
అతిగా టీవీ చూస్తే సృజనాత్మకత నశిస్తుంది
టీవీ దైనందిన జీవితంలో భాగమైపోయింది.
లండన్: టీవీ దైనందిన జీవితంలో భాగమైపోయింది. పిల్లలు సైతం టీవీలకు అతుక్కు పోతున్నారు. భోజనం చేయమన్నా టీవీ ఉంటేనే.. అంటున్నారు. ఇక టీవీ చూస్తూనే హోంవర్క్ చేసే పిల్లలు కోకొల్లలు. అయితే పిల్లల్లో అతిగా టీవీ చూసే అలవాటు వారి జీవితంపై ప్రభావం చూపిస్తోంది. ప్రతిరోజు 15 నిమిషాల కంటే ఎక్కువగా టీవీలో కార్టూన్ ఛానల్‌లు చూసే పిల్లల్లో భవిష్యత్తులో సృజనాత్మకత తగ్గిపోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
టీవీ చూసే పిల్లల్లో ఆలోచన శక్తి తగ్గినట్లు తాము గమనించినట్లు స్టాఫర్డ్‌షైర్ యూనివర్సిటీకి శాస్త్రవేత్త సరాహ్ రోజ్ తెలిపారు. ఇది వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతుందని ఆయన చెప్పారు. మూడు సంవత్సరాల వయసుగల పిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుదని, టీవీకి బదులుగా జిగ్‌జాగ్ ఫజిల్స్, పుస్తకాలు చదవడంలాంటివి చేయడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.