
PC: BCCI
ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఫీల్డింగ్ తప్పిదాల వల్లే గిల్ సేన ఓడిపోలేదని.. బౌలింగ్‌లో వైవిధ్యం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు (IND vs ENG)లో భారత్ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అత్యధికంగా ఆరు క్యాచ్‌లు వదిలేయడం, కీలక సమయాల్లో నో బాల్స్ వేయడం తీవ్ర ప్రభావం చూపాయి.
టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ.. ‘‘హెడింగ్లీ మైదానంలో భారత జట్టు ఫీల్డింగ్ చేసిన తీరు తీవ్రంగా నిరాశపరిచిన మాట వాస్తవం. అయితే, తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం.. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసినపుడు అది నో బాల్‌గా తేలడం.
భారత బౌలింగ్ అటాక్‌లో ఏమాత్రం వైవిధ్యం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా మినహా అందరు సీమర్లూ ఒకేలా బౌలింగ్ చేస్తున్నారు. అందరూ రైటార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్లే. బౌలర్లను మార్చిన ప్రతిసారీ కచ్చితంగా ఫలితం ఉంటుంది.
బౌలింగ్‌లో వైవిధ్యం ఉన్నప్పుడు బ్యాటర్ తడబడతాడు. కానీ టీమిండియాలో ఇప్పుడు అది కనిపించడం లేదు. బుమ్రాతో పాటు లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది.
షేన్ వార్న్ తర్వాత అతడే అత్యుత్తమ బౌలర్
ఇక కుల్దీప్ యాదవ్.. షేన్ వార్న్ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ మణికట్టు స్పిన్నర్ అతడు. అతడిని కూడా వీరికి జతగా తుదిజట్టుకు ఎంపిక చేస్తే బౌలింగ్‌లో వైవిధ్యం కనబడుతుంది.
బుమ్రా తప్ప మిగతా సీమర్లు సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేయడం లేదు. వేస్తూ ఫుల్ బాల్స్.. లేదంటే మరీ షార్ట్ బాల్స్. ఇలా అయితే కష్టం. బుమ్రాపైనే భారం ఉంటుందని ఇంగ్లండ్ బ్యాటర్లుకు తెలుసు. ఒత్తిడిలో ఉన్న అతడిని వారు ఈజీగా టార్గెట్ చేస్తారు.
జడ్డూ విషయంలో పునరాలోచన చేయాలి
అందుకే కుల్దీప్ యాదవ్‌ను కచ్చితంగా ఆడించాలి. రవీంద్ర జడేజా ఇంగ్లండ్ గడ్డపై ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా పనికిరాడు. బ్యాటింగ్ కారణంగా అతడికి అవకాశం ఇస్తున్నారు. కానీ.. అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇక ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్‌ను కాదని.. దిగ్గజ షేన్ వార్న్ తర్వాత బెస్ట్ అంటూ చాపెల్ కుల్దీప్ యాదవ్‌కు కితాబులివ్వడం విశేషం. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో (జూలై 2-6) రెండో టెస్టు జరుగుతుంది. అక్కడి పిచ్ పొడిగా ఉండనున్న నేపథ్యంలో కుల్దీప్ తప్పనిసరిగా ఆడే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్