‘‘అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అర్ధగంటే సమయం ఇచ్చాం. ఆ సమయంలోనే రూ.2వేల కోట్లు వచ్చాయి. అదే గనక 8 గంటలు సమయం ఇచ్చి ఉంటే రూ.10 వేల కోట్లు సమీకరించి ఉండేవాళ్లం.’’
ఇదీ... చంద్రబాబు తరఫున ఏపీ ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చెరుకూరి కుటుంబరావు తాజా మాట. అంటే!! తాము జారీ చేసిన బాండ్లకు విపరీతమైన గిరాకీ ఉందని చెబుతున్నట్లేగా?
అదే నిజమైతే తక్కువ వడ్డీ ఇవ్వొచ్చు కదా? ఎవరూ రారనే భయంతోనే కదా... అంత ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసింది?
ఈ బాండ్లకే గనక నిజంగా అంత గిరాకీ ఉంటే రేటింగ్ సంస్థలు తక్కువ రేటింగ్ ఎందుకిచ్చాయి? ఇన్వెస్టర్లను తేవటానికి నియమించిన సంస్థే (అరేంజర్) నేరుగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాల్సి (అండర్‌రైటింగ్) వచ్చింది? ఎవ్వరూ రావటం లేదనేగా? అసలు ఏపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ మతి ఉన్న మాటలేనా? ఒకదానితో ఒకటి పొంతన లేదెందుకు?
సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ అథారిటీ(ఏపీసీఆర్‌డీఏ) పేరిట చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన రూ.2,000 కోట్ల బాండ్లకు సంబంధించి తవ్వుతున్న కొద్దీ కొత్త కోణా లు వెలుగుచూస్తున్నాయి. అంతర్జాతీయంగా బాగా పేరున్న సంస్థ కనక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ద్వారా వెనక నుంచి కథ నడిపించారనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తే అందులో 62 శాతం వాటా తనకే కావాలని ఏ ఫండ్ కూడా పెట్టుబడి పెట్టదు. నిజానికి ఏ ఫండూ కూడా ఒక మొత్తం ఇష్యూలో 5 శాతాన్ని మించి కొనుగోలు చేయటానికి ఇష్టపడదు. బాండ్ల విషయానికి వస్తే ఈ శాతం మహా అయితే 10 వరకూ ఉండొచ్చు. కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ తన చేతిలోని వివిధ పథకాల ద్వారా ఏకంగా ఏపీసీఆర్‌డీఏ బాండ్లలో 62.5 శాతాన్ని తానొక్కటే కొనుగోలు చేసింది. అంటే... రూ.2,000 కోట్ల ఈ ఇష్యూలో రూ.1,300 కోట్లను ఈ సంస్థ ఒక్కటే పెట్టుబడిగా పెట్టింది.
తెరవెనక కథ ఇదేనా?
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇంత భారీగా పెట్టడం వెనక ఆనేక ఆసక్తికరమైన కథలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ఆరంభించిన కొన్ని పథకాల్లో బాబు అనయాయులు, ఆయన మనుషులు పలువురు భారీగా పెట్టుబడులు పెట్టారనేది టీడీపీ వర్గాల్లో వినవస్తున్న మాట. దీంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఈ డబ్బునే తెచ్చి అమరావతి బాండ్లలో భారీగా ఇన్వెస్ట్ చేసింది. తద్వారా బాబు ప్రభుత్వం ఇస్తున్న భారీ వడ్డీ... కొంత ఛార్జీలు మినహా తిరిగి ఆయన అనయాయుల జేబుల్లోకే చేరుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ కారణంగానే అమరావతి బాండ్లలో ఇన్వెస్ట్ చేయటానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మరికొన్ని సంస్థలు తప్ప ఎవరూ ముందుకు రాలేదని... చివరకు అనుకున్నట్లుగా ఇష్యూ సబ్‌స్క్రయిబ్ కాదేమోనని భయపడి, అరేంజర్‌గా వ్యవహరిస్తున్న ఏకే క్యాపిటల్ తానే నేరుగా ఇన్వెస్ట్ చేసిందని విశ్వసనీయంగా తెలిసింది.
ఇవి ప్రభుత్వ బాండ్లు కాదు...
నిజానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి రుణాల్లో (ఎస్‌డీఎల్) భాగంగా కొన్ని బాండ్లను జారీ చేస్తుంటుంది. వీటిని ప్రభుత్వ బాండ్లుగా వ్యవహరిస్తారు. వీటికి ఆర్‌బీఐ, కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కాకపోతే అమరావతి బాండ్లు అలాంటివి కావు. ఇవి కూడా సాధారణ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జారీ చేసే ప్రయివేటు బాండ్ల లాంటివే. ఇలా మున్సిపాలిటీల వంటివి బాండ్లు జారీ చేసేటపుడు ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ‘సెబీ’ కొన్ని మార్గదర్శకాలు విధించింది. వీటి ప్రకారం జారీ చేసే సంస్థ అంతకు ముందటి ఏడాదిలో చెల్లింపుల్లో డిఫాల్ట్ అయి ఉండకూడదు. దేనికోసం జారీ చేస్తున్నారో తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాలో ఉంచాలి. ఈ లెక్కన చూసినపుడు ఏపీసీఆర్‌డీఏకు అంత గొప్ప ఆదాయ వనరులేమీ లేవు. రూ.2,000 కోట్లు రుణంగా తెచ్చినందుకు ప్రతి 3 నెలలకూ రూ.258 కోట్లు వడ్డీగా చెల్లించాలి. ఇంత మొత్తాన్ని అసలు నుంచి చెల్లించవలసిందే తప్ప ఇప్పటికప్పుడు దానిపై ఆదాయం వచ్చే పరిస్థితులు లేవన్నది సాక్షాత్తూ బాబు ప్రభుత్వ వర్గాలే చెబుతున్న మాట.
వాళ్లొచ్చింది వడ్డీ కోసమా... అభివృద్ధి కోసమా?
‘‘అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావటానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ముందుకొచ్చింది. అందుకే ఇన్వెస్ట్ చేసింది’’ అన్నది చంద్రబాబు మాట. నిజానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది మ్యూచ్‌వల్ ఫండ్ వ్యాపారం నిర్వహించే సంస్థ. జనం దగ్గర డబ్బులు సమీకరించి... వాటిని రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి... వచ్చే లాభాల్ని వారికి పంచటం దానిపని. అలాంటి సంస్థ అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని ఎందుకు అనుకుంటుంది? పైపెచ్చు ఏపీసీఆర్‌డీఏ అనేది ఒక చిన్న సంస్థ. దీనికి ఆదాయమెలా వస్తుంది? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అన్నది కూడా స్పష్టత లేదు. పోనీ ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది కదా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే లోటు బడ్జెట్‌లో ఉంది. అంతెందుకు మనదేశంలో కూడా ప్రభుత్వరంగ సంస్థలు జారీచేసిన అనేక బాండ్లు కూడా చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ ఈ ఒక్క సంస్థే రూ.1,300 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి రిస్క్ చేయటం వెనక బాబు వ్యూహం ఉందనేది చెప్పకనే తెలుస్తోంది.
తక్కువ వడ్డీకి ప్రయత్నించారా?
చంద్రబాబు హెరిటేజ్‌తో సహా ఏ సంస్థయినా తన వ్యాపార విస్తరణ కోసం నిధులను సేకరించేటప్పుడు తక్కువ వడ్డీకి రుణాల కోసం ప్రయత్నిస్తుంది. కానీ బాబు ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రయత్నాలే పక్కనబెట్టేసింది. తక్కువ వడ్డీకి రుణాల కోసం ప్రయత్నిచమంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ సూచించినా పెడచెవిన పెట్టేసింది. చిత్రమేంటంటే ఇదే ప్రభుత్వం పౌరసరఫరాల శాఖను రూ.15,000 కోట్ల రుణాలను 7.9 శాతం లేదా అంతకంటే తక్కువ వడ్డీకి రుణం తీసుకోమంటూ జీవో జారీచేసింది. కానీ తానేమో 10.32 శాతం వడ్డీ ఇస్తానంటూ బాండ్లు జారీచేసింది. 6 శాతం వడ్డీకే బాండ్లు జారీ చేసే అవకాశం ఉంటుంది కనక ఇన్‌ఫ్రా బాండ్ హోదా కోసం కేంద్రంతో చర్చించాలని ఆర్థిక శాఖ సూచించినా పట్టించుకోలేదు. దీనిపై సమాధానం మాత్రం శూన్యం.
పబ్లిక్ ఇష్యూ అంటూ అబద్ధాలు దేనికి?
ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో ఇన్వెస్టర్ల నుంచి బాండ్ల రూపంలో రూ.2,000 కోట్లు సేకరిస్తున్నట్లు జీవో జారీ చేశారు. కానీ పబ్లిక్ ఇష్యూ ద్వారా బాండ్లు జారీ చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. ఇన్వెస్టర్ల వివరాలడిగితే చెప్పకుండా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ఉంటాయి చూసుకోమని చెబుతున్నారు. నిజానికి ప్రైవేటు ప్లేస్‌మెంట్ వివరాలు స్టాక్ ఎక్సే్ఛంజీలు బయటకు చెప్పవు. ఈ బాండ్లు గనక పారదర్శకంగా జారీ అయి ఉంటే వివరాలన్నీ సీఎం డ్యాష్ బోర్డులోనే ఉండేవనేది ఆర్థిక నిపుణుల మాట.
బాండ్ల ఇన్వెస్టర్లు ‘తమ్ముళ్లేనా’?
Published Sat, Sep 29 2018 5:53 AM | Last Updated on Sat, Sep 29 2018 11:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment