ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ‘నిలిపివేసిన’ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారిని రక్షించేందుకు ముందుకు రావాలంటూ ఇన్వెస్టర్ల సంఘం ‘సీఎఫ్‌ఎమ్‌ఏ’ సుప్రీంకోర్టును కోరింది. లేదంటే మరో 10కి పైగా మ్యచువల్ ఫండ్స్ అదే మార్గంలో వెళ్లొచ్చని, దాంతో అమెరికాలో సబ్‌ప్రైమ్ సంక్షోభం మాదిరే.. మ్యూచువల్‌ఫండ్స్ సంక్షోభం ఇక్కడ ఏర్పడవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లకు న్యాయవ్యవస్థ ఒక్కటే ఆశాకిరణంగా చెన్నై ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ అకౌంటబిలిటీ (సీఎఫ్‌ఎమ్‌ఏ) ఓ ప్రకటనలో పేర్కొంది. మరో 10 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నష్టాలను యూనిట్ హోల్డర్లపై రుద్దాలని అనుకుంటున్నాయంటూ.. సుప్రీంకోర్టు తీర్పు కోసం అవి వేచి ఉన్నాయని సీఎఫ్‌ఎమ్‌ఏ ఆరోపించింది.
అయితే, తన ఆరోపణలకు ఆధారాలను వెల్లడించలేదు. లిక్విడిటీ (ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు తగినంత నిధుల్లేని) లేకపోవడంతో ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ గతేడాది ఏప్రిల్ 23న నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. దీన్ని వ్యతిరేకిస్తూ ఇన్వెస్టర్లు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా పథకాల మూసివేతకు తీసుకున్న నిర్ణయం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది. పథకాల మూసివేతకు ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఇన్వెస్టర్ల నుంచి ఈలోపు ఆమోదం తీసుకోవడం కూడా పూర్తయింది.
రూ.14,000 కోట్ల నష్టం..
ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ నిర్ణయంతో మూడు లక్షలకు పైగా యూనిట్ హోల్డర్లు తమ పెట్టుబడుల్లో 50 శాతానికి పైగా (సుమారు రూ.14,000 కోట్లు) నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని సీఎఫ్‌ఎమ్‌ఏ ఆరోపించింది. ఇతర ఫండ్స్ కూడా ఇదే బాట పడితే మొత్తం మీద ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్లమేర నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment