
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.
ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.
అయితే, ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.
భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.
ఒకవేళ భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.
మూడుసార్లు పోటీ పడే అవకాశం!
అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు.
కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.
తటస్థ వేదిక కాబట్టి
కాగా పాకిస్తాన్‌తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల బ్రాడ్‌కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్‌లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!
చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