భయపడ్డాను.. అందుకే చెప్పలేదు!
టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి వ్యవహారంలో అనేక కథనాలు తెరపైకి వస్తున్నాయి. అనుమనాస్పద పరిస్థితుల నడుమ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో ఉన్న అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, ఆమె మృతికి ప్రియుడు రాహులే కారణమని కథనాలు వస్తున్నాయి.
ప్రతిక్షణం ఓ కొత్త కథనం తెరపైకి వస్తున్న ఈ మిస్టరీ డెత్ కేసులో పోలీసులు ప్రత్యూష ప్రియుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఒక రహస్య ప్రదేశంలోని అతడిని ముంబై పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ మృతికేసులో అతని ప్రమేయముందనే వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులకు అతడు తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తాను ఇంటినుంచి వెళ్లేటప్పుడు ప్రత్యూష బాగానే ఉందని, కానీ సాయంత్రం 4 గంటలకు వచ్చి చూస్తే సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించిందని అతడు పోలీసులకు తెలిపాడు.
'డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో మేం ఉండేవాళ్లం. మా వద్ద రెండు తాళం చెవిలు ఉండేవి. అందులో ఒకటి నా దగ్గర మరొకటి ప్రత్యూష దగ్గర ఉండేది. సాయంత్రం నేను ఇంట్లోకి రాగానే తను ఉరేసుకొని కనిపించింది. నేను భయపడ్డాను. ఇరుగుపొరుగువారిని పిలిచి.. వారి సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించాను. తను బతికే ఉందని మేం అనుకున్నాం, కానీ చనిపోయింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చేందుకు నేను భయపడ్డాను. ఆస్పత్రి అధికారులే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వైద్యులు ప్రత్యూష చనిపోయినట్టు నిర్ధారించిన తర్వాత ఆమె కుటుంబసభ్యులకు, సన్నిహిత మిత్రులకు ఫోన్ చేసి చెప్పాను' అని రాహుల్ సింగ్ పోలీసులకు వాంగ్మూలమిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, అతనికి విరుద్ధంగా ఇంకా కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు అతన్ని అధికారికంగా కస్టడీలోకి తీసుకోలేదు.