
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) విడాకుల కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భరణం కింద నెలకు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. షమీ నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ (Hasin Jahan)కు భరణం కింద నెలకు రూ. 1.5 లక్షలు.. అదే విధంగా వీరి కుమార్తె ఐరా నిర్వహణ ఖర్చు నిమిత్తం నెలకు రూ. 2.5 లక్షల చొప్పున చెల్లించాలని పేర్కొంది.
అదే విధంగా.. 2018 నుంచి ఈ మేరకు ఇద్దరికీ నెలకు నాలుగు లక్షల చొప్పున చెల్లించాలని హైకోర్టు షమీని ఆదేశించింది. కాగా షమీపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడు స్త్రీలోలుడని, ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపించిన హసీన్.. తనపై గృహహింసకు కూడా పాల్పడ్డాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఏడేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో కుమార్తెను తన వద్దే పెట్టుకున్న హసీన్.. భరణం కింద తనకు రూ. 10 లక్షల చొప్పున చెల్లించేలా షమీని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు రూ. 1.3 లక్షలు మాత్రమే చెల్లించేలా దిగువ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హసీన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఈ సందర్భంగా జస్టిస్ ముఖర్జీ.. ‘‘ ఈ కేసులో పిటిషనర్ నంబర్ 1 అనగా భార్యకు నెలకు రూ. 1.50 లక్షలు.. అదే విధంగా ఆమె కూతురుకి రూ. 2.50 లక్షలు ఇవ్వడమే న్యాయం. వీరిద్దరి జీవనం సజావుగా సాగేందుకు ఈమాత్రం భర్త చెల్లించాల్సిందే’’ అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
పిటిషనర్ భర్త ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారన్న న్యాయస్థానం.. అతడి నుంచి విడిపోయిన భార్య మరో పెళ్లి చేసుకోలేదని.. కుమార్తెను కూడా ఆమె పెంచుతున్నందున ఈమాత్రం భరణం సబబేనని పేర్కొన్నట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది. తల్లిదండ్రులతో కలిసి ఉన్నపుడు కుమార్తె జీవనశైలి ఎలా ఉండేదో.. ఇప్పుడే అదేలా ఉండాలన్నా, ఆమె భవిష్యత్తుకు బాగుండటానికి నెలకు రూ. 2.50 లక్షల మొత్తం చెల్లించాల్సిందేనని షమీని ఆదేశించినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని దిగువ కోర్టును ఆదేశించినట్లు తెలిపింది.
ఇక హైకోర్టు ఆదేశాల అనంతరం హసీన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ఏడేళ్లుగా నా హక్కుల కోసం పోరాడే క్రమంలో నేను దాదాపుగా నా సర్వస్వం కోల్పోయాను. నా కూతురిని మంచి పాఠశాలలో కూడా చేర్చించలేకపోయాను. ఇప్పుడు నాకు కాస్త ఊరట లభించింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు చెబుతున్నా’’ అని తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు.
కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్‌గా ఉన్న సమయంలో హసీన్ జహాన్‌కు షమీతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. వీరు 2014లో పెళ్లి చేసుకోగా మరుసటి ఏడాదే కుమార్తె జన్మించింది. అయితే, 2018 నుంచి విభేదాలు తారస్థాయికి చేరడంతో షమీ- హసీన్ జహాన్ విడిగా ఉంటున్నారు.
ఇక షమీ కెరీర్ విషయానికొస్తే.. 34 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ ఫిట్‌నెస్ లేమి కారణంగా దాదాపు ఏడాది ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డేలతో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన షమీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఆడాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు.
అయితే, ఐపీఎల్-2025లో మాత్రం షమీ పూర్తిగా తేలిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీశాడు. అనంతరం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.