సాక్షి,అమరావతి : ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేశారు. రివ్యూ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల పేరిట ఇబ్బంది పెట్టారు. కొత్త నియామకాలు చేయకపోవడంతో ఉద్యోగులపై పని భారం రెట్టింపైంది. సమయానికి డీఏలు, ఐఆర్‌లు ఇవ్వకుండా, పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఇక్కట్లకు గురిచేశారు.
బలవంతపు పదవీ విరమణ జీఓల జారీకి ప్రభుత్వం ప్రయత్నిస్తే.. ఉద్యోగ సంఘాలు వాటిపై పోరాడకుండా సర్కారుకు వత్తాసు పలికి ఉద్యోగుల్ని మోసగించాయి. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికి ఉద్యోగ వ్యతిరేక సర్కారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 27 శాతం ఐఆర్ ఇస్తానని చెప్పడంతో పాటు సీసీఎస్‌ను రద్దు చేస్తామంటున్నారు. ఇది ఉద్యోగులకు శుభవార్త’ అంటున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమాఖ్య కన్వీనర్ కె వెంకటరామిరెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ..
ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యాయి
రాష్ట్రంలో ఉద్యోగులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. ఇప్పుడు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు రెండూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వీరిద్దరూ కుమ్మక్కయి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం సిగ్గుచేటు. మూడు డీఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? 50 సంత్సరాలకే బలవంతపు పదవీవిరమణ చేయించేలా దుర్మార్గమైన జీఓలు తయారు చేసిన ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? ఎన్నడూ లేని విధంగా పోస్టుడేటెడ్ ఐఆర్, డీఏలు ఇచ్చే ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? మా దగ్గర డబ్బులు వసూలు చేసి పనిచేయని హెల్త్‌కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మా సంక్షేమం గురించి ఆలోచిస్తుందని చెప్పాలా.?
డీఏలు రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు
ఇప్పటికి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2014 నుంచి పెండింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు డీఏలను రద్దు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 50 ఏళ్లకే బలవంతపు పదవీవిరమణ జీఓల విడుదలకు ప్రయత్నించడం ముమ్మాటికి నిజం. ఆ జీఓల విషయం లీక్ చేశారన్న నెపంతో ఇద్దరు అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఉద్యోగికి 50 సంవత్సరాలు రాగానే.. ఆ ఉద్యోగి గత 5 సంవత్సరాల పనితీరు ఆధారంగా ఉద్యోగంలో ఉంచాలా? లేదా? అనేది ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ జీఓల వల్ల ఉద్యోగం పోవడం మాట పక్కిన పెడితే వేధింపులు ఎక్కువవుతాయి. ఇలాంటి దుర్మార్గమైన జీఓలు ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాకుండా అడ్డుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకులకు ఒక సవాలు విసురుతున్నా. ధైర్యముంటే అలాంటి జీఓలు లేవని బహిరంగంగా చెప్పండి.
ఎవరికీ సెంటు స్థలం ఇవ్వలేదు
ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగికీ స్థలం ఇవ్వలేదు. నెల క్రితం ఇళ్ల స్థలాల మంజూరులో నియమ నిబంధనలకు సంబంధించి పాలసీని మాత్రమే తయారుచేసింది. ఎప్పుడిస్తారో చెప్పలేదు.
20 ఐఆర్‌కే సన్మానాలు చేస్తున్నారు
ప్రభుత్వం 20 శాతం ఐఆర్ ఇచ్చింది. దీనికే సన్మానాలు చేశారు. 2009లో 22 శాతం, 2014లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అప్పుడు ఎవరికి సన్మానాలు చేయలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం రావాలి. సీపీఎస్ రద్దు చేయడంతో పాటు, సక్రమంగా డీఏలు ఇవ్వడం, మంచి ఐఆర్ ప్రకటించి సకాలంలో పీఆర్‌సీ అమలు చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి.
27 శాతం ఐఆర్ హామీపై హర్షం
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీనివ్వడం చాలా గొప్ప విషయం. 27 శాతం ఐఆర్ అంటే ఫిట్‌మెంట్ తప్పకుండా 30 శాతానికి పైగానే ఇస్తారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ హామీతో 1.8 లక్షలకు పైగా కుటుంబాలకు మంచి జరుగుతుంది.
లక్ష ఉద్యోగాల్ని భర్తీ చేయాలి.. పనిభారం రెట్టింపైంది
చాలా మంది ఉద్యోగులు పనివేళలతో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు. ప్రభుత్వం ఉద్యోగులపై నమ్మకంతో పనిచేయించుకోవాలని గాని బయోమెట్రిక్ పేరిట ఉద్యోగుల్ని వేధించడం సరికాదు. ఉద్యోగులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. రివ్యూ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల హడావుడితో ఉద్యోగులపై ఒత్తిడి పెడుతున్నారు.
నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంలో లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులపై పని భారం రెట్టింపవుతోంది. సచివాలయంలో ఒక సెక్షన్‌కు రెండు ఏఎస్‌ఓ పోస్టులు అవసరం కాగా.. ప్రస్తుతం రెండు సెక్షన్లకు ఒక్క ఏఎస్‌ఓ మాత్రమే పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment