడా ఫోన్లో బెదిరిస్తున్నారు. నాకు జీవితంలో ఇంకేం మిగిలిందిప్పుడు? రాహుల్: ఇవేమి పెద్ద విషయాలు కాదు ప్రత్యూష: రాహుల్ నీ ఈగోను పక్కనపెట్టు. ఇవేమి పెద్ద విషయాలు కాదని ఎలా చెబుతావు ప్రత్యూష మాట్లాడుతుండగానే రాహుల్ రాజ్ సింగ్ ఫోన్ కట్ చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన మరో ఫోన్ సంభాషణ ఆడియోను 'మిడ్-డే' పత్రిక మంగళవారం వెల్లడించింది. దీంట్లో సంభాషణ ఇలా కొనసాగింది. ప్రత్యూష: నువ్వు మోసగాడివి. నన్ను వంచించావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను విడదీశావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. రాహుల్: ఏమైంది. నేను ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను. ఇంటికి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చే వరకు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకు. -
'రాహుల్ చూడు.. ఇప్పుడేం చేస్తానో'
ఏప్రిల్ 1న తాను ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందు టీవీనటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కు ఫోన్ చేసింది. దాదాపు 201 సెకన్ల నిడివితో ఉన్న ఈ టెలిఫోనిక్ సంభాషణలో పలు కీలక విషయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో ఈ సంభాషణ ఆడియో క్లిప్పును వినాలని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి మృదుల భట్కర్ నిర్ణయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మృదుల సోమవారం ప్రధాన నిందితుడు రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కీలకంగా భావిస్తున్న ప్రత్యూష-రాహుల్ చివరి ఫోన్ కాల్ లో ఏం మాట్లాడారు. ఆ ఆడియోక్లిప్పులో ఏముంది. తదితర అంశాలను తాజాగా ముంబైకి చెందిన 'మిడ్-డే' టాబ్లాయిడ్ ప్రచురించింది. ఆడియో క్లిప్ సంభాషణ ప్రత్యూష: నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో.. రాహుల్: ఏమైంది. నేను ఇంటికొచ్చాక నీతో మాట్లాడుతాను. నేను దారిలో ఉన్నాను. నేను ఇంటికొచ్చేవరకు ఏమీ చేయకు. ప్రత్యూషను ఆత్మహత్యకు పూరికొల్పినట్టు ప్రాథమిక ఆధారాలు లేనందున రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రాహుల్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను సెషన్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 'బాలికా వధు' సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బెనర్జీ మృతికి రాహులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
చనిపోతున్నానని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పిందా?
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ నటి, 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో సోమవారం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదుల భట్కర్ వాదనలు విన్నారు. చనిపోయేరోజున ప్రత్యూష తన ప్రియుడు రాహుల్ రాజ్ కు చేసిన చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌ను వినాలని న్యాయమూర్తి నిర్ణయించారు. చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌లో పలు కీలకమైన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఈ ఫోన్‌కాల్‌లోనే ప్రత్యూష రాహుల్‌కు చెప్పిందని ఆమె లాయర్ చెప్తున్నారు. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న బాంగుర్ నగర్ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను అందుకున్నారు. ఈ నివేదికలో కీలక అంశాలు వెలుగుచూశాయి. చనిపోయేరోజున 24 ఏళ్ల ప్రత్యూష మద్యం మత్తులో ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. ప్రత్యూష చాలా అప్పులు చేసిందని, అప్పులవారి బాధ నుంచి తప్పించుకునేందుకు తరచూ మద్యం తాగేదని సన్నిహితులు చెప్తున్నారు. ప్రియుడు రాహుల్ రాజ్‌తోనూ తనకు సత్సంబంధాలు లేకపోవడం, తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె ఆత్మహత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తన ఆత్మహత్యకు ముందురోజు రాహుల్, ప్రత్యూష తన స్నేహితులకు పార్టీ ఇచ్చారని, ఈ పార్టీకి వారి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా చనిపోయేరోజున మధ్యాహ్నం బాగా మద్యం తాగుతుండటంతో ప్రత్యూషను రాహుల్ తిట్టాడని, సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహుల్‌రాజ్‌కు బొంబాయి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యూష మృతి వ్యవహారంలో తాను అమాయకుడినని రాహుల్ చెప్తున్నాడు. -
ఆ రోజు ఏం జరిగిందంటే..
ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యకు సంబంధించి రోజు రోజుకి పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన రోజున ఏం జరిగిందనే విషయాన్ని తొలిసారి వెల్లడించాడు. 'ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి నేను, ప్రత్యూష, మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకరు.. ముగ్గురం కలిసి ఫ్లాట్‌లోనే పార్టీ చేసుకున్నాం. రాత్రంతా చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఉదయం 8.30 వరకు మా చిట్ చాట్ కొనసాగింది. ఆ రోజుకి బయటే తిందామని డిసైడ్ అయ్యాం. ఆ పూట ఇంట్లోనే వంట చేసుకుని ఉంటే అసలు ఇలా జరిగి ఉండేది కాదేమో. నేను నిద్ర లేచేటప్పటికే ప్రత్యూష స్నానం చేసి మళ్లీ తాగుతూ కూర్చుంది. దాంతో మా ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా జరిగింది. ఆమె ఇటీవల తాగుడికి బానిసయ్యింది. తాగడం తగ్గించాలని నేను ఇంతకుముందు కూడా మందలించాను. అయినా వినిపించుకోకుండా అదేపనిగా తాగుతుండటంతో మండిపడ్డాను. తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిపోయాను' అంటూ ఏప్రిల్ 1న జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు రాహుల్. కాసేపటి తర్వాత తిరిగి ఫ్లాట్‌కు చేరుకున్న రాహుల్.. ఎంతసేపు తలుపు తట్టినా ప్రత్యూష తలుపు తీయకపోయేసరికి ఇతరుల సాయంతో లోపలికి ప్రవేశించడం, అక్కడ ఆమె ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఉండటం చూసినట్టు తెలిపాడు. హుటాహుటిన ఆమెను కిందికి దించి ముఖంపై నీళ్లు చల్లి, నోటి ద్వారా ఊపిరందించే ప్రయత్నం చేశానన్నాడు. ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేసరికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రత్యూష మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించడం జరిగిందన్నాడు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించానని తెలిపాడు. అనంతరం హాస్పిటల్ నుంచి ఎందుకు తప్పించుకున్నారని ప్రశ్నించగా.. ఆమెను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించానని, ఘటన జరిగిన వెంటనే ప్రత్యూష సంబంధీకులకు సమాచారం అందించానని రాహుల్ చెప్పాడు. అయితే ఆమె ఇక లేదని తెలిశాక షాక్‌కు గురయ్యానని, మీడియా ప్రశ్నలకు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయానని అన్నాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాహుల్ పేర్కొన్నాడు. కాగా ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఆమె గర్భస్రావానికి పాల్పడిందని రిపోర్టుల్లో తేలగా.. రాహుల్ ఈ విషయమై స్పందించాడు. అబార్షన్ కోసం తాను బలవంతం చేయలేదని, పరస్పర అంగీకారంతోనే ఆమె అబార్షన్ చేయించుకుందని తెలిపాడు. ఆ సమయంలో ప్రత్యూషతోపాటు తాను కూడా హాస్పిటల్ కు వెళ్లినట్లు చెప్పాడు. నవంబర్‌లో వివాహం చేసుకోవాలని అనుకున్న క్రమంలో భవిష్యత్ దృష్ట్యా ఆ నిర్ణయం తప్పలేదని చెప్పుకొచ్చాడు. -
ప్రత్యూష అబార్షన్ చేయించుకుందా?
చిన్నారి పెళ్లికూతురుగా టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య చేసుకోడానికి ముందు.. ఆమె అబార్షన్ చేయించుకుందట! ఈ విషయాన్ని జేజే ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఏప్రిల్ 2వ తేదీన ఆత్మహత్య చేసుకోడానికి కొద్దిరోజుల ముందే ఆమెకు అబార్షన్ అయిందని అంటున్నారు. ఆమె గర్భాశయం కణజాలాలను పరిశీలించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసు మొత్తం మరో కొత్త మలుపు తిరిగింది. ఆమె చనిపోవడానికి కొన్ని రోజులు లేదా.. ఒక నెల ముందుగా ఆమె గర్భంలోని శిశువు మరణించిందని కేసు దర్యాప్తు చేస్తున్న వర్గాలు తెలిపాయి. కావాలని అబార్షన్ చేయించుకోవడం లేదా గర్భం పోవడం వల్ల కలిగే పరిణామాలు ఆమె గర్భాశయంలో కనిపించాయి. దీనివల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ కూడా సోకి, దానికి చికిత్స కూడా చేయించుకున్నట్లు తెలిసింది. (చదవండి... టీవీ నటి ప్రత్యూష కేసులో మరో మిస్టరీ) అయితే.. ఇలాంటి సందర్భాల్లో మృతశిశువుకు తండ్రి ఎవరన్న విషయాన్ని నిర్ధారించడం మాత్రం అంత సులభం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. గర్భాశయం లోపల పిండానికి సంబంధించిన కణాలు ఏమీ లేకపోవడంతో డీఎన్ఏ పరీక్ష చేయడం కూడా సాధ్యం కాదని అన్నారు. నటుడు, నిర్మాత అయిన రాహుల్ రాజ్సింగ్తో ప్రత్యూషకు బ్రేకప్ కావడం, వారిద్దరి మధ్య గొడవలు జరగడం లాంటివి తెలిసిందే. (చదవండి - పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష) ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను తాము వెల్లడించలేమని, నివేదికను పోలీసులకు అందించామని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే తెలిపారు. ప్రత్యూష మరణానికి కారణమేంటో తెలుసుకోడానికి చాలా విభాగాలు ప్రయత్నిస్తున్నాయని, మెడచుట్టూ బిగుసుకుపోవడం, ఊపిరి ఆడకపోవడం వల్లే ఆమె మరణించినట్లు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. ఒకవేళ ఉరికి ముందు ఆమె విషప్రయోగానికి గురైందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కూడా పరీక్షలు జరుగుతున్నాయి. ఆమె గోళ్లు, జుట్టు, రక్త నమూనాలను డీఎన్ఏ పరీక్ష కోసం భద్రపరిచారు. -
'నేను ఆమెకు అన్యాయం చేయలేదు'
ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ను పోలీసులు మరోసారి ప్రశ్నించారు. మానసిక అనారోగ్యానికి గురైన కారణంగా రాహుల్‌ను ప్రస్తుతం అరెస్ట్ చేయకుండానే విచారణ కొనసాగించాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు హాజరైన రాహుల్‌ను గంటపాటు ప్రశ్నించారు. 'నేను అమాయకుడిని, ప్రత్యూషకు ఎటువంటి అన్యాయం చేయలేదు' అంటూ రాహుల్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ సారి పోలీసులు ప్రత్యూష బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించారు. 'ఆమె ఆర్థికపరమైన సమస్యల్లో ఉంది. ఈ విషయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి.. అయితే అది ఏ బంధంలోనైనా సాధారణమైన విషయమే కదా' అంటూ రాహుల్ బదులిచ్చాడు. ఇక స్టేషన్ బయట మీడియాతో మాట్లాడుతూ.. 'నేనిప్పుడిప్పుడే కోలుకుంటున్నాను, గతం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు నేనే మీ ముందుకొచ్చి మాట్లాడతాను, నిజానిజాలు తప్పకుండా బయటపడతాయి' అంటూ అక్కడి నుంచి తిరిగి హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. కాగా ప్రత్యూష తండ్రి.. రాహుల్ కు చికిత్స అందిస్తున్న శ్రీసాయి హాస్పిటల్ మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. డబ్బు తీసుకుని అక్కడి వైద్యులు రాహుల్ ని పరోక్షంగా కాపాడుతున్నారని తెలిపారు. -
'మా అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ బెదిరిస్తున్నాడు'
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జి బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ తమను బెదిరిస్తున్నాడని ఆమె తల్లి సోమా బెనర్జీ ఆరోపించింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహులే కారణమని, ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసింది. 'రాహుల్ మా అమ్మాయి ప్రత్యూషను మోసం చేయడమే కాదు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమయ్యాడు. అతను అమాయికులైన కొందరు యువతులను మోసం చేసి డబ్బు తీసుకున్నాడు' అని సోమా మీడియా సమావేశంలో చెప్పింది. ఈ కేసును ముంబైలోని బంగుర్ నగర్ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలేదని ఆరోపించింది. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి వీలుగా నిందితుడిని స్వేచ్ఛగా వదిలేశారని చెప్పింది. రాహుల్ తమతో పాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నాడని సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రిని కోరింది. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్‌కు ఊరట
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్కు తాత్కాలికంగా ఊరట కలిగింది. ఈ నెల 18 వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయవద్దంటూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బుధవారం నుంచి 18 వరకు ప్రతిరోజు ముంబైలోని బంగుర్నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని రాజ్సింగ్ను ఆదేశించింది. రాజ్‌సింగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో సోమవారం అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రత్యూష తల్లిదండ్రులు మొదటిసారి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాజ్సింగ్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదని అతని తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యూష మరణించిన రెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆమెతో రాజ్ సింగ్ అనుబంధాన్ని వ్యతిరేకించినవారు ఆమె తల్లిదండ్రులను ప్రభావితం చేశారని చెప్పారు. అనంతరం హైకోర్టు వారం రోజుల వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయరాదంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సంఘటనపై ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాజ్‌సింగ్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజ్సింగ్ను విచారించారు. ప్రత్యూష మృతితో రాజ్‌సింగ్ షాక్‌కు గురయ్యాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ఉన్నాడు. -
పని లేదని బాధపడొద్దు
తగినంత పని చేతిలో లేకపోయినా పెద్దగా బాధపడొద్దని నటీనటులను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కోరాడు. టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ మృతిపట్ల ఆయన తన సంతాపం తెలిపారు. 'ఫ్యాన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్‌ను ఈ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి షారుక్ సమాధానమిచ్చారు. ''మీరు అడుగుపెట్టిన రంగంలో తగినంత విజయం రాకపోయినా నిరాశపడొద్దు. ప్రతివాళ్లకు మంచిరోజులు, చెడ్డరోజులు వస్తుంటాయి. చెడ్డ రోజుల గురించి ఆలోచిస్తూ బాధపడటం అనవసరం. మీకు పని చేతనైతే ఈరోజు కాకపోతే రేపు మీకు వచ్చి తీరుతుంది. మీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీలో సత్తా ఉండబట్టే ఇక్కడివరకు వచ్చారు. ఇప్పటికే ఈ రంగంలో స్థిరపడ్డారు కాబట్టి పని ఎందుకు దొరకదు? ఒకటి రెండు రోజులు దొరక్కపోయినా మీరు ఆందోళన చెందొద్దు'' అని సలహా ఇచ్చారు. అనవసరంగా బాధపడినంత మాత్రాన ప్రయోజనం ఉండదని అన్నారు. టాలెంట్ ఉంటే పని అదే దొరుకుతుందని, దాని మీద విశ్వాసం ఉంచాలని చెప్పారు. బాలికా వధు సీరియల్‌తో తారాపథానికి వెళ్లిన ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యతో టీవీ పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. -
పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష
ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. తన ఇంట్లో పనిచేసే మహిళ రేణు సిన్హా నుంచి అప్పుడప్పుడు కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకునేదని వెల్లడయ్యింది. ప్రత్యూష, రాహుల్‌ల మధ్య సంబంధం గురించి పలు విషయాలను రేణు సిన్హా వెల్లడించింది. మూడు నెలలుగా ప్రత్యూష ఇంట్లో తాను పని చేస్తున్నానని రేణు సిన్హా చెప్పింది. అప్పుడప్పుడు ప్రత్యూష క్యాబ్ చార్జీల కోసం, మందుల కోసం తన దగ్గర తక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటుండేదని తెలిపింది. ఆర్థిక పరమైన విషయాలన్నీ రాహుల్ చేతిలో ఉండేవని, ఆమె వద్ద ఖర్చుల నిమిత్తం కూడా పెద్దగా డబ్బు ఉండేది కాదని రేణు చెప్పింది. అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయాల్లో వారి గది నుంచి అరుపులు వినబడుతుండేవని.. తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారని ఆమె తెలిపింది. చాలాసార్లు వారిని అడ్డుకోవాలని భావించానని.. అయితే వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదనే ఆలోచనతో ఆగిపోయేదాన్నని తెలిపింది. రాహుల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాక గొడవ గురించి తనతో చెప్పేదని.. ఎప్పుడూ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ సతాయించేవాడని.. రాహుల్ చేతిలో ప్రత్యూష దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేసుకుంది. సినిమా, షాపింగ్ లాంటి చిన్న చిన్న కోరికలకు కూడా రాహుల్ ఆమెకు ఆంక్షలు విధించేవాడని రేణు చెబుతోంది. అతని మాజీ గాళ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి దుర్భాషలాడుతుండేదని.. అయినా రాహుల్ తో ప్రత్యూష బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుందని చెప్పింది. కానీ రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వాయిదా వేసేవాడని దీంతో ఆమె మానసికంగా కుంగిపోయేదని తెలిపింది. కాగా ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
టీవీ నటి ప్రత్యూష కేసులో మరో మిస్టరీ
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి కేసు విచారణలో మరో అంశం వెలుగు చూసింది. గతేడాది నవంబర్ నుంచి మార్చి వరకు ప్రత్యూష బ్యాంక్ ఎకౌంట్ నుంచి 24 లక్షల రూపాయలు విత్ డ్రా చేసినట్టు ముంబైలోని బంగుర్ నగర్ పోలీసులు గుర్తించారు. కాగా ఈ డబ్బు ఎవరు తీశారన్నది మిస్టరీగా మారింది. ప్రత్యూష కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆమె ఎకౌంట్లో డబ్బులు లేవని, ఈ డబ్బు ఎవరు తీశారో తమకు తెలియదని చెప్పినట్టు పోలీసు వర్గాలు చెప్పాయి. ప్రత్యూష బ్యాంక్ ఎకౌంట్ వివరాలను పరిశీలించిన పోలీసులు డబ్బు మాయమైన విషయాన్ని గుర్తించారు. ఈ డబ్బును ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ విత్ డ్రా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యూష రియాల్టీ షోల్లో పాల్గొనడం ద్వారా ఈ డబ్బును సంపాదించింది. ప్రత్యూష ఇతర బ్యాంక్ ఎకౌంట్ల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సందేహాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌పై కేసు నమోదు చేశారు. ప్రత్యూష మరణించాక షాక్‌కు గురైన రాహుల్ ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇదివరకే రాహుల్‌ను అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా ప్రశ్నించారు. రాహుల్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసేందుకోసం అతని ఆరోగ్య పరిస్థితి గురించి అభిప్రాయం కోరుతూ వైద్య నివేదికలను జేజే ఆస్పత్రికి పంపారు. జేజే ఆస్పత్రి వైద్యుల నివేదికను బట్టి అతడిని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. -
ప్రత్యూషది హత్య కేసు అయ్యే అవకాశం?
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతికేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ముంబై కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రాహుల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ప్రత్యూష కుటుంబం తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ప్రత్యూష కేసు హత్యకేసు అయ్యే అవకాశముందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని జడ్జికి విజ్ఞప్తి చేశారు. దీంతో బెయిల్ ఇవ్వడం లేదంటూ జడ్జి కేఎఫ్ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు. బెయిల్ కోసం ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ప్రత్యూషది నూటికి నూరుపాళ్లు హత్యేనని, ఈ కేసులో రాహుల్‌ను తీవ్రంగా శిక్షించాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినట్టు రాహుల్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ గతంలో కూడా పలువురు మహిళలను మోసం చేసినట్టు తెలుస్తోంది. అతడు తమను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడని టీవీ పరిశ్రమకు చెందిన హీర్ పటేల్, కేశా కంభాటితోపాటు మరో మహిళ ఆరోపించారు. రాహుల్ వలలో చిక్కి మోసపోయిన మహిళలు డజను వరకు ఉంటారని వారు చెప్పారు. -
ప్రత్యూష ఎఫ్ఐఆర్ లో సంచలన అంశాలు!
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న రాహుల్ డిశ్చార్జ్ అయిన వెంటనే అతన్ని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పడం, ఆమెపై దాడి చేయడం, బెదిరించడం వంటి అభియోగాలతో పోలీసులు అతనిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ కేసు ఎఫ్ఐఆర్ లోనూ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రత్యూష తల్లిదండ్రులు సోమ, శంకర్ బెనర్జీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రాహుల్ కు సంబంధించి పలు విషయాలు తెలిపారు. ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం.. ప్రత్యూష టీవీ నటిగా ప్రాచుర్యం పొంది.. బాగా సంపాదిస్తున్న తర్వాతే రాహుల్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అంతకుముందే అతనికి గత సంబంధాల వల్ల తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. 'రాహుల్ తన ఆస్తుల గురించి ప్రత్యూషకు అబద్ధాలు చెప్పాడు. అతను తనకు ముంబైలో నాలుగు ఫ్లాట్లు, సొంతూరిలో 150 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. తన తల్లి ఎమ్మెల్యే అని నమ్మబలికాడు. అలా ప్రత్యూష జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను కలువకుండా ఆమెను అడ్డుకున్నాడు. మొబైల్ ఫోన్ కూడా వినియోగించనివ్వలేదు. ప్రత్యూష పాత సంబంధాలను గుర్తుచేసి ఆమెను తిట్టేవాడు. కొట్టేవాడు. ఒకప్పుడు వారు నివసించిన కాందివ్లి హౌస్ లో గట్టిగా అరుపులు వినిపించేవని, రాహుల్ కొట్టినప్పుడల్లా ప్రత్యూష బాధతో అరిచేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు' అని ఆమె తల్లిదండ్రలు పోలీసులకు వివరించారు. రాహుల్ చేసిన అప్పులు పెరిగిపోయి ఇంటి అద్దె కూడా కట్టడం కష్టమైపోయిందని, దీంతో ఆర్థిక కష్టాలు కూడా వారిని చుట్టుముట్టాయని తెలిపారు. తాము మొదట తమ కూతురితో ముంబైలోనే ఉండేవాళ్లమని, తల్లిదండ్రులతో ఉంటే నిన్ను వదిలేస్తానని రాహుల్ హెచ్చరించడంతో ఆమె రాహుల్ తోనే ఉండటం ప్రారంభించిందని చెప్పారు. రాహుల్ తనను హింసిస్తున్నాడని ప్రత్యూష తన అంకుల్ దీపాంకుర్, ఆయన భార్యకు గత జనవరిలో చెప్పిందని, రాహుల్ వల్ల తన కాలిపై జరిగిన గాయాన్ని కూడా వారికి చూపిందని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష ఆత్మహత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఆమె తల్లి సోమతోపాటు మరో 12 మంది వాంగ్మూలం కూడా సేకరించాలని భావిస్తున్నారు. ఆమె స్నేహితులు, ఆమె నివాసం సెక్యూరిటీ గార్డ్స్, ప్రత్యూష ఫ్లాట్ తాళం తెరిచేందుకు రాహుల్ పిలిపించిన తాళంచెవి తయారీదారు, ప్రత్యూష భౌతికకాయాన్ని మొదట చూసిన వారి ఇంటి వంట మనిషి తదితరుల నుంచి సాక్ష్యాలను సేకరించాలని వారు భావిస్తున్నారు. -
టీవీ నటి ఆత్మహత్య; ప్రియుడిపై కేసు
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు రోజుల తర్వాత ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు అతడిపై అభియోగాలు మోపారు. ప్రత్యూష కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రకటనలను ఆధారంగా చేసుకుని ముంబై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఛాతీలో నొప్పి, లో బీపీ, కుంగుబాటు కారణాలతో ఆదివారం రాహుల్ ఆస్పత్రిలో చేరాడు. అతడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించినట్టు రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. ప్రొడక్షన్ కంపెనీ నడుపుతున్న రాహుల్ ను ప్రత్యూష పెళ్లి చేసుకోవాలనుకుందని వీరి స్నేహితులు వెల్లడించారు. బెంగాలీ నూతన సంవత్సరాది రోజైన ఈ నెల 14న వారు పెళ్లి చేసుకోడానికి సిద్ధమయినట్లు చెప్పారు. కాగా, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఆమె తల్లిదండ్రుల కోసం రూ. 50 లక్షల అప్పు తీసుకుందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఆమె ఒత్తిడికి గురయ్యేదన్నారు. ఆమెకు అప్పుడప్పుడు రూ. పది వేల చొప్పున డబ్బులు పంపేవాడినని అన్నారు. ఈ విషయాలన్నిటిపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. -
ప్రత్యూష బెనర్జిది మూర్ఖమైన పని!
ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్ అలనాటి కథనాయిక హేమామాలిని చికాకు పరిచినట్టు ఉంది. ఆమె ఆత్మహత్య మూర్ఖమైనదని హేమ అభిప్రాయపడింది. చేజేతులా ప్రాణాలు తీసుకొనే ఇలాంటి ధోరణి ఎంతమాత్రం సబబు కాదంటూ కొన్ని పరుషమైన వ్యాఖ్యలు ఆమె ట్విట్టర్లో చేసింది. 'అన్ని మూర్ఖమైన ఆత్మహత్యలే. వాటివల్ల ఏమీ జరుగదు. జీవితం దేవుడు ఇచ్చిన కానుక. అది జీవించేందుకు ఉంది కానీ మనకు నచ్చినప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ప్రాణాలు తీసుకొనే హక్కు మనకు లేదు' అని హేమామాలిని పేర్కొంది. 'కష్టాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంతేకానీ ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోకూడదు. ప్రపంచం పోరాడేవారినే కీర్తిస్తుంది. కానీ పరాజితులను కాదు' అని తెలిపింది. 'సెలబ్రిటీ ఆత్మహత్యలు ఆకలిగొన్న మీడియాకు ఆహారంలాంటింది. మరో సెన్సేషనల్ వార్త వచ్చేవారకు దానిని ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత మరిచిపోతుంది' అని హేమ పేర్కొంది. -
'ప్రత్యూష ప్రవర్తనలో మార్పు వచ్చింది'
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ, ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ పలుమార్లు గొడవపడినట్టు సన్నిహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. ఇద్దరికీ విబేధాలు రావడంతో నిత్యం గొడవపడేవారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సాయపడ్డానని ప్రత్యూష తల్లి సోమా చెప్పింది. ముంబై బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 'ప్రత్యూషకు, రాహుల్‌కు విబేధాలు వచ్చాక ఇద్దరూ విడిపోయారు. గొడవపడటం మానుకుని కెరీర్‌పై దృష్టిసారించాలని ఇద్దరికీ చెప్పాను' అని సోమా పోలీసులకు చెప్పింది. ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తనకు తెలియదని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసులను కోరింది. రాహుల్‌తో నిరంతరం గొడవపడటం వల్ల ప్రత్యూష ప్రవర్తనలో మార్పు వచ్చిందని సోమా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రత్యూష్ చనిపోయేముందు ముంబైలోని కండివిలి ఫ్లాట్‌లో ఉండగా, తల్లిదండ్రులు అంబర్‌నాథ్‌లో నివాసం ఉంటున్నారు. ప్రత్యూష, రాహుల్‌ల జాయింట్ బ్యాంక్ ఎకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరి కాల్ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. కాగా ప్రత్యూష మరణించే సమయానికి రెండు నెలల గర్భవతి అని వచ్చిన వార్తలు అవాస్తవమని ఆమె సన్నిహితురాలు ఫాల్గుణి ఖండించారు. ఏప్రిల్ 1న ప్రత్యూష తన ఫ్లాట్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
ఆస్పత్రిలో ప్రత్యూష ఫ్రెండ్
ప్రత్యూష గర్భవతి అని అనుమానాలు ముంబై: బుల్లితెర నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది నీరజ్ గుప్తా తెలిపారు. అతను ఛాతీలో నొప్పి, లో బీపీ, కుంగుబాటు కారణంగా స్థానిక ఆస్పత్రిలో చేరారని, చాలా బలహీనంగా ఉన్న ఆయనను ఐసీయూలో ఉంచారని చెప్పారు. కాగా, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే రాహుల్ కారణంగానే ఆమె ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష గర్భవతా..?: చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భవతి అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైద్యులు ఇచ్చిన రిపోర్టులో పేర్కొనలేదని విచారణాధికారి తెలిపారు. ఆమె పోస్ట్‌మార్టమ్ రిపోర్టు నెల రోజుల్లో రానుందని, అది వస్తే అందులో ఆమె గర్భవతా కాదా అనేది తేలుతుందన్నారు. ప్రత్యూష, రాహుల్ జంటకు స్నేహితులైన పలువురు చెబుతున్న దాని ప్రకారం బెంగాలీ నూతన సంవత్సరాది రోజైన ఈ నెల 14న వారు పెళ్లి చేసుకోడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఆమె తల్లిదండ్రుల కోసం రూ. 50 లక్షల అప్పు తీసుకుందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఆమె ఒత్తిడికి గురయ్యేదన్నారు. ఆమెకు అప్పుడప్పుడు రూ. పది వేల చొప్పున డబ్బులు పంపేవాడినని అన్నారు.