financial struggles
-
Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో క్రికెట్ దిగ్గజం
మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్లైన్లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్ స్వయంగా ధృవీకరించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సమావేశమైన ఛాపెల్ స్నేహితులు.. ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన. ‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని అన్నారాయన. ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. -
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
నెల్లూరు సిటీ: ‘అతను ఓ టీవీ షోలో డ్యాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. మంచి పేరు వచ్చింది. కానీ సంపాదనలో మాత్రం వెనుకబడ్డాడు. కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమి చేయలేకపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను ఆత్మహత్యే శరణ్యం అనుకుని నిర్ణయించుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.’ ఆదివారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళేనికి చెందిన సుబ్బారావు, లక్ష్మి రాజ్యం దంపతులకు సి.చైతన్య (31), వినీల అనే పిల్లలున్నారు. చైతన్య హైదరాబాద్‌లో ఉంటూ ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని టౌన్హాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అనంతరం నగరంలోని దర్గామిట్లలో ఉన్న నెల్లూరు క్లబ్లో గది తీసుకున్నాడు. చైతన్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ‘అమ్మా, నాన్న, చెల్లి ఐ లవ్ యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివలేదు. చెల్లీ ఫీల్ కావద్దు. నువ్వంటే చాలా ఇష్టం. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కుదరలేదు. అప్పులు అవుతాం. తీర్చుకునే సత్తా ఉండాలి. తీర్చగలను కానీ అంతా తీర్చ లేకపోతున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా. చాలా ప్రయత్నిస్తున్నా. కావట్లేదు. ఢీ పేరు ఇస్తుంది. కానీ సంపాదన తక్కువ ఇస్తుంది. జబర్దస్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ’ అని ఆ వీడియోలో ఉంది. కాగా చైతన్య స్నేహితులు వీడియో చూసి నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు చైతన్య ఉంటున్న గది వద్దకు చేరుకుని తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అప్పటికే అతను ఉరేసుకుని ఉన్నాడు. దీంతో ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రికి పోలీసులు సమాచారం అందించారు. మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షాకింగ్ ఘటన: ఊహకే అందని ఫోన్ కాల్...కంగుతిన్న పోలీసులు
ఇంత వరకు మనం క్షణికావేశంలో హతమార్చడం లేదా తప్పుడూ నిర్ణయాలు తీసుకుని చనిపోవడం విని ఉంటాం. ఒక వేళ హత్య చేసిన ఆ తర్వాత భయంతో పోలీసులకు లొంగిపోవడం వంటివి కూడా చూశాం. కానీ నేనే చంపేశా రండి అరెస్టు చేయండి అంటూ పోలీసులకే ఫోన్ కాల్ చేయడం గురించి ఇంత వరకు విని ఉండ లేదు కదా. ఇక్కడొక వ్యక్తి డైరెక్టగా పోలీసులకే అసలు విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలవడంతో.. ఒక్కసారిగా ఇది నిజమా? కాదా! అన్నంతగా షాక్ అయ్యారు పోలీసులు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి పోలీసులకు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసి నా భార్యను చంపేశానంటూ పోలీసులకు కాల్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..యోగేశ్ కుమార్ అనే వ్యక్తి సుశీల్ గార్డెన్లో ఉన్న తన ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని పోలీసులకు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. సదరు నిందితుడు చెప్పిన సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. అక్కడ నిందితుడి భార్య అర్చన నేలపై విగత జీవిగా పడి ఉంది. దీంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు నిందితుడు యోగేశ్ కుమార్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని పోలీసులు అన్నారు. దీంతో అతడి భార్య అర్చన తనకు తెలిసిన వారి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఈ విషయమై ఆదివారం ఆ జంట గొడపడ్డారని, ఆ తర్వాత యోగేశ్ కోపంతో తన భార్య అర్చనను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్‌కి లేని అభ్యంతరాలు మీకెందుకు?) -
మా కుమార్తె చనిపోయాక చేతిలో చిల్లిగవ్వ లేదు: నటి తల్లిదండ్రులు
బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రత్యూష తల్లిదండ్రులు రాహుల్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తె మరణం తర్వాత అన్నీ పొగొట్టుకున్నామని.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రత్యూష తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ రూమ్ ఉన్న ఇంటికి మారామని.. రోజు వారి జీవితం గడవడం కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మా కుమార్తె మరణం తర్వాత ఓ పెద్ద భయంకరమైన తుపాను వచ్చి.. మా సర్వస్వం లాక్కెళ్లింది. మా దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఈ కేసు పోరాటంలో భాగంగా మేం సర్వస్వం కోల్పోయాం. నేను చైల్డ్ కేర్ సెంటర్లో పని చేస్తుండగా.. నా భర్త కథలు రాస్తూ.. పొట్ట పోసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఒక్క గదిలో నివసిస్తున్నాం’’ అని ప్రత్యూష తల్లి తెలిపారు. ప్రత్యూష బెనర్జీ 2016 లో తన ముంబై అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణం వెనుక ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్, నటుడు రాహుల్ రాజ్ సింగ్ పాత్ర ఉందని ఆరోపించారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ మూడు నెలల్లో బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం రాహుల్, నటి సలోని శర్మను వివాహం చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను గతం నుంచి బయటపడాలని భావించాను. ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో అయ్యింది. ఇప్పటికి సంతోషం కోసం పోరాడుతున్నాను. ఈ పరిస్థితులన్నింటిని నేను తట్టుకుని నిలబడటానికి నా కుటుంబ సభ్యులు, భార్య మద్దతు ఎంతో ఉంది. వారు నా బాధను అర్థం చేసుకుని.. నాకు అండగా నిలబడ్డారు’’ అని తెలిపాడు. -
క్రికెటర్లకేంటీ దుస్థితి.. ఒకరేమో కార్పెంటర్‌గా మరొకరేమో క్యాబ్ డ్రైవర్‌గా
న్యూఢిల్లీ: క్రీడల చరిత్రలో ఫుట్‌బాల్ తర్వాత అత్యధికంగా కాసుల కురిపించే ఆటగా చలామణి అవుతున్న క్రికెట్లో కొందరు మాజీలు ఆర్ధిక కష్టాల కారణంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేవియర్ డోహర్టీ కార్పెంటర్‌గా పని చేసుకుంటున్న విషయం వెలుగు చూడగా, తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ దయనీయ స్థితి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 2015 వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న డోహర్టీ ఆర్థిక కష్టాల కారణంగా కార్పెంటర్ అవతారమెత్తాడు. లెఫ్టార్మ్ స్పిన్నరయిన డోహర్టీ.. ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడి 55 వికెట్లు తీశాడు. 2001-02 సీజన్లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆయన.. 17 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగాడు. అతను చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇక ఆర్ధిక ఇబ్బందులు తాలలేక క్యాబ్ డ్రైవర్‌గా మారిన అర్షద్ ఖాన్‌ది కూడా అంతర్జాతీయ క్రికెట్లో భారీ నేపథ్యమే. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. భారత్ 2005 పాక్ పర్యటనలో అదరగొట్టిన అర్షద్.. దిగ్గజ ఆటగాళ్లైన సెహ్వాగ్, సచిన్ వికెట్లను తీసి, అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అయితే, రిటైర్మెంట్ అనంతరం గడ్డు పరిస్థితులు ఎదురవ్వడంతో క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. కుటుంబాన్ని పోషించేందుకు సిడ్నీలో నానా తంటాలు పడుతున్నాడు. ఇక అర్షద్ తన చివరి టెస్ట్, వన్డేను భారత్‌లోనే ఆడాడు. మొత్తంగా ఆర్ధిక కష్టాల కారణంగా దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్న అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల జాబితా చాలా పెద్దగానే ఉంది. శ్రీలంక ఆటగాడు సూరజ్ రణ్దీవ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు మాథ్యూ సింక్లెయిర్, క్రిస్ కెయిన్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆడమ్ హోలియోక్, ఆసీస్ స్పీడ్ స్టార్ క్రెయిగ్ మెక్ డెర్మాట్.. ఇలా ప్రస్తుత, పాత తరానికి చెందిన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది. చదవండి: టీమిండియానే ప్రపంచ ఛాంపియన్.. ఆసీస్ కెప్టెన్ జోస్యం -
అర్జున అవార్డు గ్రహీత.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి! 30 ఏళ్ల భారత వెటరన్ బాక్సర్ దినేశ్ కుమార్ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్ కుమార్ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి. -
అప్పుల బాధలు తాళలేక..
తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఒకవైపు పంట దిగుబడి రాక..మరోవైపు చేసిన అప్పులు తీర్చే దారిలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్య తనకున్న రెండెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగు చేశాడు. వర్షాభావంతో పంట దిగుబడి సరిగా లేదు. దీంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక బుధవారం రాత్రి పురుగు మందుతాగాడు. భూపాలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పూలకుంటకు చెందిన రైతు ఆదినారాయణ రెడ్డి(65) అప్పుల బాధతో ఈనెల 20వ తేదీన పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. ఈయన తనకున్న ఐదెకరాల్లో ద్రాక్ష సాగు చేశాడు. సరైన ప్రతిఫలం దక్కకపోవటంతో ఆవేదన చెందాడు. ఎప్పుటికప్పుడూ చేసిన అప్పులు రూ.8 లక్షలకు చేరడంతో అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పెద్ద మరణంతో పాటు..చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.