ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేనకు శుభాభినందనలు తెలిపాడు. అద్భుత ఆట తీరుతో ముందుకు సాగుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు.
భారత్ వర్సెస్ పాక్
దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 10)న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభమైంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆదివారం(ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్ లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఓపెనర్ యస్తికా భాటియా(17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది.
అదరగొట్టిన జెమీమా- రిచా
మరో ఓపెనర్ షఫాలీ వర్మ 25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెస్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16 పరుగులకే పెవిలియన్ చేరిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది.
ఇదే అత్యధిక ఛేదన
జెమీమా(53)- రిచా(31) జోడీ అద్భుతంగా రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని గెలుపుతో ఆరంభించింది. కాగా.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టుకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అంతేకాదు.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కిది ఐదో విజయం.
వాట్ ఏ విన్
ఈ నేపథ్యంలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా భారత మహిళా జట్టు ఫొటో షేర్ చేస్తూ వారిని అభినందించాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలోనూ.. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. వాట్ ఏ విన్’’ అని కొనియాడాడు. ప్రతి టోర్నమెంట్‌లోనూ సత్తా చాటుతూ ఆటను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబులిచ్చాడు.
చదవండి: SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్
ధర్మశాల టెస్టు వైజాగ్‌లో?
Comments
Please login to add a commentAdd a comment