తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఒకవైపు పంట దిగుబడి రాక..మరోవైపు చేసిన అప్పులు తీర్చే దారిలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్య తనకున్న రెండెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగు చేశాడు. వర్షాభావంతో పంట దిగుబడి సరిగా లేదు. దీంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక బుధవారం రాత్రి పురుగు మందుతాగాడు. భూపాలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు.
అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పూలకుంటకు చెందిన రైతు ఆదినారాయణ రెడ్డి(65) అప్పుల బాధతో ఈనెల 20వ తేదీన పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. ఈయన తనకున్న ఐదెకరాల్లో ద్రాక్ష సాగు చేశాడు. సరైన ప్రతిఫలం దక్కకపోవటంతో ఆవేదన చెందాడు. ఎప్పుటికప్పుడూ చేసిన అప్పులు రూ.8 లక్షలకు చేరడంతో అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పెద్ద మరణంతో పాటు..చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.