సాక్షి, స్పోర్ట్స్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం షమీ భార్యను ఈ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. నలుగురు అధికారులు షమీ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆమె తడబడుతూ వారికి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం ఆదివారం అమ్రోహలోని పేసర్ షమీ ఇంటికి చేరుకున్నారు.
ఆదివారం క్రికెటర్ ఇంటికి చేరుకున్న అవినీతిశాఖ అధికారులు షమీని, కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. షమీ ప్రవర్తన, అతడు ఎలా ఉండేవాడు అతడికి సంబంధించిన వ్యక్తిగత అంశాలపై కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. షమీకి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనపై వేధింపులకు పాల్పడ్డాడని హసీన్ జహాన్ ఆరోపించారు. దాంతో పాటుగా పాకిస్తాన్ మహిళతో నగదు తీసుకుని క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేశాడంటూ కీలకమైన ఆరోపణలు చేసిన ఆడియో టేపులను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. హసీన్ నా మాజీ భార్య అంటూ, ఆమెతో తనకు ఇద్దరు పిల్లలు పుట్టారంటూ ఓ వ్యక్తి బయటకు రావడంతో షమీ భార్య కాస్త తగ్గినట్లు కనిపించారు.
షమీ భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశానుసారం బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు విచారణ చేపట్టారు. వారంలో రోజుల్లోగా దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని గడువు ఇచ్చారు. అధికారుల నివేదిక మీద షమీ క్రికెట్ కెరీర్ (భవిష్యత్తు) ఆధారపడి ఉంటుంది. మరోవైపు భార్య తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనకు మరణశిక్ష విధించాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment