అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్‌ | Ind vs Eng: That Baffles Me: Dinesh Karthik Slams Ravindra Jadeja | Sakshi
Sakshi News home page

అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్‌

Jun 25 2025 12:49 PM | Updated on Jun 25 2025 1:10 PM

Ind vs Eng: That Baffles Me: Dinesh Karthik Slams Ravindra Jadeja

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా స్టార్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును భారత మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) విమర్శించాడు. జడ్డూ బౌలింగ్‌ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందన్నాడు. అనుభవజ్ఞుడైన అతడు విఫలం కావడం వల్ల జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌తో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం- మంగళవారం తొలి టెస్టు జరిగింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం మొదలుపెట్టాడు.

అందరికంటే సీనియర్‌
ఇక ఇంగ్లండ్‌కు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజానే అందరికంటే సీనియర్‌. అయితే, తొలి టెస్టులో ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 36 (11, 25 నాటౌట్‌) పరుగులు చేసిన జడ్డూ.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు బౌలింగ్‌ వేసిన జడ్డూ.. 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు విఫలం చెందాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా జడ్డూ స్థాయికి తగ్గట్లు బౌలింగ్‌ చేయలేకపోయాడు.

ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్ల పని పట్టడంలో ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ విఫలమయ్యాడు. అతడి బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు తొలి రెండు సెషన్లలో రివర్స్‌ స్వీప్‌ షాట్లతో తేలికగా పరుగులు పిండుకున్నారు. బెన్‌ డకెట్‌ శతకం (149)తో చెలరేగగా.. టీ బ్రేక్‌ తర్వాత పాత బడిన పిచ్‌పై జడ్డూ మ్యాజిక్‌ చేయగలిగాడు. బెన్‌ స్టోక్స్‌ (33)ను ఎట్టకేలకు పెవిలియన్‌కు పంపాడు.

అనుభవం ఉండి ఏం లాభం?
ఈ విషయంపై భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ స్పందిస్తూ.. ‘‘జడేజా రఫ్‌సైడ్‌ వేయకుండా స్ట్రెయిట్‌గా బౌల్‌ చేశాడు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అన్‌ఈవెన్‌ పిచ్‌పై తన పాత్ర పోషించడంలో విఫలమయ్యాడు.

అనుభవం ఉన్న ఆటగాడు అతడు. అయినా.. ఇలా ఎందుకు ఎలా చేశాడో తెలియదు. వైడ్‌ ఆఫ్‌ ది వికెట్‌ వేయాల్సింది. సరైన చోట బంతులు వేయడంలో జడ్డూ విఫలమయ్యాడు’’ అని విమర్శించాడు.

కాగా తొలి టెస్టులో ఓటమితో గిల్‌ సేన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య జూలై 2- జూలై 6 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు స్కోర్లు
భారత్‌ స్కోర్లు: 471 & 364
ఇంగ్లండ్‌ స్కోర్లు: 465 & 373/5
ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో భారత జట్టు ఓటమి.

చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement