Franklin Templeton Company
-
ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
ముంబై: ఈక్విటీ మార్కెట్లో రాబడులు వచ్చే మూడేళ్ల కాలంలో క్రితం మూడేళ్ల స్థాయిలో మాదిరి గొప్పగా ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే మూడేళ్లలో ఈక్విటీ రాబడులు గౌరవనీయ స్థాయిలో, ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని ఈ సంస్థ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆర్ జానకీరామన్ చెప్పారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి కొత్తగా మలీ్టక్యాప్ ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జానకీరామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్లపై (ఐపీవో) స్పందిస్తూ.. అదనంగా వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదిక కాగలవన్నారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్‌్కను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో సగం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. భారత్ మరింత వృద్ధి చెందేకొద్దీ మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో మరిన్ని కంపెనీలు మెరుగ్గా రాణించడాన్ని చూస్తామంటూ.. ఈ విభాగం పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. రూ.లక్ష కోట్ల మైలురాయి తమ నిర్వహణలోని ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను అధిగమించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్ అవినాష్ సత్వాలేకర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి చివరికి 15వ అతిపెద్ద అస్సెట్ మేనేజర్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ త్రైమాసికంలోనే పలు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మలీ్టక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 8న ప్రారంభమై, 22 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ నిలిపివేసిన ఆరు మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.27,000 కోట్లను చెల్లించింది. 2020 ఆరంభంలో కరోనా వైరస్ రాకతో మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో 2020 ఏప్రిల్ 23న ఆరు డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలను నిలిపివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, అదే సమయంలో మార్కెట్లో డెట్ సెక్యూరిటీల అమ్మకాలకు కావాల్సినంత లిక్విడిటీ (కొనుగోలుదారులు) లేనట్టు అప్పుడు సంస్థ ప్రకటించింది. ఆరు పథకాలను నిలిపివేసే నాటికి వాటి పరిధిలోని పెట్టుబడుల విలువ రూ.25,125 కోట్ల మేర ఉండగా, దీంతో పోలిస్తే తాము ఇన్వెస్టర్లకు 107 శాతం మేర చెల్లించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా తెలిపింది. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్ నిలిపివేసిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ తన ఫిక్స్డ్ ఇన్కమ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారాలకు కొత్త నియామకాలను ప్రకటించింది. రాహుల్ గోస్వామి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఎండీగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సంతోష్ కామత్ ఇకపై ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా పనిచేయనున్నారు. -
అంతర్జాతీయ పెట్టుబడులకు ద్వారాలు
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫండ్స్‌కు సంబంధించి తాజా పెట్టుబడులను పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, మిరే అస్సెట్ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇలా అనుమతించిన వాటిల్లో ఉన్నాయి. ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఏడు అంతర్జాతీయ పథకాలను నిర్వహిస్తుండగా, అన్నింటిలోకి చందాలను సోమవారం నుంచి స్వీకరిస్తోంది. స్విచ్ ఇన్ లేదా లంప్సమ్ లావాదేవీలను అనుమతిస్తోంది. డెట్ మ్యూచువల్ ఫండ్‌పై పన్ను ప్రయోజనాలు ఏప్రిల్ 1 నుంచి మారిపోతున్నాయి. దీంతో మార్చి 31లోపు ప్రస్తుత పన్ను ప్రయోజనం నుంచి లబ్ధి పొందాలనుకునే వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ఎడెల్వీజ్ ఏఎంసీ ప్రొడక్ట్ హెడ్ నిరంజన్ అవస్థి తెలిపారు. ఇక మిరే అస్సెట్ మ్యూచువల్ ఫండ్ మూడు ఇంటర్నేషనల్ ఈటీఎఫ్‌లు, వీటికి సంబంధించిన ఫండ్ ఆఫ్ ఫండ్‌ల్లోకి లంప్సమ్ పెట్టబడులను మార్చి 27 నుంచి అనుమతిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత సిప్‌లు, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను సైతం మార్చి 29 నుంచి తెరుస్తున్నట్టు.. తాజా సిప్‌లు, ఎస్టీపీలను మాత్రం అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మూడు విదేశీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి లంప్సమ్ పెట్టుబడులను అనుమతిస్తోంది. పరిమితులు.. ‘‘తాజా పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. సెబీ విదేశీ పెట్టుబడుల పరిమితులకు అనుగుణంగా ఈ పథకాల్లో తిరిగి భవిష్యత్తులోనూ పెట్టుబడులను నిలిపివేయవచ్చు’’ అని మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఈటీఎఫ్ హెడ్ సిద్ధార్థ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ స్టాక్స్‌లో దేశీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 7 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సెబీ పరిమితి విధించింది. గతేడాది జనవరి నాటికి ఫండ్స్ మొత్తం పెట్టుబడులు ఈ పరిమితికి చేరడంతో తాజా పెట్టుబడులు స్వీకరించొద్దని ఆదేశించింది. 2022 జూన్‌లో తాజా పెట్టుబడులకు మళ్లీ అనుమతించింది. -
ఎంఎఫ్ లావాదేవీలపై సెబీ కన్ను
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమ పటిష్టతపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఎంఎఫ్ యూనిట్లలో లావాదేవీలను ఇన్సైడర్ నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందుకు నిబంధనలను సవరించింది. వెరసి ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకం తాజా నిబంధనలలోకి రానున్నాయి. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీల సెక్యూరిటీలలో లావాదేవీలకు మాత్రమే ఇన్సైడర్ నిబంధనలు వర్తిస్తున్నాయి. ధరలను ప్రభావితం చేయగల రహస్య(వెల్లడికాని) సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టి లబ్ది పొందడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్‌గా పిలిచే సంగతి తెలిసిందే. సెక్యూరిటీలకు వర్తించే ఈ నిబంధనల నుంచి ఎంఎఫ్ యూనిట్లకు ప్రస్తుతం మినహాయింపు ఉంది. అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. ఎంఎఫ్‌లో ఇన్సైడర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ హౌస్‌కు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ పథకాలలోగల తమ హోల్డింగ్స్‌ను అక్రమ పద్ధతిలో ముందుగానే రీడీమ్ చేసుకున్నారు. ఆరు డెట్ పథకాలు రిడెంప్షన్ ఒత్తిళ్లలో మూతపడకముందే రీడీమ్ చేసుకోవడంతో సెబీ తాజా మార్గదర్శకాలను ముందుకు తీసుకువచ్చింది. ఇకపై ఎంఎఫ్ పథకాల యూనిట్లలో బయటకు వెల్లడికాని సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. పథకం నికర ఆస్తుల విలువ(ఎన్ఏవీ)పై లేదా యూనిట్‌దారులపై ప్రభావం చూపే సమాచారంతో ట్రేడ్ చేయడాన్ని నిబంధనలు అనుమతించవని నోటిఫికేషన్ ద్వారా సెబీ స్పష్టం చేసింది. వివరాలన్నీ వెల్లడించాలి.. తాజా నిబంధనల ప్రకారం ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఫండ్ పథకాలకు సంబంధించిన యూనిట్ల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఏఎంసీ, ట్రస్టీలు, దగ్గరి సంబంధీకులు తదితర హోల్డింగ్స్ వివరాలు తెలియజేయవలసి ఉంటుంది. సొంతం ఎంఎఫ్‌ల యూనిట్లలో యాజమాన్యం, ట్రస్టీలు, సంబంధీకుల లావాదేవీలను వెనువెంటనే ప్రకటించవలసి ఉంటుంది. ఏఎంసీ కంప్లయెన్స్ ఆఫీసర్‌కు రెండు పనిదినాల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
భారత మార్కెట్‌ను వదిలి వెళ్లేది లేదు
ముంబై: భారత మార్కెట్ నుంచి వెళ్లేది లేదని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ స్పష్టం చేసింది. బదులుగా తమ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని ప్రకటించింది. భారత మార్కెట్‌ను వీడిపోవడాన్ని అవివేకంగా సంస్థ భారత ప్రెసిడెంట్ అవినాష్ సత్వలేకర్ అభివర్ణించారు. ఇతర విదేశీ సంస్థల మాదిరే ఫ్రాంక్లిన్ టెంపుల్ సైతం భారత మార్కెట్ నుంచి వెళ్లిపోవచ్చంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో, అటువంటిదేమీ లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 26 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 20 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.56,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్నట్టు గుర్తు చేశారు. తమ కార్యకలాపాలు పూర్తిగా లాభదాయకంగా ఉన్నట్టు చెప్పారు. సంక్షోభం ఎదుర్కొంటున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా హెడ్‌గా సత్వలేకర్ మూడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. పంపిణీదారులు, ఉద్యోగులతో మమేకమై, ఇన్వెస్టర్లను చేరుకోనున్నట్టు చెప్పారు. 2020 మార్కెట్ల క్రాష్ సమయంలో రూ.25,000 కోట్ల ఆస్తులతో కూడిన ఆరు డెట్ పథకాలను మూసేస్తూ ఈ సంస్థ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో సెబీ జరిమానా విధించడంతోపాటు, కొత్త డెట్ పథకాల ఆవిష్కరణపై నిషేధం విధించింది. ఈ ఆదేశాలను ఈ సంస్థ శాట్‌లో సవాలు చేసింది. -
మెజారిటీ ఇన్వెస్టర్ల ఆమోదం అవసరమే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలను మూసివేయాలంటే అందుకు మెజారిటీ యూనిట్ హోల్డర్ల (ఆయా పథకాల్లో పెట్టుబడిదారులు) ఆమోదం అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ గతేడాది ఏప్రిల్‌లో ఆరు డెట్ పథకాలను మూసివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. పథకాల మూసివేతకు కారణాలను తెలియజేస్తూ నోటీసును విడుదల చేసి.. మెజారిటీ యూనిట్ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తుంటే జోక్యం చేసుకునే అధికారాలు సెబీకి ఉన్నాయని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల సమ్మతి లేకుండా డెట్ పథకాలను మూసివేయడం కుదరదంటూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు లేదా ఏఎంసీలు నిబంధనలకు కట్టుబడి లేకపోతే జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం సెబీకి ఉందని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదే అంశంపై దాఖలైన పలు ఇతర వ్యాజ్యాలపై సుప్రీం విచారణ చేపట్టింది. దీంతో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిబంధనలపై వివరణ ఇచ్చింది. యూనిట్ హోల్డర్ల అనుమతి అవసరం అంటూ సెబీ నిబంధనలు 18 (15)(సీ), 39(3)లను ధర్మాసనం ప్రస్తావించింది. నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకున్నందున విచారణ, దర్యాప్తు చేసే అధికారం సెబీకి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇప్పటికే వాటాదారుల ఆమోదం పొందింది. ఆరు డెట్ పథకాల పరిధిలో రూ.25,000 కోట్ల నిధులకు గాను మెజారిటీ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లింపులు కూడా చేసింది. షిప్పింగ్ సబ్సిడీ స్కీముకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: భారత్‌లో నమోదు చేయించుకునేలా షిప్పింగ్ కంపెనీలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 72 గంటల్లోనే నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉత్పత్తుల దిగుమతికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లలో పాల్గొనే దేశీ షిప్పింగ్ కంపెనీలకు రూ. 1,624 కోట్ల సబ్సిడీ కల్పించే స్కీమునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అయిదేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) స్టే విధించింది. గతేడాది ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఉన్నపళంగా మూసేయడం తెలిసిందే. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినట్టు సెబీ తన విచారణలో భాగంగా తేల్చింది. మ్యూచువల్ ఫండ్స్‌విభాగాలకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కినట్టు గుర్తించింది. దీంతో ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ.512 కోట్లరూపాయల ఫీజులను, ఈ మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రెండేళ్లపాటు కొత్తగా డెట్ పథకాలను ప్రారంభించకుండా వేటు వేసింది. జరిమానాలను కూడా విధించింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) ముందు సవాలు చేసింది. వాదనలు విన్న శాట్..రూ.512 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించడం అన్నది చాలా అధిక మొత్తంగా అభిప్రాయపడింది. కనీస ఖర్చులను ఇందులో మినహాయించడం భావ్యంగా పేర్కొంది. దీంతోరూ.250 కోట్లను ఎస్క్రో ఖాతాలో మూడు వారాల్లోగా జమ చేయాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను ఆదేశించింది. ఇప్పటికీ 21 డెట్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నిర్వహిస్తుండగా.. వీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడాన్ని శాట్ పరిగణనలోకి తీసుకుంది. ఆరు పథకాలను మూసేసినందున కొత్త పథకాలను ప్రారంభించకుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసులో స్పందన దాఖలు చేయాలంటూ సెబీకి నాలుగువారాల వ్యవధినిచ్చింది. చదవండి : stockmarket : బ్యాంకుల దెబ్బ, నష్టాల్లో సూచీలు -
డెట్ ఫండ్స్..తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి!
‘ఈక్విటీల్లో అధిక రిస్క్ ఉంటుంది’.. తరచుగా ఈ మాట వింటుంటాం. నిజానికి రిస్క్ లేని పెట్టుబడి సాధనాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉంటుంది. ఈక్విటీలను మించిన రిస్క్ డెట్ ఫండ్స్‌లోనూ ఉంటుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ పథకాల మూసివేత ఉదంతాన్ని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈక్విటీల్లో రిస్క్.. డెట్‌లో రిస్క్ లేదన్న అపోహలు వీడాలి. పెట్టుబడులకు ముందే ప్రతీ సాధనాన్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తే రిస్క్పాళ్లు తెలుస్తాయి. తెలుసుకోకుండా ఏదేనీ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటే ఎన్నో ఆకాంక్షలతో చేసిన పెట్టుబడులను తిరిగి పొందడం ఆశగానే మిగిలిపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిపుణుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కనుక.. పెట్టుబడులు సురక్షితం అనుకోవద్దు. వారు సైతం తప్పటడుగులు వేయొచ్చు. నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను అన్ని సందర్భాల్లోనూ కాపాడతాయనుకోలేము. ఇన్వెస్టర్లే తగిన ముందస్తు అధ్యయనం, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారి పెట్టుబడులకు రక్షణ సాధ్యపడుతుంది. సెబీ ఇటీవలి ఆదేశాలను పరిశీలిస్తే.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం నుంచి ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అనుభవాలు కొన్ని కనిపిస్తాయి. ఆ వివరాలే ఈవారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనంలో... 2018లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్ విభాగాలకు (కేటగిరీలు) సంబంధించి పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలను 36 విభాగాలుగా వర్గీకరించింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనువైన పథకాలను సులభంగా ఎంపిక చేసుకోవచ్చన్నది సెబీ ఉద్దేశం. పథకాల పెట్టుబడుల విధానం పేరులో ప్రతిఫలించేలా సెబీ నాడు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ వాస్తవంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పెట్టుబడులు వాటి పేరును ప్రతిఫలించడం లేదనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీరు నిరూపించింది. అందుకే పేరును చూసి మోసపోవద్దు. ఆ పథకం పెట్టుబడుల విధానం ఆయా విభాగం పరిధికి అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు విచారించుకోవాలి. లో డ్యూరేషన్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, లాంగ్డ్యూరేషన్ ఫండ్స్ ఇలా ఎన్నో డెట్ విభాగాలున్నాయి. ఇవన్నీ కూడా తక్కువ రిస్క్ ఉండేవే. కానీ, అసలు రిస్క్ అన్నది ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకునే డెట్ పేపర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఫండ్ నిర్వహణ సంస్థ తక్కువ రిస్క్ ఉండే డెట్ పేపర్లనే అన్ని కాలాల్లోనూ ఎంపిక చేసుకుంటుందని నమ్మడానికి లేదు. అధిక రాబడుల కోసం నాణ్యతలేమి డెట్ పేపర్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అదే చేసింది. పరిమితికి మించి పెట్టుబడుల్లో రిస్క్ తీసుకుంది. సాధారణంగా ఏఏ అంతకంటే దిగువ రేటింగ్ పేపర్లలో క్రెడిట్ రిస్క్ ఉంటుంది. అంటే డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఆయా డెట్ పేపర్లను జారీ చేసే సంస్థలు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లకు అధిక రాబడులను ఆఫర్ చేసే ఉద్దేశంతో 2019 డిసెంబర్ నాటికి ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ 84 శాతం పెట్టుబడులను తీసుకెళ్లి ఏఏ, అంతకంటే తక్కువ రేటింగ్ పేపర్లలో పెట్టేసింది. అలాగే, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ పథకం కింద పెట్టుబడుల్లోనూ 80 శాతాన్ని అధిక రిస్క్ ఉండే పేపర్లలో ఇన్వెస్ట్ చేసింది. కానీ ఈ పథకాల పేర్లలో క్రెడిట్ రిస్క్ లేదన్నది గమనించాలి. ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ 86 శాతం పెట్టుబడులను ఏఏ అంతకు దిగువ పేపర్లలో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. క్రెడిట్ రిస్క్ అని పేరులోనే ఉంది కనుక ఇలా ఇన్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. కానీ, లో డ్యూరేషన్, షార్ట్‌టర్మ్ ఇన్కమ్ ప్లాన్ విషయంలోనూ అదే విధంగా పెట్టుబడుల విధానాన్ని పాటించి తప్పు చేసింది. ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్, ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్ సైతం అదే తోవలో నడిచాయి. సెబీ కేటగిరీ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న విషయం ఇక్కడ తేటతెల్లమవుతోంది. అందుకే ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకునే ముందు కేవలం పేరు, విభాగానికే పరిమితం కావద్దు. వాటి పోర్ట్‌ఫోలియోను పూర్తిగా చూసి, నిబంధనల మేరకే ఉందని నిర్ధారించుకున్న తర్వా తే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటికే మీరు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఆయా పథకాలను ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోండి. తెలియకపోతే నిపుణుల సాయం పొందడానికి వెనుకాడొద్దు. రాబడులే గీటురాయి కావద్దు.. పెట్టుబడికి రాబడి ఒక్కటే ప్రామాణికంగా భావించడం సరికాదు. రాబడితోపాటు పెట్టుబడికి రక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ, చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే పథకాలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు. అంత రాబడులను ఆయా పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ అర్ధంతరంగా మూసేసిన డెట్ పథకాలు కూడా రాబడులతో ఇన్వెస్టర్లను ఆకర్షించినవి కావడం గమనార్హం. అనలిస్టులు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు సైతం ఫ్రాంక్లిన్ ఇండియా సంస్థ అంత రాబడులను ఎలా ఇవ్వగలుగుతోందన్న సంశయాన్ని ఎదుర్కొన్న వారే. ఆ రాబడుల వెనుకనున్న అసలు రూపం ఆలస్యంగానే బయటకు వచ్చింది. అధిక రాబడులను ఇచ్చే ఫ్రాంక్లిన్ డెట్ పథకాలను ఇన్వెస్టర్లకు సూచించిన ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా డెట్ పథకాలు రాబడులను ఎలా ఇస్తాయన్నది తెలియకపోతే వాటికి ఇన్వెస్టర్లు దూరంగా ఉండడమే మంచిదని నిపుణుల సూచన. పోటీ పథకాలతో పోలిస్తే అధిక రాబడులను ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఫ్రాంక్లిన్ ఇండియా అనుసరించింది. అందుకోసం అసాధారణ విధానాలను ఎంచుకుంది. పెట్టుబడుల్లో సింహ భాగాన్ని ‘బీస్పోక్ బాండ్స్’.. అంటే ప్రైవేటుగా జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. 2020 మార్చి నాటికి ఆరు డెట్ పథకాలకు సంబంధించి 56 శాతం నుంచి 77 శాతం పెట్టుబడులను ఫ్రాంక్లిన్ ఇండియా సంస్థ ఇటువంటి బాండ్లలోనే పెట్టింది. ప్రైవేటుగా జారీ చేసిన బాండ్లలో 70 శాతం పెట్టుబడులు ఈ సంస్థవే ఉన్నాయి. బీస్పోక్ బాండ్లలో సింహ భాగం పెట్టుబడులు ఈ ఒక్క సంస్థే పెట్టడంతో అధిక వడ్డీ రేటును డిమాండ్ చేసి పొందగలిగింది. కానీ, ఆయా బాండ్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నవి కావు. అంటే లిక్విడిటీ తగినంత లేనివి. బాండ్లను జారీ చేసిన సంస్థ సమస్యల్లో పడిపోవడంతో ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఎదురైంది. పైగా ఆయా బాండ్ల నుంచి కాల వ్యవధి తీరిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకుండా.. వాటిల్లోనే కొనసాగుతూ వడ్డీ రేట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్లింది. దీనివల్ల వడ్డీ రేట్ల పరంగా ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. ఇక్కడే మరో తప్పిదం కూడా జరిగింది. ఆయా బాండ్లలోనే కొనసాగే విధానం వల్ల.. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాలను ఆశ్రయించింది. అంటే స్వల్పకాలం కోసం తీసుకున్న పెట్టుబడులను దీర్ఘకాల బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఉదాహరణకు లో డ్యురేషన్ ఫండ్స్ అన్నవి 6 నెలల నుంచి 12 నెలలకు మించని కాల వ్యవధితో కూడిన డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే 12 నెలలకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ లో డ్యూరేషన్ ఫండ్స్ పెట్టుబడులను బీస్పోక్ బాండ్లలోనే గడువు తీరినా కొనసాగిస్తూ వెళ్లింది. కేవలం అధిక రాబడుల కోసమే ఇలా చేసింది. వడ్డీ రేట్లను సవరించిన తేదీలనే పెట్టుబడుల కాల వ్యవధిగా చూపించింది. ఇలాంటి విధానాలతో అధిక రాబడులను ఇవ్వొచ్చేమో కానీ.. ఇన్వెస్టర్ల పెట్టుబడులను అధిక రిస్క్‌లో పెట్టినట్టే అవుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పోర్ట్‌ఫోలియో వివరాలను నెలవారీగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ పథకం కలిగి ఉన్న బాండ్ల వివరాలే ఉంటాయి. అంతకుమించి వివరాలు తెలియవు. దీంతో ఇక్కడే రిస్క్ ఏర్పడుతుంది. మన బాండ్ మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. దీంతో చాలా బాండ్లు ప్రైవేటుగా అనధికారిక ఒప్పందాల మేరకు జారీ అవుతుంటాయి. అందుకే డెట్ ఫండ్స్ విషయానికొస్తే మీరు చూసేది వేరు.. పొందేది వేరన్నది గ్రహించాలి. పోర్ట్‌ఫోలియోలో డెట్ పేపర్లు, వాటి కాల వ్యవధి వివరాలు ఉంటాయి. వాటిని సమగ్రంగా పరిశీలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. నియంత్రణపరమైన లోపాలు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన నియంత్రణల మధ్య నడుస్తుంటాయని, మంచి రాబడులను ఇస్తాయని అందరికీ తెలిసిన విషయం. అంటే నూరు శాతం రిస్క్ లేనివని భావించొద్దు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ సంస్థలు దివాలా తీసిన తర్వాత డెట్ ఫండ్స్ విషయంలో సెబీ నిబంధనలను కఠినతరం చేసిన మాట వాస్తవమే. సెబీ అన్ని చర్యలు తీసుకున్నాకానీ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రూపంలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. అందుకే నియంత్రణ సంస్థలు, నిబంధనలపై భారం వేసి ఇన్వెస్టర్లు నిశ్చింతగా కూర్చుంటామంటే కుదరదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ మూసివేయడానికి ముందే.. ఆ సంస్థ సీనియర్ ఉద్యోగులు ఆయా పథకాల్లో తమకున్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్వెస్టర్లను పూర్తిగా వంచించడమే అవుతుంది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కఠినమైన ఇన్సైడర్ నిబంధనలను సెబీ అమలు చేస్తోంది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల స్థాయిలో నిఘా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇవే నిబంధనలు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లకు వర్తించవు. దీంతోఫండ్స్ సంస్థల్లో పనిచేసేవారు, వారి సన్నిహితులు ఆంత రంగిక సమాచారం ఆధారంగా యూనిట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫ్రాంక్లిన్ వ్యవహరించింది. దీంతో సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల్లో లోపాలకు వెంటనే చెక్ పెట్టకపోతే.. ఇతర సంస్థల్లోనూ ఈ తరహా లోపాలకు ఆస్కారం లేకపోలేదు. అందుకే ఇన్వెస్టర్లు కాస్త అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం. స్టార్‌ను చూస్తేనే సరిపోదు.. స్టార్ ఫండ్ మేనేజర్.. మంచి రాబడుల చరిత్ర అన్నవి మ్యూచువల్ ఫండ్స్ పథకం ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లు చూసే అంశాలు. కానీ, ఇవి మాత్రమే చాలవని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం సూచిస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ పథకాలను పర్యవేక్షించిన ఫండ్‌మేనేజర్ సంతోష్ కామత్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఆయన పనితీరును చూసి రిస్క్‌కు భయపడే ఇన్వెస్టర్లకు ఫ్రాంక్లిన్ డెట్ పథకాలను ఆర్థిక సలహాదారులు సూచించే వారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెట్ పేపర్ల నాణ్యతలో, లిక్విడిటీ విషయంలో కామత్ రాజీపడ్డారు. అదే సంక్షోభానికి దారితీసింది. అందుకే స్టార్ రేటింగ్‌లకే పరిమితం కాకుండా కాస్త లోతుగా చూసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. సుప్రీం జోక్యం వరకూ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్.. ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్కమ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్‌రిస్క్ ఫండ్లను 2020 ఏప్రిల్‌లో నిలిపివేసింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు అభ్యర్థనలు వస్తుండగా.. వాటికి చెల్లింపులు చేసే స్థాయిలో లిక్విడిటీ లేకపోవడం (అంటే పెట్టుబడులను విక్రయించాలనుకుంటే కొనేవారు లేక)తో ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆసియా పసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ వివేక్ కుద్వా ఈ పథకాలను మూసివేయడానికి ముందే తన వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ చేసిన రూ.32 కోట్లను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్. అందుకే డెట్ ఫండ్స్ పథకాలకు సంబంధించి ఉండే గరిష్ట రిస్క్ స్థాయిలను ఇన్వెస్టర్లకు తెలియజేయాలంటూ సెబీ ఇటీవలే నిబంధనలను తీసుకొచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ మూసేసిన ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్లకు జూన్ 15 నాటికి రూ.17,777 కోట్లు వెనక్కి రావడం కొంత ఊరట. 2020 ఏప్రిల్ 23 నాటికి ఆయా పథకాల్లోని మొత్తం పెట్టుబడుల్లో ఇది 71%. సుప్రీంకోర్టు జోక్యంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లిక్విడేటర్‌గా రంగంలో దిగడంవల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు వారికి చేరడానికి మార్గం సుగమం అయ్యింది. -
పచ్చ దోపిడీకి భయపడే
-
ఫ్రాంక్లిన్ ఏఎంసీ, ఉద్యోగులపై భారీ జరిమానా
న్యూఢిల్లీ: డెట్ ఫండ్స్ విషయంలో నిబంధనలకు పాతరేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థ (ఏఎంసీ)పై, సీనియర్ ఉద్యోగులు, ట్రస్టీలపై సెబీ రూ.15 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2020 ఏప్రిల్‌లో ఈ సంస్థ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రాత్రికి రాత్రే మూసివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫలితంగా రూ.25వేల కోట్ల మేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయి. ఈ విషయమై దర్యాప్తు నిర్వహించిన సెబీ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ట్రస్టీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌పై రూ.3 కోట్లు, ఫ్రాంక్లిన్ ఏఎంసీ ప్రెసిడెంట్ సంజయ్ సప్రే, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంతోష్ కామత్ ఒక్కొక్కరూ రూ.2 కోట్ల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఫండ్ మేనేజర్లు కునాల్ అగర్వాల్, పల్లబ్ రాయ్, సచిన్ పద్వాల్దేశాయ్, ఉమేశ్ శర్మ, మాజీ ఫండ్ మేనేజర్ సుమిత్ గుప్తా 1.5 కోట్లు చొప్పున చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ సౌరభ్ గంగ్రేడ్కు రూ.50 లక్షల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ మొత్తాలను చెల్లించాలని ఆదేశించింది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో లోపాలు జరగకుండా చూడడంలో వీరంతా విఫలమైనట్టు.. విధుల నిర్వహణ యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా లేవని తేలి్చంది. ఈ ఆదేశాలతో తాము విభేదిస్తున్నామని.. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తామని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. చదవండి: ధరలకు ఇంధన సెగ! -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు సెబీ షాక్.. 5 కోట్ల జరిమానాతో పాటు
న్యూఢిల్లీ: గతేడాది ఆరు డెట్ పథకాలను నిలిపివేసిన అంశానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకిచి్చంది. రూ. 5 కోట్ల జరిమానా విధించింది. రెండేళ్ల పాటు కొత్త స్కీములేమీ ప్రవేశపెట్టకుండా నిషేధం విధించింది. అలాగే, పెట్టుబడుల నిర్వహణ, అడ్వైజరీ ఫీజులకు సంబంధించి వడ్డీతో సహా రూ. 512 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు వాపసు చేయాలని సెబీ ఆదేశించింది. మరోవైపు సాధారణ ప్రజానీకానికి ఇంకా వెల్లడి కాని వివరాలు తమ దగ్గర ఉండగా.. ఫండ్‌లో తమకున్న యూనిట్లను విక్రయించుకున్నందుకు గాను సంస్థ ఏషియా పసిఫిక్ మాజీ హెడ్ వివేక్ కుద్వా, ఆయన భార్య రూపా కుద్వాపైనా సెబీ చర్యలు తీసుకుంది. వారిద్దరికి మొత్తం రూ. 7 కోట్ల జరిమానాతో పాటు ఏడాది కాలం.. సెక్యూరిటీ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది. ఫండ్స్ యూనిట్ల అమ్మకం ద్వారా వారు అందుకున్న రూ. 22.64 కోట్ల మొత్తాన్ని 45 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా సెబీ ఆదేశించింది. -
ఫ్రాంక్లిన్ ఎంఎఫ్‌పై ఈడీ కేసు
ముంబై: దాదాపు ఏడాది క్రితం అంటే 2020 ఏప్రిల్‌లో ఆరు పథకాలకు స్వస్తి పలికిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)పై ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోపక్క మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టిసారించాయి. దీనిలో భాగంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. సంస్థతోపాటు మరో 8మందిపై కేసు రిజిస్టర్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆరు పథకాలను మూసివేసే ముందుగానే కీలక అధికారులు కొంతమంది తమ పెట్టుబడులను వెనక్కి(రీడీమ్) తీసుకోవడంపై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్‌తోపాటు, కీలక అధికారులకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సమన్లు సైతం జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అవకతవకలు, అక్రమ లావాదేవీల(ఎఫ్‌యూటీపీ) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై సెబీ దర్యాప్తును చేపట్టినట్లు తెలుస్తోంది. పథకాల మూసివేతకంటే ముందుగానే ఫండ్ హౌస్‌కు చెందిన కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు రూ. 50 కోట్లకుపైగా విలువైన పెట్టుబడులను రీడీమ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలు ఆడిట్లో వెల్లడికావడంతో సెబీ చట్టపరమైన దర్యాప్తునకు తెరతీసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సాధారణ పద్ధతిలోనే..: నియంత్రణ సంస్థల దర్యాప్తు వార్తల నేపథ్యంలో మూసివేసిన ఆరు పథకాలలో కంపెనీకి చెందిన యాజమాన్యం, ఉద్యోగుల పెట్టుబడులున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ 23వరకూ దాఖలైన యూనిట్ హోల్డర్ల దరఖాస్తులను సాధారణ బిజినెస్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు తెలియజేశారు. పథకాలను మూసివేసేందుకు ట్రస్టీలు ముందస్తుగా నిర్ణయించాక కంపెనీకి చెందిన కీలక వ్యక్తులెవరూ ఎలాంటి పెట్టుబడులనూ రీడీమ్ చేసుకోలేదని వివరించారు. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు పూర్తిస్థాయిలో వివరాలను దాఖలు చేసినట్లు వెల్లడించారు. రూ. 25,000 కోట్లు 2020 ఏప్రిల్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ఎత్తివేసిన 6 పథకాల్లో పెట్టుబడుల విలువ రూ. 25,000 కోట్లు కాగా.. 3 లక్షల మంది ఇన్వెస్ట్ చేశారు. కాగా.. సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్లకు పెట్టుబడులను వెనక్కిచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే రూ.9,122 కోట్లను పంపిణీ చేశామని, మరో రూ.1,180 కోట్ల నగదును సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. -
మరో 10 ఫండ్స్ అదే మార్గంలో వెళ్లొచ్చు
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ‘నిలిపివేసిన’ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారిని రక్షించేందుకు ముందుకు రావాలంటూ ఇన్వెస్టర్ల సంఘం ‘సీఎఫ్‌ఎమ్‌ఏ’ సుప్రీంకోర్టును కోరింది. లేదంటే మరో 10కి పైగా మ్యచువల్ ఫండ్స్ అదే మార్గంలో వెళ్లొచ్చని, దాంతో అమెరికాలో సబ్‌ప్రైమ్ సంక్షోభం మాదిరే.. మ్యూచువల్ఫండ్స్ సంక్షోభం ఇక్కడ ఏర్పడవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లకు న్యాయవ్యవస్థ ఒక్కటే ఆశాకిరణంగా చెన్నై ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ అకౌంటబిలిటీ (సీఎఫ్‌ఎమ్‌ఏ) ఓ ప్రకటనలో పేర్కొంది. మరో 10 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నష్టాలను యూనిట్ హోల్డర్లపై రుద్దాలని అనుకుంటున్నాయంటూ.. సుప్రీంకోర్టు తీర్పు కోసం అవి వేచి ఉన్నాయని సీఎఫ్‌ఎమ్‌ఏ ఆరోపించింది. అయితే, తన ఆరోపణలకు ఆధారాలను వెల్లడించలేదు. లిక్విడిటీ (ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు తగినంత నిధుల్లేని) లేకపోవడంతో ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ గతేడాది ఏప్రిల్ 23న నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. దీన్ని వ్యతిరేకిస్తూ ఇన్వెస్టర్లు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా పథకాల మూసివేతకు తీసుకున్న నిర్ణయం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది. పథకాల మూసివేతకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్టర్ల నుంచి ఈలోపు ఆమోదం తీసుకోవడం కూడా పూర్తయింది. రూ.14,000 కోట్ల నష్టం.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయంతో మూడు లక్షలకు పైగా యూనిట్ హోల్డర్లు తమ పెట్టుబడుల్లో 50 శాతానికి పైగా (సుమారు రూ.14,000 కోట్లు) నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని సీఎఫ్‌ఎమ్‌ఏ ఆరోపించింది. ఇతర ఫండ్స్ కూడా ఇదే బాట పడితే మొత్తం మీద ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్లమేర నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. -
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..?
ఇటీవలి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ చేసిన నిర్వాకం చూసి డెట్ ఫండ్స్ ఇన్వెస్టర్లు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ సంస్థ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ (క్రెడిట్‌రిస్క్) పథకాలను ఉన్నట్టుండి మూసేసింది. అప్పటికే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అవసరాలకు పెట్టుబడులను తిరిగి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిని అయోమయానికి, భయానికి గురి చేసింది. కొందరు అయితే ఇతర డెట్ ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులకు భయంతో తీసేసుకునే ఆలోచన చేస్తున్నారు. కానీ, మరే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ/ఏఎంసీ) కూడా ఇప్పటి వరకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనుక ఫ్రాంక్లిన్ చర్యను చూసి ఆందోళన చెందాల్సిన పని లేదు. కాకపోతే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు, కేవలం రాబడుల రేటు ఒక్కటి కాకుండా.. తమ స్కీమ్‌లకు సంబంధించిన రిస్క్ విషయాలను పూర్తిగా తెలుసుకోవడం ఎంతో అవసరం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ మూసి వేసిన ఆరు పథకాలు కూడా క్రెడిట్ రిస్క్ విభాగంలోనివే. ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.25,856 కోట్లుగా ఏప్రిల్ 22 నాటికి ఉన్నాయి. కానీ, ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో మరో ఏడు డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు ఏప్రిల్ 22 నాటికి రూ.17,800 కోట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు ఈ సంస్థ నిర్వహణలో 15 ఈక్విటీ పథకాలు, వాటి పరిధిలో రూ.36,663 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ చర్యను ఫండ్స్ అంతటికీ ఆపాదించి ఒకే విధంగా చూడడం సరికాదు. అసలేం జరిగింది..? కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూవిచూస్తున్నాయి. దీంతో డెట్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పెరిగారు. అదే సమయంలో డెట్ ఫండ్స్‌లోకి తాజా పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌లో అయితే లిక్విడిటీ మరింత తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆరు డెట్ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న రిడెంప్షన్ (పెట్టుబడుల ఉపసంహరణ) ఒత్తిళ్లను తట్టుకోలేక వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయే కానీ, అవి పూర్తిగా రాకుండా పోయినట్టు కాదు. డెట్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ పథకాల వద్ద ఉన్న డెట్ పేపర్లను ఫ్రాంక్లిన్ సంస్థ విక్రయించి ఇన్వెస్టర్లకు సొమ్ములు చెల్లిస్తుంది. లేదా ఆయా డెట్ పేపర్ల గడువు తీరిపోయిన తర్వాత ఎంత మొత్తం వస్తుందన్న ఆధారంగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌లోనే సమస్య అంతా.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు ఉంటాయి. వీటిల్లో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కూడా ఒకటి. తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కార్పొరేట్ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు ఇవ్వడం ఈ పథకాల పనితీరు విధానం. కనుకనే ఈ ఫండ్స్‌లో రాబడులు అధికంగా ఉండడంతోపాటు పెట్టుబడులకు రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. సెబీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్రెడిట్ రిస్క్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని ఏఏప్లస్ అంతకంటే తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభం, అడాగ్ గ్రూపు కంపెనీలు, వొడాఫోన్ ఐడియా ఈ కంపెనీల రుణ పత్రాలు తక్కువ నాణ్యత విభాగంలోనివే కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితులు బలంగా లేకపోవడం వల్ల ఆయా కంపెనీలు ఎక్కువ రేటుపై డెట్ పేపర్ల ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేస్తుంటాయి. కంపెనీల ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే అవి చెల్లింపుల్లో విఫలం కావచ్చు. దాంతో వాటికి రుణాలు ఇచ్చిన, డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌కు దెబ్బలు తగిలినట్టే. దాంతో ఇన్వెస్టర్ల రాబడులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కేవలం రాబడుల కాంక్షతోనే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే చేతులు కాల్చుకున్నట్టే అవుతుంది. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందుగానే తమ రిస్క్ సామర్థ్యం, ఇన్వెస్ట్ చేస్తున్న పథకంలో ఉండే రిస్క్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఎస్టీపీ విషయంలో జాగ్రత్త.. ఈక్విటీల్లో ఒకే విడత ఇన్వెస్ట్ చేయడం నచ్చని వారు, క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు సాధారణంగా డెట్ ఫండ్స్‌లో లంప్సమ్(ఒకే మొత్తం)గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. తర్వాత ఆయా డెట్ ఫండ్స్ నుంచి సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ/క్రమానుగతంగా బదిలీ చేయడం) ద్వారా ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని తాము ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. మరి ఫ్రాంక్లిన్ ఉదంతం చూసిన తర్వాత.. ఇన్వెస్టర్లు ఎస్టీపీ కోసం ఎంచుకునే డెట్ ఫండ్స్ అధిక నాణ్యత, రిస్క్ తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డెట్ ఫండ్స్ సురక్షితమేనా..? ద్రవ్యోల్బణంపై 1.5 శాతానికి మించి రాబడులను డెట్ ఫండ్స్ నుంచి ఆశించకూడదన్నది నిపుణుల సూచన. రిస్క్ భరించలేని వారు ఏఏఏ రేటింగ్ (అధిక నాణ్యత) పేపర్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం కావాలి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ బాండ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఎస్టీపీ కోసం ఇవి మంచి ఆప్షనే అవుతాయి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా పథకాల పోర్ట్‌ఫోలియోల్లోని డెట్ పేపర్ల రేటింగ్లను చూసి నిర్ణయం తీసుకోవాలి. డెట్ ఫండ్స్‌ను అమ్మేసుకోవాలా..? ఫ్రాంక్లిన్ చర్యను చూసి ఇతర డెట్ ఫండ్స్‌ను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎగ్జిట్ చార్జీలు, పన్నులు చెల్లించాల్సి రావచ్చు. డెట్ ఫండ్స్‌లో లాభాలపై, స్వల్పకాల, దీర్ఘకాల లాభాల పన్ను వర్తిస్తుంది. ‘‘అన్ని బాండ్ ఫండ్స్ కూడా రాబడుల కోసం అధిక క్రెడిట్ రిస్క్ తీసుకుంటాయని అనుకోవద్దు. చక్కని నిర్వహణతో కూడిన ఫండ్స్ ఉత్తమ క్రెడిట్ రేటింగ్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి’’ అని ఇన్వెస్టికా రీసెర్చ్ మేనేజర్ సయాలీ ఖండ్కే తెలిపారు. వీటిల్లో రిస్క్ తక్కువ డెట్ ఫండ్స్ గురించి అంతగా అవగాహన లేని వారు, ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే, కొంచెం భద్రత పాళ్లు ఎక్కువగా ఉంటే ఈ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. కాకపోతే వీటిల్లో రాబడులు తక్కువగా ఉంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్..: డెట్ ఫండ్ విభాగంలో సురక్షితం. ఒక రోజు వ్యవధితో కూడిన ఓవర్‌నైట్ రివర్స్ రెపో, ఇతర డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక రోజు నుంచి నెల కోసం అనుకూలం. రాబడి 5% వరకూ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్..: 91 రోజుల కాల వ్యవధి మించని ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపోలు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్‌లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతుంటాయి. రాబడులు 6 శాతం వరకు ఉంటాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్..: ఈ పథకాలు బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డిఫాల్ట్ రిస్క్ చాలా తక్కువ. మూడేళ్ల కాలానికి అనుకూలం. వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మార్కెట్ టు మార్కెట్ నష్టాలు ఈ ఫండ్స్‌కు ఉంటాయి. రాబడులు దీర్ఘకాలంలో 8 శాతం వరకు ఉంటాయి. ఇతర డెట్ ఫండ్స్ రకాలు ఈ పథకాలన్నింటిలోనూ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయా పథకాల్లోని పోర్ట్‌ఫోలియోపై రిస్క్ ఆధారపడి ఉంటుంది. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మూడు నుంచి ఆరు నెలల్లోపు గడువుతీరే డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోలిస్తే అధిక రాబడులను ఇస్తాయి. లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిల్లో రిస్క్ ఎక్కువ. ఎంచుకునే పథకాలను బట్టి రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి 1–3 ఏళ్ల కాల వ్యవధి కలిగిన కంపెనీల బాండ్లు, బ్యాంకుల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెచ్యూరిటీ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీలు, బాండ్లు, డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తా యి. ఏడేళ్లకు పైగా వీటి కాల వ్యవధి ఉంటుంది. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ 80% పెట్టుబడులను అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగని ఈ విభాగంలోని అన్ని పథకాల్లోనూ రిస్క్ ఒకే మాదిరిగా ఉంటుందనుకోవద్దు.పోర్ట్‌ఫోలియోలోని పేపర్లను చూసిన తర్వాతే అవగాహనకు రావాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ వడ్డీ రేట్లలో మార్పులను పెట్టుబడి అవకాశాలుగా మలుచుకుని అధిక రాబడులను ఇచ్చే విధంగా డైనమిక్ బాండ్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. వివిధ కాల వ్యవధులతో ఉన్న సెక్యూరిటీలను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. వీటిల్లో అధిక రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపీ) ఇవి క్లోజ్ ఎండెడ్ డెట్‌ఫండ్స్. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సాధారణంగా మూడేళ్లకు పైబడిన కాల వ్యవధితో ఉంటుంటాయి. అధిక రాబడులను ఆఫర్ చేస్తాయి. రిస్క్ ఉంటుంది. గిల్ట్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో పెట్టుబడులు, వడ్డీ చెల్లింపులకు ఎటువంటి రిస్క్ ఉండదు. వడ్డీ రేట్లు తరచుగా మార్పులకు గురవుతుంటే ఆ ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుంది. అధిక రాబడులు, ప్రతికూల రాబడుల రిస్క్ కూడా ఉంటుంది. ఈక్విటీల్లోనే కాదు డెట్‌లోనూ రిస్క్ ఈక్విటీలతో పోలిస్తే డెట్ విభాగంలో రిస్క్ తక్కువ. కాకపోతే డెట్ పెట్టుబడులపై క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్ల రిస్క్ ఎప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫండ్ మేనేజర్ తక్కువ క్రెడిట్ రేటింగ్ బాండ్లలో (చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉండే కంపెనీల పేపర్లు) ఇన్వెస్ట్ చేస్తుంటే ఆయా పథకాల్లో రిస్క్ ఈక్విటీల స్థాయిల్లోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా బాండ్ల ధరలు పడిపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈక్విటీలనే కాకుండా, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కూడా ఆర్థిక నిపుణులు, సలహాదారులను సంప్రదించి, తమ రిస్క్, పెట్టుబడుల సామర్థ్యాలకు అనుగుణంగా మెరుగైన ప్రణాళికను రూపొందించుకోవడం సూచనీయం. -
ఇన్వెస్టర్ల సొమ్ము పూర్తిగా చెల్లిస్తాం
న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్ల సొమ్మును పూర్తిగా చెల్లిస్తామని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. స్కీములను మూసివేసినంత మాత్రాన పెట్టుబడులు పోయినట్లుగా భావించరాదని పేర్కొంది. ‘స్కీముల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు జరిపేందుకు, మా బ్రాండ్‌పై విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని ఇన్వెస్టర్లకు రాసిన నోట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీ(ఇండియా) ప్రెసిడెంట్ సంజయ్ సప్రే తెలిపారు. కరోనా వైరస్‌పరమైన సంక్షోభం కారణంగా రిడెంప్షన్ ఒత్తిళ్లు పెరిగిపోయి, బాండ్ మార్కెట్లలో లిక్విడిటీ పడిపోవడంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ స్కీములను మూసివేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 25,000 కోట్లు ఉంటుంది. మూసివేత నిర్ణయం చాలా కష్టతరమైనదని, కానీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పలేదని సప్రే తెలిపారు. ట్రిపుల్ ఎ రేటింగ్ నుంచి ఎ రేటింగ్ దాకా ఉన్న బాండ్లలో తాము ఇన్వెస్ట్ చేశామని .. ఈ వ్యూహం ఇటీవలి దాకా మంచి ఫలితాలనే ఇచ్చిందని పేర్కొన్నారు. ఫండ్‌ను ప్రభుత్వం టేకోవర్ చేయాలి: బ్రోకింగ్ సంస్థల డిమాండ్ ‘ఫ్రాంక్లిన్’ ఉదంతంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మేనేజ్మెంట్ను టేకోవర్ చేసేందుకు, పెట్టుబడుల తీరును సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖకు ఏప్రిల్ 26న ఏఎన్ఎంఐ ఈ మేరకు లేఖ రాసింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు అంతగా రేటింగ్ లేనివి, ఊరూ పేరూ లేని పలు సంస్థల్లో టెంపుల్టన్ ఫండ్ పెట్టుబడులు పెట్టడం సందేహాలు రేకెత్తిస్తోందని పేర్కొంది. -
ఆర్బీఐ ‘ఫండ్స్’
ముంబై: డెట్ మార్కెట్లో నిధుల లేమికి ఆర్బీఐ తాత్కాలిక పరిష్కారం చూపించింది. రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు బ్యాంకుల ద్వారా అందించే ప్రత్యేక రెపో విండో ఏర్పాటును ప్రకటించింది. డెట్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం, అదే సమయంలో మార్కెట్లో కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గడంతో నిధుల కటకట పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఆరు అధిక రిస్క్‌తో కూడిన డెట్ పథకాలను మూసివేస్తూ గత వారం నిర్ణయం తీసుకుంది. గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా అసలే లిక్విడిటీ సమస్య తీవ్రంగా ఉన్న డెట్ మార్కెట్లో ప్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయం ఇన్వెస్టర్ల నుంచి మరింత మొత్తంలో ఉపసంహరణలు పెరిగేందుకు దారితీయవచ్చన్న ఆందోళనలతో.. సోమవారం ఆర్బీఐ మార్కెట్లను ఆదుకునే చర్యలతో ముందుకు వచ్చింది. దీంతో ఫండ్స్ సంస్థలకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా అవి తమకు ఎదురయ్యే పెట్టుబడుల ఉపసంహరణలకు చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది. అధిక రిస్క్ విభాగంలోనే సమస్య.. ‘‘కరోనా వైరస్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లలో ఆటుపోట్లు పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్‌కు నిధుల లభ్యత సమస్యలు ఎదురయ్యాయి. పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను మూసివేయడంతో ఈ ఒత్తిళ్లు మరింత తీవ్రతరమయ్యాయి. ప్రస్తుత దశలో అధిక రిస్క్‌తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగానికే ఈ ఒత్తిళ్లు పరిమితమయ్యాయి. పరిశ్రమలో మిగిలిన విభాగాల్లో అధిక శాతం నిధుల లభ్యత ఉంది’’ అంటూ ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్బీఐ ఇప్పుడు ఏం చేస్తుంది..? మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యేక నిధుల సదుపాయం (ఎస్ఎల్ఎఫ్–ఎంఎఫ్) కింద ఆర్బీఐ 90 రోజుల కాల పరిమితితో రూ.50,000 కోట్ల మేర రెపో ఆపరేషన్స్‌ను చేపడుతుంది. 4.4 శాతం ఫిక్స్డ్ రెపో రేటుపై ఈ నిధులను బ్యాంకులకు అందిస్తుంది. ఈ నెల 27 నుంచి మే 11 వరకు ఈ పథకం (విండో) అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజు అయినా బ్యాంకులు ఈ విండో ద్వారా నిధుల కోసం బిడ్ దాఖలు చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఈ సదుపాయం కింద తీసుకునే నిధులను బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిధుల అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఫండ్స్‌కు రుణాలను అందించడం, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలిగి ఉన్న ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల కొనుగోలుకు బ్యాంకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఫండ్స్‌కు నిధుల లభ్యత ఏర్పడుతుంది. బ్యాంకుల నుంచి డిమాండ్ అధికంగా ఉంటే అదనంగా నిధులను అందించే అవకాశం కూడా ఉంటుందని ఏప్రిల్ 23 నాటికి నాలుగు ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకుల నుంచి రూ.4,428 కోట్లను రుణాలుగా తీసుకున్నట్టు యాంఫి గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు.. మ్యూచువల్ ఫండ్స్‌కు నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. వాటి అవసరాల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.25,000 కోట్ల రుణాలను అందించేందుకు 2013 జూలైలో ఆర్బీఐ ప్రత్యేక విండోను తెరిచింది. అదే విధంగా లెహమాన్బ్రదర్స్ సంక్షోభం అనంతరం 2008 అక్టోబర్‌లోనూ ఆర్బీఐ ఇదే తరహా నిర్ణయంతో ముందుకు వచ్చింది. నిపుణుల భిన్నాభిప్రాయాలు.. ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధుల లభ్యతకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అద్భుతమైనదని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని కొందరు పేర్కొంటే.. రిస్క్ అధికంగా ఉండే డెట్ విభాగంలో పెద్ద ఫలితాన్నివ్వకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. మార్కెట్లలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచే చక్కని చర్యలు ఇవి. – నీలేశ్‌షా, యాంఫి చైర్మన్ సానుకూలమైన ఆహ్వాన చర్య. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను సానుకూలంగా మారుస్తుంది. – నిమేశ్షా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో ఫండ్స్‌కు బ్యాంకులు తమ రుణాలను ఎప్పుడు పెంచుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో అవసరానికంటే ఎక్కువ నిధుల లభ్యతకు ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఈ చర్యలు బాండ్ మార్కెట్లకు మేలు చేస్తాయి. నమ్మకాన్ని భారీగా పెంచే బూస్టర్ వంటిది. – ఎ.బాలసుబ్రమణ్యం, ఆదిత్య బిర్లా ఏఎంసీ ఎండీ, సీఈవో లిక్విడిటీ విండో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. అయితే, నిధుల కటకట ఏర్పడిన, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న పేపర్లకు బ్యాంకులు నిధులు అందిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. – కౌస్తభ్ బేల్‌పుర్కార్, మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ -
మళ్లీ కనిష్టాల దిశగా రూపాయి...
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలహీన బాటను వీడడం లేదు. కరోనా కల్లోలం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, ఈక్విటీల భారీ నష్టాల వంటివి దీనికి కారణం. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి కదలికలను చూస్తే... 40 పైసలు నష్టంతో 76.46 వద్ద రూపాయి విలువ ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.91 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపు విలువ 76.83 (2020, ఏప్రిల్ 21వ తేదీ). ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అనూహ్యరీతిలో తన ఆరు డెట్ ఫండ్ స్కీమ్‌లను మూసివేయడం శుక్రవారం రూపాయి పతనానికి నేపథ్యం. పెరిగిన విదేశీ మారక నిల్వలు... ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 3.09 బిలియన్ డాలర్లు పెరిగి (అంతక్రితం ఏప్రిల్ 10తో ముగిసిన వారంతో పోల్చితే) 479.57 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి 6తో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు లైఫ్‌టైమ్ హై 487.23 బిలియన్ డాలర్లు. -
‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ, అకస్మాత్తుగా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ మరింత ఆలస్యమవుతుండటం, గిలీడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలనివ్వడం లేదన్న వార్తలు, కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించిన ప్రభావమే ఉండనున్నదన్న ఆందోళన, గత రెండు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర లాభపడటంతో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం....ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 536 పాయింట్లు క్షీణించి 31,327 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 9,154 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం మేర లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల మేర నష్టపోయాయి. సెంటిమెంట్‌పై ‘టెంపుల్టన్’ దెబ్బ.... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఆరు డెట్ స్కీమ్‌లను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. కరోనా వైరస్ కల్లోలానికి, లాక్‌డౌన్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించే సూచనలు కనిపించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు 1–2%, యూరప్ మార్కెట్లు ఇదే రేంజ్ నష్టపోయాయి. ఫార్మా షేర్ల పరుగులు.... ఫార్మా షేర్ల పరుగులు కొనసాగుతున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి వివిధ కంపెనీలకు ఆమోదాలు లభించడం, ఇటీవలే వెల్లడైన అలెంబిక్ ఫార్మా ఫలితాలు ఆరోగ్యకరంగా ఉండటం, దీనికి ప్రధాన కారణాలు. అలెంబిక్ ఫార్మా, సన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్(ఈ మూడు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి) అల్కెమ్ ల్యాబ్స్, అజంతా ఫార్మా, లుపిన్, ఇప్కా ల్యాబ్స్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, ఎఫ్డీసీ తదితర షేర్లు 2–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఆర్థిక, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ రంగ షేర్లు క్షీణించాయి. నిప్పన్ ఇండియా షేర్ 18 శాతం నష్టంతో రూ.216కు, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ 6 శాతం నష్టంతో రూ.2,425కు, శ్రీరామ్ ఏఎమ్‌సీ 3 శాతం పతనమై రూ.71కు పడిపోయాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.1,976 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. -
ఫండ్ ఇన్వెస్టర్లకు షాక్!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి .. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లకు హోల్డింగ్స్ అమ్మేయడం లేదా పెట్టుబడులపై మరిన్ని రుణాలు తెచ్చి తీర్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని సంస్థ భారత విభాగం ఎండీ సంజయ్ సాప్రే చెప్పారు. ఏదీ కుదిరే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పనిసరై ఆయా స్కీములను మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. మూసివేతతో ఇన్వెస్టర్లపరమైన లావాదేవీలేమీ జరగకపోయినప్పటికీ .. యాజమాన్యం దృష్టికోణంలో ఇవి కొనసాగుతాయని సాప్రే చెప్పారు. మెరుగైన రేట్లకు విక్రయించి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. ‘ఇటు మార్కెట్లు, అటు ఎకానమీ ఏ దిశ తీసుకుంటాయన్నదానిపై స్పష్టత కొరవడటంతో ఇన్వెస్టర్లకు మరిం త హాని జరిగే అవకాశముందని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంతోష్ కామత్ తెలిపారు. సుమారు 26 ఏళ్ల రీసెర్చ్ అనుభవం, 19ఏళ్లకు పైగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మె ంట్ అనుభవం కామత్‌కి ఉంది. ట్రిపుల్ ఎ కన్నా తక్కువ రేటింగ్ ఉండే బాండ్ల పెట్టుబడుల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సెబీతో సంప్రదించాకే: ‘ఆరు ఫండ్ల మూసివేత నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. దీనిపై నియంత్రణ సంస్థ సెబీతో విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలే ఉన్నాయని సెబీ కూడా భావించింది‘‡అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్ ఎండీ వివేక్ కుద్వా తెలిపారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు క్రమానుగతంగా, ’అందరికీ సమానంగా’ చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కుద్వా వివరించారు. ఇది టెంపుల్టన్కి మాత్రమే పరిమితం: యాంఫి 6 స్కీమ్‌ల మూసివేత అంశం కేవలం ఆయా స్కీమ్లకే పరిమితమైన దని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫి పేర్కొంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌పై దీని ప్రభావమేమీ ఉండబోదని కాన్ఫరెన్స్ కాల్లో యాంఫి చైర్మన్ నీలేశ్ షా చెప్పారు. డెట్ స్కీముల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగానే ఉన్నాయని భరోసానిచ్చారు. రూ.22.26 లక్షల కోట్లు ఈ మార్చి 31నాటికి మ్యూచువల్ ఫండ్స్ వద్ద సగటు నిర్వహణ నిధులు రూ.2.13 లక్షల కోట్లు మార్చి నెలలో ఫండ్స్(ఈక్విటీ, డెట్) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ సెబీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి: బ్రోకింగ్ సంస్థలు టెంపుల్టన్ ఆరు డెట్ స్కీముల మూసివేతతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొందని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను, కష్టార్జితాన్ని పరిరక్షించేందు కు ఆర్థిక శాఖ, సెబీ తక్ష ణం జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దాలని కోరింది. స మస్య మూలాల గుర్తింపునకు నిపుణుల కమిటీ వేయాలని పేర్కొంది. ఏం జరిగిందంటే.... కరోనా వైరస్ ధాటికి భారత్ సహా పలు ప్రపంచ దేశాల ఈక్విటీ, బాండ్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. అయితే, కొనేవాళ్లు కరువవడంతో .. రేట్లు గణనీయంగా పడిపోయాయి. పైపెచ్చు తక్కువ స్థాయి రేటింగ్ ఉన్న స్క్రిప్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలహీన క్రెడిట్ రేటింగ్స్ ఉన్న కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడం దాదాపు నిలిపివేశాయి. దీంతో తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల డెట్ స్క్రిప్‌లకు డిమాండ్ భారీగా పడిపోయింది. రిస్కులు ఎక్కువున్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కన్నా మిగులు నిధులను తక్కువ రాబడులు వచ్చినా రిజర్వ్ బ్యాంక్ దగ్గర సురక్షితంగా ఉంచుకునేందుకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై నమ్మకం సన్నగిల్లి ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లకు దూరంగా ఉంటుండటంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి. కరోనా వైరస్‌పరమైన మాంద్యం భయాలతో టెంపుల్టన్ మూసివేసిన ఆరు స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అయినకాడికి అమ్ముకునేందుకు మొగ్గుచూపారు. అయితే, మార్కెట్లో అమ్ముదామన్నా కొనేవారు కరువవడంతో మరో దారి లేక ఈ స్కీములను టెంపుల్టన్ మూసివేయాల్సి వచ్చింది. మిగతా డెట్ ఫండ్స్ మాటేంటి .. ఆరు స్కీమ్‌లు మూసివేసినంత మాత్రాన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పూర్తిగా మూతబడినట్లు కాదు. దాదాపు పాతికేళ్లకుపైగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టెంపుల్టన్ మరో ఏడు డెట్ ఫండ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నాటికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 17,800 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా టెంపుల్టన్ దాదాపు రూ. 36,663 కోట్ల విలువ చేసే 15 ఈక్విటీ ఫండ్స్‌ను, సుమారు రూ. 3,143 కోట్ల విలువ చేసే 11 హైబ్రిడ్ కేటగిరీ స్కీమ్‌లను (ఈక్విటీలు, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్) నిర్వహిస్తోంది (విలువలు మార్చి 31 నాటికి). ఈ ఫండ్సన్నీ యథాప్రకారం కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందరాదని సంస్థ పేర్కొంది. ఇప్పుడేంటి పరిస్థితి... స్కీములను మూసివేసినా ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. స్కీము వాస్తవ గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిందే. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ సంగతి తీసుకుంటే.. సగటు గడువు బట్టి చూసినప్పుడు.. ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి రావడానికి ఏడాది పైన 73 రోజులు పట్టొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్ సగటు కాలావధి బట్టి చూస్తే ఇన్వెస్టర్లు మూడేళ్ల పైన 80 రోజులు దాకా వేచి చూడాల్సి రానుంది. ఈ స్కీములు మూతబడ్డాయి కాబట్టి వీటిల్లోకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్న వారి వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ (ఎస్టీపీ) కింద వీటిల్లో డబ్బు పెట్టిన వారికి మాత్రం చిక్కులు తప్పవు. సాధారణంగా చేతిలో భారీ మొత్తం సొమ్ము ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టకుండా.. ఇలాంటి డెట్ సాధనాల్లో ఉంచుతారు. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా వీటిలో కాస్త ఎక్కువ రాబడి వస్తుందనే ఆలోచన ఇందుకు కారణం. ఇక, ఈ డెట్ సాధనాల నుంచి కొంత మొత్తాన్ని విడతలవారీగా (నెలకోసారి, వారాని కోసారి లాగా) ఈక్విటీల్లోకి ఇన్వెస్టర్లు మళ్లిస్తుంటారు. ప్రస్తుతం మూతబడిన టెంపుల్టన్ స్కీముల్లో ఇలా ఎస్టీపీ కింద భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేసినవారికి కాస్త ఇబ్బంది తప్పదనేది విశ్లేషకుల మాట. -
కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం
సాక్షి, ముంబై : ప్రముఖ, పురాతన ఎసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. కోవిడ్-19 సంక్షోభం కారణం భారత్ లో నిర్వహిస్తున్న 6 ఫండ్స్ మూసివేస్తున్నట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభం భారతీయ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావానికి సంకేతంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ 2020 ఏప్రిల్ 23 నుండి అమలులోకి వచ్చే ఆరు పథకాలను స్వచ్ఛందంగా ముగించాలని నిర్ణయించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్లో పెరిగిన ఉపసంహరణ ఒత్తిడి, క్షీణించిన ద్రవ్యత లభ్యత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. యూనిట్ హోల్డర్ల విలువను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. కరోనా వైరస్ అసాధారణ పరిస్థితులలో ఇదొక్కటే ఆచరణీయమైన మార్గమని పేర్కొంది. తద్వారా రూ .30,800 కోట్ల పెట్టుబడిదారుల సంపద ఇరుక్కుపోయింది. తాజా పరిణామం ఇతర రుణ పథకాలపై కూడా ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బ్యాకప్ లేదా ప్రత్యామ్నాయ నిధుల మార్గాలు లేకపోవడం రాబోయే 3 నెలల్లో ఎన్ బీఎఫసీ రంగం తీవ్ర మైన ఇబ్బందుల్లో పడనుందని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది. ఆ ఫండ్స్ కింద ఉన్న సెక్యూరిటీలను కొద్దికాలం తర్వాత విక్రయించి ఇన్వెస్టర్లకు క్రమంగా చెల్లింపులు జరుపుతామని కంపెనీ తెలిపింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు వివరించింది. మూసేస్తున్న 6 ఫండ్స్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో లిక్విడిటీ సమస్య ఎదుర్కునే ఫండ్స్‌ను మాత్రమే మూసేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్స్ మూసేసి ఇన్వెస్టర్లకు డబ్బులవు వాపసు ఇవ్వడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్టు ఫ్రాంక్లిన్ ఇండియా (ఇండియా) అధ్యక్షుడు సంజయ్ సాప్రే చెప్పారు. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్) కాగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గురువారం మ్యూచువల్ ఫండ్ల కోసం వాల్యుయేషన్ పాలసీలను సడలించిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఆయా సంస్థలు మెచ్యూరిటీలో పొడిగింపు, లేదా వడ్డీ చెల్లించడంలో ఆలస్యం అయితే వాటిని డిఫాల్ట్ర్స్ గా ప్రకటించ వద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకాలను మూసివేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తరువాత, ఈ పథకాల్లోని పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోలేరు. తాజా యూనిట్లను కొనలేరు, ఈక్విటీ పథకాలకు బదిలీ చేయలేరు లేదా వారి నెలవారీ ఖర్చుల నిమిత్తం తమ నిధులను క్రమపద్ధతిలో ఉపసంహరించుకోలేరు. మరోవైపు ఈ విషయం ప్రభుత్వం, ఆర్బీఐ దృష్టికి వెళ్లింది. లిక్విడిటీ సమస్యను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) మూసివేస్తున్నట్టు ప్రకటించిన 6 ఫండ్స్ ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్‌కం ప్లాన్ ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రాషార్ట్ బాండ్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం అపార్చునిటీస్ ఫండ్ -
బాండ్ల ఇన్వెస్టర్లు ‘తమ్ముళ్లేనా’?
‘‘అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అర్ధగంటే సమయం ఇచ్చాం. ఆ సమయంలోనే రూ.2వేల కోట్లు వచ్చాయి. అదే గనక 8 గంటలు సమయం ఇచ్చి ఉంటే రూ.10 వేల కోట్లు సమీకరించి ఉండేవాళ్లం.’’ ఇదీ... చంద్రబాబు తరఫున ఏపీ ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చెరుకూరి కుటుంబరావు తాజా మాట. అంటే!! తాము జారీ చేసిన బాండ్లకు విపరీతమైన గిరాకీ ఉందని చెబుతున్నట్లేగా? అదే నిజమైతే తక్కువ వడ్డీ ఇవ్వొచ్చు కదా? ఎవరూ రారనే భయంతోనే కదా... అంత ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసింది? ఈ బాండ్లకే గనక నిజంగా అంత గిరాకీ ఉంటే రేటింగ్ సంస్థలు తక్కువ రేటింగ్ ఎందుకిచ్చాయి? ఇన్వెస్టర్లను తేవటానికి నియమించిన సంస్థే (అరేంజర్) నేరుగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాల్సి (అండర్‌రైటింగ్) వచ్చింది? ఎవ్వరూ రావటం లేదనేగా? అసలు ఏపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ మతి ఉన్న మాటలేనా? ఒకదానితో ఒకటి పొంతన లేదెందుకు? సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ అథారిటీ(ఏపీసీఆర్డీఏ) పేరిట చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన రూ.2,000 కోట్ల బాండ్లకు సంబంధించి తవ్వుతున్న కొద్దీ కొత్త కోణా లు వెలుగుచూస్తున్నాయి. అంతర్జాతీయంగా బాగా పేరున్న సంస్థ కనక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ద్వారా వెనక నుంచి కథ నడిపించారనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తే అందులో 62 శాతం వాటా తనకే కావాలని ఏ ఫండ్ కూడా పెట్టుబడి పెట్టదు. నిజానికి ఏ ఫండూ కూడా ఒక మొత్తం ఇష్యూలో 5 శాతాన్ని మించి కొనుగోలు చేయటానికి ఇష్టపడదు. బాండ్ల విషయానికి వస్తే ఈ శాతం మహా అయితే 10 వరకూ ఉండొచ్చు. కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ తన చేతిలోని వివిధ పథకాల ద్వారా ఏకంగా ఏపీసీఆర్డీఏ బాండ్లలో 62.5 శాతాన్ని తానొక్కటే కొనుగోలు చేసింది. అంటే... రూ.2,000 కోట్ల ఈ ఇష్యూలో రూ.1,300 కోట్లను ఈ సంస్థ ఒక్కటే పెట్టుబడిగా పెట్టింది. తెరవెనక కథ ఇదేనా? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇంత భారీగా పెట్టడం వెనక ఆనేక ఆసక్తికరమైన కథలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ఆరంభించిన కొన్ని పథకాల్లో బాబు అనయాయులు, ఆయన మనుషులు పలువురు భారీగా పెట్టుబడులు పెట్టారనేది టీడీపీ వర్గాల్లో వినవస్తున్న మాట. దీంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఈ డబ్బునే తెచ్చి అమరావతి బాండ్లలో భారీగా ఇన్వెస్ట్ చేసింది. తద్వారా బాబు ప్రభుత్వం ఇస్తున్న భారీ వడ్డీ... కొంత ఛార్జీలు మినహా తిరిగి ఆయన అనయాయుల జేబుల్లోకే చేరుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ కారణంగానే అమరావతి బాండ్లలో ఇన్వెస్ట్ చేయటానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మరికొన్ని సంస్థలు తప్ప ఎవరూ ముందుకు రాలేదని... చివరకు అనుకున్నట్లుగా ఇష్యూ సబ్స్క్రయిబ్ కాదేమోనని భయపడి, అరేంజర్గా వ్యవహరిస్తున్న ఏకే క్యాపిటల్ తానే నేరుగా ఇన్వెస్ట్ చేసిందని విశ్వసనీయంగా తెలిసింది. ఇవి ప్రభుత్వ బాండ్లు కాదు... నిజానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) భాగంగా కొన్ని బాండ్లను జారీ చేస్తుంటుంది. వీటిని ప్రభుత్వ బాండ్లుగా వ్యవహరిస్తారు. వీటికి ఆర్బీఐ, కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కాకపోతే అమరావతి బాండ్లు అలాంటివి కావు. ఇవి కూడా సాధారణ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జారీ చేసే ప్రయివేటు బాండ్ల లాంటివే. ఇలా మున్సిపాలిటీల వంటివి బాండ్లు జారీ చేసేటపుడు ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ‘సెబీ’ కొన్ని మార్గదర్శకాలు విధించింది. వీటి ప్రకారం జారీ చేసే సంస్థ అంతకు ముందటి ఏడాదిలో చెల్లింపుల్లో డిఫాల్ట్ అయి ఉండకూడదు. దేనికోసం జారీ చేస్తున్నారో తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాలో ఉంచాలి. ఈ లెక్కన చూసినపుడు ఏపీసీఆర్డీఏకు అంత గొప్ప ఆదాయ వనరులేమీ లేవు. రూ.2,000 కోట్లు రుణంగా తెచ్చినందుకు ప్రతి 3 నెలలకూ రూ.258 కోట్లు వడ్డీగా చెల్లించాలి. ఇంత మొత్తాన్ని అసలు నుంచి చెల్లించవలసిందే తప్ప ఇప్పటికప్పుడు దానిపై ఆదాయం వచ్చే పరిస్థితులు లేవన్నది సాక్షాత్తూ బాబు ప్రభుత్వ వర్గాలే చెబుతున్న మాట. వాళ్లొచ్చింది వడ్డీ కోసమా... అభివృద్ధి కోసమా? ‘‘అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావటానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ముందుకొచ్చింది. అందుకే ఇన్వెస్ట్ చేసింది’’ అన్నది చంద్రబాబు మాట. నిజానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది మ్యూచ్‌వల్ ఫండ్ వ్యాపారం నిర్వహించే సంస్థ. జనం దగ్గర డబ్బులు సమీకరించి... వాటిని రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి... వచ్చే లాభాల్ని వారికి పంచటం దానిపని. అలాంటి సంస్థ అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని ఎందుకు అనుకుంటుంది? పైపెచ్చు ఏపీసీఆర్డీఏ అనేది ఒక చిన్న సంస్థ. దీనికి ఆదాయమెలా వస్తుంది? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అన్నది కూడా స్పష్టత లేదు. పోనీ ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది కదా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే లోటు బడ్జెట్లో ఉంది. అంతెందుకు మనదేశంలో కూడా ప్రభుత్వరంగ సంస్థలు జారీచేసిన అనేక బాండ్లు కూడా చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ ఈ ఒక్క సంస్థే రూ.1,300 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి రిస్క్ చేయటం వెనక బాబు వ్యూహం ఉందనేది చెప్పకనే తెలుస్తోంది. తక్కువ వడ్డీకి ప్రయత్నించారా? చంద్రబాబు హెరిటేజ్‌తో సహా ఏ సంస్థయినా తన వ్యాపార విస్తరణ కోసం నిధులను సేకరించేటప్పుడు తక్కువ వడ్డీకి రుణాల కోసం ప్రయత్నిస్తుంది. కానీ బాబు ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రయత్నాలే పక్కనబెట్టేసింది. తక్కువ వడ్డీకి రుణాల కోసం ప్రయత్నిచమంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ సూచించినా పెడచెవిన పెట్టేసింది. చిత్రమేంటంటే ఇదే ప్రభుత్వం పౌరసరఫరాల శాఖను రూ.15,000 కోట్ల రుణాలను 7.9 శాతం లేదా అంతకంటే తక్కువ వడ్డీకి రుణం తీసుకోమంటూ జీవో జారీచేసింది. కానీ తానేమో 10.32 శాతం వడ్డీ ఇస్తానంటూ బాండ్లు జారీచేసింది. 6 శాతం వడ్డీకే బాండ్లు జారీ చేసే అవకాశం ఉంటుంది కనక ఇన్ఫ్రా బాండ్ హోదా కోసం కేంద్రంతో చర్చించాలని ఆర్థిక శాఖ సూచించినా పట్టించుకోలేదు. దీనిపై సమాధానం మాత్రం శూన్యం. పబ్లిక్ ఇష్యూ అంటూ అబద్ధాలు దేనికి? ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఇన్వెస్టర్ల నుంచి బాండ్ల రూపంలో రూ.2,000 కోట్లు సేకరిస్తున్నట్లు జీవో జారీ చేశారు. కానీ పబ్లిక్ ఇష్యూ ద్వారా బాండ్లు జారీ చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. ఇన్వెస్టర్ల వివరాలడిగితే చెప్పకుండా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ఉంటాయి చూసుకోమని చెబుతున్నారు. నిజానికి ప్రైవేటు ప్లేస్మెంట్ వివరాలు స్టాక్ ఎక్సే్ఛంజీలు బయటకు చెప్పవు. ఈ బాండ్లు గనక పారదర్శకంగా జారీ అయి ఉంటే వివరాలన్నీ సీఎం డ్యాష్ బోర్డులోనే ఉండేవనేది ఆర్థిక నిపుణుల మాట. -
బాండ్లతో జనానికి బ్యాండ్
‘‘చూశారా! ఎంత స్పందనో? అమరావతి బ్రాండ్ ఇమేజ్ను, చంద్రబాబు నాయకత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీలు పడ్డారు. అందుకే అరగంటలోనే మేం కావాలనుకున్న మొత్తం కంటే ఎక్కువ పెట్టుబడులొచ్చాయి?’’ రూ.2,000 కోట్ల విలువైన అమరావతి బాండ్లను లిస్ట్ చేసినప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్పిన మాటలివి. సరే! బాబు నాయకత్వాన్ని, అమరావతి ఇమేజ్‌ని చూసి పెట్టుబడులు పెట్టినపుడు మీరు అరేంజర్‌కు (రన్నింగ్ లీడ్ మేనేజర్) 0.9 శాతం.. అంటే రూ.18 కోట్లు ఎందుకిచ్చారు? జీహెచ్ఎంసీ వంటి సంస్థలు తమ బాండ్ల అరేంజర్‌కు ఫీజుగా 0.10 శాతమే ఇచ్చాయి కదా? మీరు కూడా అలా చేస్తే ఓ 2 కోట్లతో పోయేది కదా?... ఈ ప్రశ్న అడిగిన వారికి బాబు ఇచ్చే సమాధానమేంటో తెలుసా? ‘‘ఈ బాండ్లలో రిస్కు ఎక్కువ. అందుకే అంత ఫీజు చెల్లించాల్సి వచ్చింది’’ అని. అంటే తమ నాయకత్వాన్ని చూసి ఇన్వెస్టర్లు ఎగబడి వచ్చేశారని చెప్పేదీ వారే! రిస్కుంది కాబట్టి ఇన్వెస్టర్లు రారేమోనని భయపడి ఎక్కువ ఫీజులు చెల్లించామని చెప్పేదీ వారే!! ఈ రెండు పొంతన లేని సమాధానాలను పక్కనబెడితే అసలు ప్రశ్న ఒకటుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే బాండ్లకు రిస్కుంటుందా? ఉంటే ఆ ప్రభుత్వం పనికిరాని డిఫాల్టరనేగా అర్థం? మరి అలాంటప్పుడు నాయ కత్వం గురించి బోడి గొప్పలెందుకు? అసలు వీళ్ల చర్యల్లోని మతలబులేంటి? తెరవెనుక ఏం జరిగింది? ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైన నిజాలు సాక్షి, అమరావతి: అమరావతి కథల్లాగే... ఈ బాండ్ల కథలూ అన్నీ ఇన్నీ కావు. ఇంతా చేస్తే ఈ బాండ్లలో ఏకంగా 95 శాతాన్ని కొన్నది ముగ్గురు ఇన్వెస్టర్లే! అందులో ఒక్క ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థే ఏకంగా రూ.1,300 కోట్లు పెట్టి 62.5 శాతాన్ని కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలోని మధురవాడలో రూ.400 కోట్ల విలువైన 40 ఎకరాలను ఎకరా రూ.32 లక్షలకే కట్టబెట్టింది. పైపెచ్చు మిగతా సంస్థలన్నిటికీ భూములను 33 ఏళ్ల లీజుకిస్తూ... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు మాత్రం ఏకమొత్తంగా విక్రయించేసింది. అది చాలదన్నట్లు మిగతా వారెవ్వరూ ఇవ్వనంత వడ్డీని ఆఫర్ చేస్తూ ప్రభుత్వ బాండ్లనూ జారీ చేసింది. నిజానికి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం 10 ఎకరాలకు మించి లేదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 9,400 మంది ఉద్యోగులుండగా, సింహభాగం అమెరికాలోనే ఉన్నారు.అలాంటిది అక్కడే పదెకరాల్లో విస్తరించిన ఆ సంస్థకు... విశాఖపట్నంలో 2,500 ఉద్యోగాలిస్తామని చెప్పేసరికి ఏకంగా 40 ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టేయడం గమనార్హం. విశాఖలో పదెకరాలకు మించి భూమి కేటాయించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ చేసిన సూచనలను బాబు ప్రభుత్వం పక్కనబెట్టేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు ప్రస్తుతం ఇండియా మొత్తమ్మీద 600 మంది మాత్రమే ఉద్యోగులున్నారు. అలాంటి ఒక్క విశాఖలో 2,500 ఉద్యోగాలివ్వడానికి ఎన్నాళ్లు పడుతుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు.వడ్డీ రేట్ల విషయానికొస్తే అమెరికాలో 4 శాతం మించి లేవు. ఇండియాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఇన్వెస్ట్ చేసిన బాండ్లపై 7–9 శాతానికి మించి వడ్డీ రావడం లేదు. అలాంటిది బాబు ప్రభుత్వం మూడు నెలలకోసారి 10.32 శాతం చెల్లించేలా బాండ్లను జారీ చేసింది. వార్షికంగా చూస్తే ఈ వడ్డీ ఏకంగా 10.78 శాతం కావడం గమనార్హం. ఇలా అత్యధిక వడ్డీనిచ్చే బాండ్లను, కారుచౌకగా భూములను ఆ కంపెనీకే ఎందుకిచ్చారనేది ఊహలకు అందనిదేమీ కాదు. సలహాదారు నుంచి ఇన్వెస్టరుగా... అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టిన మరో సంస్థ ఏకే క్యాపిటల్. మొదట బాండ్ల ఇష్యూకు సలహాదారుగా వ్యవహరించిన ఈ సంస్థ... తరవాత లీడ్ మేనేజర్‌గా(అరేంజర్) రూపాంతరం చెందింది. అంటే బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లను తీసుకొచ్చే పని దీనిదన్న మాట. చివరకు ఈ సంస్థ కూడా ఇన్వెస్టరుగా మారిపోయి ఏకంగా 25 శాతం... అంటే రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టడం గమనార్హం. ప్రభుత్వం జారీ చేసే బాండ్లలో అరేంజర్గా ఉన్న సంస్థ పెట్టుబడి పెట్టకూడదన్నది సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిబంధన. కానీ.. ఏకే క్యాపిటల్ దీన్ని తుంగలో తొక్కిందని, దీనిపై సెబీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉన్నా... నిజానికి అరేంజర్ల పాత్ర తగ్గించడానికి, బాండ్లు జారీ చేసే సంస్థలకు ఖర్చులు తగ్గడానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ‘సెబీ’ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.200 కోట్లకు పైబడి బాండ్లు జారీ చేసే సంస్థలన్నీ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించవచ్చు. అరేంజర్ ప్రమేయం లేకుండా నేరుగా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. చిన్న, అనామక సంస్థలకు ఇబ్బందిగా ఉన్నా... పేరున్న సంస్థలకిది బాగా కలిసి వస్తోంది. మరి తన బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రపంచమంతా డప్పు కొట్టే చంద్రబాబు అనామకుడు కాదు కదా! మామూలు కంపెనీలకంటే ఏపీ ప్రభుత్వం మెరుగైనదే కదా? పైగా అందరికంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టి వస్తారు. కానీ, తెలిసిన సంస్థను అరేంజర్గా ఎంచుకుని, దానికి భారీ ఫీజులిచ్చి... కావాల్సిన వారు మాత్రమే పెట్టుబడులు పెట్టేలా చేయటం వెనక బాబు పన్నిన కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అబద్ధాలతో అక్రమాలను కప్పెట్టేయత్నం అమరావతి బాండ్లను పారదర్శకంగా జారీ చేస్తున్నామని, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ వివరాలు స్టాక్ ఎక్ఛేంజీలో లభిస్తాయని ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో వీసమెత్తు వాస్తవం లేదు. బాండ్లను పబ్లిక్ ఇష్యూగా కాకుండా ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో జారీ చేశారు. దీంతో ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారి వివరాలు సాధారణ ప్రజలకు తెలియవు. ఇన్వెస్టర్ల వివరాలు చెప్పాలని ఒత్తిడి రావడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ.. 59 మంది పెట్టుబడి పెట్టారంటూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బిర్లా, ఏకే క్యాపిటల్ గ్రూపుల పేర్లు మాత్రమే వెల్లడించారు. నిజానికి ఈ మూడు సంస్థలే వివిధ పథకాల పేర్లతో 95 శాతం పెట్టుబడి పెటినట్లు ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైంది. జీవోనూ ఉల్లంఘించారు ‘హడ్కో’ లాంటి సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీరేటు 8 శాతం లోపు, అదే ఇన్ఫ్రా బాండ్ హోదా అయితే వడ్డీరేటు 6 శాతంలోపు ఉంటేనే ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అదే బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తే వడ్డీరేటు వాణిజ్య బ్యాంకుల టర్మ్ రుణాల కంటే తక్కువ ఉంటేనే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ప్రస్తుతం ఎస్బీఐ బేస్‌రేట్ 8.95 శాతం. కానీ, 10.32 శాతానికి అమరావతి బాండ్లను జారీ చేస్తూ కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జీవో నిబంధనలకు విరుద్ధమని సాక్షాత్తూ ఆర్థిక శాఖ అధికారులే చెబుతున్నారు. దీని మర్మమేంటి బాబూ! అమరావతి బాండ్లలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన సంస్థలు 12.5 శాతం పెట్టుబడి పెట్టాయి. సాధారణంగా ఆదిత్య బిర్లా గ్రూపు పెట్టుబడులను అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకే డైరెక్టర్ అటు ఏకే క్యాపిట్‌లో, ఇటు ఆదిత్య బిర్లా గ్రూపులో ఉండటంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే క్యాపిటల్‌లో డైరెక్టర్‌గా ఉన్న సుభాష్‌చంద్ర భార్గవ.. ఏబీ నువో, ఏబీ క్యాపిటల్, ఏబీ సన్‌లైఫ్ పెన్షన్, ఏబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏబీ మై యూనివర్స్ లిమిటెడ్‌లో కూడా డైరెక్టర్. ఈ డైరెక్టర్‌కు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పలువురు స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు. వీటిని పరిశీలిస్తే బాండ్ల జారీకి సలహాదారుగా ఏకే క్యాపిటల్ సంస్థను తెరపైకి తీసుకురావడం దగ్గర్నుంచి చివరి వరకూ అంతా బాబు కనుసన్నల్లోనే, అనుకున్నట్టే జరిగినట్లు తెలుస్తోంది. అంత భారీ ఫీజు ఎందుకు? అరేంజర్గా వ్యవహరించే సంస్థకు చిన్న ఇష్యూల్లో అయితే కాస్త ఎక్కువగా... పెద్ద ఇష్యూల్లో కొంచెం ఎక్కువగా చెల్లిస్తారు. ఉదాహరణకు ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రూ.200 కోట్ల మేర బాండ్లు జారీ చేసింది. చిన్న ఇష్యూ కనుక ఫీజు ఎక్కువుండాలి. అయితే ఫీజు కింద జీహెచ్ఎంసీ రూ.20 లక్షలు అంటే 0.10 శాతం చెల్లించింది. అమరావతి బాండ్ల సైజు రూ.2,000 కోట్లు.కాబట్టి ఇది ఇంకా తక్కువుండాలి. పోనీ 0.10 శాతం అనుకున్నా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించాలి. కానీ బాబు సర్కారు ఏకే క్యాపిటల్‌కు ఏకంగా 0.9 శాతం... అంటే రూ.18 కోట్లు చెల్లించింది. గతంలో స్టాక్ బ్రోకర్‌గా పనిచేసి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తికి ఏకే క్యాపిటల్‌తో ఉన్న సంబంధాల గురించి పలువురు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ తాజా చర్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. -
భలే మంచి చౌకబేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అత్యంత విలువైన భూములను విదేశీ ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కేటాయించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తోంది. భూముల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారుల అభ్యంతరాలు, సూచనలను సైతం ప్రభుత్వ పెద్దలు లెక్కచేయడం లేదు. ఐటీ కంపెనీల పేరిట ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే విలువైన భూములను పరాధీనం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు టీడీపీ ప్రభుత్వం 40 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టింది. ప్రధాన కార్యాలయం పదెకరాల్లోనే.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో కేవలం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, మన రాష్ట్రంలో ఆ సంస్థకు 40 ఎకరాలు కేటాయించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తేల్చిచెప్పింది. తొలుత 10 ఎకరాలు మాత్రమే కేటాయించాలని, ఆ స్థలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న తర్వాత అవసరమైతే మరికొంత భూమిని కేటాయించవచ్చని సూచించింది. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఇచ్చే భూమి ఎకరా రూ.10 కోట్లకు పైగా పలుకుతోందని, ఆ సంస్థ కోరినట్లు ఎకరా రూ.32.50 లక్షలకే కేటాయించవద్దని స్పష్టం చేసింది. కనీసం ఏపీఐఐసీ నిర్ణయించిన ధర ఎకరా రూ.2.70 కోట్ల చొప్పున అయినా వసూలు చేయాలని కమిటీ పేర్కొంది. ఎకరా రూ.32.50 లక్షలకే.. పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ చేసిన సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పట్టించుకోలేదు. ఫ్రాంక్టిన్ టెంపుల్టన్ కోరినట్లుగానే ఎకరా రూ.32.50 లక్షల చొప్పున మొత్తం 40 ఎకరాలను ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంటే రూ.406 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.13 కోట్లకే విదేశీ సంస్థకు దారాదత్తం చేశారన్నమాట. సదరు భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు తక్షణమే అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ శుక్రవారం జీవో జారీ చేశారు. పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సూచించినట్లు ఏపీఐఐసీ నిర్ణయించిన ధరకైనా భూములను కేటాయించి ఉంటే రూ.108 కోట్లు సర్కారు ఖజానాకు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. కంపెనీలు రాకముందే ఔట్ రైట్ సేల్ విశాఖ రూరల్ మండలం మధురవాడలో గతంలో పర్యాటక శాఖకు కేటాయించిన సర్వే నంబర్ 409లో 28.35 ఎకరాలు, సర్వే నంబర్ 381లో 11.65 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు కేటాయించారు. ఇందులో ఆ సంస్థ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తుందని, 2,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రెగ్యులర్ కేటాయింపులతో సంబంధం లేకుండా తక్షణం ఆ 40 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఇచ్చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఔట్ రైట్ సేల్కు ఇచ్చేస్తున్నందున ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదని అధికారులు అంటున్నారు. ఐటీ పరిశ్రమలు రాకముందే ఔట్ రైట్ సేల్ చేయడం సరైంది కాదని పేర్కొంటున్నారు. -
లోకేశా.. ఇది లోకల్ ప్రేమేనా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఔత్సాహికులు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి విదేశీ సంస్థలకే విలువైన భూములు ఇస్తోందన్న విమర్శలపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలు, ట్విట్టర్ వేదికగా ఇస్తున్న సమాధానాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఐటీ రంగంలో విశాఖలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారికి ఎర్ర తివాచీ వేస్తామని, ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త శ్రీనుబాబు.. పల్సస్ కంపెనీ పెట్టేందుకు వస్తే ప్రభుత్వం భూములు కేటాయించిందని లోకేష్ ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవానికి పల్సస్ కంపెనీకి ఇప్పటికీ గజం భూమి కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా పొందిన పల్సస్ సంస్థ ఐటీ రంగంలో మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తామని దరఖాస్తు చేసి రెండేళ్లయినా ఇంకా పరిశీలనలోనే ఉంది. ఐదు నుంచి పది ఎకరాల్లోపు కేటాయించగలమని, ఎకరం ధర రూ.3 కోట్ల మేర ఉంటుందని సదరు పల్సస్ సంస్థకు సర్కారు చెబుతూ వస్తోంది. అయితే ఇప్పటికీ కేటాయింపుపై స్పష్టత లేకపోగా, నారా లోకేష్ మాత్రం పల్సస్ సంస్థకు కేటాయించేశామని చెప్పడం గమనార్హం. ఇదే విషయం ఇప్పుడు ఐటీరంగంలో చర్చనీయాంశమైంది. ప్రాంక్లిన్ టెంపుల్టన్కు అడ్డగోలు కేటాయింపులు ప్రాంక్లిన్ టెంపుల్టన్కు భూముల కేటాయింపులపై విమర్శలకు సమాధానంగానే లోకేష్ పల్సస్ ప్రస్తావన తెచ్చి.. మరిన్ని విమర్శలకు తావిచ్చారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టే టెంపుల్టన్ రెండువేల ఉద్యోగాలు కల్పిస్తుందని లోకేష్ చెప్పారు. అందుకే 40 ఎకరాల భూములు కట్టబెట్టామని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి టెంపుల్టన్ 25 ఎకరాలే కోరితే.. అత్యంత ఉదారంగా 40ఎకరాలు కేటాయించడంపై ఇప్పటికీ వివాదం చెలరేగుతోంది. తొలుత మల్టీనేషనల్ కంపెనీ టెంపుల్టన్, దేశీయ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌కు కలిపి 40 ఎకరాలు కేటాయిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు సంస్థలు సంయుక్తంగా భూమిని అడగడంపై వివాదంతో పాటు.. ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థ బాధ్యుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని బయటకు రావడంతో సర్కారు వెనక్కి తగ్గి జీవోలో మార్పులు చేసింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ను తప్పించి మొత్తం 40ఎకరాలూ టెంపుల్టన్‌కే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఎకరానికి 40 రూ.లక్షలు చొప్పున రిషికొండలోని ఐటీ హిల్స్‌లో భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ కేటాయింపుల్లోనూ అక్రమాలు దాగున్నాయి. 40 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నా..రెండున్నరవేల ఉద్యోగాలేనా? ఐటీ నిబంధనల ప్రకారం.. భూములు తీసుకున్న కంపెనీలు ఎకరానికి 500మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ మేరకు టెంపుల్టన్ 40ఎకరాలకు గానూ 20వేల మందికి ఉద్యోగాలివ్వాలి. కానీ లోకేష్ మాత్రం టెంపుల్టన్ కంపెనీ 2500 ఉద్యోగాలిస్తుందని గొప్పగా చెప్పారు. 20వేలమందికి ఇవ్వాల్సిన కంపెనీ 2,500మందికి ఇస్తామంటే సదరు మంత్రి ఘనంగా ప్రకటించడం విమర్శలపాలవుతోంది. మరోవైపు 3వేల ఉద్యోగాలు కచ్చితంగా కల్పిస్తామని చెబుతున్న శ్రీకాకుళం యువ పారిశ్రామికవేత్తకు చెందిన పల్సస్ కంపెనీకి ఐదు నుంచి పది ఎకరాల్లోపే ఇస్తామని చెబుతున్నా.. ఇంకా సాగదీస్తుండటం గమనార్హం. ఇక విదేశీ సంస్థ అయిన టెంపుల్టన్కు రిషికొండ ఐటీ హిల్స్‌లో ప్రైమ్ లొకేషన్లో ఎకరం రూ.40 లక్షలకు కట్టబెట్టిన సర్కారు.. పల్సస్‌కు మాత్రం ఎకరం రూ. 3కోట్ల ధర చెబుతోంది. ఇప్పుడు ఇదే విషయం ఐటీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటివరకు స్థానికులకు ఒక్కరికి కూడా భూములు కేటాయించకపోవడం కూడా చర్చకు తెరలేపింది. విశాఖ నగరానికే చెందిన 12మంది ఐటీ ప్రతినిధులు భూముల కోసం దరఖాస్తు చేసుకోగా, టీడీపీ సర్కారు కొలువుదీరిన నాలుగేళ్లలో ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం కలగలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే లోకేష్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేయడం నవ్వులపాలవుతోంది. -
ఏపీలో అడుగు పెట్టండి
ఫ్రాంక్లింన్ టెంపుల్టన్ సంస్థను కోరిన చంద్రబాబు సాక్షి, అమరావతి : ఫిన్‌టెక్, డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని ఆ రంగానికి చెందిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు ఆయన మీడియా సలహాదారు కార్యాలయం తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం మంగళవారం ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ జెన్నిఫర్ జాన్సన్‌తో కాలిఫోర్నియాలో సమావేశమైంది. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా తాము భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసర మైన అత్యున్నత పరిజ్ఞానం ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్ర బాబు స్పందిస్తూ... ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులున్నారని, వారిలో ఒకరు కచ్చితం గా ఏపీ వారేనని చెప్పా రు. దీంతో విశాఖలో సముద్రానికి అభిముఖం గా మంచి స్థలం చూపిస్తే తమ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని జెన్నిఫర్ తెలిపారు. స్టాన్ఫోర్డ్ కుటుంబ సభ్యుడినే... ఆ తర్వాత చంద్రబాబు బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. వర్సిటీ మెడికల్ స్కూల్ డీన్ లాయిడ్ బి మైనర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏ వ్యక్తి అనారోగ్యం బారిన పడుతున్నారో ముందుగానే పసిగట్టి నివారణ, నియంత్రణ చర్యలు తీసుకోవడం తమ మెడికల్ స్కూల్ ప్రత్యేకతని తెలిపారు. తాను స్టాన్ఫోర్డ్ కుటుంబ సభ్యుడినేనని చంద్రబాబు తెలిపారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తమకు విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని ఆకాంక్షను సీఎం ఆ ప్రతినిధుల వద్ద వ్యక్తం చేశారు.