సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థకు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) స్టే విధించింది. గతేడాది ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ ఉన్నపళంగా మూసేయడం తెలిసిందే. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినట్టు సెబీ తన విచారణలో భాగంగా తేల్చింది.
మ్యూచువల్ ఫండ్స్‌విభాగాలకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కినట్టు గుర్తించింది. దీంతో ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ.512 కోట్లరూపాయల ఫీజులను, ఈ మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రెండేళ్లపాటు కొత్తగా డెట్ పథకాలను ప్రారంభించకుండా వేటు వేసింది. జరిమానాలను కూడా విధించింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) ముందు సవాలు చేసింది. వాదనలు విన్న శాట్..రూ.512 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించడం అన్నది చాలా అధిక మొత్తంగా అభిప్రాయపడింది. కనీస ఖర్చులను ఇందులో మినహాయించడం భావ్యంగా పేర్కొంది. దీంతోరూ.250 కోట్లను ఎస్క్రో ఖాతాలో మూడు వారాల్లోగా జమ చేయాలని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్‌ను ఆదేశించింది. ఇప్పటికీ 21 డెట్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నిర్వహిస్తుండగా.. వీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడాన్ని శాట్ పరిగణనలోకి తీసుకుంది. ఆరు పథకాలను మూసేసినందున కొత్త పథకాలను ప్రారంభించకుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసులో స్పందన దాఖలు చేయాలంటూ సెబీకి నాలుగువారాల వ్యవధినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment