ఆ రోజు ఏం జరిగిందంటే..
ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యకు సంబంధించి రోజు రోజుకి పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఓ ప్రముఖ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన రోజున ఏం జరిగిందనే విషయాన్ని తొలిసారి వెల్లడించాడు.
'ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి నేను, ప్రత్యూష, మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకరు.. ముగ్గురం కలిసి ఫ్లాట్లోనే పార్టీ చేసుకున్నాం. రాత్రంతా చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఉదయం 8.30 వరకు మా చిట్ చాట్ కొనసాగింది. ఆ రోజుకి బయటే తిందామని డిసైడ్ అయ్యాం. ఆ పూట ఇంట్లోనే వంట చేసుకుని ఉంటే అసలు ఇలా జరిగి ఉండేది కాదేమో. నేను నిద్ర లేచేటప్పటికే ప్రత్యూష స్నానం చేసి మళ్లీ తాగుతూ కూర్చుంది. దాంతో మా ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా జరిగింది. ఆమె ఇటీవల తాగుడికి బానిసయ్యింది. తాగడం తగ్గించాలని నేను ఇంతకుముందు కూడా మందలించాను. అయినా వినిపించుకోకుండా అదేపనిగా తాగుతుండటంతో మండిపడ్డాను. తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిపోయాను' అంటూ ఏప్రిల్ 1న జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు రాహుల్.
కాసేపటి తర్వాత తిరిగి ఫ్లాట్కు చేరుకున్న రాహుల్.. ఎంతసేపు తలుపు తట్టినా ప్రత్యూష తలుపు తీయకపోయేసరికి ఇతరుల సాయంతో లోపలికి ప్రవేశించడం, అక్కడ ఆమె ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఉండటం చూసినట్టు తెలిపాడు. హుటాహుటిన ఆమెను కిందికి దించి ముఖంపై నీళ్లు చల్లి, నోటి ద్వారా ఊపిరందించే ప్రయత్నం చేశానన్నాడు. ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేసరికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రత్యూష మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించడం జరిగిందన్నాడు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించానని తెలిపాడు.
అనంతరం హాస్పిటల్ నుంచి ఎందుకు తప్పించుకున్నారని ప్రశ్నించగా.. ఆమెను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించానని, ఘటన జరిగిన వెంటనే ప్రత్యూష సంబంధీకులకు సమాచారం అందించానని రాహుల్ చెప్పాడు. అయితే ఆమె ఇక లేదని తెలిశాక షాక్కు గురయ్యానని, మీడియా ప్రశ్నలకు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయానని అన్నాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాహుల్ పేర్కొన్నాడు.
కాగా ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఆమె గర్భస్రావానికి పాల్పడిందని రిపోర్టుల్లో తేలగా.. రాహుల్ ఈ విషయమై స్పందించాడు. అబార్షన్ కోసం తాను బలవంతం చేయలేదని, పరస్పర అంగీకారంతోనే ఆమె అబార్షన్ చేయించుకుందని తెలిపాడు. ఆ సమయంలో ప్రత్యూషతోపాటు తాను కూడా హాస్పిటల్ కు వెళ్లినట్లు చెప్పాడు. నవంబర్లో వివాహం చేసుకోవాలని అనుకున్న క్రమంలో భవిష్యత్ దృష్ట్యా ఆ నిర్ణయం తప్పలేదని చెప్పుకొచ్చాడు.