తల్లిదండ్రులతో ప్రత్యూష బెనర్జీ (ఫైల్ ఫోటో)
బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రత్యూష తల్లిదండ్రులు రాహుల్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తె మరణం తర్వాత అన్నీ పొగొట్టుకున్నామని.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రత్యూష తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ రూమ్ ఉన్న ఇంటికి మారామని.. రోజు వారి జీవితం గడవడం కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మా కుమార్తె మరణం తర్వాత ఓ పెద్ద భయంకరమైన తుపాను వచ్చి.. మా సర్వస్వం లాక్కెళ్లింది. మా దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఈ కేసు పోరాటంలో భాగంగా మేం సర్వస్వం కోల్పోయాం. నేను చైల్డ్ కేర్ సెంటర్‌లో పని చేస్తుండగా.. నా భర్త కథలు రాస్తూ.. పొట్ట పోసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఒక్క గదిలో నివసిస్తున్నాం’’ అని ప్రత్యూష తల్లి తెలిపారు.
ప్రత్యూష బెనర్జీ 2016 లో తన ముంబై అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణం వెనుక ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్, నటుడు రాహుల్ రాజ్ సింగ్ పాత్ర ఉందని ఆరోపించారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ మూడు నెలల్లో బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం రాహుల్, నటి సలోని శర్మను వివాహం చేసుకున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను గతం నుంచి బయటపడాలని భావించాను. ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో అయ్యింది. ఇప్పటికి సంతోషం కోసం పోరాడుతున్నాను. ఈ పరిస్థితులన్నింటిని నేను తట్టుకుని నిలబడటానికి నా కుటుంబ సభ్యులు, భార్య మద్దతు ఎంతో ఉంది. వారు నా బాధను అర్థం చేసుకుని.. నాకు అండగా నిలబడ్డారు’’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment