ఊపిరి ఆడకే ప్రత్యూష మృతి | Post-mortem report reveals it is 'clear case of suicide' | Sakshi
Sakshi News home page

ఊపిరి ఆడకే ప్రత్యూష మృతి

Published Sat, Apr 2 2016 7:56 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఊపిరి ఆడకే ప్రత్యూష మృతి - Sakshi

ఊపిరి ఆడకే ప్రత్యూష మృతి

ముంబై : 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ఆనందిగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రత్యూష బెనర్జీ(24) పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతమయింది. ఆమెది ఆత్మహత్యేనని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఊపిరి ఆడని స్థితిలో ఉక్కిరిబిక్కిరై ఆమె మరణించినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యూష తన సొంత ఫ్లాట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో ఉన్న అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, ఆమె మృతికి ప్రియుడు రాహులే కారణమని పలు కథనాలు వినిపిస్తున్నాయి. ముంబై పోలీసులు రాహుల్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తమ కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలుసని, ఆమె మృతి విషయమై రాహుల్ తప్పక సమాధానం చెప్పాల్సి ఉందని ప్రత్యూష తల్లి వాపోతున్నారు. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

మరోపక్క ప్రియుడు రాహుల్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యూషను ఆసుపత్రికి తీసికెళ్లాక.. ఆమె మృతి చెందిందని నిర్థారణ అయిన తరువాత రాహుల్ ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడని చెబుతున్నారు. అలాగే శుక్రవారం ఇరువురు ఓ మాల్లో గొడవ పడ్డారని, ఆ సమయంలో రాహుల్ ప్రత్యూషపై చేయి చేసుకున్నాడని.. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె విగత జీవిగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ చిన్న వయసులో ప్రత్యూష ఈ పరిస్థితుల్లో మరణానికి చేరువవడం పలువురిని కలచివేసింది. ప్రేమ కారణంగా అర్థాంతరంగా తనువు చాలించిన తారలను గుర్తుచేసింది. వెలుగు జిలుగుల జీవితాలను చీకటిగా మార్చేసిన 'ప్రేమ' మరోసారి వార్తల్లోకెక్కింది. అశ్రు నయనాల మధ్య ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement