
వేసవి వచ్చేసింది. పరీక్షలు అయి పోగానే పిల్లలకు సెలవలు. తల్లిదండ్రులకు అసలు పరీక్షాకాలం మొదలవుతుందప్పుడే. అయితే ఈ సెలవల్లో వారిని వేసవి ‘శిక్ష’ణా కేంద్రాలలో చేర్చేసి చేతులు దులుపుకునే కంటే వారి చేత క్రియేటివ్‌గా ఏదైనా పని చేయిస్తే ఎలా ఉంటుంది? అదీ వంటింటి వ్యర్థాలతోనే వారి చిట్టి చేతులతో పెరటి తోట పెంచి, అందులో పూలు, కాయలు, పళ్లూ పెంచితే..? ఇంకెందుకాలస్యం? వెంటనే పనిలోకి దిగుదామా మరి!
వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి కిచెన్ గార్డెన్‌లో పెరిగే మొక్కలకు ఎరువుగా వాడితే అవి ఏపుగా పెరిగి నవనవలాడే పూలూ, కాయలూ, పండ్లూ ఇస్తాయి. అసలు ఇంత వరకూ కిచెన్ గార్డెన్ లేదా టెర్రస్ గార్డెన్ లేనివారు ఏం చేయాలి మరి?
టమోటా పంట
టెర్రస్ గార్డెన్‌లో సులువుగా పెంచదగ్గవి టమోటాలే. ఈసారి టొమోటోలు తరిగేటప్పుడు బాగా పండిన టొమోటోలోని గింజలను ఒక పేపర్ టవల్ మీదికి తీసుకోవాలి. మీ పిల్లలను ఆ పేపర్ టవల్‌ను గాలికి ఎగిరిపోకుండా జాగ్రత్తగా ఎండబెట్టమనండి. ఒక కంటెయినర్‌లో మట్టి నింపి, ఆ మట్టిలో ఈ విత్తనాలను నాటి రోజూ కాసిని నీళ్లు చిలకరిస్తూ ఏం జరుగుతుందో గమనించమనండి. వారం తిరిగేసరికి వాటిలోనుంచి మొలకలు రావడం గమనించి వాళ్ల పెదవులు సంబరం తో విచ్చుకోవడాన్ని మీరే గమనిస్తారు. వాటిని సంరక్షించి ఒకదానికి ఒకటి తగలకుండా కొంచెం దూరం దూరంగా పాతి, కాస్త ఎండ తగిలేలా పెట్టి, రోజూ నీళ్లు పోస్తూ ఉంటే నెల తిరిగేసరికల్లా చిన్ని చిన్ని టొమాటోలను చూసి వాళ్లే ఎగిరి గంతులేస్తారు చూడండి.
ఉల్లి మొక్కలు...
ఉల్లిమొక్కలు.. స్ప్రింగ్ ఆనియన్లు పెంచుకోవడం అన్నింటికన్నా తేలిక. ఉల్లిపాయలు తరిగేటప్పుడు పైన ఆకుపచ్చటి మొలకల్లా ఉండే భాగాన్ని తీసి పారేస్తుంటాం కదా... అలాంటివన్నింటినీ సేకరించాలి. ఒక కంటెయినర్ లో నీళ్లు పోసి వాటికి నీళ్లు తగిలేలా ఈ తొడిమ భాగాన్ని ఉంచాలి. రెండు మూడు రోజులకోసారి ఆ నీటిని మారుస్తూ ఉండాలి. వారం తిరిగేసరికల్లా రెండు మూడు అంగుళాలకు పైగా ఉల్లి కాడలు రావడం గమనిస్తారు. వాటిని తీసి కుండీలలో లేదా నేరుగా గార్డెన్‌లోని మట్టిలో పాతి రోజూ కాసిని నీళ్లు చిలకరిస్తూ ఉంటే సరి.. కొద్దిరోజులలోనే పైన ఉండే కాడలు ఎండిపోయి కింద ఉల్లిపాయలు ఊరి ఉంటాయి. ఉల్లి కాడల్ని కూడా అప్పుడప్పుడు పైనుంచి కట్ చేసుకుని సలాడ్స్‌లో వాడితే రుచిగా ఉంటాయి.
మెంతి మొక్కలు...
స్పూను మెంతులు తీసుకుని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. వాటిని ఒక పేపర్ టవల్‌లో వేసి మట్టిలో పెట్టి రోజూ నీళ్లు చిలకరిస్తూ ఉంటే సరి మెంతికూర పెరుగుతుంది. మనకు కావలసిన సైజులోకి రాగానే వాటిని కోసుకుని వాడుకోవచ్చు.
బంగాళదుంప...
బంగాళ దుంప మీద కళ్లలా ఉండే చిన్న చిన్న భాగాలుంటాయి. అలా ఉన్న వాటిని కొద్దిగా ముక్క ఉండేలా కోసి తీసి కుండీలో పాతి, రోజూ నీళ్లతో తడపాలి. వారం తిరిగేసరికి వాటినుంచి మొలకలు వస్తాయి. వాటిని నేరుగా గార్డెన్‌లో నాటవచ్చు లేదా కుండీల్లోనే ఉంచి రోజూ కొద్దిగా నీళ్లు పోస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ఏపుగా పెరిగి పైన ఉన్న ఆకులు ఎండిపోయి, కింద బంగాళదుంపలు ఊరి ఉండటాన్ని గమనించవచ్చు.
చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
ఇవే కాదు.. ఇంకా పుదీనా కాడలను కూడా ఆకులు కట్ చేసుకుని కాండాన్ని కుండీలలో నాటి రోజూ కాసిని నీళ్లు పోస్తూ ఉంటే మొక్కలు పచ్చగా చిగురిస్తాయి. అలాగే ధనియాలను కూడా వాటిని ఒక పాత న్యూస్ పేపర్ మీద పోసి పైన ఫ్లాట్‌గా ఉండే కంటెయినర్‌తో రుద్దాలి. ఒక్కొక్కటి రెండుగా విడిపోయేలా చేయాలి. వాటిని నీళ్లలో నానబెట్టి కుండీలలో పాతితే కొత్తిమీర పెరుగుతుంది.
గార్డెనింగ్ నేర్పించడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఓపిక, క్రమశిక్షణ, జాగ్రత్తగా సంరక్షించడం, నా అనే భావన కలుగుతాయి. కాబట్టి ఈ వేసవిలో వారి చేత గార్డెనింగ్ చేయించండి. మొక్కలతో;eటే వారిలో వికాసం కూడా పెరుగుతుంది.
చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో