breaking news
Tendulkar-Anderson Trophy
-
అందుకే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాం: శుబ్‌మన్ గిల్
టీమిండియా- ఇంగ్లండ్ (India vs England) మధ్య రెండో టెస్టు నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన పేరు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav). ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఈ చైనామన్ స్పిన్నర్‌ను ఆడిస్తే భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో పాటు.. సునిల్ గావస్కర్ వంటి భారత దిగ్గజ క్రికెటర్లు కూడా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించారు.అతడికి విశ్రాంతి.. వారిపై వేటుఅయితే, రెండో టెస్టు ఆడే జట్టులో మాత్రం కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు. ఈ మణికట్టు స్పిన్నర్‌కు బదులు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు సెలక్టర్లు తుదిజట్టులో స్థానం ఇచ్చారు. తొలి టెస్టులో ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేశారు.ఈ ముగ్గురి స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్తో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో జట్టులో చేసిన మార్పుల గురించి స్పందించిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.అందుకే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాం‘‘ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రెడ్డి, వాషీలతో పాటు ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించడం లేదు. అతడి వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.మూడో టెస్టు లార్డ్స్‌లో జరుగనుంది. అక్కడ బుమ్రా అవసరం మాకు ఎక్కువగా ఉంటుంది. అక్కడి పిచ్‌ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. అందుకే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చాం.ఇక కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని ఆఖరి వరకు అనుకున్నాం. అయితే, బ్యాటింగ్‌లో డెప్త్ గురించి ఆలోచించి అతడిని పక్కనపెట్టాం. ’’ అని శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. గత మ్యాచ్‌లో తమ లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైందని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా గతంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కు మొదట ప్రాధాన్యం ఇవ్వలేదు మేనేజ్మెంట్.భారత గడ్డపై ఇలాఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు ఓడిన తర్వాత.. రెండో మ్యాచ్ నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. తదుపరి నాలుగు మ్యాచ్‌లలో కుల్దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొత్తంగా 19 వికెట్లు కూల్చాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్‌పై 4-1తో గెలిచి సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ప్రస్తుతం సిరీస్ ఇంగ్లండ్‌లో జరుగుతున్నందున అతడికి ఎక్కువగా అవకాశం రాకపోవచ్చు. కానీ ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్వభావాన్ని బట్టి కుల్దీప్ను ఆడిస్తారని అంతా భావించారు. కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఐదు శతకాలు బాదినాఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు కొట్టగా.. రిషభ్ పంత్ రెండు శతకాలతో అలరించాడు. అయితే, అప్పుడు కూడా బ్యాటింగ్ డెప్త్ కోసమని శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోగా.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు పరుగులు చేయడంతో పాటు కేవలం రెండు వికెట్లే పడగొట్టగలిగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) రెండో టెస్టు ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 8.4 ఓవర్ వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (2) బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ 12 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 15/1 (8.4).చదవండి: IND vs ENG T20Is: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
IND vs ENG: తుదిజట్టులోకి నితీశ్ రెడ్డి, వాషీ, ఆకాశ్.. ఆ ఇద్దరిపై వేటు
England vs India 2nd Test Birmingham: టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.బుమ్రాకు విశ్రాంతితాను టాస్ గెలిస్తే తప్పక తొలుత బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. ఇక రెండో టెస్టులో తాము మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు గిల్ వెల్లడించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చామని.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.ఆ ఇద్దరిపై వేటుకాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో పాటు.. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌పై వేటు పడింది. శార్దూల్ తొలి టెస్టులో కేవలం ఐదు పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.కరుణ్ నాయర్‌కు రెండో అవకాశంమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో ముప్పై పరుగులు చేయగలిగాడు. అయితే, సాయి సుదర్శన్‌తో పాటే విఫలమైన సీనియర్ కరుణ్ నాయర్‌పై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది. అతడికి రెండో ఛాన్స్ ఇచ్చింది. కాగా కరుణ్ తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’
ఇంగ్లండ్- భారత్ మధ్య టెస్టు సిరీస్‌కు కొత్త పేరు పెట్టడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ ఫారూఖ్ ఇంజనీర్ (Farookh Engineer) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చర్య వల్ల ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించాడు. భారత క్రికెట్ రంగానికి సేవ చేయడంతో పాటు ఇంగ్లండ్‌కూ ఆడిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (Mansur Ali Khan Pataudi) పేరు తొలగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు.గొప్ప కుటుంబంకాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా ఈ సిరీస్‌కు టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఈసీబీ. ఈ క్రమంలో విమర్శలతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి విజ్ఞప్తి రాగా.. విజేత జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను అందజేస్తామని ప్రకటించింది. తద్వారా పటౌడీ పేరు చిరస్మరణీయం కానుంది.అయితే, ఈసీబీ నిర్ణయం తనకు అంతగా సంతృప్తినివ్వలేదని షారూఖ్ ఇంజనీర్ అన్నాడు. ‘‘టైగర్ పటౌడీ నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి చాన్నాళ్లు క్రికెట్ ఆడాము. అతడిది గొప్ప వారసత్వం. వారిది గొప్ప కుటుంబం. 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టినపుడు ఎంతో సంతోషించా.షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండిఅయితే, ఇప్పుడు ఆ పేరును తీసేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆండర్సర్- టెండుల్కర్ కూడా దిగ్గజ ఆటగాళ్లే. వారికి ఎవరూ సాటిరారు. ట్రోఫీకి వారి పేరు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఇలాంటి చర్య వల్ల ఈసీబీ తన విశ్వసనీయతను కోల్పోయింది.మెడల్ ఇస్తామంటూ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెడల్ అందిస్తామని చెప్పింది. కేవలం ఇలా చేస్తే సరిపోదు. మన్సూర్ భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్ల చేతుల మీదుగా ఆ పతకం విజేత జట్టు కెప్టెన్‌కు అందజేయాలి. ఈసారి ఇలా చేయడం వల్ల ఈసీబీ వైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు’’ అని ఫారూఖ్ ఇంజనీర్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ నటి షర్మిలాను పెళ్లాడిన మన్సూర్‌కు కుమారుడు సైఫ్‌తో పాటు కుమార్తెలు సబా, సోహా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య మొత్తంగా ఐదు టెస్టులు జరుగనుండగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం రెండో మ్యాచ్ (జూలై 2-6)కు వేదిక. చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్ మారకుంటే..
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదుర్కొన్నాడు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శతకం (147)తో చెలరేగినా.. అతడి ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది.గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిబ్యాటింగ్ విభాగం రాణించినా.. బౌలర్లు.. ముఖ్యంగా ఫీల్డర్ల తప్పిదాల వల్ల గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేసింది. యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal), రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ కీలక సమయాల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశారు.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106), రెండో ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (149) శతకాలతో సత్తా చాటి.. మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.ఫీల్డింగ్ కూడా అద్భుతమే.. కానీ ఇప్పుడుభారత్ జట్టు గొప్పదని.. వారి ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉండేదన్న హాడిన్.. గిల్ మాత్రం ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆదిలోనే విఫలమయ్యాడని పేర్కొన్నాడు. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్ల ఉదాసీనత వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని విమర్శించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారత ఆటగాళ్లు ఇలా క్యాచ్‌లు జారవిడవడం ఎక్కువగా ఉందని.. ఇదో అలవాటుగా మారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘ప్రతి గొప్ప జట్టు.. ఎక్కడ ఆడుతున్నా.. ఎప్పుడైనా ఫీల్డింగ్ విషయంలోనూ గొప్పగానే ఉంటుంది. కానీ ఈసారి గిల్ ఆ లెగసీని కొనసాగించలేకపోయాడు. జట్టుపై అతడు పట్టు కోల్పోయాడు. ఇప్పటికైనా గిల్ తన ఆటిట్యూడ్ మార్చుకోవాలి.మీ జట్టు బాగా ఫీల్డింగ్ చేయాలన్నా.. జట్టుగా సమిష్టిగా పోరాడలన్నా కెప్టెన్‌గా నువ్వు మరింత బలంగా తయారవ్వాలి. టెక్నిక్ మార్చాలి. ఎంత మంది కోచ్‌లు ఉంటే ఏం లాభం?.. ఆటగాళ్ల దృక్పథంలో మార్పు రావాలి. ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదేఈ ఏడాది ఐపీఎల్‌లోనూ చాలా మంది భారత ఆటగాళ్లు క్యాచ్‌లు మిస్ చేసిన తీరు చూశాం. దాని ఫలితమే ఇక్కడా కనిపిస్తోంది’’ అని బ్రాడ్ హాడిన్ విల్లో టాక్స్ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఇరుజట్ల మధ్య జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!
భారత టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుండగా.. అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) వంటి దేశీ హీరోలు అరంగేట్రం చేయాలని ఆరాటపడుతున్నారు. వీరిలో జురెల్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న జట్టులో ఉన్నప్పటికీ తుదిజట్టులో అతడికి ఆడే అవకాశాలు కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిలో శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. అతడి కంటే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌ల వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు.చాలా సమస్యలుఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘భారత బ్యాటింగ్ విభాగం కూర్పు విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ఆటగాళ్లను ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడించాలో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కదు. అతడే కాదు.. చాలా మందికి నిరాశ తప్పదు.ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న వాళ్లలో కరుణ్ నాయర్‌కు ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేసే అవకాశం దక్కింది. సర్ఫరాజ్ ఖాన్ మరోసారి వేచి చూడక తప్పని పరిస్థితి. ధ్రువ్ జురెల్ జట్టులో ఉన్నా చాలా కాలంగా పక్కనపెట్టారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక శ్రేయస్‌ని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారని నమ్మకం ఏంటి?అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించాడు. దేశీ క్రికెట్లో సత్తా చాటాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అంతకంటే ముందు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.సుదీర్ఘకాలం నిరీక్షణ తప్పకపోవచ్చుఅందుకే వన్డే జట్టులో చోటు దక్కించుకోగలడు. కానీ టెస్టుల విషయానికి వచ్చే సరికి... అతడి కంటే చాలా మంది ముందే ఉన్నారు. కాబట్టి అతడికి సుదీర్ఘకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై తరఫున శ్రేయస్ అయ్యర్ రాణించాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 480 పరుగులు చేశాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడి వైపు చూడలేదు. తాజాగా ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ గురించి అభిమానులు ప్రశ్నిస్తుండగా.. ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఇంగ్లండ్‌తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు అక్కడికి వెళ్లిన టీమిండియా.. తొలి టెస్టులో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. కాగా ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణాన్ని ఆరంభించాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్ -
గెలిచిన మ్యాచ్‌లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్
జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. లీడ్స్‌లో టెస్టులో ఓటమితో గంభీర్‌పై ఒత్తిడి పెరిగిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చెపట్టిన తర్వాత భారత జట్టు బంగ్లాపై మినహా ఒక్క ప్రధాన టెస్టు సిరీస్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓడిపోవడంతో గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓటమితో ఆరంభించడం గంభీర్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది."గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడిపోయినప్పుడు విమర్శలు గుప్పించడం భారత క్రికెట్ సూత్రం. మ్యాచ్‌లో గెలిచి అన్ని బాగా జరిగితే అందరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అదే ఓటమి పాలైతే ప్రతీ ఒక్కరూ విమర్శలు ఎదుర్కొక తప్పదు. లీడ్స్ టెస్టులో ఓటమికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను నేను బాధ్యుడిని చేయాలనుకోవడం లేదు.ఎందుకంటే అతడు ఇప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. పరిస్థితులను ఆర్ధం చేసుకోవడానికి అతడికి కాస్త సమయం పడుతోంది. కానీ గౌతం గంభీర్‌పైన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్లో కోచ్‌గా తన మార్క్ చూపించలేకపోయాడు. అతడి పర్యవేక్షణలో భారత్ చాలా తక్కువ మ్యాచ్‌లను గెలిచింది. బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై చెరో మూడు మ్యాచ్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై కూడా ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అతడి నేతృత్వంతో భారత్ కేవలం ఓటముల తప్ప విజయాలు సాధించలేకపోతుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆశించింన ఫలితం రాకపోతే గంభీర్ స్ధానం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఎందుకంటే గంభీర్ కోరిన ప్రతీది సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. అయినప్పటికి విజయాలను అందించకపోతే సెలక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కొక తప్పదు" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్ -
IND Vs ENG: అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?
టీమిండియాతో రెండో టెస్టుకు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)ను ఎంపిక చేయడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ విమర్శించాడు. ఈ పేస్ బౌలర్‌ను ఇప్పుడే ఆడించడం రిస్క్ అని మేనేజ్మెంట్ను హెచ్చరించాడు. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.1-0తో ముందంజలో ఇంగ్లండ్కాగా ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ (Tendulkar-Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా .. లీడ్స్ (Leeds Test)లో నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి పోరులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు... పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను తీసుకుంది.2021లో చివరగా..గాయాలతో సహవాసం చేసే ఆర్చర్... 2021 తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అతడు చివరగా... అహ్మదాబాద్ వేదిగా టీమిండియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. అనంతరం మోచేతి గాయంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు దాదాపు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ సంప్రదాయ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టాడు.కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో ససెక్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు.. దుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. పద్దెనిమిది ఓవర్ల పాటు బౌలింగ్ చేసి దుర్హమ్ తొలి ఇన్నింగ్స్‌లో ఎమిలో గేను 37 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరఫున రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆర్చర్ రాక గురించి ప్రస్తావిస్తూ ‘జాతీయ జట్టు తరఫున 13 టెస్టులు ఆడిన 30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. 2021 ఫిబ్రవరిలో భారత్‌పైనే చివరి టెస్టు ఆడిన అతడు... మళ్లీ టీమిండియాపైనే పునరాగమనం చేస్తున్నాడు’ అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. ‘‘రానున్న వారం రోజుల్లో ఇంగ్లండ్ నిజంగానే పెద్ద రిస్క్ తీసుకోబోతోంది. ఇందులో వారు సఫలం అవుతారో లేదో తెలియదు. జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉందో నాకైతే తెలీదు.అంతా బాగుంటే మంచిదే. అయినా, ఆర్చర్ కోసం ఇప్పుడు ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నదే ప్రశ్న?.. ఇప్పుడే జట్టులో మార్పులు అవసరం లేదనుకుంటా. ఆర్చర్‌ను ఆడించే విషయంలో లార్డ్స్ టెస్టు వరకు వేచి చూస్తే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. ‘‘అతడు ససెక్స్ తరఫున ఒకే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్నాడు. నాలుగేళ్లు టెస్టులకు దూరంగా ఉండి.. రీఎంట్రీలో కేవలం 18 ఓవర్లు బౌల్ చేశాడు. నిజంగానే ఆర్చర్ పూర్తి ఫిట్‌గా ఉండే ప్రపంచంలో అతడే అత్యుత్తమ బౌలర్ అని చెప్పడానికి సందేహించను.అయితే, దురదృష్టవశాత్తూ గాయాల వల్ల సుదీర్ఘకాలంగా టెస్టు ఫార్మాట్‌కు అతడు దూరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియాతో తొలి టెస్టులో క్రిస్ వోక్స్ ఒకే ఒక్క వికెట్ తీయగా.. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ కలిసి పదకొండు వికెట్లు కూల్చారు. అయితే, వోక్స్ పొదుపుగా బౌలింగ్ చేసిన కారణంగా అతడిని ఇప్పుడే జట్టు నుంచి తప్పించడం తొందరపాటు చర్యే అవుతుంది.చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్ -
అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) విమర్శించాడు. జడ్డూ బౌలింగ్ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందన్నాడు. అనుభవజ్ఞుడైన అతడు విఫలం కావడం వల్ల జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌తో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం- మంగళవారం తొలి టెస్టు జరిగింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.అందరికంటే సీనియర్ఇక ఇంగ్లండ్‌కు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజానే అందరికంటే సీనియర్. అయితే, తొలి టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 36 (11, 25 నాటౌట్) పరుగులు చేసిన జడ్డూ.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు బౌలింగ్ వేసిన జడ్డూ.. 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు విఫలం చెందాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా జడ్డూ స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు.ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్ల పని పట్టడంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ విఫలమయ్యాడు. అతడి బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తొలి రెండు సెషన్లలో రివర్స్ స్వీప్ షాట్లతో తేలికగా పరుగులు పిండుకున్నారు. బెన్ డకెట్ శతకం (149)తో చెలరేగగా.. టీ బ్రేక్ తర్వాత పాత బడిన పిచ్‌పై జడ్డూ మ్యాజిక్ చేయగలిగాడు. బెన్ స్టోక్స్ (33)ను ఎట్టకేలకు పెవిలియన్‌కు పంపాడు.అనుభవం ఉండి ఏం లాభం?ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ‘‘జడేజా రఫ్సైడ్ వేయకుండా స్ట్రెయిట్‌గా బౌల్ చేశాడు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అన్ఈవెన్ పిచ్‌పై తన పాత్ర పోషించడంలో విఫలమయ్యాడు.అనుభవం ఉన్న ఆటగాడు అతడు. అయినా.. ఇలా ఎందుకు ఎలా చేశాడో తెలియదు. వైడ్ ఆఫ్ ది వికెట్ వేయాల్సింది. సరైన చోట బంతులు వేయడంలో జడ్డూ విఫలమయ్యాడు’’ అని విమర్శించాడు.కాగా తొలి టెస్టులో ఓటమితో గిల్ సేన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య జూలై 2- జూలై 6 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుభారత్ స్కోర్లు: 471 & 364ఇంగ్లండ్ స్కోర్లు: 465 & 373/5ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు ఓటమి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్#BenDuckett’s brilliant 149 set the tone for England’s highest successful chase at Leeds and their second-highest in Test history.👉 Relive the innings that turned the tide in the 1st Test : https://t.co/MhwlN52U7s#ENGvIND 👉🏻 2nd TEST | WED, 2nd JULY, 2.30 PM on JioHotstar pic.twitter.com/1uRcpT5vRE— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్
ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీని టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించినప్పటికీ భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది.బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం.. ఫీల్డర్ల బౌలర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో గిల్ సేన ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. ఏ ఒక్కరిని నిందించేందుకు తాను సిద్ధంగా లేనని.. గెలిచినా, ఓడినా ఆటగాళ్లంతా ఒక్కటిగా ఉంటారని పేర్కొన్నాడు.అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులేకాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత లోయర్ ఆర్డర్ (8-11 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినవాళ్లు) అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులే చేసింది. ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘కొన్నిసార్లు కొందరు విఫలమవుతారు. నిరాశ కలిగించే విషయమే అయినా మరేం పర్లేదు.అయితే, అందరి కంటే ఎక్కువ సదరు ఆటగాళ్లే ఎక్కువ నిరాశకు లోనవుతారు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని వారికి తెలుసు. ఒకవేళ మొదటి ఇన్నింగ్స్‌లో మేము 570- 580 పరుగులు చేసినట్లయితే మా ఆధిపత్యమే కొనసాగేది.ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. అయితే, అన్నిసార్లూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోవచ్చు. స్పెషలిస్టు బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అంతమాత్రాన ఏ ఒక్కరినో వేరు చేసి నిందించాల్సిన పనిలేదు.ఈ మ్యాచ్‌లో మేము గెలిచే సందర్భాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ పని పూర్తి చేయలేకపోయాం. ఏదేమైనా గెలిచినా, ఓడినా ఒక్కటే. కలిస్తే గెలుస్తాం.. కలిసే ఓడిపోతాం’’ అని గంభీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాంఇక శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) గురించి ప్రశ్నించగా.. ‘‘అతడిని మేము స్పెషలిస్టు బౌలర్‌గా జట్టులోకి తీసుకోలేదు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గానే తీసుకున్నాం. కొన్నిసార్లు కెప్టెన్ నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అదే విధంగా.. 1, 4 పరుగులు స్కోర్ చేశాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మొదలుపెట్టింది. ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత జట్టు.. హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఈ సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఓటమి కారణంగా నిరాశే ఎదురైంది.ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) సెంచరీలు బాదారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137)తో పాటు రిషభ్ పంత్ (118) శతక్కొట్టాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 471 & 364ఇంగ్లండ్: 465 & 373/5.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్ -
Ind vs Eng: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో మూడు శతకాలుబ్యాటింగ్కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.ఆరు పరుగుల ఆధిక్యంఓపెనర్ బెన్ డకెట్ (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆదుకున్న రాహుల్, పంత్.. కానీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.శతక్కొట్టిన డకెట్ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా ఆడిన స్టోక్స్ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్‌ను పూర్తి చేసింది.ఓపెనర్లలో జాక్ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైనా.. జో రూట్ (53 నాటౌట్), జేమీ స్మిత్ (44 నాటౌట్) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీయగా.. ప్రసిద్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్‌గా గిల్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
లండన్‌లో క్రికెటర్ మరణం.. నివాళులు అర్పించిన భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లు
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు (Indv s Eng 1st Test) ఐదో రోజు ఆట సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్‌తో బరిలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి (Dilip Doshi) మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. కాగా భారత్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో లండన్ (London)లో కన్నుమూశారు.చారిత్రాత్మక విజయంలో కీలక పాత్రగుండెపోటు కారణంగా ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా 1979- 1983 మధ్య కాలంలో దిలీప్ దోషి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు తీసి.. జట్టు చారిత్రాత్మక విజయానికి దోహదం చేశారు.ఇక తన కెరీర్లో మొత్తంగా 33 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిలీప్ దోషి 114 వికెట్లతో సత్తా చాటారు. అదే విధంగా.. పదిహేను వన్డేలు ఆడి 22 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ క్రికెట్ జట్లకు ఆడిన ఆయన.. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ భాగమయ్యారు. వార్విక్షైర్, నాటింగ్‌హామ్‌షైర్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత లండన్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్న దిలీప్ దోషి.. సోమవారం మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాపంగా భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు.తొలి రోజు.. మూడో రోజు ఆలాకాగా.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంతాప సూచకంగా తొలి రోజు ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగారు.అదే విధంగా.. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ వాలంటైన్ లారెన్స్ (61) మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మౌనం పాటించడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించారు. తాజాగా మంగళవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆటలోనూ ఇదే తరహాలో నివాళి అర్పించారు.భారత్‌కు 10 వికెట్లు.. ఇంగ్లండ్‌కు 350 రన్స్మ్యాచ్ విషయానికొస్తే.. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 364 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని విధించింది.ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఫలితం తేలనుంది. టీమిండియా పది వికెట్లు తీస్తే విజేతగా నిలుస్తుంది. అదే ఇంగ్లండ్ తమ ఓవర్ నైట్ స్కోరు (21/0)తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ విజయానికి 350 పరుగుల దూరంలో ఉంది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ పెద్దన్నలా ఆదుకుని బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 202 బంతుల్లో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.రాహుల్ శతక ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అదరగొడుతున్నాడు. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పంత్ కూడా సెంచరీ బాదాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది.టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది.ఇందుకు బదులుగా స్టోక్స్ బృందం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేయగా.. భారత్‌కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి.. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పట్టుదలగా నిలబడగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఇక నాలుగో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో రాహుల్- పంత్ నిలకడగా ఆడుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69.4 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి పంత్ 100, రాహుల్ 112 పరుగులతో ఉన్నారు. టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.𝗖 𝗛 𝗔 𝗠 𝗣 𝗜 𝗢 𝗡 𝗦 𝗧 𝗨 𝗙 𝗙 🫡🙌🏻After missing out in the first innings, @klrahul makes it count in the second! A priceless century that puts #TeamIndia in a commanding position in the 1st Test! 🇮🇳#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on JioHotstar 👉… pic.twitter.com/FVrutSIABd— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
బుమ్రాను అందుకు నువ్వే ఒప్పించాలమ్మా!.. పుజారా రిక్వెస్ట్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఘనంగా ఆరంభించాడు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చి.. భారత్‌కు స్వల్ప ఆధిక్యం అందించాడు. బౌలింగ్ దళ భారాన్ని మొత్తం తానే మోస్తూ.. మరోసారి తన విలువను చాటుకున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (4).. అదే విధంగా మరో ప్రధాన బ్యాటర్ జో రూట్ (28) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన బుమ్రా.. క్రిస్ వోక్స్ (38), బ్రైడన్ కార్స్ (22) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.అందుకే కెప్టెన్సీకి కూడా దూరం అంతేకాదు.. తాను కూడా అన్ని టెస్టులు ఆడలేను కాబట్టే కెప్టెన్సీ వద్దని చెప్పానని బుమ్రా కూడా ఇటీవల పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా భవిష్యత్ దృష్ట్యా తాను పనిభారాన్ని మేనేజ్ చేసుకునే విషయంలో ‘స్మార్ట్’గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లోనూ బుమ్రా ఆడాలని కోరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు.. ఇందుకు అతడిని ఒప్పించాలంటూ స్పోర్ట్స్ ప్రజెంటర్‌ను కోరారు. ఆమె మరెవరో కాదు బుమ్రా సతీమణి సంజనా గణేషన్.సంజనా.. నాదో రిక్వెస్ట్..భారత్- ఇంగ్లండ్ టెస్టుల బ్రాడ్‌కాస్టర్ సోనీ నెట్వర్క్ షోలో భాగంగా.. ‘‘సంజనా.. నాదో రిక్వెస్ట్.. అన్ని మ్యాచ్‌లు ఆడేలా జస్ప్రీత్ను నువ్వు మాత్రమే ఒప్పించగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీకు మాత్రమే అది సాధ్యం’’ అని పుజారా సంజనాతో అన్నాడు.ఇంతలో గావస్కర్ కలుగజేసుకుంటూ.. ‘‘మ్యాచ్‌కి మ్యాచ్‌కి మధ్య కావాల్సినంత విరామం దొరుకుతుంది. దాదాపు ఎనిమిది రోజులు విశ్రాంతి లభిస్తుంది. తదుపరి మ్యాచ్‌కు వారానికి పైగా సమయం ఉంది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టుకు.. ఆపై మాంచెస్టర్ టెస్టుకు కూడా ఇదే తరహాలో విరామం లభిస్తుంది.జట్టుకు బుమ్రా అవసరం ఉందిమాంచెస్టర్లో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబర్ లేదంటే నవంబరు.. ఎప్పుడైనా బంతి బాగా స్వింగ్ అవుతుంది. ది ఓవల్‌లో ఐదు రోజులు మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది.జట్టుకు జస్ప్రీత్ అవసరం ఎంతగానో ఉంది. అతడు ఐదు టెస్టులు ఆడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి నువ్వు అన్ని మ్యాచ్‌లు ఆడు బుమ్రా’’ అని సంజనా సమక్షంలో విజ్ఞప్తి చేశాడు. కాగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. నాలుగో రోజు ఆటలో భాగంగా 34 ఓవర్ల ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8) ఈసారి విఫలమయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేయగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ 52, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ షెడ్యూల్తొలి టెస్టు: జూన్ 20-24, లీడ్స్రెండో టెస్టు: జూలై 2-6, బర్మింగ్హామ్మూడో టెస్టు: జూలై 10- 14, లార్డ్స్, లండన్నాలుగో టెస్టు: జూలై 23-27, మాంచెస్టర్ఐదో టెస్టు: జూలై 31- ఆగష్టు 4, కెన్నింగ్టన్ ఓవల్, లండన్.చదవండి: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై? The People vs. Bumrah's workload management 👨⚖️This bench rules: Bumrah MUST play all 5 Tests ✅ 😅#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @cheteshwar1 @SanjanaGanesan @Jaspritbumrah93 pic.twitter.com/22f2LichMZ— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025 -
అడ్డుగోడలా..: జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. లీడ్స్ వేదికగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఈ పేస్ గుర్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా స్టోక్స్ బృందాన్ని 465 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి బౌలింగ్ విభాగం భారమంతా తన భుజాలపైనే వేసుకుని ముందుకు నడిపించాడు.అయితే, మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు అంతగా సహకారం లభించలేదు. మరోవైపు.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. శనివారం నాటి రెండో రోజు ఆటలో మూడు.. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.క్యాచ్‌లు నేలపాలు చేసిన జైసూ, జడ్డూముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (62), వన్‌డౌన్ బ్యాటర్, శతక వీరుడు ఓలీ పోప్ (106), మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ (99) ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మరోవైపు.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా బుమ్రా బౌలింగ్‌లో డకెట్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. బ్రూక్‌ను బుమ్రా డకౌట్ చేశాడని భావించగా.. అది నో బాల్‌గా తేలడం.. ఆ తర్వాత బ్రూక్ శతకానికి సమీపించడం జరిగాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసిస్తూనే.. భారత ఫీల్డర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!‘‘బుమ్రాకు శుభాకాంక్షలు!.. ఒక నో బాల్.. మూడు జారవిడిచిన క్యాచ్‌లు నీకూ.. తొమ్మిది వికెట్లకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి’’ అని పేర్కొన్నాడు.జైసూ, జడ్డూ ఫీల్డింగ్ తప్పిదాలతో, బ్రుక్కు వేసిన బంతి నో బాల్‌గా తేలనట్లయితే బుమ్రా ఖాతాలో మరో నాలుగు వికెట్లు చేరేవని.. తద్వారా అతడు తొమ్మిది వికెట్లు తీసేవాడని సచిన్ టెండుల్కర్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఎవరి వికెట్లు తీశాడంటే?కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 24.4 ఓవర్ల బౌలింగ్‌లో 83 పరుగులు (3.40 ఎకానమీ) ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో బుమ్రా.. జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (62), జో రూట్ (28), క్రిస్ వోక్స్(38), జోష్ టంగ్ (11) వికెట్లు పడగొట్టాడు. ఇందులో డకెట్‌తో పాటు.. వోక్స్, టంగ్‌లను బుమ్రా బౌల్డ్ చేశాడు.ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్ నుంచి దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా- ఇంగ్లండ్‌కు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్‌తోనే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు (జూన్ 20-24)🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్ (జైస్వాల్ (101), గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాలు)🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (ఓలీ పోప్ (106) శతకం)🏏ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి: టీమిండియా స్కోరు: 90/2 (23.5).. 96 పరుగుల ఆధిక్యం.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ Congratulations Bumrah!A no-ball and 3 missed chances stood between you and 𝙣𝙖𝙪 wickets. 🤪 pic.twitter.com/09rJNI9KP0— Sachin Tendulkar (@sachin_rt) June 22, 2025 -
అతడిపై నమ్మకం లేనపుడు.. తుదిజట్టులో ఎందుకు?: భారత మాజీ క్రికెటర్
టీమిండియా నాయకత్వ బృందం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ (Sahrdul Thakur) పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదన్నాడు. అతడి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనపుడు తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులుకాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tedulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆతిథ్య ఇంగ్లండ్ సైతం భారత్‌కు దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు సాధించింది.బుమ్రాకు ఐదు వికెట్లుఓపెనర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీ(62) చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మిగతా వాళ్లలో హ్యారీ బ్రూక్ (99) రాణించాడు. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు బౌల్ చేసి ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ 20 ఓవర్లు వేసి మూడు, మహ్మద్ సిరాజ్ 27 ఓవర్లు బౌల్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 23 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మాత్రం కేవలం ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. కేవలం ఆరు ఓవర్లలోనే అతడు 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మళీ శార్దూల్ చేతికి బంతిని ఇవ్వలేదు.నమ్మకం లేనపుడు జట్టులో ఎందుకు?ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గిల్ తీరును ప్రశ్నించాడు. ‘‘శార్దూల్ ఠాకూర్ సేవలను పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేదు. అతడిని తుదిజట్టుకు ఎంపిక చేశారు. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారు.అయితే, అతడు ధారాళంగానే పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ అతడికి లాంగ్ స్పెల్స్ వేసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. జట్టులోని ప్రతి బౌలర్ దాదాపు 20 ఓవర్లకు పైగానే బౌల్ చేశారు. కానీ శార్దూల్ మాత్రం సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోయాడు.మొదటిసారి, రెండోసారి కొత్త బంతి పాతబడిన తర్వాత కూడా అతడికి ఛాన్స్ రాలేదు. నాయకత్వ బృందం అతడిపై నమ్మకం ఉంచలేదు. మరి అలాంటపుడు అతడిని ఎందుకు ఎంపిక చేసినట్లు?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.కాగా ఓవరల్‌గా 100.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. మూడోరోజు ఆటలో భాగంగా 465 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం.. ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి 23.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: IND vs ENG: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు -
ICC: శుబ్‌మన్ గిల్‌కు జరిమానా?!.. కారణం?
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.అజేయ శతకంలీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి 138 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిక్కుల్లో పడే అవకాశంకాగా ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్లేయర్ క్లాతింగ్- ఎక్విప్మెంట్ నిబంధన (క్లాజ్ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.జరిమానా?ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్ తప్పదు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కేఎల్ రాహుల్ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్ శతకాలతో చెలరేగగా.. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్ -
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు రెండో రోజు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వివరాల ప్రకారం.. లీడ్స్‌లో శనివారం ఉదయం ఎండ కాస్తుంది. 28-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.అయితే, 25 శాతం మేర వర్షం కురిసేందుకు కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశాలు 86 శాతం ఉన్నాయి. 31 శాతం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేందుకు ఛాన్స్ ఉంది. టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆటలో రెండో, మూడో సెషన్లో వర్షం పడే ఛాన్సులు 77 శాతం ఉన్నాయి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్‌లో పరస్పరం తలపడుతున్నాయి. టెండుల్కర్-ఆండర్సన్ (Tendulkar-Anderson Trophy) ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ క్రమంలో శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మొదలైంది.ఇరగదీసిన భారత బ్యాటర్లుటాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. గిల్ సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమై ఈ మేరకు అతడు తీసుకున్న నిర్ణయం భారత్‌కు కలిసి వచ్చింది. తొలి రోజు పొడిగా ఉన్న పిచ్‌పై టీమిండియా స్టార్లు బ్యాట్‌తో ఇరగదీశారు.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 127 పరుగులతో అజేయంగా ఉండగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకం (65*) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.వరుణుడు అడ్డుపడతాడా?అయితే, రెండో రోజు ఆటలో వీరు మరింత చెలరేగితే చూడాలని ఆశపడుతున్న అభిమానులకు వరుణుడు షాకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలిరోజు కూడా ఇదే తరహా హెచ్చరికలు కాగా.. ఆట సజావుగానే సాగింది. ఇక మొదటి రోజు టీమిండియా అభిమానులను నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే.. అది సాయి సుదర్శన్ డకౌట్ మాత్రమే.అదొక్కటే నిరాశఇంగ్లండ్ గడ్డ మీద ఈ తమిళనాడు బ్యాటర్ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 24 ఏళ్ల సాయి భారత్ తరఫున టెస్టు ఆడిన 317వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అతనికి టెస్టు క్యాప్‌ను అందించాడు. అయితే, దురదృష్టవశాత్తూ కెరీర్ తొలి ఇన్నింగ్స్ అతనికి కలిసి రాలేదు. నాలుగు బంతులే ఎదుర్కొన్న అతను ‘సున్నా’కే వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టు అరంగేట్రానికి ముందు సాయి భారత్ తరఫున 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్ -
అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్‌కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్‌తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్‌కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్‌కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్‌ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్‌లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.కాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్‌తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియాతో తొలి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్‌కు భంగపాటే ఎదురైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (Kl Rahul- 42) రాణించగా.. యశస్వి జైస్వాల్ శతకం (101)తో చెలరేగాడు. ఇక ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో కదం తొక్కాడు.అదే విధంగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా అర్ధ శతకంతో మెరిశాడు. వెరసి శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులు సాధించింది. తద్వారా ఆతిథ్య జట్టుపై పర్యాటక టీమ్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది.కామన్ సెన్స్ ఉన్నవాళ్లు ఇలా చేయరుఈ నేపథ్యంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ ఆథర్టన్ కూడా ఈ విషయంలో స్టోక్స్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘టాస్ గెలిచిన కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా అనిపించింది. గత ఆరు మ్యాచ్‌లలో తొలుత బౌలింగ్ చేసిన జట్టే విజయం సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్లు.. క్రికెట్ బుర్ర వాడేవారు ఎవరైనా ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు.ఎందుకంటే.. ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన ఎండ ఉంది. రానున్న రెండు రోజుల్లో 30 డిగ్రీలకు పైగానే ఉంటుంది. స్టోక్స్ కేవలం గత రికార్డు ఆధారంగానే తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటాడు’’ అని ఆథర్టన్ స్టోక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించగల సత్తా ఇంగ్లండ్‌కు ఉందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.ఇంగ్లండ్ పశ్చాత్తాపం!కాగా ఇంగ్లండ్ మరో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా టాస్ విషయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్‌కు ఏమాత్రం అవకాశం లేని వాతావరణం, పెద్దగా అనుభవం లేని బౌలర్లు... ఇలాంటి స్థితిలో టాస్ గెలిచి స్టోక్స్ బౌలింగ్ ఎంచుకునే సాహసం చేయడంతో ఇంగ్లండ్ పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి తలెత్తింది.నిజమే... హెడింగ్లీ మైదానంలో గత ఆరు టెస్టుల్లో ముందుగా బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ శుక్రవారం పరిస్థితి వాటికి భిన్నం. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్‌కు అర్థమై ఉంటుంది. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లింది.ఇంగ్లండ్ చేజారిన అవకాశాలు.. పెనాల్టీ పరుగులు👉45 పరుగుల వద్ద జైస్వాల్‌కు అదృష్టం కలిసొచ్చింది. కార్స్ వేసిన యార్కర్‌ను అతను చివరి నిమిషంలో నిలువరించగలిగాడు. ఇంగ్లండ్ అప్పీల్‌కు సిద్ధమైన తరుణంలో అంపైర్ దానిని ‘నోబాల్’గా ప్రకటించాడు. ఆ తర్వాత రీప్లే చూస్తే బంతి ముందుగా అతని ప్యాడ్‌కు తాకినట్లు తేలింది. ‘నోబాల్’ కాకపోతే అది కచ్చితంగా అవుట్‌గా తేలేది. 👉గిల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు కార్స్ బౌలింగ్‌లో కష్టసాధ్యమైన సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే గిల్ చాలా దూరంలోనే ఉన్నా... పోప్ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఓవర్‌త్రో బౌండరీని చేరడంతో మరో నాలుగు పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. 👉టీ విరామానికి ముందు స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో స్లిప్ ఫీల్డర్ రూట్ బంతిని ఆపే క్రమంలో దానిని పక్కకు తోశాడు. అది అక్కడే పెట్టిన వికెట్ కీపర్ హెల్మెట్‌ను తాకడంతో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా లభించాయి. ఈ గందరగోళంలో అంపైర్ లెక్క తప్పడంతో ఈ ఓవర్లో స్టోక్స్ 7 బంతులు వేశాడు. చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!.. బోటు ప్రమాదం నుంచి బయటపడి.. రపా రపా రఫ్పాడించి!
భారత్‌లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవ లేదు. ఐపీఎల్ మొదలైన తర్వాత ఎంతో మంది యువ తారలు వెలుగులోకి వస్తున్నారు. పొట్టి క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులో చోటుకు బాటలు వేసుకుంటున్నారు. దీంతో టీమిండియాలో స్థానం కోసం పోటీ మరింత పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ వెటరన్ ఆటగాడు పునరాగమనం చేయడమంటే విశేషమే.అదీ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియా తరఫున తుదిజట్టులో ఆడే అవకాశం దక్కించుకోవడం మరీ విశేషం. కరుణ్ నాయర్ (Karun Nair) తాజాగా ఈ ఘనత సాధించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ ‘ట్రిపుల్ సెంచూరియన్’ ఇంగ్లండ్ (Ind vs Eng 1st Test)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టు సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.ఎనిమిదేళ్ల 83 రోజుల విరామం తర్వాత తిరిగి భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. తద్వారా టీమిండియా తరఫున సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. కాగా కరుణ్ నాయర్ చివరగా 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు వీరే..👉లాలా అమర్నాథ్- 12 ఏళ్ల 129 రోజుల తర్వాత..👉ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ- 12 ఏళ్ల 10 రోజుల తర్వాత..👉జయదేవ్ ఉనాద్కట్- 12 ఏళ్ల రెండు రోజుల తర్వాత..👉దత్తారామ్ ధర్మాజీ హిండ్లేకర్- 9 ఏళ్ల 357 రోజులు తర్వాత..👉సయ్యద్ ముస్తాక్ అలీ- 9 ఏళ్ల 336 రోజులు తర్వాత..👉కొటారి సుబ్బన్న నాయుడు- 9 ఏళ్ల 329 రోజుల తర్వాత..👉విజయ్ మర్చంట్- 9 ఏళ్ల 308 రోజుల తర్వాత..👉దినేశ్ కార్తిక్- 8 ఏళ్ల 144 రోజులు తర్వాత..👉పార్థివ్ పటేల్- 8 ఏళ్ల 107 రోజుల తర్వాత..👉కరుణ్ నాయర్- 8 ఏళ్ల 83 రోజుల తర్వాత..బోటు ప్రమాదం నుంచి బయటపడి...కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో వన్డే మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీని డబుల్ సెంచరీగా.. త్రిశతకం(381 బంతుల్లో 303)గా మార్చిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడిన కరుణ్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి. రెండు వన్డేలు ఆడిన అతడు 46 రన్స్ చేయగలిగాడు. అయితే, 2017లో అజింక్య రహానే పునరాగమనం తర్వాత కరుణ్ నాయర్‌పై వేటు పడింది.ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌పై దృష్టి సారించిన కరుణ్ నాయర్.. 2023లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున మూడు మ్యాచ్‌లలో కలిపి 249 పరుగులు చేశాడు. సర్రే జట్టుపై సెంచరీ బాదాడు.బ్యాట్‌తో బంతిని రపా రపా.. రఫ్పాడించి! ఇక అదే ఏడాది రంజీల్లో విదర్భ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కరుణ్ కీలక పాత్ర పోషించాడు. మరుసటి సీజన్లో విదర్భ తరఫున విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఏకంగా 779 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. ఇక రంజీ ట్రోఫీలో అదే ఏడాది 863 పరుగులు చేశాడు. విదర్భకు టైటిల్‌కు అందించడంలో అతడిది ముఖ్య భూమిక.అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఎ తరఫున బరిలోకి దిగి.. డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఎంపికైన కరుణ్ నాయర్ తాజాగా తొలి టెస్టుతో రీ ఎంట్రీని ఖరారు చేసుకున్నాడు.కాగా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఏడాదే కరుణ్ నాయర్ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేరళలో ఆలయాన్ని దర్శించుకునే నిమిత్తం వెళ్లిన అతడు.. పంపా నదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.చదవండి: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. సాయి సుదర్శన్ అరంగేట్రం -
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. కరుణ్ ఉన్నాడా?
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు సమరానికి సమయం ఆసన్నమైంది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా (Eng vs Ind) మధ్య టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తొలుత బౌలింగ్ ఎంచుకుని.. గిల్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఇక ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ప్రస్థానం మొదలు కాగా.. చెన్నై చిన్నోడు సాయి సుదుర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా నయా వాల్, వెటరన్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ క్యాప్ అందుకున్నాడు.ఈ సందర్భంగా భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. బెకింగ్‌హామ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం అద్బుతంగా అనిపించిందని.. సిరీస్‌లో శుభారంభం అందుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.అదే విధంగా సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని.. కరుణ్ నాయర్‌కు కూడా తుది జట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా దశాబ్ద కాలం తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందే ఈ ఇద్దరూ సంప్రదాయ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.విమాన ప్రమాద మృతులకు నివాళిగాకాగా తొలి టెస్టు సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు ఇరుజట్ల ఆటగాళుల సంతాపం ప్రకటించారు. నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్ ఆర్మ్బ్యాండ్లతో బరిలోకి దిగారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 181 మంది భారత ప్రయాణికులతో పాటు 53 మంది బ్రిటిష్ పౌరులు మృతి చెందారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టువేదిక: హెడింగ్లీ మైదానం, లీడ్స్టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్తుదిజట్లుభారత్🏏యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్🏏జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
అక్కడ నేనిలాగే ఆడతా అంటే కుదరదు!.. సొంతంగా నిర్ణయాలు తీసుకో: సచిన్
ఇంగ్లండ్ (Ind vs Eng)తో టెస్టు సిరీస్ రూపంలో టీమిండియాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ ద్వారానే భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), స్పిన్ లెజెండ్ రవించంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ ఇదే కావడం.. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై మ్యాచ్‌లు జరుగనుండటంతో సారథిగా గిల్ ఈ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.వాటిని పట్టించుకోకు.. సొంతంగా నిర్ణయాలు తీసుకోఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ గిల్‌కు కీలక సూచనలు చేశాడు. ఒత్తిడిని జయిస్తేనే అతడు అనుకున్న ఫలితం రాబట్టగలడని పేర్కొన్నాడు. ‘‘‘అతడు అలా చేయాలి.. ఇలా చేస్తే బాగుండు’ అని బయటి నుంచి ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి.అయితే, అతడి దృష్టి మొత్తం టీమ్ ప్లాన్‌పై మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. డ్రెసింగ్ రూమ్‌లో జరిగే చర్చలపైనే ఫోకస్ చేయాలి. ప్రణాళికలకు అనుగుణంగానే జట్టు ముందుకు సాగుతుందా? లేదా? అన్న విషయాలను గమనిస్తూ ఉండాలి.ముఖ్యంగా మ్యాచ్‌కు ముందు రచించే ప్రణాళికలు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరిగ్గా అంచనా వేయగలగాలి. బయటి ప్రపంచం ఏమనుకుంటుందో అన్న విషయంతో సంబంధం లేకుండా.. దృష్టి మరల్చకుండా ఆటపైనే మనసు లగ్నం చేయాలి.కొన్నిసార్లు బయటి వ్యక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావచ్చు. అలాంటపుడు ఒత్తిడిని దరిచేరనీయకూడదు. డిఫెన్స్‌లో పడిపోకూడదు. ఎవరికి తోచినట్లుగా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ముందుగా చెప్పినట్లు డ్రెసింగ్ రూమ్‌లో చర్చలు, జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాలి. అంతకు మించి పెద్దగా చేయాల్సిందేమీ కూడా ఉండదు’’ అని సచిన్ టెండుల్కర్ చెప్పుకొచ్చాడు.ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదుఇక ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్న సచిన్ టెండుల్కర్.. ‘‘పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అలా అయితేనే ప్రణాళికలకు తగ్గట్లుగా ముందుకు వెళ్లే వీలు ఉంటుంది. ఇదేమీ వన్‌వే ట్రాఫిక్ కాదు.. ‘నేనిలాగే ఉంటా.. ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదు’.పిచ్ పరిస్థితులకు ఆకళింపు చేసుకున్న తర్వాతే అసలైన ఆట మొదలుపెట్టాలి’’ అని భారత ఆటగాళ్లకు సూచించాడు. ఏదేమైనా ఈసారి టీమిండియా ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని సచిన్ టెండుల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంటుందని అంచనా వేశాడు. కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్ గడ్డ మీద 1990- 2011 మధ్య సచిన్ ఐదు టెస్టు సిరీస్‌లు ఆడాడు.చదవండి: WI Vs AUS 1st Test: వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా -
కోహ్లి చెప్పింది నిజమే.. కానీ కుటుంబాన్నీ పోషించుకోవాలిగా!: బుమ్రా
టెస్టు క్రికెట్ గురించి టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) చేసిన వ్యాఖ్యలపై భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్పందించాడు. కోహ్లి మాటలతో తాను ఏకీభవిస్తానని.. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఒక్కోసారి తప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు.కాగా టెస్టు క్రికెట్ (Test Cricket)లో బ్యాటర్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు సాధించిన విరాట్ కోహ్లి.. ఇటీవలే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక పద్దెనిమిదేళ్ల కలను నిజం చేసుకుంటూ.. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి ట్రోఫీని ముద్దాడాడు. టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ ఐదు అంచెల కిందేక్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చాంపియన్‌గా నిలవడంతో ఈ రన్‌మెషీన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. తన జీవితంలోని గుర్తుంచుకోదగ్గ గొప్ప క్షణాల్లో ఇదొకటి అని తెలిపాడు. అయితే, తన దృష్టిలో టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ ఐదు అంచెల కిందే ఉంటుందని వ్యాఖ్యానించాడు. సంప్రదాయ ఫార్మాట్ అంటే తనకెంతో ఇష్టమని.. యువ, వర్ధమాన క్రికెటర్లు కూడా రెడ్ బాల్ క్రికెట్‌ను గౌరవించాలని సూచించాడు.టెస్టు క్రికెట్లో రాణిస్తే ప్రపంచంలో ఎక్కుడైనా ఏ ఫార్మాట్లోనైనా రాణించగలరనే ఆత్మవిశ్వాసం వస్తుందని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు.కోహ్లి చెప్పింది నిజమే‘‘కోహ్లి చెప్పినట్లు టెస్టు ఫార్మాట్లో ఆడటం ద్వారా ఆటగాడిగా గొప్ప గౌరవం లభిస్తుంది. నేను కూడా యువ క్రికెటర్లకు ఈ ఫార్మాట్‌ను గౌరవించమని, వీలైనంత ఎక్కువగా ఆడమనే చెప్తాను. అయితే, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. నేను కూడా చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్‌పై ప్రేమను పెంచుకున్నాను.నా దృష్టిలో అదే అత్యుత్తమమైనది. సంప్రదాయ క్రికెట్లో ప్రదర్శన ఆధారంగానే నా స్థాయిని అంచనా వేసుకునేవాడిని. అయితే, ఇప్పటి ఆటగాళ్ల ఆలోచనా విధానం వేరుగా ఉంది. టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.డబ్బు సంపాదించాలి కదా!ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. ఆటగాళ్ల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ఏదేమైనా ఫాస్ట్ బౌలర్లను ఈ విషయంలో మనం తప్పుబట్టలేము. టెస్టు క్రికెట్ ఆడేందుకు అందరి శరీరం సహకరించకపోవచ్చు.కెరీర్ కాపాడుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు సంపాదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంపై అదనపు భారం వేసి కష్టపెట్టడం సరికాదు. అందుకే చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటారని అనుకుంటున్నా.టెస్టు క్రికెట్ ఆడాలనే కోరిక బలంగా ఉన్నా.. శరీరం సహకరించకపోతే వారు కూడా ఏమీ చేయలేరు కదా!’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా వెన్నునొప్పి కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా.. తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అతడు పునరాగమనం చేయబోతున్నాడు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20)నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్ టెండుల్కర్
