
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమ పటిష్టతపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఎంఎఫ్ యూనిట్లలో లావాదేవీలను ఇన్‌సైడర్ నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందుకు నిబంధనలను సవరించింది. వెరసి ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకం తాజా నిబంధనలలోకి రానున్నాయి. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీల సెక్యూరిటీలలో లావాదేవీలకు మాత్రమే ఇన్‌సైడర్ నిబంధనలు వర్తిస్తున్నాయి. ధరలను ప్రభావితం చేయగల రహస్య(వెల్లడికాని) సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టి లబ్ది పొందడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌గా పిలిచే సంగతి తెలిసిందే. సెక్యూరిటీలకు వర్తించే ఈ నిబంధనల నుంచి ఎంఎఫ్ యూనిట్లకు ప్రస్తుతం మినహాయింపు ఉంది. అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఉదంతం నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది.
ఎంఎఫ్‌లో ఇన్‌సైడర్
ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఫండ్ హౌస్‌కు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ పథకాలలోగల తమ హోల్డింగ్స్‌ను అక్రమ పద్ధతిలో ముందుగానే రీడీమ్ చేసుకున్నారు. ఆరు డెట్ పథకాలు రిడెంప్షన్ ఒత్తిళ్లలో మూతపడకముందే రీడీమ్ చేసుకోవడంతో సెబీ తాజా మార్గదర్శకాలను ముందుకు తీసుకువచ్చింది. ఇకపై ఎంఎఫ్ పథకాల యూనిట్లలో బయటకు వెల్లడికాని సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. పథకం నికర ఆస్తుల విలువ(ఎన్‌ఏవీ)పై లేదా యూనిట్‌దారులపై ప్రభావం చూపే సమాచారంతో ట్రేడ్ చేయడాన్ని నిబంధనలు అనుమతించవని నోటిఫికేషన్ ద్వారా సెబీ స్పష్టం చేసింది.
వివరాలన్నీ వెల్లడించాలి..
తాజా నిబంధనల ప్రకారం ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఫండ్ పథకాలకు సంబంధించిన యూనిట్ల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఏఎంసీ, ట్రస్టీలు, దగ్గరి సంబంధీకులు తదితర హోల్డింగ్స్ వివరాలు తెలియజేయవలసి ఉంటుంది. సొంతం ఎంఎఫ్‌ల యూనిట్లలో యాజమాన్యం, ట్రస్టీలు, సంబంధీకుల లావాదేవీలను వెనువెంటనే ప్రకటించవలసి ఉంటుంది. ఏఎంసీ కంప్లయెన్స్ ఆఫీసర్‌కు రెండు పనిదినాల్లోగా వెల్లడించవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment