
బ్రిస్టల్: బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (40 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్‌తో రెండో టి20లో భారత మహిళల క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది.
కాగా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
రిచా ఘోష్ (20 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడింది. గత మ్యాచ్‌లో సెంచరీతో విజృభించిన స్మృతి మంధాన (13; 2 ఫోర్లు), షఫాలీ వర్మ (3), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్‌బెల్ 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్ అర్ధ శతకం (54)తో రాణించగా.. మిగిలిన వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
ఇక భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు దక్కించుకోగా.. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన అమన్‌జోత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.