
‘‘మా అక్కకు క్యాన్సర్. గత రెండు నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతోంది. ఇంత వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. తను కోలుకుంటోంది.
ఈ మ్యాచ్‌లో నా ఆటతీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. మా అక్కకు నా ఈ మ్యాచ్‌ను అంకితమిస్తున్నా. ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదు. ఇది నీ కోసమే అక్కా.. బంతి అందుకున్న ప్రతిసారి నా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.
నీ రూపమే నా మదిలో మెదులుతుంది. నిన్ను సంతోషరచాలనే నా ప్రయత్నాలు. మేమంతా నీతోనే ఉన్నాం’’ అంటూ టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. తన ప్రదర్శనను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అక్కకు అంకితమిచ్చాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన.. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఆది నుంచే ఆధిపత్యం
ఇలాంటి తరుణంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు బరిలో దిగిన భారత్.. ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 608 పరుగుల మేర భారీ లక్ష్యం విధించగలిగింది.
కీలక వికెట్లు కూల్చి.. విజయం అందించి
ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తవుతుందనగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలిరోజే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం కాగా.. ‘డ్రా’ భయం అభిమానులను వెంటాడింది. కానీ ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు.
అద్భుతమైన డెలివరీలతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88) రూపంలో ఏకంగా ఐదు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్.. బ్రైడన్ కార్స్ (38) వికెట్‌తో సిక్సర్ కొట్టాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
బుమ్రా లేడు కాబట్టే..
నిజానికి రెండో టెస్టులో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కింది. ఇక అక్క క్యాన్సర్‌తో పోరాడుతున్న వేళ.. ఓవైపు తోబుట్టువు గురించి మనసులో ఆందోళనలు చెలరేగుతున్నా ఈ రైటార్మ్ పేసర్ తన ఏకాగ్రత చెదరనీయలేదు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
#AkashDeep’s 6/99 was nothing short of sensational.
A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025
ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో మెరిశాడు. ఇలా రెండో టెస్టులో మొత్తంగా పది వికెట్లు తీసి టీమిండియా చిరస్మరణీయ విజయంలో కీలకంగా మారాడు. మిగతా వాళ్లలో సిరాజ్ మొత్తంగా ఏడు వికెట్లు కూల్చగా.. ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు (జూలై 2-6)
వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
భారత్: 587 & 427/6 డిక్లేర్డ్
ఇంగ్లండ్: 407 & 271
ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్.
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్