Stanford University
-
సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ
‘పెద్ద చదువులు చదవాలి’ అనేది పేదింటి అమ్మాయి ఆక్సా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని ఆమెకు అర్థం అయింది. దారి పొడగునా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అయినా సరే ఆమె ప్రయాణం ఆగలేదు. ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాదు’ అని నిరూపించి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అక్సా పులారా. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చూస్తోంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆక్సా పులారా ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ‘చదివింది చాలు’ అన్నారు ఇంటి పెద్దలు. ఉన్నత చదువులు చదవాలనేది అక్సా లక్ష్యం.‘నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను’ అంటే ససేమిరా అన్నారు.అదేపనిగా అడిగితే పెద్దల మనసు కరిగింది. ‘సరేలే. చదువుకో’ అన్నారు. ఆరోజు తనకు ఎంత సంతోషమైందో!‘యస్...నేను సాధించగలను’ అనే గట్టి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే అక్సాకు ఎంతో శక్తిని ఇచ్చింది. ఆ శక్తే తనను అమెరికా వరకు తీసుకెళ్లింది. అమెరికాలో చదువుకుంటున్న వారి గురించి వినడమే కాని తాను కూడా చదువు కోసం అక్కడికి వెళతానని కలలో కూడా అనుకోలేదు. సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేరింది. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్(యంఎల్)తో సహా అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. (రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!)ఆ తరువాత గూగుల్‌లో చేరింది. అక్కడ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను లీడ్ చేస్తోంది. కాలేజీ, యూనివర్శిటీ రోజుల్లో గూగుల్‌లో ఆవిష్కరణల గురించి ఆసక్తిగా తెలుసుకునేది. ఇప్పుడు ఆ ఆవిష్కరణలలో తాను కూడా భాగం అయింది. అక్సాకు మొదటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. ముఖ్యంగా కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీగా చెప్పే ఏఐ, ఎంఎల్లో ప్రతి చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేది. నిజజీవితంలో మనం ఎదుర్కొనే ట్రాఫిక్జామ్లాంటి సమస్యలకు ఏఐ, ఎంఐ సాంకేతికత పరిష్కారం చూపుతుందని అంటుంది ఆక్సా పులారా.గూగుల్‌లో చేరిన తరువాత ఆ సంస్థ ఏఐ అండ్ ఎంఎల్ డెవలప్‌మెంట్స్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. టీమ్ వర్క్‌స్పేసెస్, లుకర్ స్టూడియో ప్రో మొదలైన ఇన్నోవేటివ్ గూగుల్ ప్రొడక్ట్స్‌లో తన వంతు పాత్ర నిర్వహించింది. మనలో సామర్థ్యం ఉండగానే సరి΄ోదు. ఆ సామర్థ్యానికి తగిన వేదిక కూడా దొరకాలి. గూగుల్ రూపంలో ఆమెకు సరైన వేదిక దొరికింది.‘గూగుల్‌లో కనిపించే కల్చరల్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభావంతో పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. సంక్లిష్టమై సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే కుతూహలం నన్ను ముందుకు నడిపించింది’ అంటుంది అక్సా పులారా. ఆమె పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఎన్నో ఆవిష్కరణలలో కీలకపాత్ర పోషించబోతుందని గట్టిగా చెప్పవచ్చు. -
స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. బయోడిజైన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగం సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను తెలంగాణలో విద్య, ఆరోగ్య రక్షణ విభాగాలకు అనుసంధానం చేయాలనే ఆలోచనను వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ పంచుకున్నారు. కొత్త యూనివర్సిటీల్లో భాగస్వామ్యం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని స్టాన్ఫోర్డ్ వర్సిటీని రాష్ట్ర బృందం ఆహా్వనించింది. అధునాతన పరిజ్ఞానం మారి్పడి, ఉమ్మడి పరిశోధనలపైనా చర్చించింది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ వర్సిటీ తెలంగాణతో కలిసి పనిచేస్తుందని బయోడిజైన్ విభాగం అధిపతులు అనురాగ్ మైరాల్, జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం బృందానికి లేఖ ఇచ్చారు. వైద్య, విద్య పరికరాలు, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ కార్యాలయానికి రేవంత్ బృందం వర్సిటీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్ బృందం కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో ఉన్న గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ప్రొఫెసర్ రామ్‌చరణ్‌తో భేటీ సీఎం రేవంత్ కాలిఫోర్నియాలో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త ప్రొఫెసర్ రామ్‌చరణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేకతలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆహా్వనించారు. వేగంగా మారుతున్న వాణిజ్య వాతావరణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై వారు చర్చించారు. ప్రొఫెసర్ రామ్‌చరణ్ పలు అంతర్జాతీయ కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలసి పనిచేశారు. హైదరాబాద్‌లో జొయిటిస్ విస్తరణ ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ హైదరాబాద్‌లో తమ కేపబులిటీ సెంటర్ (సామర్థ్య కేంద్రం)ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెపె్టంబర్ నుంచి విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందంతో జొయిటిస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనలకు జొయిటిస్ విస్తరణ దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ భేటీలో జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్, ఇండియా కేపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ ప్రణాళిక హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలో సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ సీఈఓ ప్రవీణ్ పెన్మత్స, ఇతర ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి అనుబంధంగా అటానమస్ ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని మోనార్క్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రైవర్ లెస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను తమ సంస్థ రూపొందించిందని తెలిపారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం: 105 ఏళ్ల బామ్మ మాస్టర్స్ డిగ్రీ
మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడం సామాన్య విషయం కాదు. అందుకు చాలా పట్టుదల కావాలి. పెళ్లి పిల్లలు తరువాత, పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ, లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే.. ఇపుడేం చదువులే.. అని పెదవి విరుస్తారు చాలామంది. కానీ 105 ఏళ్ల బామ్మ ఏకంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చాలామందికి డిగ్రీ పట్టా పుచుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది. కానీ 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది. వర్జీనియా "జింజర్" హిస్లాప్ తాజాగా ఈ డిగ్రీని అందుకుంది. దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమో భావోద్వేగానికి లోనైంది.1940లలో స్టాన్‌ఫోర్డ్‌లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్‌లో ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపుఆమె ప్రియుడితో పెళ్లి. భర్త జార్జ్ హిస్లోప్ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లి పోయాడు. దీంతో అమెరికాలోని అనేకమంది ఇతర మహిళల్లాగానే వర్జీనియా కూడా చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అతనికి సాయం చేస్తూ, కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది. తాజాగా ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు , తొమ్మిది మంది మనవరాళ్లతో కూడిన తన కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అటు వర్జీనియా వాషింగ్టన్ స్టేట్‌లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేశారు. కానీ డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీయలేదు. పట్టుదలతో సాధించింది. ఈ ఏడాది జూన్ 16, ఆదివారం తన కల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ని దక్కించుకుంది. మనుమలు, మనువరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య 2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్లో కాలేజీ డీన్ డేనియల్ స్క్వార్ట్జ్ ఆమెకు డిప్లొమాను అందజేస్తోంటే సంతోషంగా ఉప్పొంగిపోయింది. -
ఏడుగురు భారత సంతతి విద్యార్థులకు ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లు!
ఏడుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మక నైట్స్ హెనెస్సీ స్కాలర్షిప్ను పొందారు. ప్రంచంలోనే అతిపెద్ద గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ అయిన ఈ స్కాలర్షిప్ కోసం 90 మంది స్కాలర్లను ఎంపిక చేయగా, వారిలో ఆంక్ అగర్వాల్, వాసన్ కుమార్, అనీష్ పప్పు, ఇషా సంఘ్వి, కృతిక సింగ్, కృష్ణ పాఠక్, రాహుల్ పెనుమాక ఉన్నారు. ఆ విద్యార్థులంతా వైద్యం,సాంకేతికత, ఇంజనీరింగ్, న్యాయ రంగాలు తదితర విభాగాల్లో ఈ స్కాలర్షిప్లను పొందారు. వాళ్లంతా ఆ యూనివర్సిటీలో పీహెచ్డీ, ఎండీఏ, ఎండీ డిగ్రీలు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా 30 దేశాలకు చెందిన 90 మంది విద్యార్థులు స్టాన్ఫోర్డ్లోని ఏడు పాఠాశాలల్లో 45 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు చేయడానికి రావడం విశేషం. ఈ ఏడాది ఆ విద్యార్థుల్లో ఆస్ట్రియా, బహ్రెయిన్, బెలారస్, బొలీవియా, బల్గేరియా, ఫ్రాన్స్, శ్రీలంక విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక ఎంపికైన విద్యార్థుల బ్యాచ్‌లో దాదాపు 47% మంది యూఎస్ యేతర పాస్‌పోర్ట్‌లు కలిగిఉన్నారు. ఈ మేరకు నైట్-హెన్నెస్సీ స్కాలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీనా సీలిగ్ మాట్లాడుతూ..ప్రతి స్కాలర్ తన నేపథ్య సమాజానికి ఆదర్శంగా ఉండటమేగాక ప్రత్యేక దృక్పథాన్ని తీసుకొస్తారు. అలాగే ప్రపంచంలోని అన్ని సవాళ్లను అధిగమించేలా విభిన్న సంస్కృతుల భావజాలన్ని ఆకళింపు చేసుకునేలా జ్ఞానాన్ని సముపార్జించి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. కాగా, ఈ ఫెలోషిప్తో విద్యార్థులు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల గ్రాడ్యేయేట్ అధ్యయనాన్ని కొనసాగించేలా ఆర్థిక సాయం అందుకుంటారు .(చదవండి: భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!) -
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
శ్రీసిటీలో స్టాన్ఫోర్డ్ వర్సిటీ విద్యార్థులు
వరదయ్యపాళెం: స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్‌మ్యాటిక్స్ (ఎస్టీఈఎం) విభాగానికి చెందిన 20 మంది అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. ప్రొఫెసర్ మైకేల్ కోచెండర్ ఫర్, పీహెచ్డీ స్కాలర్ డైలాన్ మిచెల్ ఆస్మార్ నేతృత్వంలోని ఈ బృందానికి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ చైర్మన్ సి.శ్రీనిరాజు వర్చువల్ విధానంలో వారితో మాట్లాడారు. 1980లలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వర్క్, లివ్, లెర్న్, ప్లే సూత్రం ఆధారంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశ్రామిక అనుకూల వాతావరణంలో శ్రీసిటీ ప్రగతి సాగుతోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సౌర విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడడంపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పారిశ్రామికవాడగా శ్రీసిటీ అవతరించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు. శ్రీసిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఇతర ప్రత్యేకతల గురించి సతీష్ కామత్ వివరించారు. పెప్సికో, క్యాడ్బరీస్, కోల్గేట్ పామోలివ్, వీఆర్వీ చాట్ ఇండస్ట్రీస్, బాల్ కార్పొరేషన్, కెల్లాగ్స్, వెస్ట్ ఫార్మాతో సహా 11 ప్రముఖ అమెరికన్ కంపెనీలతో పాటు ప్రపంచంలోని 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీ అభివృద్ధి పట్ల స్టాన్ఫోర్డ్ బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ మోడల్, ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిరత కార్యక్రమాలను నేరుగా వీక్షించి అర్థం చేసుకోవడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశంగా వారు తెలిపారు. అనంతరం శ్రీసిటీలోని క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. -
Rahul Gandhi: ఆ మొదటి వ్యక్తిని నేనేనేమో!
2004లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ సమయంలో భారత్ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలివి. ఎంపీగా తనపై పడిన అనర్హత వేటు గురించి విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. భారత్‌లో పరువు నష్టం కేసులో ఇలాంటి శిక్షను ఎదుర్కొన్న నేతను బహుశా తానేనేమోనని వ్యాఖ్యానించారాయన. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో.. దేశం ఇలా అయిపోతుందని ఊహించలేదు. పరువు నష్టం దావాతో గరిష్ట శిక్షను ఎదుర్కొన్న మొదటి నేతను బహుశా నేనే కావొచ్చు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని పేర్కొన్నారాయన. 52 ఏళ్ల రాహుల్ గాంధీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎంపీగా నెగ్గారు. అయితే.. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల గరిష్ట శిక్ష పడగా, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వేటు పడి ఎంపీ(వయనాడ్ లోక్‌సభ స్థానం) పదవిని కోల్పోయారాయన. అయితే పార్లమెంట్లో కూర్చొని గళం వినిపించడంతో పోలిస్తే ఇప్పుడు తనకు మరింత అవకాశం దొరికిందని చెబుతూ.. భారత్ జోడో పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. It was a pleasure to engage with the learned audience at @Stanford on 'The New Global Equilibrium'. We discussed the challenges and opportunities of a changing world order. Actions based on truth is the way forward. pic.twitter.com/6tEoCV6OsM — Rahul Gandhi (@RahulGandhi) June 1, 2023 Relive the captivating moments as Shri @RahulGandhi graced the stage at Stanford University for an unforgettable interactive session. pic.twitter.com/IbcaPQ3o8y — Congress (@INCIndia) June 1, 2023 హలో.. మిస్టర్ మోదీ తన పర్యటనలో భాగంగా.. సిలికాన్ వ్యాలీలో సందడి చేసిన రాహుల్ గాంధీ, పలువురు స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లతో కాసేపు రాహుల్ గాంధీ ముచ్చటించారు. వాళ్ల మధ్య ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల గురించి చిట్‌చాట్ జరిగింది. ఈ క్రమంలో.. భారత్‌లో టెక్నాలజీ విస్తరణ గురించి ప్రస్తావనకు రాగా.. పెగాసస్ కుంభకోణం అంశం లేవనెత్తారు రాహుల్ గాంధీ. దాని గురించి(ఫోన్ ట్యాపింగ్) నేనేం దిగులుచెందడం లేదు. ఒకానొక టైంలో నా ఫోన్‌ట్యాపింగ్ అవుతోందని నాకు అర్థమైంది. అంటూ.. తన ఐఫోన్లో ‘‘హలో మిస్టర్ మోదీ’’ అంటూ ఛలోక్తి విసిరారాయన. ఒక ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేయాలని అనుకుంటే.. దానిని ఎవరూ ఆపలేరు కదా. అది పోరాటం చేయదగ్గ అంశమూ కాలేదు. ఎందుకంటే.. చేసే ప్రతీ పని ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి.. అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: దేశ మనోభావాల్ని కించపరిచారు -
నేడు అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్టును అధికారులకు తిరిగి ఇచ్చేశారు. ఆయనకు సాధారణ పాస్‌పోర్టును జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదంటూ శనివారం ఢిల్లీ కోర్టు తెలిపింది. ఈ మేరకు అధికారులు రాహుల్‌కు ఆదివారం ఉదయం పాస్‌పోర్టును పంపించారు. సోమవారం రాహుల్ శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్తారు. అక్కడ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర ముఖ్యులను కలుసుకుంటారు. -
రోబో లాయర్!
వాషింగ్టన్: న్యాయవాదుల సేవలు నానాటికీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయి. ఈ భారీ ఫీజులతో పని లేకుండా ఓ రోబో లాయర్ మన తరఫున ఎంచక్కా కోర్టులో వాదిస్తే? బాగుంటుంది కదా! కృత్రిమ మేధతో పని చేసే అలాంటి రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. డునాట్‌పే అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది. కోర్టులో వాదనలు జరిగినంతసేపూ సలహాలు సూచనలు అందించనుంది. స్మార్ట్ ఫోన్ సాయంతో వాదనలు వింటూ, ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తన కక్షిదారుకు ఎప్పటికప్పుడు ఇయర్ ఫోన్లో చెబుతుందట. అయితే కక్షిదారు పేరు, వాదనలు జరిగే కోర్టు తదితర వివరాలను సదరు కంపెనీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతోంది. స్టాన్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ జోషువా బ్రౌడర్ దీని వ్యవస్థాపకుడు. తన యాప్ ఆధారిత రోబో లాయర్లు మున్ముందు లాయర్ల వ్యవస్థ మొత్తాన్నీ భర్తీ చేయాలన్నది ఆయన ఆకాంక్ష! అదెంత మేరకు నెరవేరుతుందో చూడాలి. -
రెండు ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్యం లక్ష్యం
శాన్ఫ్రాన్సిస్కో: భారత్ వస్తు, సేవల ఎగుమతులు గత సంవత్సరం ముగిసే నాటికి 675 బిలియన్ డాలర్లు దాటాయని, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఆకాంక్షిస్తున్నదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక్కడి స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో సంభాషించిన గోయల్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, భారతదేశం తన స్వాతంత్య్ర 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సమయానికి, 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ విలువ 35 నుంచి 45 ట్రిలియన్ల స్థాయినీ అందుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ల ఎకానమీతో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. భారత్ ముందు వరుసలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు ఉన్నాయి. దశాబ్దం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండేది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధితో బ్రిటన్ను భారత్ ఎకానమీ ఆరవ స్థానంలోకి నెట్టింది. తక్షణం ఇబ్బందులే... కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం, అనిశ్చితి వంటి పరిస్థితుల్లో భారత్ ఎగుమతులు కష్టకాలాన్ని ఎదుర్కొన తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాలు వంటి రంగాలు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, రష్యా–ఉక్రెయిన్, చైనా–తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, సరఫరాల సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి వేగానికి, డిమాండ్ బలహీనతకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఎగుమతుల క్షీణత–భారీ దిగుమతులపై ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు కూడా ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే ఐదు నెలల కాలంలో 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 53.78 బిలియన్ డాలర్ల నుంచి 125.22 బిలియన్ డాలర్లకు చేరింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతుల విలువ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు. యూఎస్ ఇన్వెస్టర్లతో స్టార్టప్స్ అనుసంధానం భారత స్టార్టప్స్‌ను యూఎస్ ఇన్వెస్టర్లతో అనుసంధానించేందుకు.. సపోర్టింగ్ ఎంట్రప్రెన్యూర్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్‌స్కిల్లింగ్ (సేతు) పేరుతో కార్యక్రమానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ శ్రీకారం చుట్టారు. భారత్‌లో వ్యవస్థాపకత, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న యూఎస్‌లోని ఇన్వెస్టర్ల మధ్య భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి సేతు రూపొందించారు. నిధుల సమీకరణ, ఉత్పత్తుల విక్రయం, వాణిజ్యీకరణకై ఇన్వెస్టర్లు మార్గదర్శకత్వం వహిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని స్టార్టప్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు భారత్‌లో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టు గోయల్ తెలిపారు. స్టార్టప్స్‌లో 90 శాతం, అలాగే నిధులు అందుకున్న స్టార్టప్స్‌లో సగం ప్రారంభ దశలోనే విఫలం అవుతున్నాయని గుర్తు చేశారు. వ్యాపారాన్ని నిర్వహించడంలో అనుభవం లేకపోవడం ఒక కీలక సమస్య అని అన్నారు. నిర్ణయం తీసుకోవడానికి, నైతిక మద్దతు కోసం వ్యవస్థాపకులకు సరైన మార్గదర్శకత్వం అవసరమని వివరించారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు మార్గ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 200 పైచిలుకు మెంటార్స్ పేర్లు నమోదు చేసుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో మాట్లాడుతున్న గోయల్ -
Great resignation: కొలువుకు టాటా
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవనక్రమం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. భార్యాబిడ్డలతో గడుపుతూనే, ఇంటి పనులూ చేసుకుంటూనే, బయటికెళ్లి సరదాగా గడుపుతూనే ఆఫీసు పని కూడా చేసుకునే కొత్త ట్రెండు. ఇంతకాలంగా కోల్పోయిందేమిటో సగటు ఉద్యోగికి తెలిసొచ్చేలా చేసింది కరోనా. అందుకే మళ్లీ ఎప్పట్లా ఆఫీసుకు వెళ్లి పని చేయాలంటే ఎవరికీ ఓ పట్టాన మనసొప్పడం లేదు. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పని చేసే వీలున్న కొలువు చూసుకొమ్మంటోంది. ఫలితం? ఉద్యోగుల రాజీనామా వెల్లువ... కరోనా తర్వాత ఉద్యోగుల రాజీనామాలు కొంతకాలంగా ప్రపంచమంతటా పెరుగుతూనే ఉన్నా, అమెరికాలో మాత్రం ఈ పోకడ పలు చిన్నా పెద్దా కంపెనీలను మరీ కుదిపేస్తోంది. గతేడాది అక్కడ 4.7 కోట్ల మంది ఉద్యోగాలకు రాంరాం చెప్పినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారట. ‘వీళ్లంతా నచ్చిన వేళల్లో తమకు నచ్చినట్టు పనిచేసే వెసులుబాటున్న ఉద్యోగాలు వెదుక్కుంటున్నారు. ఒకరకంగా చరిత్రలో తొలిసారిగా ఉద్యోగుల్లో ఒక ధీమా వంటివి వచ్చింది. ఉన్న ఉద్యోగం మానేసినా నచ్చిన పని వెదుక్కోవడం కష్టమేమీ కాదన్న భావన పెరిగింది’అని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ నికోలస్ బ్లూమ్ అన్నారు. నచ్చిన పనిలో ఇప్పుడున్న జీతం కంటే తక్కువ వచ్చినా పర్లేదనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఆయన చెబుతున్నారు. ఉద్యోగుల్లో ఏకంగా 57 శాతం వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోరుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజా సర్వే తేల్చింది. కరోనా కాలంలో విపరీతమైన ఒత్తిడికి లోనైన టెక్, హెల్త్‌కేర్ కంపెనీల ఉద్యోగులే ఇప్పుడు ఎక్కువగా కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. వీరిలో చాలామంది ఐదు నుంచి పదేళ్ల అనుభవమున్నవారే. మొత్తానికి వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు కొత్త జీవిత పాఠాలు నేర్పిందంటారు టెక్సాస్ ఎం–ఎం వర్సిటీ ప్రొఫెసర్ ఆంటోనీ క్లోజ్. 2021 నుంచీ పెరిగిపోయిన రాజీనామాల పోకడకు ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’అని పేరు పెట్టారాయన. మన దేశంలోనూ అదే ధోరణి మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్ పేజ్ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట!! సర్వేలు ఏం చెప్తున్నాయి.. ► ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగం మారాలనుకుంటున్నట్టు ప్రైస్‌వాటర్‌కూపర్ ఇటీవల 44 దేశాల్లో నిర్వహించిన మెగా సర్వేలో తేలింది ► అధిక జీతం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నామని వీరిలో 44 శాతం మంది చెప్పగా, వృత్తి–వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల జాబ్ మారుతున్నట్టు మరో44 శాతం మంది చెప్పారు. ► ప్రపంచవ్యాప్తంగా కేవలం 29 శాతం మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగేందుకు ఇష్టపడుతున్నట్టు గార్టర్ అనే సంస్థ సర్వేలో తేలింది. ► తమకు నచ్చిన పనివిధానం, పని గంటలుండే ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 79 శాతం మంది చెప్పారు. కంపెనీల తీరూ మారుతోంది రాజీనామాల నేపథ్యంలో కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు అమెజాన్, గూగుల్ వంటి భారీ సంస్థలు కూడా అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. పని విధానాన్నే మార్చేస్తున్నాయి. అధిక జీతాలను ఆశగా చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఇంటినుంచి కొంత, ఆఫీసులో కొంత సమయం పని చేసేలా హైబ్రిడ్ విధానాన్నీ తెస్తున్నాయి. పింట్రెస్ట్ సంస్థ అయితే ఏకంగా బిడ్డల సంరక్షణ కోసం ఉద్యోగులకు సెలవులతో పాటు అనేక సౌకర్యాలిస్తోంది. జర్మనీకి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ డాబే అయితే ఇంటర్వ్యూలకు హాజరైన వారికీ నగదు బహుమతులిస్తోంది! తొలి రౌండ్లో 550 డాలర్లు, రెండో రౌండ్ చేరితే 1,100 డాలర్లు ముట్టజెబుతోంది! -
పది నిమిషాల్లోపే డెలివరీ! లేకుంటే..
Zepto Grocery Deliver App Founders Inspirational Success Story: వయసు 19 ఏళ్లు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఉన్నత విద్యాలయం చదువుల్ని పక్కనపెట్టి.. ఒకే లక్క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేవలం పది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే యాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తద్వారా గ్రోఫర్స్, డుంజో, స్విగ్గీలాంటి సర్వీసులతో పోటీ పడుతున్నారు. అయితే ఇంత చిన్నవయసులో దాపు 450 కోట్ల పెట్టుబడి ఎలా సమీకరించుకోగలిగారు?.. మార్కెట్లో దాని విలువను 2 వేల కోట్లకుపైగా(ప్రస్తుతం) ఎలా చేర్చగలిగారు?.. అదెలాగో.. జెప్టో యాప్ కథ చదివితే తెలుస్తుంది. ముంబై బేస్డ్గా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది జెప్టో యాప్. డెలివరీ యాప్ స్టార్టప్‌లో ఇప్పుడు ఇదొక సంచలనం. బచ్పన్ దోస్తులైన ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా.. ఇద్దరు కుర్రాళ్లు దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. లొకేషన్‌ను బట్టి ETA(ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్ ఎరైవల్) కేవలం 6 నుంచి 7 నిమిషాల్లోనే సరుకుల్ని డెలివరీ చేయిస్తుండడం ఈ యాప్ ప్రత్యేకత. మొత్తం మీద 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ అయ్యేలా చూడడం ఈ యాప్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. మరి ఆ టైంలోపు డెలివరీ చేయకపోతే.. పండ్లు, మాంసం, మందులు, ఇతర కిరాణా సామాన్లు.. జెప్టో యాప్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా సర్వీసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ పది నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే.. సంబంధిత సరుకుల మీద డిస్కౌంట్స్‌తో పాటు, ఇతరత్ర ఇన్సెంటివ్స్ యాప్ యూజర్లకు అందిస్తారు. వాటికి అయ్యే ఖర్చు జెప్టో యాప్ నిర్వాహకులే భరిస్తున్నారు. ఇక ఈ యాప్ ద్వారా జరుగుతున్న డెలివరీలు ప్రస్తుతానికైతే ఛార్జీలు వసూలు చేయడం లేదు. అతిపెద్ద ఛాలెంజ్.. ఈ స్థాయికి చేరుకుంటారని ఏ దశలోనూ అనుకోలేదు పలిచా, వోహ్రాలు. ఈ బాల్య స్నేహితులు కలిసే పెరిగారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోసం ఇద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. యూనివర్సిటీలో ఉండగానే గ్రాసరీ డెలివరీ యాప్‌ను ప్రయోగాత్మకంగా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఆ సరదా ప్రయోగం వర్కవుట్ కావడంతో పర్ఫెక్ట్ మోడల్ కోసం మూడు నెలలు కష్టపడ్డారు. భారత్‌లో డెలివరీ స్టార్టప్‌లకు మంచి గిరాకీ ఉందని గుర్తించి.. కాలేజీ చదువుల్ని పక్కనపెట్టి స్వస్థలానికి చేశారు. క్విక్ డెలివరీ అంటే 45 నిమిషాలనే ఆలోచన ఉందట మొదట వీళ్లిద్దరికీ. కానీ, ఒపినీయన్ సర్వేలో జనాలు 10-15 నిమిషాలు అనేసరికి.. భయం భయంగానే యాప్‌ను మొదలుపెట్టారు. అంత తక్కువ టైంలో యాక్సిడెంట్లు కాకుండా రైడర్లు డెలివరీ చేయడం మరో పెద్ద టాస్క్. అదే టైంలో డెలివరీకి తగ్గట్లు లొకేషన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా రిస్క్ తీసుకోకుండా యాప్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నారు. ఇన్వెస్టర్లను మెప్పించి.. యాప్ మార్కెట్లోకి తేవడానికి వీళ్లిద్దరూ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ముందు తమ సర్వీస్ వేగాన్ని ఇన్వెస్టర్లకే రుచి చూపించారు వీళ్లు. అలా ఆర్నేళ్లపాటు కష్టపడి 450 కోట్ల రూపాయల పెట్టుబడి సమీకరణతో జెప్టోను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ విలువ 200-300 మిలియన్ డాలర్లుగా ఉంది(రెండు వేల కోట్లరూపాయలకుపైనే). వై కాంబినేటర్, గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్‌తో పాటు ఇన్వెస్టర్లు లాచీ గ్రూమ్, నీరజ్అరోరా పెట్టుబడులు ఉన్నాయి జెప్టో స్టార్టప్‌లో. టాలెంట్‌కి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చని, విజయం అందుకోవాలంటే అమితమైన ఆత్మవిశ్వాసమూ, నమ్మకమూ, కెరీర్లో ముందడుగు వేసే ధైర్యమూ ఉండాలని చెబుతోంది ఈ ఇద్దరి మిత్రుల సక్సెస్ కథ. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
కొంపముంచిన ట్రంప్.. 700 మంది మృతి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో (నవంబర్ 3)న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో తగిన జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రచారంలో ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు దేశాన్ని చుట్టివచ్చారు. నువ్వా నేనా అనే విధంగా ఇరువురి నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్నిక ప్రత్యేక దృష్టిని ఆకర్శించింది. (బైడెన్‌పై అంత ప్రేమెందుకు?: ట్రంప్) తొలిసారి అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ట్రంప్ విజయం సాధించాలని పట్టుదలగా ఉండగా.. మరోసారి గెలుపొంది రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. కరోనా వ్యాప్తి భయంకరంగా సాగుతున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కూడా ఓసారి వైరస్ బారీనపడ్డారు. అయినప్పటకీ గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. ఇక ఎన్నికలకు సమయం ఆసన్నమైతున్న క్రమంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఓ కీలక నివేదికను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 30వేల మంది పౌరులు కరోనా వైరస్ పడగా.. మరో 700 మంది చనిపోయారని తన నివేదికలో పేర్కొంది. వైరస్ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన ప్రచార ర్యాలీలు నిర్వహించడం కారణంగానే పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ మేరకు జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను బహిర్గతం చేసింది. మరోవైపు తాజా రిపోర్టుపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బీడైన్ ఘాటుగా స్పందిచారు. అమెరికన్ల ప్రాణాలపై ట్రంప్‌కు ఏ బాధ్యత, గౌరవం లేదని విమర్శించారు. -
ప్రొఫెసర్ చల్లపల్లి తెలుగువారికి గర్వకారణం
న్యూయార్క్: స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపక, శాస్త్రవేత్తలు బృందం రూపొందించిన ప్రపంచములోని లక్షమంది ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ చల్లపల్లి సూర్యనారాయణకు స్థానం దక్కింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేసిన మేటి పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తల జాబితాలో ఆయన 55వ స్థానం సంపాదించడం తెలుగువారందరికీ గర్వకారణమని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా అధ్యక్షులు అలెగ్జాండర్ ఎన్. కార్ట్‌రైట్ అన్నారు. ‘తమ తమ రంగాలలో ప్రపంచంలోనే మేటి 100 మందిలో చోటు సంపాదించడం అంటే అది ఒక గొప్ప విజయం. అందరికీ సాధ్యమయ్యేది కాదు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాకి వన్నె తెస్తున్న శాస్త్రవేత్త సూర్యనారాయణకు అభినందనలు’ అని అన్నారు. ఈ మేటి శాస్త్రవేత్తల జాబితా గత 22 ఏళ్లుగా ఇంజనీరింగ్, విజ్ఞానం, వైద్య, తదితర రంగాలలో నిష్ణాతులైన 6,880,389 మంది సాంకేతిక పత్రాల సమర్పకులను పరిగణనలోకి తీసుకుని తయారుచేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతుల్లో పదార్థ విజ్ఞాన(మెటీరియల్స్)శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణ అగ్రగణ్యులుగా పేర్కొనదగినవారు. ఆయనకు ఈ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సూర్యనారాయణ గత 20 ఏళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత 45 ఏళ్లుగా వివిధ విశ్వవిద్యాలయాలలో ఉన్నత శ్రేణి అధ్యాపకులు, పరిశోధకులుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. సూర్యనారాయణ ఇప్పటివరకు పదార్థ విజ్ఞానశాస్త్ర (మెటీరియల్స్) రంగంలో 23 పుస్తకాలను రచించడంతోపాటు సంపాదకీయం చేశారు. ఈ రంగంలో వివిధ పుస్తకాలలో 21 అధ్యాయాలు కూడా రాశారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వివిధ ప్రచురణ సంస్థల్లో 400కుపైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. గూగుల్ స్కాలర్ అంచనా ప్రకారం 26,500 ప్రశంస పత్రాల అందుకున్న శాస్త్రవేత్త సూర్యనారాయణ కావడం విశేషం. చల్లపల్లి సూర్యనారాయణ పర్యవేక్షణలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు పీహెచ్డీ డిగ్రీలను స్వీకరించి, మేటి శాస్త్రవేత్తలుగా ఉన్నత పదవులను అలంకరించారు. ఆయన వివిధ దేశాలలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలలో గెస్ట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. బ్రెజిల్, బెల్జియం, కెనడా, చిలీ, చైనా , జర్మనీ, జపాన్, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా, స్పెయిన్, అమెరికా, బ్రిటన్ దేశాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 200కి పైగా గెస్ట్ ప్రసంగాలు చేశారు. పురస్కారాలు: భారత ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నుంచి ప్రశంసాపత్రం, పురస్కారం అందుకున్నారు. అమెరికా ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం, పురస్కారం, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో జీవనసాఫల్య పురస్కారం, సెంట్రల్ ఫ్లోరిడా ఇంజనీర్స్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. జాతీయ ధాతు దినోత్సవ (నేషనల్ మెటలర్జిస్టిక్ డే) సందర్భంగా విశేష సత్కారం అందుకున్నారు. ఇరాక్ దేశ విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక రంగాలకు అంకితభావంతో అందించిన విశేష సేవలకు గాను అమెరికా గౌరవ పురస్కారం లభించింది. జపాన్ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యున్నత ప్రతిభావంతులకు ఇచ్చే సాంకేతిక అభివృద్ధి సంస్థ పౌర పురస్కారం (జపాన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్) ఆయన్ని వరించింది. అమెరికా దేశ ప్రభుత్వం శాస్త్రరంగ అభివృద్ధికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక జెఫెర్సన్ సైన్స్ ఫెలోషిప్ పురస్కారం అందుకున్నారు. భారత రాష్ట్రీయ విజ్ఞాన సంస్థ విజ్ఞాన శాస్త్ర పతకం లభించింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) పూర్య విద్యార్ధిగా గౌరవించబడ్డారు. థామ్సన్ రాయిటర్స్ సంస్థ ద్వారా 2011లో ఉన్నతమైన గుర్తింపు అందుకున్నారు. అలాగే 2003లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ గుర్తింపు లభించింది. అమెరికాలోని టీఎంఎస్ సంస్థ ద్వారా ఉత్తమ విద్యావేత్తగా సత్కరింపబడ్డారు. ఇలా ప్రపంచం మొత్తం పేరుగాంచిన సంస్థలు గౌరవించుకున్న డాక్టర్ చల్లపల్లిసూర్యనారాయణ తెలుగువారు కావటం తెలుగువారి అదృష్టం, గర్వకారణం. మచిలీపట్నంలో పుట్టి అత్యున్నత స్థాయికి.. సూర్యనారాయణ తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ చల్లపల్లి రామబ్రహ్మం, శ్రీమతికామేశ్వరి, ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఆయన కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నంలోని హిందూ కాలేజీ జరిగింది. స్నాతకోత్తర విద్యాభ్యాసం భారత విజ్ఞాన సంస్థ (బెంగళూరు), కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. సూర్యనారాయణ 1988 వరకు భారతదేశంలో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. 1988 తర్వాత అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. సూర్యనారాయణ జీవన ప్రయాణంలో ఆయన సతీమణి శ్రీమతి చల్లపల్లి మీనాక్షి గారి సహకారం మరువలేనిది. శ్రీమతి మీనాక్షి కూడా సంగీత గురువుగా ఎంతో మంది విద్యార్థులకు కర్ణాటక సంగీతం నేర్పిస్తూ, విద్వాంసులుగా తీర్చిదిద్దారు. -
సహజీవనం.. ఆసక్తికర అధ్యయనం!
వాషింగ్టన్: ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అనే మాటను తరచుగా వింటూ ఉంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఆరు నెలల పాటు ఒకరితో కలిసి ఉంటే మన లక్షణాలు కొన్న అవతలి వారికి.. వారి అలవాట్లు మనకు అబ్బుతాయి. అలానే ఏళ్ల తరబడి కలిసి జీవించే వ్యక్తులు ఒకానొక సమయంలో ఒకరినొకరు పోలి ఉండటం ప్రారంభిస్తారా అనే ప్రశ్న తరతరాలుగా శాస్త్రవేత్తలను, మనస్తత్వవేత్తలను వెంటాడుతుంది. 1980ల నాటికే దీనిపై ఎన్నో అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ దృగ్విషయానికి సంబంధించి తాజాగా జరిపిన ఓ పరిశోధన కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఆ వివరాలు.. ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ విషయాన్ని విశ్లేషించడానికి సంవత్సరాలుగా కలిసి ఉన్న వేల జంటల ఫోటోలను తీశారు. ముఖాలను విశ్లేషించడానికి ఈ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. 80 ల ప్రారంభంలో పరిశోధకులు దీన్ని విశ్లేషించడానికి స్వచ్ఛంద సేవకులపై ఆధారపడాల్సి వచ్చేది. (చదవండి: ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్ ఉందా?!) ఎలా అధ్యయనం చేశారు పీహెచ్డీ స్టూడెంట్ టీ-మేకార్న్, పరిశోధనా భాగస్వామి మిచల్ కోసిన్స్కితో కలిసి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న వేలాది జంటల ఛాయాచిత్రాలను జల్లెడ పట్టారు. వివాహం అయిన 25 సంవత్సరాల తరువాతి ఫోటోలు.. వారు వివాహం చేసుకోవడానికి ముందు తీసిన ఫోటోలను తీసుకున్నారు. ఇలా దాదాపు 517 జంటల డాటాను సేకరించారు. ఇందుకు గాను స్టాన్ఫోర్డ్ పరిశోధకులు స్వచ్ఛంద సేవకుల సాయం తీసుకున్నారు. వలంటీర్లకు టార్గెట్‌కి సంబంధించిన ఫోటో ఇచ్చి.. దానితో పాటు ఐదు ఇతర ఫోటోలు ఇచ్చారు. ఈ 5 ఫోటోల్లో ఒకటి టార్గెట్ భాగస్వామిది కూడా ఉంటుంది. ఇక ఈ మొత్తం ఫోటోల్లో ముఖ సారూప్యతలను గమనించమని వలంటీర్లను కోరారు పరిశోధకులు. అలానే ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కూడా ఇలానే చేశారు. (చదవండి: కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే) ఏం గమనించారు ఇక ఈ పరిశోధనలు స్టాన్ఫోర్డ్ విశ్వ విద్యాలయం పరిశోధకులు ఏళ్ల తరబడి కలిసి ఉన్న జంటలు ఒకానొక సమయంలో ఒకరినొకరు పోలి ఉంటారనే వాదనను కొట్టి పారేశారు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. బదులుగా తమ లాంటి ముఖ లక్షణాలు కలిగిన భాగస్వాములను ఎంచుకోవడం పట్ల ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. -
వేలంపాట సిద్ధాంతానికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరిక ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రూమ్ (72), రాబర్ట్ బి విల్సన్ (83) ఈ ఏడాది నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. వేలం పాటలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్ స్లాట్స్ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్ అవార్డుల కమిటీ తెలిపింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ సోమవారం విజేతలను ప్రకటించారు. విల్సన్ తన పీహెచ్డీ సలహాదారుగా పనిచేశాడని మిల్‌గ్రూమ్ తెలిపారు. విల్సన్ మాట్లాడుతూ వేలంపాటలకు సంబంధించి మిల్‌గ్రూమ్ ఓ మేధావి అని తన పూర్వ విద్యార్థిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి. అన్ని వేలాలు ఒకటి కాదు... సాధారణంగా వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతారో వారికి ఆయా వస్తు, సేవలు లభ్యమవుతూంటాయి. లేదంటే ఒక పనిని అతి చౌకగా చేసిపెడతామన్న వారికీ ఆ పనిని కట్టబెట్టడమూ కద్దు. అతిపురాతనమైన, అపురూపమైన వస్తువులు మొదలుకొని ఇంటి సామాన్ల వరకూ రోజూ అనూహ్యమైన ధరలకు అమ్ముడవుతూండటం మనం చూస్తూనే ఉంటాం. వేలం ద్వారా ప్రభుత్వాలు ప్రజావసరాల కోసం వస్తు, సేవలను సమీకరించడం కూడా మనం చూస్తూంటాం. రాబర్ట్ విల్సన్, పాల్ మిల్‌గ్రూమ్‌లు వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వేలంలో పాల్గొనేవాళ్లు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండటం వల్ల ఈ విళ్లేషణ అంత సులువుగా ఉండదు. తమకు తెలిసిన, ఇతరులకు తెలిసి ఉంటుందని భావిస్తున్న సమాచారాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రాబర్ట్ విల్సన్.. సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట. ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని విల్సన్ అంటారు. మరోవైపు పాల్ మిల్‌గ్రూమ్ వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి. వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని మిల్‌గ్రూమ్ చెబుతున్నారు. 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. -
హ్యాపీ బర్త్‌డే గూగుల్ తల్లి
గూగుల్.. ఈ పదం తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. చిన్నపాటి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివ్యక్తికి ఈ పదం సుపరిచితమే. ఈరోజుల్లో ఏ సమాచారం కావాలన్నా ‘జై గూగుల్ తల్లి’ అనాల్సిందే. ఎటువంటి సమాచారాన్నయినా క్షణాల్లో యూజర్లకు అందించే గూగుల్ సెర్చ్ ఇంజన్ 20వ పుట్టిన రోజు నేడు. ఈసందర్భంగా గూగుల్ ఆవిర్భావం, 20 ఏళ్ల దాని ప్రస్థానంపై గూగుల్ డూడుల్, ఓ వీడియోను రిలీజ్ చేసింది. సమాచారాన్నంతా ఒకే వేదిక ద్వారా ప్రపంచానికి అందించాలన్న ఆలోచనతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు సర్జీ బ్రిన్, లారీ పేజ్‌లు 1998లో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 150 భాషల్లో 190 దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలందిస్తుంది. -
కాబోయే భర్తతో కలిసి ఇషా సందడి
బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ 127వ ప్రారంభోత్సవ వేడుకల్లో తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఇషా అంబానీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) పూర్తి చేశారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నారు. ఈ వేడుకలో తన కాబోయే భర్త ఆనంద్ పిరామల్, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మొత్తం 2460 మంది విద్యార్థులు ఈ వేడుకలో పట్టాలు అందుకున్నారు. ఇషా అంతకముందు సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుని, యేల్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ స్టడీస్ పూర్తిచేశారు. ఇషా తల్లికి తగ్గ తనయ మాదిరి, ఎంబీఏ చదువుకుంటూనే స్టాన్ఫోర్డ్ నర్సరీలో టీచర్ ఉద్యోగం కూడా చేసింది. ఇషా అంబానీ గ్రాడ్యుయేషన్ డే ఫోటోలు మీకోసం... -
జర్నలిస్టు వరదరాజన్‌కు షొరెన్‌స్టెయిన్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ‘ద వైర్’ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్టాత్మక ‘షొరెన్‌స్టెయిన్’ జర్నలిజం అవార్డు వరించింది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను 2017వ సంవత్సరానికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఢిల్లీకి చెందిన వరదరాజన్ గతంలో హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర జాతీయ పత్రికల్లో పనిచేశారు. -
అచ్చం అమ్మలాగే ఇషా అంబానీ
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలికాం మార్కెట్లో జియో సంచలనాలు సృష్టిస్తున్న దగ్గర్నుంచి ఇషా అంబానీ పేరు మారుమ్రోగుతోంది. జియో ఐడియా తన కూతురిదేనని పలుమార్లు ముఖేష్ పలు వేదికలపై వెల్లడించారు కూడా. రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ఇషా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె పోలికలు మాత్రం అచ్చం తల్లి నీతా అంబానీ లాంటివేనట. తన తల్లి కోరిక మేరకు అటు చదువును, ఇటు ఉద్యోగాన్ని ఆమె ఎంతో విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని తెలిసింది. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న నీతా, ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిందని, ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేస్తున్నట్టు తెలిపారు. అటు ఎంబీఏ క్లాసెస్‌కు హాజరు అవుతూనే, బింగ్ అనే స్టాన్ఫోర్డ్ నర్సరీలో ఉద్యోగం చేస్తున్నట్టు నీతా వెల్లడించారు. అక్కడ తాను టీచర్‌గా వర్క్ చేయనున్నట్టు తెలిపారు. నీతా అంబానీ కూడా ముఖేష్ అంబానీని కలిసినప్పుడు స్కూల్ టీచర్‌గానే పనిచేసేవారు. రిలయన్స్ జియోలో డైరెక్టర్ హోదా, స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ, నర్సరీలో ఉద్యోగం అన్నింటిన్నీ విజయవంతంగా చేపడుతున్నట్టు తెలిసింది. దీంతో అచ్చం అమ్మలాగే, కూతురు అంటూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. -
సాయమందిస్తే.. సత్తా చాటుతాం !
నూజివీడు : ఆ నలుగురు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. రెక్కలు ముక్కలు చేసుకుని తల్లిదండ్రులు వారిని చదివించుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఇంజినీరింగ్ విద్యలోనూ అసాధారణ ప్రతిభ చూపెట్టి విదేశాల్లోని యూనివర్సిటీలను సైతం మెప్పించారు. వీరి ప్రతిభను మెచ్చి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డీ స్కూల్ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఈ నెలలో అమెరికా వెళ్లేందుకు విద్యార్థుల వద్ద చేతిలో చిల్లిగవ్వలేదు. తల్లిదండ్రులు సైతం డబ్బు ఖర్చుపెట్టి అమెరికా పంపించే పరిస్థితుల్లో లేరు. అమెరికా వెళ్లి రావాలంటే విమాన టికెట్లు, వెళ్లిన తరువాత ఖర్చులు కలిపి ఒక్కొక్కరికీ దాదాపు రూ.2లక్షలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు ఉంటే సాయమందించాలని విద్యార్థులు కోరుతున్నారు. దాతలు దయతలచి సాయమందిస్తే అమెరికా వెళ్లి తమ సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు. ఎంపికైన విద్యార్థులు వీరే.. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి 125 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరైతే గడ్డం సాయికుమార్ (సీఎస్ఈ ప్రథమ సంవత్సరం), లాల్‌సింగ్ నాయక్ (మెకానికల్ ద్వితీయ సంవత్సరం), పుప్పాల ప్రతాప్ (సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం), వంకలపాటి సాయిదుర్గాప్రసాద్ (ఈసీఈ ద్వితీయ సంవత్సరం) ఎంపికయ్యారు. వీరికి ఆరువారాల పాటు ఆన్లైన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులు శిక్షణ ఇచ్చిన తరువాత ఫెలోషిప్‌ను ప్రకటించారు. మార్చి 15 నుంచి 19వ తేదీ వరకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించే సిలికాన్ వ్యాలీ మీట్ అప్–2018 స్ప్రింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ నలుగురు విద్యార్థులకు యూనివర్సిటీ వారు ఆహ్వానం పంపించారు. యూనివర్సిటీలో నిర్వహించే మీట్లో విద్యార్థులు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఆర్థిక స్థోమత లేదు తల్లిదండ్రులు తిరుపతిరావు, లక్ష్మీలు ఇద్దరూ షాపుల్లో పనిచేస్తారు. తమ్ముడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. అమెరికా వెళ్లాలంటే రూ.2లక్షలు ఖర్చుచేసే స్థోమత లేదు. దీంతో ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుతున్నా.– వంకలపాటి సాయిదుర్గాప్రసాద్,కృష్ణలంక, విజయవాడ కూలికి వెళ్లి చదివిస్తున్నారు రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చా. నాన్న మల్లయ్య, అమ్మ పార్వతి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ నన్ను చదవిస్తున్నారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన డబ్బులు తీసుకురావడం సాధ్యం కాదు.– గడ్డం సాయికుమార్, చీమలమర్రి, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా అమ్మ కష్టపడి చదివిస్తోంది మా నాన్న నా చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ లక్ష్మి కూలి చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. తమ్ముడు ఉన్నప్పటికీ ఇంటి వద్దే గొర్రెలు మేపుతాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ్ముడిని చదివించడం లేదు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే సిలికాన్ వ్యాలీకి వెళ్లగలం.– మూడు లాలూనాయక్, చౌడవరం తండా, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా ఆదుకుంటేనే వెళ్లగలం తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మాధవి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. అక్కను ఎంబీఏ చదివిస్తున్నారు. అంత డబ్బు పెట్టడమంటే సాధ్యమయ్యే పనికాదు. ఎవరైనా ఆదుకుంటేనే తాము వెళ్లగలం.– పుప్పాల ప్రతాప్, ప్రజ్ఞం,నిజాపట్నం మండలం, గుంటూరు జిల్లా -
ఓ గొప్ప సినీమాలాంటి కథ
జీవన కాలమ్ సాధారణంగా ‘మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉపయోగం?’ అని ఆలోచించడం మానవ స్వభావం. ‘కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేదేమిటి?’ అని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం. 125 సంవత్సరాల కిందటి (1892)– అంటే సరిగ్గా గురజాడ ‘కన్యాశుల్కం’ పుట్టిన సంవత్సరం. నిజంగా జరిగిన కథ. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో 18 ఏళ్ల కుర్రాడు చదువుకుంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. మేన మామ చదువు చెప్పించాడు. ఈసారి ఫీజు కట్టడానికి డబ్బులేదు. ఇతనూ, మరొక మిత్రుడూ కలసి ఆలో చించారు. అప్పటి రోజుల్లో అతి ప్రముఖుడైన ఓ సంగీత విద్వాంసుడి కచేరీ పెట్టించి, టికెట్లు అమ్మి, మిగిలిన డబ్బుతో ఫీజు కట్టుకోవచ్చునని వారి ప్లాను. అప్పట్లో అతి ప్రఖ్యాత పియానో వాద్యగాడు పెరెడెస్కీని కలిశారు. ఆయన మేనేజరు కార్యక్రమానికి 2 వేల డాలర్లు (125 సంవత్సరాల కిందటి మాట అని మరిచిపోవద్దు) గ్యారంటీ ఫీజు అడిగాడు. వీళ్లిద్దరూ ఒప్పుకున్నారు. కచేరీకి ఏర్పాట్లను ప్రారంభించారు. అనుకున్న రోజున కచేరీ బ్రహ్మాండంగా జరిగింది. కానీ వీరు ఆశించినట్టు లాభం రాకపోగా 1,600 డాలర్లే వసూలైంది. వీళ్లు కుర్రాళ్లు. ఆయన మహానుభావుడు. 1,600 డాలర్లతో సరాసరి ఆయన దగ్గరికే వెళ్లారు. కథంతా చెప్పుకుని 1,600 డాలర్లతోపాటు 400 డాలర్ల చెక్కు ఇచ్చి త్వరలో ఈ బాకీ తీరుస్తామని చెప్పుకున్నారు. పెరెడెస్కీ అంతా విన్నాడు. ఆయన చేతిలోని చెక్కుని చింపేసి 1,600 వెనక్కి ఇచ్చాడు. ‘ఈ కచేరీకి అయిన బాకీలు తీర్చి మీ జీతాలు కట్టుకుని ఏమైనా డబ్బు మిగిలితే తనకివ్వమ’న్నాడు. కుర్రాళ్లు ఆయన ఔదార్యా నికి బిత్తరపోయారు. తర్వాత పెరెడెస్కీ జీవితం కళ కారణంగా అంత ర్జాతీయ కీర్తిని ఆర్జించిపెట్టింది. ఊహించనంత ధనాన్ని ఆర్జించి పెట్టింది. తన దేశపు ఔన్నత్యానికి, ప్రపంచంలో స్వదేశ స్మారక చిహ్నాల నిర్మాణానికీ ఆయన చేసిన కృషి ప్రజాభిమానాన్ని సంపాదించిపెట్టింది. మన దేశంలో గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ ఉపాధ్యక్షుడు అయినట్టుగా– 1919లో పోలెండు స్వతంత్ర దేశమయినప్పుడు దేశాధ్యక్షుడు పిల్సుడెస్కీ ఆయన్ని ప్రధాన మంత్రిని చేశారు. ఇది కళకూ, వితర ణకూ, రాజకీయ జీవనానికీ ఏర్పడిన వంతెన. 1935 నాటి మాట. పోలెండుకి పెరెడెస్కీ ప్రధాన మంత్రి అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో పోలెండు హిట్లరు పుణ్యమంటూ సర్వనాశనమయింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. 150 లక్షలమంది ఆహారం లేక అలమటించే పరిస్థితి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ఏం చెయ్యాలో పెరెడెస్కీకి పాలుపోలేదు. చివరికి అమెరికా ఆహార, పునరావాస సంస్థకి విజ్ఞప్తి చేశాడు. అప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ (తర్వాతి కాలంలో ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు) వెంటనే 150 టన్నుల బట్టలు, రగ్గులు, ప్రత్యేక వంట శాలలను ఏర్పాటు చేసి రోజుకి 2 లక్షలమందికి భోజ నాలను ఏర్పాటు చేశాడు. అమెరికా రెడ్‌క్రాస్ సంస్థ 2 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించింది. యుద్ధం ముగిశాక కష్ట సమయంలో తన దేశానికి ఉపకారం చేసిన వ్యక్తిని కలుసుకోవడానికి పెరెడెస్కీ అమెరికా వచ్చాడు. హూవర్ని కలిసినప్పుడు దాదాపు కళ్లనీళ్ల పర్యంతం అయి కృతజ్ఞతని చెప్పుకున్నాడు. హూవర్ నవ్వి ‘మరేం పరవాలేదు సార్. 48 సంవ త్సరాల కిందట మీరు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఓ కుర్రాడికి సహాయం చేశారు. మీకు గుర్తుండకపోవచ్చు. ఆనాడు మీకిచ్చిన 1,600 డాలర్లు వెనక్కి ఇచ్చి మా చదువుని కాపాడారు. ఆ కుర్రాడిని నేనే’ అన్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు మహా నుభావుల ఔదార్యానికి అద్దంపట్టే అపూర్వమైన కథ. సాధారణంగా ‘మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉప యోగం?’ అని ఆలోచించడం మానవ స్వభావం. ‘కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేదేమిటి?’ అని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం. అందుకే వారిలో ఒకరు తన దేశపు ప్రధాని అయ్యారు. మరొకరు తన దేశపు అధ్యక్షుడయ్యారు. హూవర్ 1919లో అమెరికా సంక్షేమ సంస్థ అధ్య క్షుడిగా వార్సా వెళ్లారు. తనకి స్వాగతం చెప్పడానికి– ఆనాటి యుద్ధంలో దెబ్బతిన్న ప్రజలు– ముఖ్యంగా 25 వేల మంది పిల్లలు ఆయనకి స్వాగతం చెప్పడానికి జోళ్లు లేని కాళ్లతో బారులు తీర్చారట. ఆ దృశ్యాన్ని చూసి హూవర్ చలించిపోయాడు. అప్పటికప్పుడు అమెరికాకు తాఖీదు పంపి– 7 లక్షల ఓవర్ కోట్లు, 7 లక్షల జోళ్లు పోలెండుకి ఓడలో పంపే ఏర్పాట్లు చేశాడు. మరో రెండే ళ్లపాటు 50 లక్షల జోళ్లు అమెరికా నుంచి దిగుమతి అవు తూనే ఉన్నాయి. ఒక వ్యక్తి ఔదార్యం, ఒక వ్యవస్థ ఔదార్యంగా పరి ణమించిన అపూర్వమైన కథనం ఇది. జీవితంలో పేద రికం చిన్న మబ్బుతునక. కానీ అది కప్పి ఉన్న వ్యక్తిత్వ వైభవం అనూహ్యమైన తేజస్సు. మరిచిపోవద్దు. పెరె డెస్కీ గొప్ప కళాకారుడు. హూవర్ది గొప్ప పేదరికం. ఉదాత్తతకీ, కళకీ, పేదరికానికీ దగ్గర బంధుత్వముంది. గొల్లపూడి మారుతీరావు -
మనం బద్ధకిష్టులమండోయ్!
ఏరా నీకేం ఇష్టం అంటే.. బద్ధకిష్టం.. అన్నాడట ఓ మహా లేజీ ఫెలో.. ఇలాంటోళ్ల సంఖ్య మన దగ్గర కాసింత ఎక్కువేనట. అడుగు తీసి అడుగు వేయమంటే.. కాలు అరిగిపోతుందని చూసేవారి సంఖ్యా అలాగే ఉందట.. ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో మనవాళ్ల ‘లేజీనెస్’ బయటపడింది. రోజువారీ జీవితంలో ఒళ్లు వంచి శారీరకశ్రమ చేసే విషయంలో, ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకేసి చురుకుదనాన్ని నింపుకోవాల్సిన చోట మనవాళ్లు బద్ధకంతో గడుపుతున్నారట. నడిచి వెళ్లేందుకు అవకాశమున్నపుడు కూడా ఏ వాహనం అందుబాటులో ఉంటే దానిపై కడుపులోని చల్ల కదలకుండా వెళ్లిపోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల ప్రజల రోజువారి నడక అలవాటు, శారీరకశ్రమపై చేసిన అధ్యయనంలో ఇండియా 39వ స్థానంలో నిలవగా, హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది.. భారతీయులు రోజుకు సగటున కేవలం 4,297 అడుగులు వేస్తున్నట్లు తేలింది. అందులోనూ మగవారు 4,606 అడుగులు, మహిళలు 3,684 అడుగులు మాత్రమే వేస్తున్నారు. సరైన శారీరకశ్రమ, వ్యాయామం లేని కారణంగా ఆడవారిలో ఊబకాయం పెరిగే అవకాశం 232 శాతం, పురుషుల్లో 67 శాతంగా ఉంటోందని స్పష్టమైంది. శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు రోజుకు కనీసం వెయ్యి అడుగులైనా వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పూట గంటపాటు వాకింగ్ చేసి వ్యాయామం అయిపోయిందనుకోవడం సరికాదని, రోజంతా శారీరక శ్రమ ఉండాల్సిందేనని చెబుతున్నారు. అయితే మనకంటే అత్యంత బద్ధకస్త దేశంగా ఇండోనేషియా నిలుస్తోంది. వారు రోజుకు 3,513 అడుగులేస్తూ బద్ధకిష్టులకే ట్రేడ్‌మార్క్‌గా అథమస్థానాన్ని (46వ ప్లేస్) సాధించారు. మలేషియా, సౌదీ ఆరేబియా ప్రజలు 3,900 అడుగుల నడకతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ప్రపంచ సగటు విషయానికొస్తే మాత్రం రోజుకు 4,961 అడుగులుగా ఉండగా, అమెరికన్లు సైతం 4,774 అడుగులతో సగటు కంటె వెనుకబడే ఉన్నారు. మొత్తం 46 దేశాల్లోని 7 లక్షల మంది నడకపై ఈ పరిశోధనను నిర్వహించారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ఫిట్బిట్లుæ ఇతర సాధనాల ద్వారా రోజూ తామెంత శారీరకశ్రమ చేస్తున్నారో, ఎన్ని అడుగులు వేస్తున్నారో అంచనా వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం ఆధారంగానే ఈ అధ్యయనం చేశారు.. హాంగ్‌కాంగ్ ప్రజలు రోజుకు 6,880 అడుగులతో అగ్రస్థానంలో నిలవగా. చైనా, ఉక్రెయిన్, జపాన్‌లకు చెందిన వారు సగటున 6 వేలకు పైగానే అడుగులు వేస్తున్నట్లు వెల్లడైంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
దుండిగల్: అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీతో మర్రి లక్ష్మణ్‌రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నాయి. అమెరికాలో ఆ సంస్థ ప్రతినిధులు, కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీ బదలాయింపు, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్‌లో టెక్నాలజీ ఎదుర్కొనే సవాళ్లపై విద్యార్థులను సన్నద్దం చేసే విషయంపై ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమ కళాశాల అమెరికాలోని ఫర్దూ యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకోవడం పాటు న్యాక్, యూజీసీ, అటానమస్ హోదా పొందిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉత్తమ ర్యాంక్‌లు సాధించిందని గుర్తు చేశారు.