అన్‌లాక్ (లాక్‌డౌన్ సడలింపులు) నిబంధనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వడంతో సోమవారం స్టాక్‌మార్కెట్ భారీగా లాభపడింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో జీడీపీ 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినా, మే నెల తయారీ రంగం అంతంతమాత్రంగానే ఉన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని, ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న తీపికబురు సానుకూల ప్రభావం చూపించాయి.
సెన్సెక్స్ 33,000 పాయింట్లు, నిఫ్టీ 9,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. ఇంట్రాడేలో 1,250 పాయింట్ల మేర ఎగసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 879 పాయింట్ల లాభంతో 33,304 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9,826 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు చెరో 2.5 శాతం మేర పెరిగాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,250 పాయింట్లు, నిఫ్టీ 352 పాయింట్ల మేర పెరిగాయి. ఆర్థిక, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఇంధన రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.
మరిన్ని విశేషాలు...
► బజాజ్ ఫైనాన్స్ 11 శాతం లాభంతో రూ.2,160 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేరు ఇదే.
► సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మినహా మిగిలిన 25 షేర్లు లాభాలు సాధించాయి. ఎల్ అండ్ టీ, హీరో మోటొకార్ప్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.
► దాదాపు 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. దివీస్ ల్యాబ్స్, బయోకాన్, సిప్లా, ఎస్కార్ట్స్, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► మే నెల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నా, వాహన షేర్లు దూసుకుపోయాయి.
► ఈ నెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు, షాపింగ్ మాల్స్‌ను తెరవడానికి కేంద్రం అనుమతిచ్చింది. దీంతో హోటళ్ల షేర్లు 20% వరకూ పెరిగాయి. చాలెట్ హోటల్స్, ఇండియన్‌హోటల్స్, ఈఐహెచ్, ఈఐహెచ్ వంటివి వీటిలో ఉన్నాయి.
రూ. 3 లక్షల కోట్లు ఎగసిన సంపద
మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 3 లక్షల కోట్లు ఎగసి రూ.130.10 లక్షల కోట్లకు పెరిగింది.
లాభాలు ఎందుకంటే...
► అన్‌లాక్ 1.0
కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగిలిన అన్ని చోట్లా అన్ని కార్యకలాపాలను దశలవారీగా ఆరంభించడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సునామీ నెలకొంది. లాక్‌డౌన్ 5.0 జూన్ 30 వరకూ పొడిగించినా, చెప్పుకోదగ్గ సడలింపులను కేంద్రం ఇచ్చింది. దాదాపు 2 నెలల లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు పుంజుకోనుండటం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.
► విస్తారంగా వర్షాలు...
ఈ ఏడాది భారత్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ, విస్తారమైన వర్షాలతో వ్యవసాయ దిగుబడులు భారీగా రాగలవన్న అంచనాలతో మార్కెట్ కళకళలాడింది.
► చైనాలో పుంజుకున్న రికవరీ..
చైనాలో రికవరీ పుంజుకుందని గణాంకాలు వెల్ల డించడం సానుకూలత చూపించింది.
► చైనాపై కొత్త ఆంక్షలు లేవ్...
హాంకాంగ్‌పై మరింత పట్టు బిగించేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని చైనా తెచ్చిన నేపథ్యంలో చైనాపై మరిన్ని ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తారనే అంచనాలున్నాయి. ఈ అంచనాలకు భిన్నంగా కొత్త ఆంక్షలను ట్రంప్ విధించలేదు.
► బలపడిన రూపాయి
రూపాయి విలువ 8 పైసలు పుంజుకుంది.
► త్వరలోనే వ్యాక్సిన్..
కరోనా వైరస్ కట్టడికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదన్న ఆశలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment