ఫండ్‌ ఇన్వెస్టర్లకు షాక్‌! | COVID-19 : Franklin Templeton India closes 6 debt schemes | Sakshi
Sakshi News home page

ఫండ్‌ ఇన్వెస్టర్లకు షాక్‌!

Published Sat, Apr 25 2020 12:39 AM | Last Updated on Sat, Apr 25 2020 3:55 AM

COVID-19 : Franklin Templeton India closes 6 debt schemes - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి .. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్‌ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా ఆరు డెట్‌ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్‌ హౌస్‌ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం.

ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్‌ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్‌ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తెలిపింది. కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లకు హోల్డింగ్స్‌ అమ్మేయడం లేదా పెట్టుబడులపై మరిన్ని రుణాలు తెచ్చి తీర్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని సంస్థ భారత విభాగం ఎండీ సంజయ్‌ సాప్రే చెప్పారు. ఏదీ కుదిరే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పనిసరై ఆయా స్కీములను మూసివేయాల్సి వచ్చిందని వివరించారు.

మూసివేతతో ఇన్వెస్టర్లపరమైన లావాదేవీలేమీ జరగకపోయినప్పటికీ .. యాజమాన్యం దృష్టికోణంలో ఇవి కొనసాగుతాయని సాప్రే చెప్పారు. మెరుగైన రేట్లకు విక్రయించి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు.  ‘ఇటు మార్కెట్లు, అటు ఎకానమీ ఏ దిశ తీసుకుంటాయన్నదానిపై స్పష్టత కొరవడటంతో ఇన్వెస్టర్లకు మరిం త హాని జరిగే అవకాశముందని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగం చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సంతోష్‌ కామత్‌ తెలిపారు. సుమారు 26 ఏళ్ల రీసెర్చ్‌ అనుభవం, 19ఏళ్లకు పైగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మె ంట్‌ అనుభవం కామత్‌కి ఉంది. ట్రిపుల్‌ ఎ కన్నా తక్కువ రేటింగ్‌ ఉండే బాండ్ల పెట్టుబడుల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

సెబీతో సంప్రదించాకే: ‘ఆరు ఫండ్ల మూసివేత నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. దీనిపై నియంత్రణ సంస్థ సెబీతో విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలే ఉన్నాయని సెబీ కూడా భావించింది‘‡అని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ గ్రూప్‌ ఎండీ వివేక్‌ కుద్వా తెలిపారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు క్రమానుగతంగా, ’అందరికీ సమానంగా’ చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ
సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కుద్వా
వివరించారు.

ఇది టెంపుల్టన్‌కి మాత్రమే పరిమితం: యాంఫి
6 స్కీమ్‌ల మూసివేత అంశం కేవలం ఆయా స్కీమ్‌లకే పరిమితమైన దని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సమాఖ్య యాంఫి పేర్కొంది. ఇతర మ్యూచువల్‌ ఫండ్స్‌పై దీని ప్రభావమేమీ ఉండబోదని కాన్ఫరెన్స్‌ కాల్‌లో యాంఫి చైర్మన్‌ నీలేశ్‌ షా చెప్పారు. డెట్‌ స్కీముల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగానే ఉన్నాయని భరోసానిచ్చారు.

రూ.22.26 లక్షల కోట్లు
ఈ మార్చి 31నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ వద్ద సగటు నిర్వహణ నిధులు
రూ.2.13 లక్షల కోట్లు
మార్చి నెలలో ఫండ్స్‌(ఈక్విటీ, డెట్‌) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ


సెబీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి: బ్రోకింగ్‌ సంస్థలు
టెంపుల్టన్‌ ఆరు డెట్‌ స్కీముల మూసివేతతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొందని బ్రోకింగ్‌ సంస్థల సమాఖ్య ఏఎన్‌ఎంఐ పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను, కష్టార్జితాన్ని పరిరక్షించేందు కు ఆర్థిక శాఖ, సెబీ తక్ష ణం జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దాలని కోరింది. స మస్య మూలాల గుర్తింపునకు నిపుణుల కమిటీ వేయాలని పేర్కొంది.

ఏం జరిగిందంటే....
కరోనా వైరస్‌ ధాటికి  భారత్‌ సహా పలు ప్రపంచ దేశాల ఈక్విటీ, బాండ్‌ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. అయితే, కొనేవాళ్లు కరువవడంతో .. రేట్లు గణనీయంగా పడిపోయాయి. పైపెచ్చు తక్కువ స్థాయి రేటింగ్‌ ఉన్న స్క్రిప్స్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలహీన క్రెడిట్‌ రేటింగ్స్‌ ఉన్న కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడం దాదాపు నిలిపివేశాయి. దీంతో తక్కువ రేటింగ్‌ ఉన్న కంపెనీల డెట్‌ స్క్రిప్‌లకు డిమాండ్‌ భారీగా పడిపోయింది.

రిస్కులు ఎక్కువున్న మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా మిగులు నిధులను తక్కువ రాబడులు వచ్చినా రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర  సురక్షితంగా ఉంచుకునేందుకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి.      ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై నమ్మకం సన్నగిల్లి ఈక్విటీలతో పాటు డెట్‌ మార్కెట్లకు దూరంగా ఉంటుండటంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి.  కరోనా వైరస్‌పరమైన మాంద్యం భయాలతో టెంపుల్టన్‌ మూసివేసిన ఆరు స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు అయినకాడికి అమ్ముకునేందుకు మొగ్గుచూపారు. అయితే, మార్కెట్లో అమ్ముదామన్నా కొనేవారు కరువవడంతో మరో దారి లేక ఈ స్కీములను టెంపుల్టన్‌ మూసివేయాల్సి వచ్చింది.

మిగతా డెట్‌ ఫండ్స్‌ మాటేంటి ..
ఆరు స్కీమ్‌లు మూసివేసినంత మాత్రాన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ పూర్తిగా మూతబడినట్లు కాదు. దాదాపు పాతికేళ్లకుపైగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టెంపుల్టన్‌ మరో ఏడు డెట్‌ ఫండ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 22 నాటికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 17,800 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా టెంపుల్టన్‌ దాదాపు రూ. 36,663 కోట్ల విలువ చేసే 15 ఈక్విటీ ఫండ్స్‌ను, సుమారు రూ. 3,143 కోట్ల విలువ చేసే 11 హైబ్రిడ్‌ కేటగిరీ స్కీమ్‌లను (ఈక్విటీలు, డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌) నిర్వహిస్తోంది (విలువలు మార్చి 31 నాటికి).  ఈ ఫండ్సన్నీ యథాప్రకారం కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందరాదని సంస్థ పేర్కొంది.

ఇప్పుడేంటి పరిస్థితి...
స్కీములను మూసివేసినా ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. స్కీము వాస్తవ గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిందే. ఉదాహరణకు ఫ్రాంక్లిన్‌ ఇండియా లో డ్యూరేషన్‌ ఫండ్‌ సంగతి తీసుకుంటే..  సగటు గడువు బట్టి చూసినప్పుడు.. ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి రావడానికి ఏడాది పైన 73 రోజులు పట్టొచ్చని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్రాంక్లిన్‌ ఇండియా ఇన్‌కమ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ సగటు కాలావధి బట్టి చూస్తే ఇన్వెస్టర్లు మూడేళ్ల పైన 80 రోజులు దాకా వేచి చూడాల్సి రానుంది. ఈ స్కీములు మూతబడ్డాయి కాబట్టి వీటిల్లోకి సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్‌) పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్న వారి వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి.

కానీ సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్స్‌ (ఎస్‌టీపీ) కింద వీటిల్లో డబ్బు పెట్టిన వారికి మాత్రం చిక్కులు తప్పవు. సాధారణంగా చేతిలో భారీ మొత్తం సొమ్ము ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టకుండా.. ఇలాంటి డెట్‌ సాధనాల్లో ఉంచుతారు. బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా వీటిలో కాస్త ఎక్కువ రాబడి వస్తుందనే ఆలోచన ఇందుకు కారణం. ఇక, ఈ డెట్‌ సాధనాల నుంచి కొంత మొత్తాన్ని విడతలవారీగా (నెలకోసారి, వారాని కోసారి లాగా) ఈక్విటీల్లోకి ఇన్వెస్టర్లు మళ్లిస్తుంటారు. ప్రస్తుతం మూతబడిన టెంపుల్టన్‌ స్కీముల్లో ఇలా ఎస్‌టీపీ కింద భారీ మొత్తాలను ఇన్వెస్ట్‌ చేసినవారికి కాస్త ఇబ్బంది తప్పదనేది విశ్లేషకుల మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement