ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ, అకస్మాత్తుగా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ మరింత ఆలస్యమవుతుండటం, గిలీడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలనివ్వడం లేదన్న వార్తలు, కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించిన ప్రభావమే ఉండనున్నదన్న ఆందోళన, గత రెండు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర లాభపడటంతో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం....ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 536 పాయింట్లు క్షీణించి 31,327 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 9,154 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం మేర లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల మేర నష్టపోయాయి.
సెంటిమెంట్‌పై ‘టెంపుల్టన్’ దెబ్బ....
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఆరు డెట్ స్కీమ్‌లను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. కరోనా వైరస్ కల్లోలానికి, లాక్‌డౌన్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించే సూచనలు కనిపించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు 1–2%, యూరప్ మార్కెట్లు ఇదే రేంజ్ నష్టపోయాయి.
ఫార్మా షేర్ల పరుగులు....
ఫార్మా షేర్ల పరుగులు కొనసాగుతున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి వివిధ కంపెనీలకు ఆమోదాలు లభించడం, ఇటీవలే వెల్లడైన అలెంబిక్ ఫార్మా ఫలితాలు ఆరోగ్యకరంగా ఉండటం, దీనికి ప్రధాన కారణాలు. అలెంబిక్ ఫార్మా, సన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్(ఈ మూడు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి) అల్కెమ్ ల్యాబ్స్, అజంతా ఫార్మా, లుపిన్, ఇప్కా ల్యాబ్స్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, ఎఫ్‌డీసీ తదితర షేర్లు 2–8 శాతం రేంజ్‌లో పెరిగాయి.
► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఆర్థిక, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ రంగ షేర్లు క్షీణించాయి. నిప్పన్ ఇండియా షేర్ 18 శాతం నష్టంతో రూ.216కు, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ 6 శాతం నష్టంతో రూ.2,425కు, శ్రీరామ్ ఏఎమ్‌సీ 3 శాతం పతనమై రూ.71కు పడిపోయాయి.
► బజాజ్ ఫైనాన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.1,976 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.
‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్
Published Sat, Apr 25 2020 12:59 AM | Last Updated on Mon, May 11 2020 5:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment