'రాహుల్ చూడు.. ఇప్పుడేం చేస్తానో'
ఏప్రిల్ 1న తాను ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందు టీవీనటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కు ఫోన్ చేసింది. దాదాపు 201 సెకన్ల నిడివితో ఉన్న ఈ టెలిఫోనిక్ సంభాషణలో పలు కీలక విషయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో ఈ సంభాషణ ఆడియో క్లిప్పును వినాలని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి మృదుల భట్కర్ నిర్ణయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మృదుల సోమవారం ప్రధాన నిందితుడు రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కీలకంగా భావిస్తున్న ప్రత్యూష-రాహుల్ చివరి ఫోన్ కాల్ లో ఏం మాట్లాడారు. ఆ ఆడియోక్లిప్పులో ఏముంది. తదితర అంశాలను తాజాగా ముంబైకి చెందిన 'మిడ్-డే' టాబ్లాయిడ్ ప్రచురించింది.
ఆడియో క్లిప్ సంభాషణ
ప్రత్యూష: నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో..
రాహుల్: ఏమైంది. నేను ఇంటికొచ్చాక నీతో మాట్లాడుతాను. నేను దారిలో ఉన్నాను. నేను ఇంటికొచ్చేవరకు ఏమీ చేయకు.
ప్రత్యూషను ఆత్మహత్యకు పూరికొల్పినట్టు ప్రాథమిక ఆధారాలు లేనందున రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రాహుల్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను సెషన్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 'బాలికా వధు' సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బెనర్జీ మృతికి రాహులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.