మెల్‌బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్ స్వయంగా ధృవీకరించారు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సమావేశమైన ఛాపెల్ స్నేహితులు.. ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన.
‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్‌లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని అన్నారాయన.
ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన.
Comments
Please login to add a commentAdd a comment