ఏపీలో అడుగు పెట్టండి
ఫ్రాంక్లింన్ టెంపుల్టన్ సంస్థను కోరిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఫిన్‌టెక్, డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని ఆ రంగానికి చెందిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు ఆయన మీడియా సలహాదారు కార్యాలయం తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం మంగళవారం ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ జెన్నిఫర్ జాన్సన్‌తో కాలిఫోర్నియాలో సమావేశమైంది. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా తాము భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసర మైన అత్యున్నత పరిజ్ఞానం ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్ర బాబు స్పందిస్తూ... ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులున్నారని, వారిలో ఒకరు కచ్చితం గా ఏపీ వారేనని చెప్పా రు. దీంతో విశాఖలో సముద్రానికి అభిముఖం గా మంచి స్థలం చూపిస్తే తమ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని జెన్నిఫర్ తెలిపారు.
స్టాన్‌ఫోర్డ్ కుటుంబ సభ్యుడినే...
ఆ తర్వాత చంద్రబాబు బృందం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. వర్సిటీ మెడికల్ స్కూల్ డీన్ లాయిడ్ బి మైనర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏ వ్యక్తి అనారోగ్యం బారిన పడుతున్నారో ముందుగానే పసిగట్టి నివారణ, నియంత్రణ చర్యలు తీసుకోవడం తమ మెడికల్ స్కూల్ ప్రత్యేకతని తెలిపారు. తాను స్టాన్‌ఫోర్డ్ కుటుంబ సభ్యుడినేనని చంద్రబాబు తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తమకు విజ్ఞాన భాగస్వామిగా ఉండాలని ఆకాంక్షను సీఎం ఆ ప్రతినిధుల వద్ద వ్యక్తం చేశారు.