‘పటౌడీ ట్రోఫీ’ పేరు మార్పు అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)దే తుది నిర్ణయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అన్నాడు. అయితే, పటౌడీ వారసత్వాన్ని కొనసాగించేలా విజేత జట్టు కెప్టెన్‌కు.. పటౌడీ మెడల్ అందించేలా తాను చేసిన ప్రయత్నం సఫలమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.ఈసీబీ తీరుపై విమర్శలుకాగా భారత్- ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు పటౌడీ ట్రోఫీ అనే పేరు ఉండేది. అయితే, తాజాగా సిరీస్ నేపథ్యంలో ఈ పేరును టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా మార్చారు. ఈ నేపథ్యంలో ఈసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి.అయినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడి ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వచ్చేలా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ పేరును ఈసీబీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పటౌడీ గౌరవం తగ్గకుండా ఏదో ఒక రూపంలో వారిని గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ సచిన్ టెండుల్కర్ ఈసీబీకి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈసీబీ భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్ అందజేస్తామని వెల్లడించింది. ఈ అంశాలపై సచిన్ టెండుల్కర్ తాజాగా స్పందించాడు.జై షా, బీసీసీఐ, ఈసీబీతో మాట్లాడాను‘‘పటౌడీ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోవాలి. భారత క్రికెట్‌కు పటౌడీ కుటుంబం చేసిన సేవలు మనకు స్ఫూర్తిదాయకం. వారి పేరుకు భంగం కలగకుండా.. లెగసీ కొనసాగేలా నా వంతు ప్రయత్నం చేస్తానని పటౌడీ ఫ్యామిలీకి చెప్పాను.ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ, ఈసీబీతో ఈ విషయం గురించి మాట్లాడాను. నా ఆలోచనలను వారితో పంచుకున్నాను. ఈ క్రమంలోనే విన్నింగ్ కెప్టెన్‌కు పటౌడీ మెడల్ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.ఇరుజట్ల మధ్య ఏదేని ట్రోఫీ రిటైర్ చేయడంపై బీసీసీఐ, ఈసీబీలదే తుది నిర్ణయం. అయితే, పటౌడీ పేరును ఏదో ఒక రూపంలో కొనసాగించేలా చేయాలన్న నా ప్రయత్నం ఫలించింది’’ అని బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ శకం మొదలుకానుంది. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడబోయే తొలి టెస్టు సిరీస్ ఇదే కావడంతో.. టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.పటౌడీ ఫ్యామిలీ గౌరవార్థంకాగా టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి పేరుంది. ఆయన ససెక్స్, ఆక్స్ఫర్డ్ జట్ల తరఫున కూడా క్రికెట్ ఆడారు. ఇక మన్సూర్ తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ కూడా టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు ఆడటం విశేషం. ఈ నేపథ్యంలోనే వారి గౌరవార్థం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచారు. కాగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భార్య షర్మిలా ఠాగూర్. ఆమె బాలీవుడ్ నటి. వీరి సంతానం సైఫ్ అలీ ఖాన్, సోహా అలీఖాన్ కూడా బాలీవుడ్ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్ హీరోయిన్గా కొనసాగుతోంది.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
ధోని వరల్డ్ రికార్డుపై కన్నేసిన పంత్
టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant).. భారత దిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు 267 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నాయి.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ సిరీస్‌తో టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ప్రస్థానం మొదలుకానుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా 2018లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్.. ఇంగ్లండ్‌తో తన తొలి మ్యాచ్ ఆడాడు.ట్రెంట్ బ్రిడ్జి వేదికగా నాడు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో పంత్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 24, 1 పరుగు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అరంగేట్రంలో అంతంత మాత్రంగానే ఆడిన పంత్.. ఇంగ్లండ్ మీద ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.రెండు సెంచరీలుఇప్పటి వరకు మొత్తంగా అక్కడ ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన పంత్ 511 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ల జాబితాలో 27 ఏళ్ల పంత్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో టీమిండియా లెజెండ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌లో ధోని మొత్తంగా 778 పరుగులు సాధించాడు. అతడిని అధిగమించాలంటే.. పంత్ ఇంకో 267 పరుగులు చేయాలి. తాజా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో.. పంత్ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఇదేమీ అంతకష్టం కాబోదు. మరి.. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ ఈసారి ధోని వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి!!కాగా రిషభ్ పంత్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టెస్టు మ్యాచ్‌లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే..1. మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 778 పరుగులు2. రోడ్నీ మార్ష్(ఆస్ట్రేలియా)- 773 పరుగులు3. జాన్ హెన్రీ (సౌతాఫ్రికా)- 684 పరుగులు4. ఇయాన్ హేలీ (ఆస్ట్రేలియా)- 624 పరుగులు5. జెఫ్రీ డుజాన్ (వెస్టిండీస్)- 604 పరుగులు6. ఫారూఖ్ ఇంజనీర్ (ఇండియా)- 563 పరుగులు7. ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 521 పరుగులు8. బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా)- 513 పరుగులు9. రిషభ్ పంత్ (ఇండియా)- 511 పరుగులు.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
గిల్ కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వస్తాడు: టీమిండియా దిగ్గజం
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద తొలి టెస్టు సిరీస్ ఆడబోతోంది. లీడ్స్‌లో శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య పోటీ ఆరంభం కానుంది.ఆ ముగ్గురికే సాధ్యమైందిఅయితే, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలవడం అంత సులువేమీ కాదు. ఇప్పటి వరకు టీమిండియా కేవలం మూడుసార్లు మాత్రమే అక్కడ విజయపతాక ఎగురవేసింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో.. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో.. చివరగా 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇంగ్లండ్‌ను తమ స్వదేశంలో భారత్ ఓడించగలిగింది.ఈ నేపథ్యంలో.. కఠిన సవాలుకు సిద్ధమైన గిల్ సేన.. సొంతగడ్డపై మరింత పటిష్టంగా కనిపించే స్టోక్స్ బృందాన్ని ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ భారత జట్టు కొత్త సారథి శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ తప్పక ట్రోఫీతో తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఈ మేరకు.. ‘‘అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కచ్చితంగా ట్రోఫీతోనే అతడు ఇంగ్లండ్ నుంచి తిరిగి వస్తాడు. మనల్ని గర్వపడేలా చేస్తాడు. టీమిండియాకు గుడ్‌లక్. మనోళ్లు విజేతలుగా తిరిగి వస్తారు. వారికి ఆ సత్తా ఉంది’’ అని కపిల్ దేవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాడు.విచిత్రంగా అనిపించింది..టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది. ఈ విషయంపై స్పందించిన కపిల్ దేవ్.. ‘‘నాకైతే ఇది విచిత్రంగా అనిపించింది.ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది. మరేం పర్లేదు. క్రికెట్లో అన్నీ జరుగుతాయి. క్రికెట్ అంటే క్రికెటే. మైదానంలో ఆటగాళ్ల స్ఫూర్తి అలాగే ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా పటౌడీ పేరును తొలగించడంపై ఈసీబీపై విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ పేరిట పతకం అందించాలని ఈసీబీ నిర్ణయించింది.చదవండి: ‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన తుదిజట్టు (భారత్)ను ప్రకటించాడు. కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్‌కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్‌లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు లీడ్స్ వేదిక. ఈ మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.అశూ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ లీడ్స్ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్‌తో పాటు కరుణ్ నాయర్‌కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌ను అశూ వెల్లడించాడు.అందుకే కరుణ్‌కే ఓటుఅయితే, ఆరో స్థానం కోసం కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్ దృష్ట్యా కరుణ్‌కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్ ఆప్షన్ కోసం శార్దూల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అత్యధిక వికెట్లు తీసేది అతడే!అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లిష్ పేసర్ క్రిస్ వోక్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్ బషీర్ హయ్యస్ట్ వికెట్ టేకర్ అవుతాడని పేర్కొన్నాడు.టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్‌కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. పరుగుల వీరుడిగా పంత్!ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్ పంత్ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్‌ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ మెడల్ అందిస్తారు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు అశ్విన్ ఎంపిక చేసిన భారత తుదిజట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ల అత్యుత్తమ Ind-Eng జట్టు.. కోహ్లికి నో ప్లేస్!
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) టెస్టు సిరీస్ గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఇరుజట్లకు ఇదే తొలి సిరీస్. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది.ఇక విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ కూడా ఇదే. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో దిగ్గజాలు లేని భారత జట్టు స్టోక్స్ బృందాన్ని వారి సొంతగడ్డపై ఢీకొట్టనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.విరాట్ కోహ్లికి నో ప్లేస్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్.. 21వ శతాబ్దానికి సంబంధించి భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారు. అయితే, వీరిద్దరు సంయుక్తంగా ఎంచుకున్న ఈ జట్టులో టీమిండియా దిగ్గజ బ్యాటర్, లెజెండరీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం చోటు ఇవ్వలేదు.ఈ విషయం గురించి నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. టీమిండియా- ఇంగ్లండ్ నుంచి మేము ఎంపిక చేసుకున్న అత్యుత్తమ జట్టులో కోహ్లి లేడు. జో రూట్ కూడా లేడు. వారిద్దరు లేకపోవడాన్ని అందరూ జీర్ణించుకోలేకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్ నుంచి విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌తో పాటు ‘వాల్’ రాహుల్ ద్రవిడ్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ప్రస్తుత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ చోటు ఇచ్చారు.21వ శతాబ్దానికి గానూ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ ఎంచుకున్న భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..వీరేందర్ సెహ్వాగ్, అలిస్టర్ కుక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్-2025కి భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవేభారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్. -
భారత్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీమిండియా(Ind vs Eng 1st Test)తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జాక్ క్రాలేతో పాటు బెన్ డకెట్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో ఓలీ పోప్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో భారీ శతకం (171)తో విరుచుకుపడిన పోప్‌నకు సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వగా.. జేకబ్ బెతెల్ (Jacob Bethell)కు నిరాశే మిగిలింది.ఇక బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఈ జట్టులో క్రిస్ వోక్స్‌కు స్థానం దక్కింది. డిసెంబరు తర్వాత అతడు ఇంగ్లండ్ తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇక దుర్హం సీమర్ బ్రైడన్ కార్సే కూడా భారత్‌తో తొలి టెస్టులో భాగం కానున్నాడు. సొంతగడ్డపై అతడికి ఇదే మొదటి టెస్టు కావడం విశేషం.చివరగా అతడు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో ఆయా దేశాల్లో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్నాడు. మరోవైపు.. జేమీ స్మిత్ వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్లకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో ఇదే తొలి సిరీస్. శుక్రవారం (జూన్ 20) నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానం ఇందుకు వేదిక.టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.భారత్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.సిరీస్ పేరు అదే.. గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ పతకంటీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ఇరు దేశాల దిగ్గజాలను గుర్తు చేసేలా టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy) పేరు ఖరారైంది. ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును మారుస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గతంలోనే ప్రకటించింది. దాంతో పటౌడీ పేరు తొలగించడంపై విమర్శలు వచ్చి చర్చ జరిగింది. కానీ ఈసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.తాము అనుకున్న పేరునే ఖాయం చేసింది. తొలి టెస్టుకు ముందు రోజు ఈ నెల 19న ఈ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. అయితే పటౌడీని ఏదో ఒక రూపంలో గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి మాత్రం ఈసీబీ సానుకూలంగా స్పందించింది. టెస్టు సిరీస్‌లో విజేతగా నిలిచే కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్’ను అందజేస్తారు.కాగా భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పటౌడీ ససెక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జట్ల తరఫున కూడా ఆడగా... ఆయన తండ్రి ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ భారత్, ఇంగ్లండ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో వారి గౌరవార్ధం ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా పిలిచారు. అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్లుగా సచిన్ టెండూ ల్కర్ (200), జేమ్స్ అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు -
గిల్, బుమ్రా కాదు!.. భారత్‌కు గేమ్ ఛేంజర్లు వీరే: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ బృందంతో తలపడే భారత జట్టులో 23 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నాడని జోస్యం చెప్పాడు. అదే విధంగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు కీలకం కానున్నాడని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ (Tendulkar-Anderson Trophy) ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన బ్రేకౌట్ స్టార్స్‌పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వీరిద్దరు కీలకం‘‘టీమిండియా తరఫున ఈ పర్యటనలో రాణించే ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ముందు వరుసలో ఉంటాడని చెప్పగలను. సర్రీ తరఫున కౌంటీ క్రికెట్లో అతడు అద్భుతంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు’’ అని మాంటీ పనేసర్ పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘శార్దూల్ ఠాకూర్‌కు ఇది కీలకమైన టూర్. అతడి చేరికతో టీమిండియాకు రెండో బౌలిండ్ చేంజ్ ఆప్షన్ లభించినట్లయింది. మెరుగైన ఎకానమీతో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. కాబట్టి భారత బౌలింగ్ విభాగంలో అతడు కీలక పాత్ర పోషించనున్నాడు’’ అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు. కాగా గిల్, బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లను కాదని పనేసర్ ఈ ఇద్దరి పేర్లు చెప్పడం గమనార్హం.అత్యధిక పరుగుల వీరుడిగాకాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఐపీఎల్-2025లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ స్టార్ బ్యాటర్.. 15 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 759 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మూడు వన్డేలు ఆడిన సాయి సుదర్శన్ 127 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఒక టీ20 మ్యాచ్ ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక టెస్టుల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయని 23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో ఆ కలను నెరవేర్చుకోనున్నాడు.అతడి రీ ఎంట్రీమరోవైపు.. 33 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ 2024లో సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత.. ఇప్పుడే మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌తో సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక ఈ సిరీస్‌కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు:శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్! -
కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో భారత జట్టు స్టోక్స్ బృందంతో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడే తొలి టెస్టు సిరీస్ కావడంతో గిల్ సేన ఎలా ఆడబోతుందన్న అంశంపైనే క్రికెట్ ప్రేమికుల దృష్టి కేంద్రీకృతమైంది.అతడికి ఎవరూ సాటిరారుఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోహ్లి సేవలను కచ్చితంగా మిస్ అవుతుందని.. అతడి పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. క్లాస్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగడం భారత జట్టుకు కాస్త కష్టంగానే ఉంటుందని తెలిపాడు.ఈ మేరకు.. ‘‘పోరాటతత్వం గల.. అదే విధంగా క్రీడాస్పూర్తిని రగిల్చే కోహ్లిని టీమిండియా మిస్ అవుతుందనడంలో సందేహం లేదు. గెలుపు కోసం అతడు పడే తాపత్రయం, అందుకోసం అతడు చేసే పోరాడే విధానానికి ఎవరూ సాటిరారు.18వ నంబర్‌ను అతడు తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వేరొక భారత ఆటగాడి జెర్సీపై నంబర్ 18ను చూడటం కాస్త చిత్రంగానే అనిపించవచ్చు. సుదీర్ఘకాలంగా అతడు టీమిండియా క్లాస్ ప్లేయర్‌గా కొనసాగిన తీరు అమోఘం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.కోహ్లి ఉంటేనే మజాఅదే విధంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తాను అతడి మెసేజ్ చేశానన్న స్టోక్స్... అతడు లేని టెస్టు క్రికెట్ ఆడటం అంత గొప్పగా ఉండదని చెప్పానన్నాడు. ‘‘ విరాట్ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటంలో ఎంతో మజా ఉంటుంది. కానీ ఇకపై అది జరుగబోదని తెలిసి నాకు కాస్త విచారంగా అనిపించింది.మైదానంలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నట్లే నేను, కోహ్లి భావిస్తాం. ఆట విషయంలో మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు మీద అతడు ఎంతో గొప్పగా ఆడాడు. అతడొక క్లాస్ ప్లేయర్’’ అని స్టోక్స్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.దిగ్గజ కెప్టెన్ కూడా!కాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్లో.. 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో ముప్పై శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. అంతేకాదు.. గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48 విజయాలు), స్టీవ్ వా(41 విజయాలు) తర్వాత అత్యధిక టెస్టు విజయాలు (40) అందుకున్న సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్‌గా పది టెస్టులు ఆడిన కోహ్లి.. మూడింట జట్టును గెలిపించాడు.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..!